కడప

మహిళల ఫిర్యాదులపై స్పందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 25: మహిళలపై వేధింపులు, విద్యార్థినీలు, యువతులపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే వేటుతప్పదని కర్నూలు డిఐజి రమణకుమార్ హెచ్చరించారు. శనివారం ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ నేతృత్వంలో ఓఎస్‌డి, ఏఎస్పీ, డిఎస్పీలు, సిఐలతో జిల్లాపోలీసు కేంద్రంలోని డిపిఓ కార్యాలయంలో క్రైమ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట పూర్తిస్థాయిలో నివారించాలని, నేరాల సంఖ్య పూర్తిగా తగ్గించాలని పోలీసులు ప్రజలకు చేరువైనప్పుడు శాంతి భద్రతలు మెరుగుపడతాయని డిఐజి రమణకుమార్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్య నియంత్రించడంతోపాటు రోడ్డుప్రమాదాలు పూర్తిగా అరికట్టాలని కర్నూలు- చిత్తూరు, ముంబాయి -చెన్నై జాతీయ రహదారులతోపాటు ఘాట్ రోడ్డుల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయాలని, డ్రైవర్లపై ప్రత్యేక నిఘా వుంచాలని ఆయన ఆదేశించారు. తప్పుచేస్తే ఎంతటి వారినైనా క్షమించే ప్రసక్తేలేదని చట్టం ముందు ఎంతటివారైనా సమానమేనని రాజకీయాలకు అతీతంగా అధికారులు పనిచేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటివారినైనా క్షమించరాదని, చట్టం తనపని తాను చేసుకుని పోతుందని డిఐజి పేర్కొన్నారు. అలాగే ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మాట్లాడుతూ పోలీసు అధికారులు, పోలీసులు విధినిర్వహణలో తప్పుచేస్తే క్షమించే ప్రసక్తేలేదని, నేరాలు అదుపునకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, నేరాలు అదుపు అయినప్పుడే శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఆయన గుర్తు చేశారు. పోలీసు సబ్ డివిజన్ వారీగా డిఎస్పీలు ప్రత్యేక శ్రద్ధ కనబరచి తమ డివిజన్లలో నేరాలు అదుపుచేయాలని రాత్రులందు గట్టి నిఘా పెంచాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఓఎస్‌డి సత్యయేసుబాబు, పులివెందు ల ఏఎస్పీ అన్బురాజన్, కడప, రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డిఎస్పీలు అశోక్‌కుమార్, రాజేంద్ర, రామకృష్ణ, పూజిత, సర్కాల్, క్రైమ్ డిఎస్పీ షౌకత్ అలీ, ట్రాఫిక్ డిఎస్పీ భక్తవత్సలం, ఎస్‌బి డిఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, మహిళా పోలీసుస్టేషన్ డిఎస్పీ వాసుదేవన్, ఎస్సీ, ఎస్టీల డిఎస్పీ సుధాకర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కుందూలో పెరిగిన నీటిమట్టం

