కడప

ఓటర్ల జాబితాపై మొదలైన రాజకీయ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 17: త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో చలనం మొదలైంది. తెలంగాణ ఎన్నికలతో కళ్లు తెరిచిన పార్టీలు ఎవరికి వారు కీలకమైన ఓటర్ల జాబితాపై దృష్టి సారించారు. తెలుగుదేశంపార్టీ పెద్ద ఎత్తున అక్రమ ఓటర్లను చేర్పించిందంటూ వైసీపీ నేతలు జిల్లా నుంచి రాష్టస్థ్రాయి వరకు ఫిర్యాదులపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో దొంగ ఓటర్లను చేర్పించారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపధ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకుల ఫిర్యాదులకు సంబంధం లేకుండా అధికారులే పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అయితే ఇదే స్థాయిలో రాజకీయ పార్టీలు కూడా పోలింగ్ బూత్ స్థాయిలో జాబితా తెప్పించుకుని ఏప్రాంతంలో కొత్త ఓటర్లు చేరారు, ఎవరిని తొలగించారు అనే విషయాలపై కార్యకర్తలకు బాధ్యత అప్పగించారు. దీంతో రెండుపార్టీల నేతలు ఓటర్ల జాబితాపై కసరత్తు మొదలు పెట్టాయి. అయితే గత నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాఅధికారులా పరీశీలనలో ఇంట్లో లేనివారు, ఇళ్లుమారిన వారు, చనిపోయినవారు, కొత్తవారు ఎవరున్నారన్న విషయాలపై విచారణ జరుపగా సుమారు 97,377 మంది ఓటర్ల పరిస్థితి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై పూర్తిస్థాయి నివేదికకు అధికారులు దృష్టిసారించారు. మరోవైపు కొత్తగా ఓటర్లు చేరిన జాబితాను పరిశీలించగా 69,626మంది చేరినట్లు గుర్తించారు. ఇక పలుప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సుమారు 62,597 మంది వారి ఓట్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఈనేపధ్యంలో ప్రతి ప్రాంతంలోనూ , కొత్తగా చేరినవారి నుంచి ఓట్లు తొలగించిన వారి వరకు అనేక ప్రశ్నలతో కూడిన ఫిర్యాదుల పత్రాలను ఇరువర్గాలు జిల్లా ఎన్నికల అధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత మూడునెలలుగా కొత్త ఓటర్ల చేరికపై జిల్లా యంత్రాంగం భారీగా కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం సాగించింది. అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిణి కూడా నియమించారు. ఎవరికి ఎలాంటి సమస్యవచ్చినా కొత్త ఓటర్లు చేరాలనుకున్నా, పాత ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నా ఈ ప్రత్యేక అధికారి ద్వారా వివరాలు తెలుసుకునే విధంగా దృష్టిపెట్టారు. కొత్త ఓటర్లను చేర్పించేందుకు వీలుగా మండల స్థాయిలోని స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో కౌంటర్లు కూడా ప్రారంభించారు. అయితే కడప నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు వదంతులకు తలొగ్గాయి. జిల్లా యంత్రాంగాన్ని నమ్మకుండా స్వయంగా వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ సైతం పెద్ద ఎత్తున వాహనాలు పెట్టి, వీధుల్లో ప్రచారాన్ని సాగించాయి. ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయితే రాజకీయ పార్టీలు తెరమీదకు వచ్చి ఓటర్ల చేరికపై సైతం ప్రచారం చేయడం జిల్లా ఎన్నికల అధికారులు మండిపడ్డారు. ఎవరికీ సంబంధం లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారానికి దిగడం అధికారులను విస్మయానికి గురిచేసింది. దీంతో కడప పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా మూడు కౌంటర్లను ఏర్పాటు చేయడమేగాకుండా ఇతర ప్రాంతాల నుంచి విఆర్వోలను, తహశీల్దార్లను కడపలో పరిశీలన అధికారులుగా నియమించి ఇంటింటా సర్వే నిర్వహించారు. అయితే వదంతులు, అపోహలేనని అధికారులు నిగ్గుతేల్చారు. ఈనేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల వారీగా ఇంటింటాసర్వే సాగిస్తున్నారు. ఈనెల చివరి నాటికి ఈ జాబితా పూర్తినివేదిక అందే అవకాశాలున్నాయి. అయితే రాజకీయ పార్టీలు కూడా అధికారుల సర్వేపై ప్రతి గ్రామంలో వారు కూడా సర్వేపై కసరత్తు సాగిస్తూ కొత్త ఓటర్ల చేరిక, పాత ఓటర్ల తొలగింపు వంటి వాటిపై పూర్తిస్థాయిలో రాజకీయపార్టీలు కసరత్తు సాగిస్తున్నాయి.

