కడప

వైవియు విసిగా రామచంద్రారెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 9: జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్‌గా పనిచేస్తున్న ఆచార్య బేతనభట్ల శ్యాసుందర్‌కు ఈనెల 11న పదవీకాలం ముగుస్తుండటంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ప్రొఫెసర్ రామచంద్రారెడ్డిని నియామకం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత అనుభవం కలిగిన రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితం కావడంతో ఆయన్ను నియమిస్తే విశ్వవిద్యాలయం ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందని ముఖ్యమంత్రి భావించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మంది ఈ విశ్వవిద్యాలయానికి విసిలుగా వచ్చేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. సెర్చ్ కమిటీ ద్వారా విసి నియామకం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం కూడా పలువురు విసి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్దవౌతున్నారు. అయితే వృక్షశాస్త్రంలో అత్యంత అనుభవం కలిగి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక గుర్తింపుకలిగిన ఆచార్య రామచంద్రారెడ్డిని వైవియు వైస్ చాన్సలర్‌గా తీసుకొచ్చినట్లయితే పరిపాలన పరంగా, విద్యాపరంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

రూ.5 లక్షల విలువ చేసే
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
రాజంపేట, జూలై 9: కడప జిల్లా రాజంపేట పోలీసులు శనివారం రూ.5 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐచర్ వాహనంలో వీటిని తరలిస్తుండగా సోదాలు నిర్వహించి పట్టుకున్నట్లు అర్బన్ సిఐ మోహనకృష్ణ తెలిపారు. బెంగుళూరు నుండి రాజంపేటకు వీటిని తరలిస్తున్నారన్నారు. రాజంపేటకు చెందిన వ్యాపారి పొబ్బటి వేణుగోపాల్, డ్రైవర్ మద్దెన శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నామన్నారు. మొత్తం 45 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటిని కడప పుడ్ ఇన్‌స్పెక్టర్‌కు స్వాధీనం చేస్తున్నట్టు చెప్పారు.

పోలీస్‌స్టేషన్ ఎదుట
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

రాయచోటి, జూలై 9: ఇరువురి విద్యార్థుల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడేలా దారితీసింది. వివరాలలోకి వెళ్లితే.. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంగొల్లపల్లెకు చెందిన జగన్నాథ నాయుడు రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుడున్నాడు. కాగా రెండు రోజుల క్రితం మరో విద్యార్థితో గొడవపడ్డాడు. ఈ గొడవలో దెబ్బలు తిన్న బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి ఇరువురి విద్యార్థుల సమస్య సమన్వయం కుదరడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే కులసంఘాల నాయకులు మాత్రం బాధిత విద్యార్థిని రెచ్చగొట్టడంతో పాటు తమ కులానికి చిన్నచూపు తెస్తావని బాధిత విద్యార్థికి రెచ్చగొట్టారు. జగన్నాధనాయుడిపై కేసు పెడతాం లేకపోతే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో జగన్నాథనాయుడు పోలీస్ స్టేషన్ బయట సూసైడ్ నోట్ రాసి వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తరలించారు.

లోక్ అదాలత్ తీర్పు
రచ్చబండలాంటిదే..

కడప,(లీగల్)జూలై 9: లోక్ అదాలత్ ద్వారా వచ్చే తీర్పులు పల్లెల్లోని రచ్చబండ తీర్పు లాంటిదని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన జడ్జి, ఫ్యామిలీ జడ్జి వివి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆయన కక్షిదారులను, ముద్దాయిలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈలోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులు సుప్రీం కోర్టు తీర్పుతో సమానమని అలాగే పేదవారికి, ఎస్సీ, ఎస్టీ, వితంతువులకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 987 కేసులు లోక్ అదాలత్‌కు ముందుకు పరిష్కారానికి రాగా జడ్జిలు మూడు బెంచ్‌లుగా ఏర్పాటై మొత్తం 913 కేసులు పరిష్కరించారు. ఈ కేసుల్లో ముద్దాయిలకు కక్షిదారులకు, మోటార్ వాహనాల నష్టపరిహారం దారులకు రూ.65లక్షల 85వేల 300 లను వారికి పంచడం జరిగింది. ఈ లోక్ అదాలత్‌లో మొదటి జూనియర్ సివిల్ జడ్జి శోభారాణి, రెండవ జూనియర్ సివిల్ జడ్జి దీనా, సభ్యులు, న్యాయవాదులు రంగబాలాజి, వెంకటకిశోర్‌కుమార్, ఏ.సుధారాణి, సోషల్ వర్కర్స్ జె.సురేష్‌సహాయం, షేక్ హమాన్, ఎస్.జిలానీబాషాలు ఈలోక్ అదాలత్ కార్యదర్శి యుయు.ప్రసాద్ పర్యవేక్షించారు.