దువ్వూరు, జూన్ 25: గత మూడురోజుల నుంచి ఎగువ ప్రాంతమైన నంద్యాల, కర్నూలులో భారీగా వర్షాలు కురవడంతో కుందూనదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. శనివారం నదిలో నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుందూనదీ ప్రాంతంలోని పెద్దజొన్నవరం, మాచనపల్లె, జిల్లెళ్ల, కానగూడూరు గ్రామాలలోని రైతులు పంటసాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నీరు వరినాట్లు వేసుకొనేందుకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. అలాగే మరిన్ని వర్షాలు కురిసి కెసికాలువకు, తెలుగుగంగ కాలువలకు నీరు వస్తే మండలంలో నీటి కొరత వుండదని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నగరం అభివృద్ధికి కృషి
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూన్ 25: కడప నగర మరింత కృషి చేస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 31 పట్టణాలను అభివృద్ధిచేసేందుకు కేంద్రప్రభుత్వం రూపొందించిన అమృత్ పథకం కింద కడప నగర పాలక సంస్థ ఎంపిక కావడం అదృష్టమన్నారు. శనివారం పట్టణంలోని డా.వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన అమృత్‌పథకం ప్రథమ వార్షికోత్సవం జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కడపను సుందరీకరణ చేసేందుకు, మంచి వసతులు కల్పించేందుకు పెద్దఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరయ్యారని, అయితే గ్రామాల్లో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పథకాలపై అవగాహన పెంచుకుని ప్రభుత్వం నుంచి లబ్దిచెందాలన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసి చైతన్యపరచడం సామాజిక బాధ్యత అన్నారు. కలెక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాకు రూ.43.82కోట్లతో కడప పట్టణాన్ని అత్యంత సుందరీకరణ చేయనున్నామన్నారు. అలాగే కడప నగరాన్ని సుందరీకరణ చేసేందుకు నీటి సరఫరా, వరదనీరు నిల్వకాకుండా చెరువులకు మళ్లించడం, డ్రైనేజి పనులు, పట్టణ రవాణా, మొక్కల పెంపకం తదితర అభివృద్ధి పనులను ఈ పథకం కింద చేపట్టడం జరుగుతుందన్నారు. నగరంలో రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్లను సరిచేయడం, పారిశుద్ధ్యం పైపులైన్లు మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో ప్రజల సహకారంతో లక్ష మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామని నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రజలు, అధికారులు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు తీసుకోవాలని ,మరుగుదొడ్లు లేని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. రోడ్లపై ఏ విధమైన వ్యర్థపదార్థాలు వేయరాదని పారిశుద్ధ్యాన్ని పాటిస్తే ఆరోగ్యవంతంగా అందరం జీవించవచ్చునన్నారు. కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా మాట్లాడుతూ పాతకడప, తిలక్‌నగర్, చిన్నచౌకు, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో 1985 సంవత్సరంలో వేసిన డ్రైనేజి పైపులు ఇప్పటి వరకు లీకేజిలతో కొనసాగుతున్నాయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సుభాన్‌బాషా, నగర పాలక సభ్యులు విశ్వనాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, మన్మోహన్‌రెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ ఇఫ్తార్ విందులు!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూన్ 25: రంజాన్ ఉపవాసాల పుణ్యమా అని ఇఫ్తార్ విందులతో జిల్లా హోరెత్తిపోతోంది. పనిలో పనిగా అధికార పార్టీ నేతలు ఇఫ్తార్ విందుల్లో భారీ ఎత్తున పాల్గొని మైనార్టీలను దగ్గరకు చేర్చుకోవడానికి అధికారపార్టీ నేతలు ఆలింగనం చేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు ఇఫ్తార్ విందుల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అధికార పార్టీ నేతలు ఇఫ్తార్ విందుల పేరిట మైనార్టీలను రాజకీయంగా కూడకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తదితరులు ఇఫ్తార్ విందుల్లో విరివిగా పాల్గొని మైనార్టీలతోపాటు ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మైనార్టీల కోసం హజ్‌హౌస్ నిర్మాణం, వౌలానా ఆజాద్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరుకావడంతో అధికార పార్టీ నేతలు మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి వుందని అంటూ ఓ పక్క ప్రచారం చేసుకుంటూ మరో పక్క ఇఫ్తార్ విందుల్లో పాల్గొని మైనార్టీలను అక్కున చేర్చుకుంటున్నారు. మిగిలిన రాజకీయ పార్టీల నేతలు మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని రాయితీలు కల్పించినా, అనేక పథకాలు ప్రవేశపెట్టినా మైనార్టీ ఓటర్లు తమవైపే ఉంటారని గట్ట్ధిమాతో ఉన్నారు. మైనార్టీ నేతలు ఒకవేళ వైసిపి నేతలను పిలిపించి ఇఫ్తార్ విందు ఇస్తే అధికారపార్టీ నేతలతో ఏ వైనా ఇబ్బందులు ఎదురౌతాయని కూడా కొంతమంది తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసిపి నేతలు మాత్రం తాము అధికారంలో లేనందున ఇఫ్తార్ విందులో పాల్గొన్నా వారికి ఒరిగేది ఏమీలేదని మైనార్టీలు తమ వైపే ఉంటారని భావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలు కొంతమేరకు తెలుగుదేశం పార్టీకి చేరువగా ఉన్నట్లు సమాచారం. అధికారపార్టీకి చెందిన మైనార్టీ నేతలు ప్రత్యేకించి ప్రముఖ మైనార్టీ నేతలందర్నీ పిలిపించి ఇఫ్తార్ విందులు ఏర్పాటుచేస్తూ తెలుగుదేశంపార్టీ జిల్లా నేతలను ఆహ్వానిస్తున్నారు. మొత్తం మీద ఇఫ్తార్ విందులో కూడా రాజకీయాలు ఊపందుకున్నాయి.

