కడప

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు పుల్‌టైమ్ పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, జూలై 30:ప్రభుత్వాసుపత్రులలో పార్ట్‌టైమ్‌గా విధులు నిర్వహించే వైద్యుల మాకువద్దు, పుల్‌టైమ్ విధులు నిర్వహించి, ప్రజలకు సేవలందించే వైద్యులే అవసరమని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం మంత్రి రాజంపేట ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే వైద్యుల కోసం ఎటువంటి చర్యలైనా తీసుకొంటామని వివరించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. వైద్యుల కొరతను త్వరలో తీర్చుతామన్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ను కడప జిల్లాలో పర్యటించి అన్ని పిహెచ్‌సిలు, ఇహెచ్‌సిల పనితీరును పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. రాజంపేట ప్రభుత్వాసుపత్రిని పరిశీలించగా అక్కడ పనిచేసే డాక్టర్ అనిల్‌పై రోగులు, ప్రజలు అనేక ఆరోపణలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. రాజంపేట ఆసుపత్రి వైద్యుని పనితీరుపై నందలూరు మండలం కృష్ణాపురానికి చెందిన లక్ష్మీ అనే గర్భిణీ ఆటోలో వెళ్తూ తనకు దారిలో ఫిర్యాదు చేసిందన్నారు. వైద్యుడు చిన్న తప్పుచేస్తే బదిలీ చేయడం, పెద్దతప్పు అయితే సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ గతంలో ఈ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి పలుమార్లు వైద్యుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేసినా వారి పనితీరు మారలేదన్నారు. పేద ప్రజల ఆరోగ్య విషయంపై మాట్లాడితే వారిలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. ఆసుపత్రిలో రూ. 4.50 కోట్లతో మంజూరైన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని దీనిపై అధికారులకు తగు సూచనలు చేయాలని, వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని ఆయన మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ఎ.సాయిప్రతాప్, ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, డిహెచ్‌ఎంఓ సత్యనారాయణరాజు, మున్సిపల్ కమీషనర్ ఎన్‌వి రమణారెడ్డి, డిఎస్పీ ఎ.రాజేంద్ర, బిజెవైఎం జాతీయ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, టిడిపి నాయకులు యెద్దల సుబ్బరాయుడు, చొప్పా వెంకటరెడ్డి, ఎ.ప్రతాప్‌రాజు, సురేష్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేరుకే సిసి కెమెరాల ఏర్పాటు!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూలై 30: జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తూ అసాంఘిక కార్యకలాపాలు పెట్రేగుతూ మహిళలకు భద్రత కరువై అరకొర పోలీసుల కొరతతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పోలీసులు సిసి కెమెరాల ఏర్పాటుతో ఊపిరి పీల్చుకోవాలని యోచిస్తున్న సమయంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పలువురు సహకరించని కారణంగా సిసి కెమెరాల ఏర్పాటుకు మొక్కుబడిగా మారింది. జిల్లాలో 1014 సిసి కెమెరాలు ఏర్పాటుచేసే దిశగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం ఆమేరకు ఈ ఏడాది మార్చి 24న అప్పటిపోలీసు బాస్ జెవి రాములు కూడా ప్రకటించారు. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు నగరాల్లో మాత్రమే సిసి కెమెరాలు కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. సిసి కెమెరాల ద్వారా ఫుటేజిలు పరిశీలించి శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు ఎంతో తపనపడ్డారు. అయితే అన్ని రంగాల నుంచి సహకారం అందనందున పోలీసులకు తలభారంగా మారింది. సిసి కెమెరాల ద్వారా దొంగతనాలు, దోపిడీలు, గొలుసుదొంగలచోరీ, వాహనాల చోరీ, ఈవ్ టీజింగ్, మహిళలను వేధింపులు వంటివి అరికట్టవచ్చునని పోలీసు యంత్రాంగం భావించింది. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పురపాలక సంఘాలు ఉండగా ప్రతినిత్యం పట్టణాల్లో జనాభా పెరగడంతోపాటు గజిబిజీగా రోడ్డుమార్గాలు, ఈవ్‌టీజింగ్ చేసే ప్రాంతాలు అధికంగా ఉన్నాయి. రాత్రుల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నా ప్రజలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయినా పోలీసులు తమకున్న మార్గాల ద్వారా శాంతి భద్రతలు కాపాడుతున్నా పూర్తిస్థాయిలో వివిధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పౌరులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పురపాలక సంఘాలు సహకరించి శాంతిభద్రతలు కాపాడేందుకు సిసి కెమెరాలు ఏర్పాటుచేయాల్సివుంది.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