శాస్త్ర విజ్ఞానంతోనే మూఢనమ్మకాలు మాయం

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూలై 9: శాస్తవ్రిజ్ఞానంతో ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే మూఢనమ్మకాలు మాయవౌతాయని, అసమానతలు రూపుమాపి నవ సమాజ నిర్మాణం చేయవచ్చునని శనివారం రిమ్స్ ఆడిటోరియంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక 14వ రాష్టమ్రహాసభల్లో ఎమ్మెల్సీలు, వేదిక రాష్టన్రేతలు, కలెక్టర్ కెవి సత్యనారాయణలు పిలుపునిచ్చారు. మూడురోజులపాటు జరుగుతున్న మహాసభలు తొలిరోజు జనవిజ్ఞాన వేదిక రాష్ట్రఅధ్యక్షుడు రంగన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వేదిక ఏర్పడి 28సంవత్సరాలు అవుతోందని శాస్తవ్రిజ్ఞానాన్ని పెంపొందించేందుకు తాము పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ విజ్ఞాన శాస్తవ్రేత్తలు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నా శాస్త్రాలు మాత్రం పేదరికంలో ఉన్నాయని భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు శాస్త్రాలతోపాటు మిగిలిన శాస్త్రాలు పూర్తిస్థాయిలో పరిశోధించి మూఢనమ్మకాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తిచేయాలని వారు కోరారు. అలాగే కలెక్టర్ కె.సత్యనారాయణ ప్రసంగిస్తూ శాస్తవ్రిజ్ఞానం ప్రతి ఒక్కరిలో అలవర్చుకునే విధంగా కృషి చేయాలని, విద్య, వైద్యం, మెరుగైన ఆరోగ్యం, సృజనాత్మకత, శాస్ర్తియత వంటి తదితరాలు అలవర్చుకుని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మూఢనమ్మకాలు పారద్రోలాలని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకృత అభివృద్ధి, అసమానతలు లేని సమాజం కోసమే జనవిజ్ఞాన వేదిక కృషి చేయడం, వారి కృషి ఫలంగానే ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం వచ్చి మూఢనమ్మకాలపై నమ్మకాలు సన్నగిల్లుతున్నాయన్నారు. అలాగే సీనియర్ ప్రముఖ వైద్యులు పుత్తాబాలిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఖనిజ సంపద, వృక్షసంపద వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నా ప్రభుత్వ చేయూతలేని కారణంగానే జిల్లా ఎటువంటి ఎదుగు బొదుగుకు లేకుండా కరవు జిల్లాగానే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వేదిక రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య, వేదిక జిల్లా వ్యవస్థాపకులు నరసింహారెడ్డి, జిల్లాకార్యదర్శి రఘునాథరెడ్డి, కోశాధికారి ప్రభాకర్, డిఇఓ బి.ప్రతాప్‌రెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో మూఢనమ్మకాలకు కారణం ప్రజల్లో చైతన్యం లేకపోవడమేనని, మొక్కుబడులు, చేతబడులు, మంత్రాలు, చిట్కాలు వంటివాటికి స్వస్తిచెప్పాలని, మంత్రగాళ్లను నిషేధించడంతోపాటు విజ్ఞానశాస్త్రంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగివుండాలని వారు పిలుపునిచ్చారు. కొంతమంది నకిలి బాబాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
కొవ్వూరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొవ్వూరు రమేష్‌రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ శశిధర్‌లు ప్రసంగిస్తూ జెవివి ద్వారా ఇప్పుడిప్పుడే ప్రజల్లో మూఢనమ్మకాలు సన్నగిల్లి ప్రజలు చైతన్య వంతులు అవుతున్నారన్నారు. జిల్లాలో విద్యాసంస్థలకు కొదవలేదని, ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తయితే జిల్లా అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.

