కడప

రబీలో సైతం వదలని వర్షాభావ సమస్యలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, డిసెంబర్ 15: రాజంపేట డివిజన్ పరిధిలో వర్షాభావం వరుసగా మూడో సంవత్సరం రైతులనుపట్టి పీడిస్తుంది. 2016-2017 సంవత్సరాల్లో ఖరీఫ్‌తోపాటు రబీ పంటను పండించుకోలేకపోయిన ఈప్రాంత ఆయకట్టు రైతాంగం 2018 ఖరీఫ్‌తోపాటు ప్రస్తుతం రబీలోసైతం వదలని వర్షాభావంతో కరవు పరిస్థితులు ఎదుర్కొనక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అడపాదడపా పడుతున్న వర్షాలవల్ల ఇక్కడి చెరువులు, కుంటలు, వాగుల్లోకి సాగునీరు చేరడంలేదు. దీంతో ఆయకట్టు భూములన్నీ గత మూడేళ్ల నుండి బీడుగానే ఉన్నాయి. బావులు బోర్లకింద మాత్రం కొంతవరకు రైతులు పంటలు పండిస్తున్నారు. అయితే వరిసాగు విస్తీర్ణం ఇక్కడకూడా చాలా తక్కువగా ఉంది. మొత్తానికి వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ఖరీఫ్ కూడా పండించకుకోలేని స్థితిలో రబీ మొదలైనా ఆశించిన మేరకు వర్షాలజాడ కనిపించని నేపధ్యంలో బావులు, బోర్లకింది రైతులు కూడా ఎందుకైనా మంచిదని కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. డివిజన్ పరిధిలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అధికశాతం రైతులు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేసి మంచి దిగుబడులు సాధించడం మేలన్నభావనతో ఉన్నారు. రాజంపేట నియోజకవర్గం వరకు తీసుకున్నా 24పైగా ఊటకాలువలు పూర్తిగా పూడిపోయాయి. 20కి పైగా చెరువుల్లో చుక్కనీరు లేదు. మడుగులు, వంకల పరిస్థితి దారుణంగా ఉంది. చెయ్యేరు, పుల్లంగేరు, గుంజన, చక్రాలమడుగులు వర్షాభావంతో నీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. వరిసాగు చేయాలంటే సమృద్ధిగా సాగునీరు అవసరం, అలాగే ఎరువులు, మందులకు భారీగానే ఖర్చవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వర్షాభావం, ఎరువుల కొరత ఇవన్నీ బాధలు పడేకంటే తక్కువ కాలం పంటలైన కూరగాయలు, ఆకుకూరలు సాగుకే మొగ్గుచూపడం మేలన్న ఆలోచన ఎక్కువమంది రైతులు చేస్తున్నారు. మిరప, టమోటా, కాకరకాయ, దొండకాయ, వంకాయ తదితర కూరగాయలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు పెంపకాన్ని రైతులు ఇప్పటికే చేపట్టి లాభాల దిశలో పయనిస్తున్నారు. డివిజన్ పరిధిలో కూరగాయలను స్థానికంగానే కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాలకు రైతులు చేరవేస్తుంటారు. ఎక్కువశాతం స్థానికంగానే అమ్మకాలు సాగించేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తుంటారు. అలాగే పూలసాగుపై కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సంపెగ, రోజా, చెండుమల్లి, జాజి, కనకాంబరం, చామంతి, సన్నజాజి, కాగడాలు తదితర రకాల పూలతోటల పెంపకాన్ని రైతులు చేపట్టేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పూల దిగుబడులను కూడా రాష్ట్రంలోని వివిధ నగరాలతోపాటు దేశంలోని వివిధ నగరాలకు చేరవేస్తుంటారు. ఎక్కువశాతం సంపెంగపూలను సువాసన కోసం ఫర్‌ప్యూమ్స్‌లో ఉపయోగిస్తుంటారని తెలిసింది. ఇందువల్ల సంపెంగ పూలకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం సరఫరా అయ్యే పూలు ఆర్టీసి బస్సుల్లో తరలిస్తుంటారు. అన్నిరకాల పూలను కిలోల వారీగా లెక్కగట్టి విక్రయిస్తుంటారు. డివిజన్ పరిధిలో వేల ఎకరాల్లో పూలతోటలు సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇదేరీతిన కూరగాయలు కూడా సాగవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరిసాగుకు రైతులు స్వస్తిపలికి కూరగాయలు, పూలతోటల సాగుపై దృష్టి సారించడంతో వరి విస్తీర్ణం బాగా పడిపోతున్నది. ఒకోమారు పూలతో పాటు కూరగాయల ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో ధరలు రైతులకు తెలియనీయకుండా దళారులు మోసం చేస్తుంటారు. దళారీ వ్యవస్థ నిర్మూలన అయితే రైతులు బాగుపడతారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికార్లు తగు విధంగా స్పందించి చర్యలు గైకొనాల్సి ఉంది.
శీతల గిడ్డంగులు ఏర్పాటుచేయాలి
డివిజన్‌లో రైతుల పండించే అన్ని రకాల పంటలు మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా వసతులు మెరుగుపరచాల్సి ఉంది. అంతేకాకుండా పండ్లతోటల రైతాంగం సమస్యలు పరిష్కారానికి వారి పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేవరకు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రతిపాదన దశాబ్దాలుగా వస్తున్నా హామీలకే పరిమితమవుతున్నది. మార్కెటింగ్ వసతులను మెరుగుపరిస్తే ప్రస్తుతం ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారమార్గమవుతుంది. అంతేకాకుండా దళారులను నమ్మి రైతులు నష్టపోకుండా ఉండేందుకు వీలవుతుంది.