రుణమాఫీ జరగలేదని నిరూపించాలి

ఖాజీపేట,జూన్ 25: రాష్ట్ర రైతాంగానికి మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించి రెండు విడతలుగా రుణమాఫి చేశామని అలా చేయలేదని నిరూపించే దమ్ము, ధైర్యం జగన్, రఘువీరారెడ్డిలకు ఉందా అని ఉంటే నిరూపించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి సవాల్ విసిరారు. మండలంలోని బి.కొత్తపల్లె, భూమయపల్లె గ్రామపంచాయతీల్లో రుణమాఫీ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సర్పంచ్ నాగిరెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం రెడ్యం మాట్లాడుతూ భూమాయపల్లెలో 755 మంది రైతులకు రూ.58లక్షల 33వేల 695లు రుణమాఫీ జరిగిందన్నారు. ఒక్కోరైతుకు రూ.లక్షా 50వేలు మూడు విడతల్లో మాఫీ చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు. కడప జిల్లాలో రూ.1281 కోట్లు రుణమాఫీకి ప్రకటించగా ఇప్పటి వరకు రూ.807కోట్లు విడుదల చేశారన్నారు. దీంతో 4లక్షల 25వేల మంది రైతులకు లబ్దిచేకూరిందన్నారు. ఇలా జరగలేదని వైకాపా అధినేత జగన్, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలు నిరూపించాలన్నారు. కార్యక్రమంలో ఎండివో ఉషారాణి, తహశీల్దార్ శివరామయ్య, వ్యవసాయాధికారి ఓబులేసు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీరభద్రాలయంలో
చిన్నారులకు అక్షరాభ్యాసం
రాయచోటి, జూన్ 25: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో జ్యేష్ట మాసం పంచమి సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు బాల బాలికలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖ్య అర్చకులు శంకరయ్య, కృష్ణ మొదటగా గణపతిపూజ తర్వాత సరస్వతలిపూజ చేసి పిల్లలందరికీ కంకణాలు కట్టి పలక, బలపము, పుస్తకము, పెన్నులు వితరణ చేసి పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులతో కలిసి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ రంగారెడ్డి, ఎం ఈవో రామక్రిష్ణ, ప్రభుత్వ పాఠ్య పుస్తక రచయిత మడితాటి నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. వీరికి ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మంజుల, రొటేరియన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ అభివృద్ధి కృషి

