కడప

టిడిపిలోకి ఆగని వలసలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 26: చాలా మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్‌కోసంతోపాటు అధికారంలో ఉన్న పార్టీలోకి రావడం సాదాసీదాగా మారే తరుణంలో తెలుగుదేశం పార్టీలోకి ఒక పార్టీ అనే గాకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలు క్యూ కట్టారు. నేతలు పార్టీలను వీడి దీర్ఘకాలంగా సంబంధిత పార్టీల నుంచి అనేక పదవులు పొంది ఆపార్టీని ఖాదర్ చేయకుండా అప్పట్లో తెలుగుదేశం పార్టీని, ఆపార్టీ నేతలపై దుమ్మెత్తిపోసి రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదనే నిరూపిస్తూ ఆపార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇరువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక కేంద్రమాజీ మంత్రి, పలువురు కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు వారి పార్టీలో నుంచి తెలుగుదేశంపార్టీలోకి మరీ పోటీపడి సైకిలెక్కారు. ఆ నేతల అనుచరగణం దశాబ్దాలకాలంగా తెలుగుదేశం పార్టీతో విభేదించి ఆధిపత్యపోరుమధ్య నలుగుతూ వచ్చిన ప్రధమ, ద్వితీయ శ్రేణినాయకులు తమ నాయకులు పార్టీ మారుతుంటే చోటా మోటా నేతలు మనసుచంపుకుని పార్టీలు మారలేక తమ సొంత పార్టీలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో తమ రాజకీయ భవితవ్యం కోసం నేతల వ్యూహాలు పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో వలసవెళ్లిన నేతలంతా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసి 2019లో అన్నా గెలుపొందుతామన్న ధీమాతో ఉండగా వలస నేతలతో తమకు టికెట్ లభించే వరకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అదే కాకుండా ఒకే వరలో రెండుమూడు కత్తులు ఒదగవని అందరికీ తెలిసినా నేతలంతా పైపైకి నటిస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సామాజికవర్గాల వారీగా తీసుకుంటే జిల్లాలో రెడ్లు, మైనార్టీ, కాపు (బలిజ) సామాజిక వర్గాలదే తొలి నుంచి జిల్లాలో రాజకీయ హవా కొనసాగుతోంది. 2019 ఎన్నికల నాటికి ఆ సామాజికవర్గ నేతలే పోటాపోటీగా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ స్థాపితం నుంచి పార్టీనే నమ్ముకుని సర్వం కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులు పడి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసినా నేతలకు ప్రాముఖ్యత తగ్గించి నిన్నా మొన్న చేరిన వలస నేతలకే పార్టీ అధిష్టానం పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో వైకాపా హవానే కొనసాగుతుండటం , ప్రతిపక్షనేత జగన్ సొంత జిల్లా కావడం, కేవలం జగన్మోహన్‌రెడ్డిని ఢీ కొనడానికి పార్టీలో చేరేందుకు వచ్చిన ఏ ఒక్క నేతలను వదులుకోలేదు. నేతలు పార్టీలు మారుతుంటే వారి అనుచరగణాలు నివ్వెరపోతూ నేతలు పార్టీలు మారిన తరహాలో పార్టీలు మారడం లేదు. నిన్నా మొన్నటి వరకు ప్రత్యర్థులపై కత్తులు నూరిన నేతలంతా తెలుగుదేశం పార్టీలో చేరి దీర్ఘకాలం శత్రుత్వంతో చేతులు కలపలేక నేతలు రంగులు మారుస్తున్నా అనుచరగణం , కార్యకర్తలు రంగులు మార్చడం లేదని పలు నియోజకవర్గాల్లో నిరూపించుకున్నారు. కేవలం పలువురు నేతలు అధికారం దాహంతోనే పార్టీలు మారుతున్నట్లు తెలుస్తోంది.