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా
కడప,డిసెంబర్ 17: జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ రైతు సంఘం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర మాట్లాడుతూ జిల్లాలో తగినంత వర్షపాతం లేకపోవడంతో రబీలోనూ, ఖరీఫ్‌లోనూ పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీమా కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 2012-13లో రబీలో బుడ్డశెనగకు జాతీయ పంటల బీమా సంస్థకు రైతులు ప్రీమియం చెల్లించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 20వేల మంది రైతులకు రూ.112కోట్లు పరిహారం అందాల్సివుందన్నారు. 2014-15లో సుమారు 25వేల మంది రైతులకు ప్రీమియం కింద చెల్లించిన మొత్తానికి రూ.6.92కోట్లు రావాల్సివుందన్నారు. 2016-17లో ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద 11,860మంది రైతులకు రూ.34.194కోట్లు పరిహారం రావాల్సివుండగా, కేవలం రూ.18కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. 2017-18లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద వరి రైతులకు రూ.38.28కోట్లు ఇతర రైతులకు రూ.171.284కోట్లు పంటల బీమా పరిహారం అందించాల్సివుండగా, సంవత్సరాలు గడుస్తున్నా ఈ బీమా రైతులకు అందలేదన్నారు. అయితే ఈపంటల బీమా ప్రీమియం చెల్లింపులో కూడా అనేక ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రీమియం విస్తీర్ణాన్ని తగ్గించి కంపెనీకి జమచేయడం వల్ల రైతులకు నష్టపరిహారం తగ్గిపోయిందన్నారు. 2014,2016లో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి గాకుండా అకాల వర్షాల వల్ల అరటి, బొప్పాయి, మామిడి, చీనీ లాంటి ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయని, వీటికి పంటల బీమా ప్రీమియం గురించి పట్టించుకోకపోవడంతో పరిహారం కూడా దక్కలేదన్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుతో రైతులు భారీగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నదుల్లో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున సాగుతోందని దీని వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులు వేసిన బోర్లలో నీటిమట్టం పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో లక్షా 33వేల 556 హెక్టార్లకు గాను కేవలం 44,189 హెక్టార్లు మాత్రమే సాగైందన్నారు. రబీలో సైతం లక్షా 72,929 హెక్టార్లకు గాను లక్షా 24,070 హెక్టార్లలో పంట సాగుకాగా, ఇందులో బుడ్డశనగ 84,914 హెక్టార్లలో సాగైందని ఇది కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో జిల్లా రైతాంగం పల్లెలు విడిచి పట్టణాల దారి పట్టిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం వలసబాట పట్టె పరిస్థితివుందన్నారు. అనంతరం వారు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
-------------

భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి
* నేడు వైకుంఠ ఏకాదశి
కడప కల్చరల్,డిసెంబర్ 17:వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా ఆలయాల ఇఓలు, చైర్మన్లు, కమిటీ సభ్యులు భక్తుల స్వామివారి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఆలయం బయట, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. కాగా కొన్ని ఆలయాల్లో తెల్లవారు జామున 3గంటల నుంచి స్వామి దర్శనాలు ప్రారంభమయ్యే నేపధ్యంలో చీకటి కారణంగా క్యూలైన్లలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆలయాలన్నింటికీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే వైష్ణవాలయాలతోపాటు ఆంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయం, పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం, నందలూరు శ్రీసౌమ్యనాథస్వామి ఆలయం, జమ్మలమడుగు నారాపురస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో ఉదయం 5గంటల నుంచి ఉత్తర దిక్కున గల ద్వారం నుంచి భక్తులకు స్వామి ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం కల్పిస్తారు. కడప నగరంలోని దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా మంగళవారం తెల్లవారు జామున 3గంటల నుంచే స్వామి మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు భక్తులకు సౌకర్యం కల్పించారు. అలాగే వైకుంఠ ద్వారం ద్వారా తెల్లవారు జామున 3గంటల నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా కడపలోని జయనగర్ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 5గంటల నుంచి స్వామి, అమ్మవార్లను వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. అదేవిధంగా కడప నగర శివార్లలోని శ్రీ పాలకొండరాయస్వామి ఆలయంలో కూడా ఉదయం 5గంటల నుంచి మూలవిరాట్, ఉత్సవ మూర్తుల దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. నగరంలోని జౌళి బజారులోని శ్రీ కోదండరామస్వామి ఆలయం తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఓ వైపు ధనుర్మాసపూజలు నిర్వహిస్తుండగా వైష్ణవాలయాల్లో అతి ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి నిర్వహించవలసి రావడంతో నిర్వాహకులు బిజీ బిజీగా ఉన్నారు. అలాగే నగరంలోని గడ్డిబజారులోని శ్రీబాలాజీ దేవస్థానం, శ్రీలక్ష్మీసత్యనారాయణస్వామి దేవస్థానం, మున్సిపల్ మైదానంలోని శ్రీదత్తసాయి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అవినీతి పార్టీల ఏకమవుతున్నాయి..