పులివెందుల, జూన్ 25: రాయలసీమ రీజియన్ పరిదిలోని ఆర్టీసీ డిపోలన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రామారావు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ రీజియన్ పరిదిలోని అన్ని డిపోలను తనిఖీ చేయడం జరిగిందని, కడప రీజియన్‌కు సంబంధించి పులివెందుల డిపో భేష్‌గా వుందన్నారు. మొత్తం ఆర్టీసీ రూ.39 కోట్ల నష్టాల్లో వుందని, త్వరలో ఆ నష్టాన్ని బర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు వాహనాలకు దీటుగా ఆర్టీసీ బస్సులను కూడా మెరుగుపరుస్తున్నామని, బస్టాండ్లలో ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ చేపట్టామని, టివిలు, కుర్చీలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రీజియన్‌లో సమస్యలను తెలుసుకుంటున్నామని, పార్సిల్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశామని, బస్సులు సకాలంలో వచ్చేలా సమయాన్ని పాటించేలా చూస్తున్నామన్నారు. ప్రజలు ఆర్టీసీ సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామనిపేర్కొన్నారు. అదేవిధంగా అధికంగా విద్యార్థులు ప్రయాణించే చోట్ల ప్రత్యేక బస్సులను తిప్పుతామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎం గోపీనాధరెడ్డి, డిఎం అజంతుల్లా తదితరులున్నారు.

ముస్లింల అభివృద్ధి సీఎంతోనే సాధ్యం

రాయచోటి, జూన్ 25: పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ప్రతి ముస్లిం కష్టాల్లో నుండి బయటపడాలని అల్లాని ప్రార్థించాలని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక బడేకరేమియా మసీదు కమిటీ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎప్పుడూ పాటుబడుతున్నాని వారి సంక్షేమం కోసం రూ.710 కోట్లు కేటాయించిన ఘనత సీఎందేనన్నారు. ముస్లింలకు అన్ని రంగాల్లో పైకి తీసుకొని వచ్చేందుకు వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు సీఎం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రంజాన్‌తోఫా ఇస్తున్నది ఒక్క సీఎంతోనన్నారు. ఇంత వరకు ఇతర రాష్ట్రాలలో ముస్లింల కొరకు రంజాన్ పండుగకు ఉచిత సరుకులు పంపిణీ ఎవరూ చేయడం లేదన్నారు. ఈ నెల నుండి వౌలానాలకు రూ.3 వేలు, ఇమాంలకు రూ.5 వేలు పారితోషికం అందించడం జరుగుతుందన్నారు. కడపలో హజ్‌హౌస్ నిర్మాణం, కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణం త్వరలో జరుగుతుందన్నారు. రంజాన్ పండుగ అంటే పవిత్రత ప్రపంచంలోనే పెద్ద ఎత్తున జరుపుకుంటున్న పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. ముస్లింలందరికీ ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాష, బడే కరేమియా మసీదు కమిటీ సభ్యులు అమీర్‌జాన్, సాబ్జాన్, కాబ్లి కదీర్‌ఖాన్, కృష్ణా బీడీ యజమాని ఫయాజ్, చాన్‌బాష, ముబారక్, న్యాయమత్, జహంగీర్, ఇలియాస్, కలకడ మియాజాన్, కొప్పుల గంగిరెడ్డి, ఖాదర్‌వలి, సత్యారెడ్డి, పాలకొండ్రాయుడు, అడ్వకేట్ జక్రియబాష తదితరులు పాల్గొన్నారు.