వేంపల్లె, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులను బర్తరఫ్ చేయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లెలో ఆయన తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పంగనామాలు పెడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడితే ఓటుకు నోటు కేసులో ఎక్కడ ఇరుక్కుంటామోనని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భయపడుతున్నారన్నారు. దీంతో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబునాయుడు గట్టిగా పోరాడటం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ ఎంసెట్ -2 రద్దుతో..
జిల్లా ర్యాంకర్ల ఆందోళన..

ఆంధ్రభూమి బ్యూరో
కడప,జూలై 30: తెలంగాణ ఎంసెట్ -2 రద్దు కావడంతో మంచి ర్యాంకులు సాధించిన ఏపి రాష్ట్ర విద్యార్థులు ఢీలా పడ్డారు. రాయలసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఏపి ఎంసెట్‌తోపాటు తెలంగాణ ఎంసెట్ -2తోపాటు నాన్‌లోకల్ కింద ఏపి ఎంసెట్ పరీక్షలు రాశారు. వీరు తెలంగాణ ఎంసెట్‌తోపాటు ఏపి ఎంసెట్‌లో కూడా ర్యాంకులు పొంది ఉన్నారు. కాగా తెలంగాణలో మంచి ర్యాంకు రావడంతో తెలంగాణలో మెడికల్‌సీటు పొందవచ్చునన్న ఆలోచనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆశలుపెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో మెడికల్ సీట్లు వస్తాయని భావించిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రద్దుతో ఢీలాపడ్డారు. తెలంగాణ ఎంసెట్ ద్వారా ఎంబిబిఎస్ వైద్యవిద్యను అభ్యసించేందుకు అనేక వ్యయప్రయాసాలకు, ఒడిదుడుకులకు లోనై మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజి వల్ల అనేక మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, రాజంపేట, మైదుకూరు, పులివెందుల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఎంసెట్ -2 రద్దుతో విద్యార్థులు మనోవేదనకు గురౌతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-2ను రద్దుచేసి తిరిగి ఎంసెట్ -3 పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో మరోసారి మెడిసిన్ ఎంసెట్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు సమాయత్తం అవుతుండగా మరికొంతమంది విద్యార్థులు ర్యాంకులు రాకపోవడంతో ఇతర చదువులపై దృష్టిపెట్టారు. ఇప్పటికే అనేక మంది అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ, హార్టికల్చర్ తదితర డిగ్రీ అభ్యసించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈనెల 17,18వ తేదీల్లో ఏపి ఎంసెట్ ర్యాంకులు పొందిన విద్యార్థులకు తిరుపతిలో జరిగిన కౌన్సిలింగ్‌లో ధృవపత్రాలు పరిశీలించారు. తెలంగాణలో మంచి ర్యాంకులు రావడంతో జిల్లాకు చెందిన కొంతమంది విద్యార్థులు ఏపి కౌన్సిలింగ్‌లో ధృవపత్రాలు చూపించలేదు. దీని ద్వారా ఇటు ఏపి, అటు తెలంగాణలో ఎక్కడ కూడా అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థుల ఆశలు నిరాశలయ్యాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన మెడిసిన్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో మేనెల 1న నీట్ -1 పరీక్షలు రాయగా ఈనెల 24న నీట్ -2 పరీక్షలు రాసిన విద్యార్థులు జిల్లాలో వెయ్యిలోపుమంది ఉన్నారు. అయితే నీట్ -2 పరీక్ష ప్రైవేట్ కాలేజిలకు మాత్రమే కావడం వల్ల విద్యార్థులు ర్యాంకులు వచ్చినా అధికఫీజులు చెల్లించాల్సి వస్తుందేమోనన్న భయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొని వుంది. ఏదేమైనప్పటికీ మెడిసిన్ చదివే విద్యార్థుల బాధలు వారి తల్లిదండ్రులు పడే బాధలు వర్ణణాతీతం.