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి
కడప సిటీ,డిసెంబర్ 17: ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో దేశంలోని అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, అన్ని ప్రభుత్వ, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించిన సోనియా, రాహుల్ గాంధీలు వాటి పరిరక్షణ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. గత 10సంవత్సరాల నుంచి యుపీఏ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించి బీజేపీనే వాటిని ధ్వంసం చేసిందని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సోనియా, రాహుల్, చంద్రబాబునాయుడులు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ కొనసాగినంతకాలం తమ అవినీతి ఆటలు చెల్లవన్న భయంతోనే ఆపార్టీలు ఉమ్మడి పోరాటానికి ఏకమైనట్లు స్పష్టవౌతోందన్నారు. రూ.6వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన సుజనా చౌదరి లాంటి వారిని ప్రోత్సహిస్తూ చంద్రబాబునాయుడు తిరిగి బ్యాంకుల్లోనే అవినీతి జరుగుతోందని ఆరోపించడం శోచనీయమన్నారు. గతంలో పెద్దనోట్ల రద్దును సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి మోదీని విమర్శించడం దుర్మార్గమన్నారు. తన అవినీతిని పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, విభజన హామీలపై నిలదీసినందుకే కేంద్రం తమపై కక్షకట్టిందని చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు. స్వచ్ఛమైన పాలనను అందిస్తున్న మోదీనే తిరిగి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రధాని కావాలనే రాహుల్ కల కలగానే మిగిలిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు ఎరికలప్ప, షిండే భాస్కర్, నగర ప్రధానకార్యదర్శి జి.లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు పి.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

చతికిలపడ్డ గ్రామ కంఠాల అమ్మకాలు
* అవస్థలు పడుతున్న యజమానులు * నిలచిన ఇళ్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు
* చక్కదిద్దుతామని రంగంలో దిగిన దళారులు
కడప అర్బన్,డిసెంబర్ 17:జిల్లా వ్యాప్తంగా గ్రామ కంఠంలోని ఇళ్లు, ఆస్తుల భూములు క్రయ విక్రయాలు నిర్వహించుకుని అవసరాలు తీర్చుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆటంకాలు, ఈ ఇబ్బందులు రాష్టవ్య్రాప్తంగా యజమానులకు ఎదురౌతున్నాయి. గ్రామకంఠంలో ఉన్న ఆస్తుల భూములు రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతుల అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు గుర్తించి ప్రత్యేక సర్వేనెంబర్ కేటాయిస్తే తప్ప గ్రామకంఠంలోని ప్రైవేట్ ఆస్తులకు మోక్షం కలిగే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గ్రామకంఠంలోని భూములు, అస్తుల సర్వేనెంబర్లకు అనుమతులు లేకపోవడంతో లావాదేవీలు పూర్తిగా నిలచిపోయాయి. ఈవ్యవహారం రెవెన్యూ అధికారులు పూర్తిగా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇళ్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామ కంఠాల ఆస్తుల అమ్మకాలు చతికిలపడ్డాయి. గ్రామకంఠంలోని ఆస్తులు క్రయ విక్రయాలు జరగాలన్నా, రిజిస్ట్రేషన్ మాత్రం చట్టపరంగా కుదరదు. వాస్తవానికైతే ఆయా మండల తహశీల్దార్ల కార్యాలయాలకు ఆయా ఆస్తులపై పూర్తి ఆధారాలతో కూడిన దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి స్పష్టత పరిశీలన కోసం రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి ఆధారాలను మండలస్థాయి అధికారులు సిఫార్సు చేస్తారు. ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించిన ఆధారాలు బట్టి ఆస్తులకు ప్రత్యేక సర్వేనెంబర్ కేటాయించాలని కలెక్టర్ కార్యాలయం నుండి డివిజనల్, మండల స్థాయి అధికారులకు లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు జారీ కావాల్సివుంది. ఇన్ని ఆటంకాలతో సతమతవౌతున్న ఆస్తుల యజమానుల అవసరాలు గుర్తించిన కొంతమంది దళారులు రంగప్రవేశం చేశారు. ఆస్తుల విలువలను బట్టి, విస్తీర్ణాన్ని బట్టి పై కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు ఖర్చుచేసే ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవచ్చునని సంబంధిత యజమానులను దళారులు నమ్మబలుగుతున్నారు. ఇంత డబ్బులు గ్రామస్థాయి విఆర్వో దగ్గరనుంచి మండలస్థాయి, డివిజన్‌స్థాయి అధికారుల వరకు పంపకం జరిపినట్లయితే గ్రామకంఠాల అమ్మకాలు సులువుగా అమ్ముకోవడానికి వీలుంటుందనే తప్పుడు సంకేతాలతో యజమానులను దళారులు నమ్మిస్తున్నారు. వాస్తవంగా అయితే గ్రామకంఠంలోని ప్రభుత్వ ఆస్తులను గుర్తించి ప్రభుత్వాలే ప్రత్యేక సర్వేనెంబర్లు కేటాయించాల్సివుంది. ఎవరైనా ఆస్తులను అమ్ముకోవాలంటే పూర్తి ఆధారాలతో కలెక్టర్‌కు దరఖాస్తుచేసే అనుమతి కోసం ఆయా డివిజన్ల ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశిస్తారు. అది కూడా జిల్లా రిజిస్టర్‌కు సంబంధిత వివరాలు పంపిస్తే అక్కడి నుంచి సబ్ రిజిస్టర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ అవుతాయి. ఇలాంటి సమస్య జిల్లా అంతటా ఉంది. కడప నగరంలో అక్కాయపల్లి, ఊటుకూరు, నకాష్ ప్రాంతాల్లో కొన్ని వాణిజ్యభూముల భవనాలకు దాదాపు రూ.2కోట్ల 50లక్షలకు బేరం కుదిరించి,దీనికిగాను కొనుగోలు దారులు కొంత మొత్తాలు అడ్వాన్స్‌లు చెల్లించి భవన యజమానుల నుంచి అగ్రిమెంట్ పొందారు. తీరా రిజిస్ట్రేషన్ సమయానికి గ్రామకంఠం పేరుతో ఆటంకం ఏర్పడటంతో అనుమతి పత్రాలకు అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులు గుర్తించి ప్రత్యేక సర్వేనెంబర్లు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. గ్రామకంఠంలో ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణాలు, స్థలాల రిజిస్ట్రేషన్ విషయమై నెలకొన్న ప్రతిష్టంబన నానాటికి సమస్యాత్మకంగా మారుతోంది. గ్రామకంఠంలో ఉన్న ప్రభుత్వస్థలాలు, నిర్మాణాలు గుర్తించి వాటికి ప్రత్యేక సర్వేనెంబర్లు కేటాయించేంతవరకు మిగిలిన లావాదేవీలు నిర్వహించేందుకు ఏ అవకాశం లేదు. దీంతో తమ అవసరాలకోసం ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధమైన వారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

టీఆర్‌ఎస్ గెలిస్తే వైకాపా, జనసేన నాయకుల సంబరాలేంటి?
* టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం
రాయచోటి, డిసెంబర్ 17: పొరుగు రాష్టమ్రైన తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సీపీ, జనసేన పార్టీల నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ప్రశ్నించారు. సోమవారం స్థానిక మదనపల్లె మార్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాషా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజద్‌అలీఖాన్‌లతో కలిసి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ వాళ్లు అడ్డుకోవడమే కాకుండా పార్లమెంటు సాక్షిగా దేశంలోని అన్ని పార్టీల వాళ్లు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తే అందుకు భిన్నంగా టీఆర్‌ఎస్ అవసరం లేదని చెప్పిన పార్టీ తెలంగాణలో గెలిస్తే జగన్, పవన్‌లకు ఎందుకు అంత సంతోషమన్నారు. నీచ రాజకీయాలు, పదవీవ్యామోహానికి వీరి చేష్టలే పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచింది కావున ఏపీలో వైకాపా గెలుస్తుందని భ్రమలు కనడం వారి రాజకీయ అపరిపక్వతకు, అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అనేక కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే ఏపీని ముందంజలో నిలిపిన ఘనత చంద్రన్నదేనన్నారు. ఇంత అభివృద్ధిని చూసే ప్రజలు ఇంతకు 2019 ఎన్నికలలో అధిక స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి గుండె లాంటి పోలవరం ప్రాజెక్టుకు కేవలం 15వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలుగువారిని దెబ్బతీసిన ఘనత కేంద్ర ప్రభుత్వం, బీజేపీయేదని, అలాంటి పార్టీకి జగన్, పవన్‌లు వత్తాసు పలకడం రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని, ఇందుకు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు మద్దతు పలుకుతున్నారన్నారు. రాహుల్‌గాంధీ పీఎం కావాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ బహిరంగంగా చెప్పారని, కానీ నేడు జగన్ అందుకు భిన్నంగా రాహుల్‌ను తిడుతుంటే వైఎస్‌ఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాజకీయ దళారి సి.రామచంద్రయ్య అని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మంచి పదవులు అనుభవించి లబ్ది పొంది ఇపుడు ఆ పార్టీలనే విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లి, దేశానికి తలమానికంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీడీపీ గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. టీ ఆర్ ఎస్, వైకాపా, జనసేన, మజ్లిస్ ఎన్ని పార్టీలు కలిసినా టీడీపీని ఏమీ చేయలేవని, 150 సీట్లకు పైగా టీడీపీ గెలవడం ఖాయమని ఆయన వివరించారు.

ఒంగోలు ట్రిపుల్ ఐటీ తరలింపునకు సన్నాహాలు
వేంపల్లె, డిసెంబర్ 17: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఆవరణలోని పాత క్యాంపస్‌లో కొనసాగుతున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోకి మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ ఆఖరుకంతా ఒంగోలులోని తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసి విద్యాబోధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పాత క్యాంపస్‌లో చదువుకుంటున్న పీయూసీ-1,2లకు చెందిన 2 వేల మంది విద్యార్థులను తరలించే యోచనలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇడుపులపాయ క్యాంపస్ ఆవరణలోనే తరగతులు అప్పటి నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నూతన ల్యాబ్ క్యాంపస్ భవనాలలో కొనసాగుతుండగా పీయూసీ-1,2 తరగతులకు గాను పాత క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ఒంగోలు ప్రాంతంలో స్థలాలను గుర్తించనప్పటికీ అవి ట్రిపుల్ ఐటీకి అప్పగించే ప్రక్రియ జాప్యం జరుగుతూ వచ్చింది. మూడు నెలల క్రితం పామూరు వద్ద 208 ఎకరాలు ఒంగోలు ట్రిపుల్ ఐటీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భవన నిర్మాణాలకు సంబంధించి డిజైన్ల ఏర్పాటు సర్వే దశలోనే ఉంది. ఇప్పటికే మూడేల్లు కావస్తున్నా నూతన భవనాలు నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి తలెత్తింది. ఈ క్రమంలో ఇక్కడి ట్రిపుల్ ఐటీ అధికారులు ఒంగోలుకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలతో చర్చించిన మీదట ఈ యేడాది డిసెంబర్ ఆఖరుకంతా ఒంగోలు పట్టణంలోకి ట్రిపుల్ ఐటీని మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఒంగోలు పట్టణంలోని రావు అండ్ నాయుడు కళాశాల భవనాలు మరో రెండు చోట్ల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ భవనాలు అయితే అనుకూలంగా ఉంటాయో అక్కడికి వెంటనే తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేసేలా అధికారులు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాధమిక పనులు ప్రారంభించి ఒంగోలు పట్టణంలో భవనాలు పరిశీలిస్తున్నట్లు అధికారుల ద్వారా సమాచారం. ఈ విషయమై ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ నరసింహరాజును వివరణ కోరగా తాత్కాలిక భవనాల్లోకి ట్రిపుల్ ఐటీని మార్చాలనే ప్రయత్నాలు ఉన్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.