పాలకులు సమాధానం చెప్పాలి

రాయచోటి, జూలై 9: చంద్రబాబు రెండేళ్ల పాలనపై కేంద్ర ప్రభుత్వంలోని ఓ సంస్థ దేశంలో అవినీతి గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చిన నివేదికలకు తెలుగుదేశం పాలకులు సమాధానాలు చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం గడప గడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజశేఖర్‌రెడ్డి పాలన అవినీతిమయమని, జగన్ అవినీతిపరుడు అంటున్న వారికి సూటికి చెప్తున్నా ప్రజల్లో రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానాన్ని తగ్గించాలనే దురుద్దేశ్యంతోనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ ఒక్కరికీ ధైర్యం ఉన్నా అభివృద్ధిపై చర్చకు సిద్ధపడాలన్నారు. జగన్ అవినీతి లక్ష కోట్ల రూపాయలు అని విమర్శించే వారు ధైర్యముంటే చూపించాలన్నారు. జగన్ తన వ్యాపార నైజంతో తన పరిశ్రమలకు వచ్చిన షేర్ విలువల ప్రకారం కొన్నింటికి పెట్టుబడులు పెడితే, అధికారం ఉపయోగించి రూ.750 కోట్లు అటాచ్ చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఏ సామాంతులు, ఏ చక్రవర్తుల కాలాల్లో కూడా జరిగి ఉండదన్నారు. మీరా అవినీతి గురంచి మాట్లాడేదని ఆయన ధ్వజమెత్తారు.
విశేషస్పందన
గడప గడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమం శనివారం మునిసిపాలిటీ పరిధిలోని 3, 4, 5వ వార్డులో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రెండో రోజు కూడా ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు ఎన్నికల హామీల ప్రకారం డ్వాక్రా రుణాల మాఫీ అయ్యాయా అని ప్రస్తావించినపుడు కానీ, రుణమాఫీ, ఇంటి ఇంటికీ ఉద్యోగం వచ్చాయా? లేదా? అని అడిగినప్పుడు కుటుంబాల నుంచి లేదు లేదు అని సమాధానాలు వచ్చాయి..
ఆయా వార్డుల్లోని ప్రజల నుంచి వినతులు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి వెల్లువలా వచ్చాయి. పెంటమాలపల్లెకు చెందిన లక్ష్మిదేవి, జెండావీధికి చెందిన మస్తానీలు వికలాంగుల పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పలువురు వృద్ధులు తమ వేలిముద్రలు పడటం లేదన్న కారణంతో చౌకదుకాణాల్లో బియ్యం ఇవ్వడం లేదంటూ చెప్పడంతో ఈ సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్‌ను కోరారు. బావి వీధిలో బెంగళూరు డాక్టర్ వీధులలోని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని స్థానికులు కోరడంతో తక్షణం స్పందించి ట్రాన్స్‌కో డీఈతో మాట్లాడి త్వరితగతిన స్తంభాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపల్లెలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్త దిబ్బలను తొలగించాలని స్థానికులు కోరడంతో అప్పటికప్పుడే చెత్తదిబ్బలను తొలగించేలా చర్యలు చేపట్టారు. డీఎస్సీ ఉర్దూ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు డీఎస్సీ ఉర్దూ అభ్యర్థులు ఎమ్మెల్యేను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి రిజ్వాన్, వైకాపా నాయకులు ముల్లా హజరత్, కొలిమి చాన్‌బాష, జాకీర్, గంగిరెడ్డి, విజయభాస్కర్, హబీబ్, కౌన్సిలర్ ఛిల్లీస్ ఫయాజ్, ముబారక్, అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

దోపిడీదారులా
గడపగడపకు వెళ్లేది..

రాయచోటి, జూలై 8: గడప గడపకూ వైకాపా పేరిట ప్రజల వద్దకు వెళ్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీదారులని అలాంటి వారు నేడు గడప గడపకూ వెళ్లి టీడీపీ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేర్కొనడం హాస్యాస్పదమని తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జగన్ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని జగన్ రాష్ట్రాన్ని లూటీ చేసిన విషయం తెలిసి కూడా వైకాపా నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో ఏదో రకంగా సానుభూతి సంపాధించాలనే ఉద్యేశంతో జగన్ మరోసారి ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వంపై అర్థరహితమైన ప్రశ్నలను వేస్తున్న వైకాపా నాయకులు జగన్ లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఏ రకంగా చేశాడో చెప్పకుంటే ప్రజల్లో సానుభూతి లభించే అవకాశం ఉందన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవుతుందన్న ఈర్ష్యతో చంద్రబాబు చేస్తున్న ప్రతి పనికీ జగన్ అడ్డుకట్ట వేయాలని చేస్తున్నాడన్నారు.
ఇప్పటికైనా వైఎస్‌ఆర్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య..!