పాఠశాల యాజమాన్య ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కమలాపురం,జూలై 30: పాఠశాలల యాజమాన్య కమిటి ఎన్నికలు పకడ్బంధీగా నిర్వహించాలని ఎంపిడివో ప్రభాకరరెడ్డి సూచించారు. ఆయన శనివారం స్థానిక మండల పరిషత్ సభాభవనంలో ఎన్నికలు నిర్వహించే పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల కమిటీ ఎన్నికలకు కూడా ప్రతిష్టకు లోనవుతారన్నారు. ఈ విషయంలో ఎన్నికలు నిర్వహించే ప్రధానోపాద్యాయులు తగు జాగ్రత్తవహించాలని అన్నారు. వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. పాఠశాల కమిటి ఎన్నికల జాబితాలో విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు ఉన్నవారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో అధ్యక్ష పదవులకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. వారు లేని చోట బి సిలకు అవకాశం ఇవ్వాలన్నారు.మండలంలోని పొడదుర్తి పంచాయతిలోని వెంకటాపురం,చదిపిరాల హరిజనవాడ ప్రాధమిక పాఠశాలలు,యర్రగుడిపాడు జడ్పీ హైస్కూళ్లను సమస్యాత్మక పాఠశాల లుగా గుర్తించామన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా జాగ్రత్తవహించాలన్నారు. అవసరమైతే ముందుగానే పోలీసు అధికారుల దృష్టికి తెచ్చి తగిన బందోబస్తు ఏర్పాటయ్యేలా చూసుకోవాలన్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఇక్కడ ఎన్నికలు నిర్వహించే హెచ్ ఎంలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆగస్టు 1న సోమవారం ఎన్నికలు నిర్వహించి మధ్యాహ్నమే ఫలితాలు తెలియచేసి కమిటీలను కూడా ఎన్నుకుని మొదటి సమావేశాన్ని నిర్వహించా లన్నారు. ఇందులో ఎమీవో జాఫర్‌సాదిక్, ఉపాధ్యాయసంఘం నేత బాబారజాక్ పాల్గొన్నారు.

జగన్ అభివృద్ధి నిరోధకుడు..
కడప,(కలెక్టరేట్)జూలై 30: రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వైఎస్సార్ సిపి రాష్ట్రఅధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతూ అభివృద్ది నిరోధకుడుగా ఉన్నాడని తెలుగుదేశం పార్టీ జిల్లా పరిశీలకుడు జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బి వసతిగృహంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. పార్లమెంట్‌లో తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాసాధనకై డిమాండ్ చేస్తూనే ఉన్నారని కేంద్రంపై వత్తిడి తీసుకువస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని నీరు-చెట్టు కార్యక్రమం, ఇంకుడుగంతలు కార్యక్రమం వల్ల ఈరోజు వర్షాభావం వల్ల పడిననీరు ఇంకుడుగుంతల్లో చేరిపోయి చెరువులకు, బావుల్లో నీరు సమృద్దిగా ఉన్నాయన్నారు. దీంతో రైతులు సంవత్సరానికి మూడుకార్లు పండించుకోవచ్చునన్నారు. జగన్‌కు ప్రత్యేక హోదా సాధనకై చిత్తశుద్ధి వుంటే రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేయడం కాదు, కేంద్రంలో వెళ్లి అక్కడ పార్లమెంట్ వద్ద నిరాహారదీక్షలు చేపట్టాలన్నారు.
వైఎస్సార్ సిపి రాష్ట్రంలో తుడుచుకుపెట్టుకుపోతందని, తన పార్టీ ఉనికిని చాటుకునేందుకే గడప గడపకు కార్యక్రమం నిర్వహించారని అయినప్పటికీ ప్రజల్లో స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా జగన్ రాష్ట్రఅభివృద్ధికి పాటుపడాలని ఆయన హితవుపలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు గోవర్దన్‌రెడ్డి, హరిప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