మందులు ఇచ్చే యంత్రం ప్రారంభం
వీరబల్లి, జూన్ 25: వీరబల్లిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్‌వో సత్యనారాయణరాజు చేతుల మీదుగా శనివారం మందులు విడుదల చేసే ఏటీఎం యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నాణ్యమైన మందులను పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాలను ప్రవేశపెట్టిందన్నారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఏటీఎం తరహాలో మాత్రలు పొందవచ్చన్నారు. తమ తమ జబ్బులకు అవసరమైన మందులను ఈ యంత్రాల ద్వారా పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సకాలంలో మందులు తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నా. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రఫీవుల్లాబేగ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పేదల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూన్ 25: షెడ్యూల్డ్ కులాలు, షెడూల్డ్ తెగల ప్రజల్లో ఎక్కువశాతం నిరుపేదలున్నారని వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక కొత్త కలెక్టరేట్‌లోని మీ కోసం సభాభవన్‌లో ప్రత్యేక మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి అనేక వ్యయప్రయాసాలకోర్చి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేదలు వస్తుంటారన్నారు. ఎక్కువ సంఖ్యలో వృద్ధులు, వితంతువులు వస్తుంటారని వారిని చీదరించుకోకుండా సమస్యలను సానుకూలంగా వినాలన్నారు. అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయాశాఖల అధికారులకు బదిలీ చేశారు. తన కుమార్తె చదువుకునేందుకు కమలాపురం లోని గురుకుల పాఠశాలలో సీటు మంజూరు చేయాలని ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన లాజర్ తన దరఖాస్తులో కలెక్టర్‌ను కోరారు. ఉన్నత విద్యను యూరఫ్‌లో అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించాలని బి.మఠం మండలం గుండాపురం గ్రామానికి చెందిన కరుణాకర్ కలెక్టర్‌ను వేడుకున్నారు. తన భూమికి డి.్ఫరం మంజూరుచేయాలని సికెదినె్న మండలం ఇప్పెంట గ్రామానికి చెందిన నరసింహులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అలాగే తన ఆధీనంలో ఉన్న భూమికి పాస్ బుక్‌లో నమోదు చేయకుండా మరో వ్యక్తులకు మార్పుచేస్తున్నారని తనకు న్యాయం చేయాలని సిద్దవటం మండలం జె.కొత్తపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్ తన దరఖాస్తులో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. అదేవిధంగా అగ్రవర్ణ కులాల వారు ప్రభుత్వ నీటికుంట నీరును, కరెంటును తమకు అందకుండా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బి.మఠం మండలం సోమిశెట్టిపల్లె గ్రామానికి చెందిన చెన్నయ్య కలెక్టర్‌ను వేడుకున్నాడు. తన గ్రామంలో చౌకదుకాణ డీలర్ షాపును మంజూరు చేయాలని మైదుకూరు మండలం సుగాలి తండాకు చెందిన తులసీరామ్‌నాయక్ తన దరఖాస్తులో తెలుపుకున్నారు. తాను పేదవాడినని తన భూమిలో పైరు పెట్టడం జరిగిందని ఎరువులు, పురుగుమందులు ఇప్పించాలని నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు కలెక్టర్‌ను కోరారు. ఐఏవై పథకం కింద నిధులు మంజూరు చేయాలని ప్రొద్దుటూరుకర చెందిన వెంకటరమణ కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో సులోచన, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

రాయచోటి, జూన్ 25: కొంత మంది వ్యక్తులు తనపై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు తనపై పనికట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు మాని ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదన్నారు. తాను ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడినట్లు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటిదేమైనా ఉంటే బయటపెట్టాలన్నారు. అలాంటి దురాలోచన వారికే ఉందన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా యుద్ధ ప్రాతిపదికన వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన ప్రాజెక్టులు నిర్మించామన్నారు. చీటికి మాటికీ ఎంపీ మిథున్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తుండటం సమంజసం కాదన్నారు. భూములకు ప్రాజెక్టుల కమిషన్లకు పాల్పడేది వారేనన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చేసుకున్నట్లు వారి వ్యవహారం ఉందన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం వలనే వ్యవసాయ భూములకు నీరు అందించాలన్న విషయం గ్రహించాలన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు వారి తోటలకు కూడా వస్తున్నాయని తెలుసుకోవాలన్నారు. రెండు సంవత్సరాల తర్వాత రూ.74 కోట్లకు టెండరుకు పిలవడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎదురుదాడి చేసి మాటల గారడీ చేసి ఏదో చెప్పడం సరికాదన్నారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం వల్లనే పొలాలకు నీరు అందాయని, ప్రస్తుతం కూడా ప్రాజెక్టులలో నీరు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకోవాలన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నది తాను కాదన్నారు. వారి విషయాలు ఎక్కడ బయటపడతాయోనన్న తాపత్రయంతో ఎదుటి వారిపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తుండటం సం స్కారం కాదన్నారు. తాను ఎపుడూ ప్రజల మనిషినని, ప్రజల కోసమే పనిచేస్తున్నానని తనపై ఆరోపణలు చేసే ముందు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్ తదితరలు పాల్గొన్నారు.