ప్రొద్దుటూరు టౌన్, జూలై 9: ఆర్టీసీ కార్మికుడు కొండారెడ్డి (48) ప్రతిరోజూ విధులు నిర్వహించే డిపోలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. విషయాన్ని తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. మృతుడి తోటి ఉద్యోగులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొండారెడ్డి ప్రొద్దుటూరు ఆర్టీసీ గ్యారేజ్‌లో వెల్పర్‌గా పనిచేస్తుండేవాడు. తాను వాడే పనిముట్లను పరిశుభ్రంగా వుంచుకుంటూ ఎవరితోనైనా పద్ధతిగా, క్రమశిక్షణకు మారుపేరుగా నడుచుకుంటుండేవాడు. ఈ క్రమంలో బుధవారం తాను వాడే టూల్స్‌ను మెకానికల్ రామచంద్రయ్య తీసుకొని వేస్ట్ ఆయిల్‌తో కలిపి అపరిశుభ్రంగా ఇవ్వడంతో శుభ్రపరిచి ఇచ్చేది తెలియదా అంటూ రామచంద్రయ్యను కొండారెడ్డి ప్రశ్నించడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. వెంటనే మజ్దూర్ యూనియన్ నాయకులు రామక్రిష్ణ, మగ్బుల్ కలిసి రామచంద్రయ్యతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌పోస్ట్ పోలీసుల వద్ద కొండారెడ్డిపై ఫిర్యాదు చేయించారు. ఈ కేసు టుటౌన్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. తోటి ఉద్యోగులు నీకు ఉద్యోగం పోతుందని కొండారెడ్డిని భయపెట్టడంతో బాధపడి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను పిలుచుకొని టుటౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను చెప్పుతో కొట్టాడని, కేసు నమోదుచేసుకోమని ప్రాధేయపడినా కొండారెడ్డి ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురై శనివారం తోటి ఉద్యోగులందరూ భోజనానికి వెళ్లిన సమయంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే టుటౌన్ ఎస్సై మంజునాధరెడ్డి, త్రీటౌన్ ఎస్సై మహేష్‌లు తన సిబ్బందిని వెంటబెట్టుకొని హుటాహుటిన అక్కడికి చేరుకొని కొండారెడ్డి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. మృతుని భార్య సులోచన, కుమారులు కిరణ్, చైతన్యలు తన తండ్రి ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, దేనినైనా ఎదుర్కొనే ధైర్యం వుందని, కచ్చితంగా రామచంద్రయ్య, రామక్రిష్ణ, మగ్బుల్‌లే చంపారని, వారిపై కేసు నమోదుచేసి, అరెస్ట్‌చేసి నిజానిజాలు నిగ్గుతేల్చాలని పోలీసులను కోరారు. సంఘటనా స్థలానికి ఆర్టీసీ డిఎంలు, సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకున్నారు.

రాజోలి రిజర్వాయర్‌పై అలసత్వం ఎందుకు..?

రాజుపాళెం, జూలై 9: కెసి రైతులు సాగునీటికి తిప్పలు పడాల్సిందేనా, రాజోలి రిజర్వాయర్‌పై ఎందుకింత ప్రభుత్వానికి అలసత్వమని వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాదరెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. శనివారం పుణ్య క్షేత్రమైన వెల్లాల సమీపంలోని కడప కెసి ప్రధాన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు, తాగునీటికి అవస్థలు పడుతున్న ఈ ప్రాంత రైతులు, ప్రజల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరిస్తున్నారని సీమ ప్రాంత అభివృద్ధిపై వివక్షత చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికి చెందిన సి ఎం ఎందుకింత వివక్షత చూపుతున్నారని రైతుల సంక్షేమమంటే ఇదా అని ఆయన దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖర్‌రెడ్డి రాబోయేరోజుల్లో కెసి ఆయకట్టు రైతులు సాగునీటికై ఇబ్బందులు పడకుండా ఈ ప్రాంత తాగునీటి అవసరాలను గమనించి రాజోలి ఆనకట్ట వద్ద రిజర్వాయర్‌ను నిర్మించాలని సంకల్పించడం జరిగిందన్నారు. అందుకోసం భూమిపూజ కూడా చేశారన్నారు. ఆయన మరణానంతరం రాజోలి రిజర్వాయర్‌పై పాలకులు ఊసే ఎత్తడం లేదన్నారు. రైతుల సంక్షేమమంటూ నినాదాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజోలి రిజర్వాయర్‌పై ఉద్యమించాలన్నారు. రాజోలి ఆనకట్ట వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తేనే అటు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా వుంటుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసి రైతుల కడగళ్లు తీర్చాలంటే రాజోలి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైకాపా అధికారప్రతినిధి వెల్లాల భాస్కర్, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.