రూ. 1.18 కోట్లతో ఆకేపాడు పిహెచ్‌సికి
నూతన భవన సముదాయం

రాజంపేట టౌన్, జూలై 30:గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్లు రాష్ట్ర వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం మండలంలోని ఆకేపాడు పిహెచ్‌సి ఆవరణలో రూ. 1.18 కోట్ల నూతన భవన సముదాయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు పిహెచ్‌సిలలో అన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రి పిహెచ్‌సిని పరిశీలించారు. పిహెచ్‌సి క్వార్టర్స్‌లో కొందరు అక్రమంగా నివసిస్తూ ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిహెచ్‌సి క్వార్టర్స్‌లో అక్రమంగా ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించి క్వార్టర్స్‌ను పిహెచ్‌సికి స్వాధీనం చేయాలని డిఎస్పీ రాజేంద్రను మంత్రి ఆదేశించారు.

నీరు-చెట్టు పనులు పూర్తి చేయాలి
కమలాపురం, జూలై 30: మండల పరిధిలోని టి చదిపిరాల చెరువుకు చెందిన రెండవ విడత నీరు-చెట్టు పనులు వెంటనే పూర్తి చేయాలని డిసియంయస్ డైరక్టర్ చల్లా మునీంద్రారెడ్డి కోరారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ చెరువు అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మంజూరు చేయించిన రు.10లక్షల పనుల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. తూముల కట్ట దగ్గర మట్టి తొలగించి రెండునెలలైనా ఆ పనులు జరగడంలో జాప్యం అవుతోందన్నారు. గత రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే చెరువులోకి సగం నీరు రావడం జరిగిందన్నారు. దీంతో తూముల దగ్గర పనులు చేయకుండానే మట్టిని కప్పివేసారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధి కారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు.

పాడి పరిశ్రమపై రైతుల ఆసక్తి

చెన్నూరు,జూలై 30: మండలంలో చెన్నూరు, ఉప్పరపల్లె, దుగ్గనపల్లె, నరసారెడ్డిపల్లె, రామనపల్లి, కొండపేట తదితర గ్రామాల్లో గత నాలుగు సంవత్సరాలుగా మండలంలో పాడిపరిశ్రమ గణనీయంగా పెరిగింది. ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం లభిస్తుండడంతో రైతులు పాడిపరిశ్రమపై మక్కువ చూపించడం, అలాగే పాల డెయిరీ యాజమాన్యం బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడం వల్ల పాడిపరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ఉప్పరపల్లె గ్రామంలో ప్రతి ఇంటికి పాడిపరిశ్రమ ఉంది. చెన్నూరు ఏపిజిబి నుంచి పాడిపరిశ్రమకు అప్పటి మేనేజర్ లక్ష్మికాంత్‌రెడ్డి మంచి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల రైతులు పాడిపరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చారు. లక్ష నుంచి రూ.2లక్షలు వరకు రుణంగా అందజేయగా మంచి మేలుజాతి పాడిపశువులను రైతులు కొనుగోలు చేశారు. దీంతోపాటు పచ్చిక బైర్లు కోసం ఒక్కొక్క పాడిరైతు 50సెంట్ల నుంచి ఎకరా వరకు కౌలుకు తీసుకుని పాడిపశువులకు పశుగ్రాసం ఏర్పాటు చేస్తున్నారు. చెన్నూరుకు చెందిన పలువురు పాడిరైతులు ఇదే పరిస్థితి అనుసరిస్తున్నారు. బీడుగా ఉన్న వ్యవసాయ పొలాలు పాడి రైతుల పుణ్యమా అని పచ్చిక బైర్లుగా మారాయి. పశుగ్రాసాన్ని పాడిపశువులకు వేయడం వల్ల అధిక పాల ఉత్పత్తి ఇస్తూ పాడిరైతులను సంతోషాన్ని నింపుతోంది. ఉప్పరపల్లెలో పాడిపరిశ్రమ ఎక్కువ కావడంతో పశువైద్యశాలను ఏర్పాటుచేశారు. చెన్నూరు పశువైద్యాధికారి శ్రీకాంత్‌రెడ్డిని ఉప్పరపల్లెకు నియమించారు. పాడిపరిశ్రమ బాగా అభివృద్ధి జరుగుతుండటంతో ప్రైవేట్ పాల డెయిరీలు కూడా ముందుకొస్తున్నాయి. పాల డెయిరీ నుంచి లీటరుకు రూ.40లు పైగా చెల్లిస్తున్నారు. దీంతో పాడి పరిశ్రమను నమ్ముకుని ఉన్న రైతుల సంతోషానికి అవధుల్లేవు. కుటుంబ పోషణతోపాటు పిల్లల చదువులకు ఆసరగా నిలుస్తుందని పలువురు పాడి రైతులు పేర్కొంటున్నారు.