విద్యార్థులకు కంప్యూటర్ విద్య
తప్పనిసరి

సుండుపల్లె, జూన్ 25: ప్రస్తుత కాలంలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య తప్పనిసరి అని ఎంఈఓ వెంకటేషునాయక్ తెలిపారు. మండల కేంద్రంలోని జి.రెడ్డివారిపల్లె మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడు తన సొంత నిధులు రూ.20 వేలు వెచ్చించి ఒక కంప్యూటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంప్యూటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి వెంకటేశునాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏ పనిలో చూసినా కంప్యూటర్ అవసరం ఎంతో ఉందని, రాబోవు కాలంలో మొత్తం కంప్యూటర్‌మయంగా మారుతుందని, ఇందుకు గాను విద్యార్థులకు కంప్యూటర్ ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. విద్యార్థులపై తల్లిదండ్రులు ఎంతో ఆశపెట్టుకొని ఉంటారని, ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని మంచి మార్కులతో ఉత్తీర్ణత చెందాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలో మెరుగైన విద్యను బోధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యత కలిగిన ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, రవీంద్రనాథరెడ్డి, హకీంబాష లాంటి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉండటం తమ పాఠశాల చేసుకున్న పూర్వజన్మ సుకృతమని ఆయన తెలిపారు. పలు రకాల ప్రైవేటు పాఠశాలల నుండి 20 మంది విద్యార్థులను ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి తన సొంత నిధులతో ఆటోను పంపించి ప్రతి రోజూ పాఠశాలకు విద్యార్థులను తీసుకురావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. వారి కృషి వల్లనే ఈ విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హైకోర్టు ఏర్పాటుకై నాయకులు కృషి చేయాలి

కడప,(లీగల్)జూన్ 25: రాయలసీమలో హైకోర్టును ఏర్పాటుచేసి సమన్యాయాన్ని పాటించాలని అందుకు రాజకీయ నాయకులు కృషి చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జేఏసి కన్వీనర్ జివి రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం న్యాయవాదుల సంఘం భవనంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, జేఏసి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో శ్రీబాగ్ ఒప్పంద ఒడంబడిక ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ఆ తర్వాత హైకోర్టును కోస్తాప్రాంతంలో నిర్మించి సమన్యాయాన్ని అప్పటి ప్రభుత్వం పాటించింది. తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధానిని, హైకోర్టును తరలించారు. అక్కడే అన్ని కోణాల్లో పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగాలు, ఆ ప్రాంతమంతా అభివృద్ధి జరిగింది. కాగా రెండు సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాలను విడదీసి తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్‌గా ఏర్పాటైంది. ప్రస్తుతం అమరావతిలో రాజధానిని నిర్మించి, కరవుప్రాంతమైన రాయలసీమలో హైకోర్టును ఏర్పాటుచేసి సమన్యాయాన్ని పాటించాలన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈవిషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి హైకోర్టు ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మేధావి వర్గం వారు హైకోర్టును రాయలసీమలోని ఏ ప్రాంతంలోనైనా ఏర్పాటుచేసేందుకు తమ వంతు కృషి చేసి న్యాయవాదులు రాబోయే కాలంలో జరిపే ఏ కార్యక్రమాలకైనా మద్దతు తెలిపి హైకోర్టును ఏర్పాటు చేసే వరకు న్యాయవాదులు వెన్నంటి ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఓంకార్, విశ్వనాధరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ఏపి బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, సభ్యులు గోవె రవి, రాయలసీమలోని 16 బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు, జేఏసి సభ్యులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు

కడప,(కల్చరల్) జూన్ 25: ప్రస్తుతం చాలామంది యువత ఎక్కువగా పాన్‌పరాగ్, గుట్కా, బ్రాంది, రాజా, హాన్స్, జర్దా కిల్లీ, మావా, గంజాయి, కొకైన్, హెరాయిన్, స్పిరిట్, బ్రౌన్ షుగర్ తదితర మాదక ద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే పెళ్లయిన వారు మాదక ద్రవ్యాలకు బానిసలు కావడంతో వారు అనారోగ్యం పాలుకావడమేగాకుండా వారి కుటుంబాల జీవన స్థితిగతులు అధ్వాన్నంగా తయారయ్యాయి. అలాగే మధ్యతరగతి కుటుంబాల వారే ఇలాంటి మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం జరుగుతోంది. దీంతో కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్న సంఘటనలు చాలా చూస్తున్నాం. ఎంతోమంది డాక్టర్లు, మేధావులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని చెబుతున్నా యువత పెడచెవిన పెట్టడంతో వారి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. తద్వారా వారి భార్యా, పిల్లల భవిష్యత్ అంధకారంలో పడిపోతున్నాయి. మాదకద్రవ్యాలను వాడవద్దంటూ అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్చంధ సంస్థలు కూడా ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ ఎంతోమంది డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ కేరళ హోమియోపతి వైద్యులు జయానంద రీషీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి కుటుంబాల వారు మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం పట్ల వారి బ్రతులు చిన్నాభిన్నం అవుతుండటం బాధాకరమన్నారు. మాదక ద్రవ్యాలు వాడేవారు వివిధ జబ్బుల బారిన పడటం, ఆ జబ్బులకు సరైన చికిత్సలు చేయించుకునే స్తోమత లేకపోవడంతో వారు మృత్యువాతపడుతున్నారు. అలాగే బ్రాంది, విస్కీ లాంటి మద్యం ధరలు కూడా ఎక్కువ కావడంతో మద్యానికి బానిసలైన వారు మెడికల్ షాప్స్‌లో చౌక ధరలకు అమ్మే స్పిరిట్ బాటిల్స్‌ను కొని తాగుతున్నారు. స్పిరిట్ తాగడం వల్ల కడుపులోని ప్రధాన అవయవాలన్నీ చెడిపోవడంతో వారు మృత్యువుకు దగ్గరవుతున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దల నుంచి చిన్నపిల్లలు కూడా మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం బాధాకరం. కొందరు మద్యం ఎక్కువగా సేవించి రోడ్లపైనే పడిపోవడం, మరి కొందరు వాహనాల కిందపడి మృత్యువాత పడటం కూడా జరుగుతోంది. అలాగే మద్యం సేవించి వాహనాలు కూడా నడపడం వల్ల వారు సరైన గమ్యాలకు చేరుకోలేకపోతున్నారు. తద్వారా మధ్యలోనే ఏదో ఒక వాహనానికి యాక్సిడెంట్ చేయడంతో మద్యం సేవించిన వారితోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా మృత్యువాత పడుతున్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపేవారు ఎదురుగా వస్తున్న వారిపై వాహనాన్ని ఎక్కించడం వంటి సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా పేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి జీవితాలను బంగారు బాటలు వేసుకోవాలి. అదేవిధంగా శరీరారోగ్యం మనం తినే తిండి, తాగేనీరు, పీల్చేగాలి పరిమాణం, నాణ్యతల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం జీవించే పరిసరాలు, పనిచేసే పరిసరాలు, విశ్రాంతి, నిద్ర, మనశ్శాంతి, అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వీటికితోడు మనం చూసే దృశ్యాలు, వినే శబ్దాలు కూడా శరీరాన్ని, మనస్సును ప్రభావితం చేస్తాయి. ఆహారంలో పెరిగిపోతున్న రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల అవశేషాలు శరీరంలోకి చేరి వ్యర్థపదార్థాలను, విషపదార్థాలను పేరుకుపోయేట్టు చేస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపక పోతే అవి వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇంటిలో, ఇంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు జయానంద రిషీనాథ్ కోరారు.