ఆకర్ష్‌కు పదును పెడుతున్న
జిఎన్ నాయుడు

రాజంపేట, మార్చి 26:వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో వైకాపాను బలహీనపరిచేందుకు ఆకర్ష్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త జి.ఎన్.నాయుడు పదును పెడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి ఎ.సాయిప్రతాప్‌ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన జి.ఎన్.నాయుడు ఇదే తరహాలో ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మరికొంతమంది వైకాపా ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకొచ్చే యత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాజంపేట, రైల్వేకోడూ రు, రాయచోటి, మదనపల్లె తదితర అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి ఇప్పటికే పలువురు వైకాపా నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు జి.ఎన్.కు టచ్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన జి.ఎన్.నాయుడును కృతజ్ఞతాపూర్వకంగా శనివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మాజీ కేంద్ర మంత్రి ఎ.సాయిప్రతాప్ భేటీ కావడం జరిగింది. సాయిప్రతాప్ పార్టీలో చేరిక సమయంలో పాండిచ్చేరి ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ కారణంగా జి.ఎన్.నాయుడు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిసింది. దీంతో సాయిప్రతాప్ శనివారం నేరుగా హైదరాబాద్‌లో జి.ఎన్.నాయుడు ఇంటికి వచ్చి కలిసి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను కూలంకషంగా చర్చించడం జరిగింది. పార్టీని బలోపేతం చేసే విషయంలో అన్ని రకాల కార్యక్రమాలకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని ఈ సందర్భంగా జి.ఎన్.నాయుడు సాయిప్రతాప్‌కు హామీ ఇచ్చారు. గత కొంతకాలంలో సాయిప్రతాప్‌తో జి.ఎన్.నాయుడు పార్టీలోకి తీసుకొచ్చే అంశంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. దీంతో సాయిప్రతాప్ భేషరతుగా పార్టీలో చేరేందుకు జి.ఎన్.నాయుడు వద్ద సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపధ్యంలోనే సాయిప్రతాప్ పార్టీలో చేరే కార్యక్రమాన్ని కూడా జిల్లా ముఖ్యనేతలతో పాటు చంద్రబాబుతో మాట్లాడి జిఎన్.నాయుడు ఖరారు చేసినట్టు సమాచారం. మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి సీనియర్ మాజీ కేంద్ర మంత్రిని తీసుకురావడంలో విజయం సాధించినట్టే మరికొంత మంది వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను తీసుకొచ్చేందుకు జి.ఎన్. ఇప్పటికే సంప్రదింపులు మొదలెత్తి ఉన్నారు. ఈ విషయాలన్నీ జి.ఎన్.దృష్టికి ఆంధ్రభూమి తీసుకెళ్ళగా శాంతికాముకుడు, నిజాయితీపరుడైన సాయిప్రతాప్ చేరిక వల్ల పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకం తనకుందని, అలాగే పలువురు కాంగ్రెస్, వైకాపాలకు చెందిన ముఖ్యనేతలు కూడా తెలుగుదేశం పార్టీలోకి రానున్నారని, త్వరలోనే ఈ కార్యక్రమం కూడా కార్యరూపం దాలుస్తుందన్న ధీమాను వ్యక్తపరిచారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే అన్ని వివరాలు వెలుగు చూస్తాయని జి.ఎన్.నాయుడు తెలిపారు.

పోలీసుల అదుపులో
నకిలీ విద్యార్థులు

పులివెందుల, మార్చి 26: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని మండల విద్యాశాఖాధికారి బండి క్రిష్ణారెడ్డి తెలిపారు. శనివారం పదవ తరగతి పరీక్షల్లో భాగంగా ఇంగ్లీష్ పేపర్-1 పరీక్షను పట్టణంలోని ఉర్దూ హైస్కూల్లో ప్రైవేటు విద్యార్థులైన హనుమంతరెడ్డి అను విద్యార్థి తరుపున సుబ్బయ్య, సుధీర్ అను విద్యార్థి తరుపున కిషోర్ అనే వ్యక్తులు పరీక్షలు రాస్తున్నారు. దీనిని గమనించిన ఇన్విజిలేటర్ రవికుమార్‌రెడ్డి, పరీక్షల చీఫ్ శివరామిరెడ్డి విషయాన్ని ఎంఇఓ క్రిష్ణారెడ్డికి తెలియజేయడంతో ఆయన పరీక్ష కేంద్రానికి చేరుకొని విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డికి, డిప్యూటీ డిఇఓ జనార్ధనాచారికి తెలియజేశారు. డిప్యూటీ డిఇఓ జనర్ధానాచారి పరీక్ష కేంద్రానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ అనిల్‌కుమార్ నకిలీ విద్యార్థులైన కిషోర్, సుబ్బయ్యలతోపాటు విద్యార్థి హనుమంత్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే విద్యార్థి సుధీర్‌బాబు కోసం పోలీసులు అనే్వషిస్తున్నట్లు సమాచారం.