కడప

వైభవంగా అక్షయ తృతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లూరు, మే 9:హరిహర బేధం లేని క్షేత్రం దక్షిణకాశి పుష్పగిరిలో వైభవంగా అక్షయ తదియ దినోత్సవం జరిగింది. సోమవారం అక్షయ తదియను పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పుష్పగిరికి వచ్చారు. అక్షయ తదియ రోజున పంచమనది సంగమంలో నదీ స్నానం ఆచరించి స్వామివార్లను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. క్షేత్రాధిపతి వైద్యనాదేశ్వరస్వామికి ఉదయం గణపతి పూజతో ప్రారంభమై రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు అర్చకులు నిర్వహించారు. క్షేత్రపాలకుడు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవస్వామి పూలంగిసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని సంతాన మల్లేశ్వరస్వామికి, సాక్షి మల్లేశ్వరస్వామికి, లక్ష్మిదేవిలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశంకరభారతి స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు సుమంత్ దీక్షితులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతించారు. పీఠాధిపతి చెన్నకేశవస్వామికి సంతాన మల్లేశ్వరస్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు కొండపైన బారులు తీరి స్వామిదర్శనం చేసుకున్నారు. తమ మనసులోని కోర్కెలు నెరవేరుతాయో లేదో చూసుకునేందుకు సాక్షి మల్లేశ్వరస్వామి వద్ద రాయిని వేసి భక్తులు పరీక్షించుకున్నారు. గ్రామంలోని శ్రీ చక్రసమేత, కామాక్షిదేవి వద్ద పెద్ద ఎత్తున మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. రాత్రి వైద్యనాదేశ్వరస్వా మి, చెన్నకేశవస్వామివార్లను గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు వివిధ కుల సంఘాలచే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఓల్డ్ కేటగిరి, పాలపండ్ల వృషభాలచే నిర్వహించిన బండలాగుడు పోటీలు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్పగిరి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం హరిహరుల కల్యాణం నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉదయం క్షేత్రాధిపతి వైద్యనాదేశ్వరస్వామి, రాత్రి క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వామిలకు కల్యాణం చేయడానికి సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఘరానా మోసగాళ్లు అరెస్ట్
* రూ.10 లక్షల నగదు స్వాధీనం
ప్రొద్దుటూరు, మే 9: గత ఐదు సంవత్సరాలుగా పలు రకాల రుణాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల ముఠా గుట్టు రట్టయింది. ప్రొద్దుటూరు ఒన్‌టౌన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు మోసగాళ్లను అరెస్ట్ చేయడంలో సఫలీకృతులయ్యారు. సోమవారం స్థానిక ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సి ఐ బాలస్వామిరెడ్డి మాట్లాడుతూ గ్లోబల్ అసోసియేట్, శ్రీవిద్యా అసోసియేట్ బోగస్ ఫైనాన్స్ సంస్థలను స్థాపించి గత ఐదు సంవత్సరాలుగా పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమందిని ఈ ముఠా మోసం చేసి కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసిందన్నారు. పట్టణానికి చెందిన షైన్ ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకులు పూల అబ్దుల్‌ఖాదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టామన్నారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం ముఠా నిర్వాహకుడైన రాయపురెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఉదయ్‌కుమార్‌లను సుందరాచార్యుల వీధిలోని బిజి ఆర్ లాడ్జి వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.10 లక్షల నగదు, పలు బ్యాంకులకు సంబంధించిన చెక్‌బుక్‌లు, ఎటి ఎం కార్డులు, వీరికి సంబంధించిన నకిలీ గుర్తింపుకార్డులు, నకిలీ రబ్బరు స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఒక్క ప్రొద్దుటూరు పట్టణంలోనే రూ.50 లక్షలకుపైబడి మోసం చేశారన్నారు. ముఠా నాయకుడు రాయపురెడ్డి స్వస్థలం గుంటూరు కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడని, నాగేశ్వరరెడ్డి ఖమ్మంజిల్లాకు చెందినవాడని, ఉదయ్‌కుమార్‌ను బెంగుళూరుకు చెందినవాడుగా గుర్తించామన్నారు. అలాగే పలు బ్యాంకులలో వున్న వీరి అకౌంట్లను సీజ్ చేశామని, అందులోని నగదు వివరాలు తెలియాల్సి వుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐలు విద్యాసాగర్, చిన్నపెద్దయ్య, వినోద్‌కుమార్, కానిస్టేబుళ్లు నాయక్, రామ్‌భూపాల్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
24 బస్తాల చౌకబియ్యం పట్టివేత
చాపాడు, మే 9: మండలంలోని కుందూనది బ్రిడ్జి వద్ద సోమవారం అక్రమంగా తరలించబడుతున్న 24 బస్తాల చౌకబియ్యాన్ని పట్టుకున్నట్లు చాపాడు ఎస్ ఐ శివశంకర్ తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి బద్వేలుకు శ్రీరాములు అనే వ్యక్తి ఆటోలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్నారు. సమాచారం అంది న వెంటనే ఆటోతో సహా 24 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. పట్టుబడిన బి య్యాన్ని తహశీల్దార్ కిరణ్‌జ్ఞానమూర్తికి అప్పజెప్పగా ఆయన చాపాడు డీలర్ రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయాలు
చిన్నమండెం,మే 9:మండలంలోని దేవగుడిపల్లె గ్రామ కస్తూరిబా గురుకుల పాఠశాల వద్ద ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని బొలెరో ఢీ కొని కాంట్రాక్టర్ నాగిరెడ్డికి గాయాలయ్యాయి. గాలివీడు మండలానికి చెందిన బొల్లోరో రామాంజనేయులు అనే డ్రైవర్ చిన్నమండెం నుంచి వెళుతూ ముందువెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఈప్రమాదం జరిగింది. అతన్ని 108 ద్వారా చికిత్సనిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయాలు
సిద్దవట,మే 9:ఏపి ఎస్‌పి 11వ బెటాలియన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో జ్యోతి నరసింహారెడ్డి గాయపడ్డాడు. మండలపరిధిలోని జ్యోతి గొళ్లపల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కడప నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో ప్రయాణించగా ఏపిఎస్‌పి 11వ బెటాలియన్ మొదటి గేటు వద్ద వున్న వేగ నిరోధకం వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు స్వల్పగాయాలై తగలడంతో ఏఎస్‌ఐ శ్రీనివాసవర్మ పరిశీలించి వైద్యం కోసం 108వాహనం ద్వారా కడప రిమ్స్‌కు తరలించామని ఆయన చెప్పారు.