1న విద్యాసంస్థల బంద్

కమలాపురం, జూలై 30: ఆగస్టు 1న విద్యాసంస్థల బంద్‌ను జయఫ్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి శివకుమార్ తెలిపారు. ఆయన శనివారం స్థానిక సాంఘీక సంక్షేమ హాస్టల్‌లో ఆ సంఘం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న బంద్‌లో భాగంగా ఈ జిల్లాలో కూడా అన్ని మండలాల్లో విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడమే కాక చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలను చదువుకు దూరం చేసే విధంగా హాస్టళ్లను మూసివేసి వారిని దూరప్రాంతంలోని రెసిడెన్సియల్ పాఠశాలలకు తరలించడం వల్ల చాలా మంది అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడం జరిగిందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపకుండానే వారి పిల్లలను దూరప్రాంతాలకు తరలించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఆ సంఘం నేతలు సురేష్, విష్ణు, మల్లి, మహేశ్ పాల్గొన్నారు.
ఇలా ఉండగా జిల్లావ్యాప్తంగా నెలకొన్న విద్యారంగసమస్యల పరిష్కారం కోసం విద్యార్థిసంఘాల కార్యచరణ కమిటీ ఆగస్టు 1న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని పిడియస్ యు జిల్లా అధ్యక్ష,కార్య దర్శులు రమేష్, ఓబులేసు కోరారు. తమ బంద్‌కు విద్యార్థులు, తల్లి దండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సహకరించాలని శనివారం వారు కోరారు.

వైఎస్‌ఆర్ విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టాలి

రాయచోటి, జూలై 30: విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రివేళ నిర్ధాక్ష్యనంగా, దౌర్జన్యంగా తీసివేయడం ప్రజాస్వామ్యంలో దుర్దినమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో అప్పటి మంత్రుల సమక్షంలో అప్పటి పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ విజయడవాడ నడిబొడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ విగ్రహాన్ని చూస్తే సాక్షాత్తూ రాజశేఖర్‌రెడ్డే నిలబడి ఉన్నంత కళగా ఉండేదన్నారు. పోలవరం, పులిచింతల రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఆ ప్రాజెక్టుల రూపంలో ఆవిష్కరించిన ఆ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్నారు. ఆ విగ్రహం వల్ల ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయమూ లేదు. ప్రజలు దాన్ని చూసినపుడు నమష్కరిస్తున్నారనే ద్వేషంతోనే తొలగించారన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేయటం శ్రేయష్కరం కాదని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్దరికపు రాజకీయాలు అలవరచుకోవాలని ఆయన సూచించారు. తక్షణమే ఆ విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు.

పెన్నానదిలో కొట్టుకుపోయిన హైవే వంతెన సామాగ్రి

చెన్నూరు,జూలై 30: గత రెండురోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకారణంగా కుందూ, పాపాగ్ని పెన్నానదికి భారీ స్థాయిలో వర్షం నీరు చేరడంతో శుక్రవారం ఎనిమిది వేల క్యూసెక్కులు నీటి ప్రవాహం దిగువకు వెళ్లింది. కడప -కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నూరు వద్ద పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తుండటంతో వంతెన నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రి పెన్నానీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రాత్రి ఒంటిగంట వరకు పెన్నానదిలో నీటి ఉద్ధృతి పెరగగా రెండు గంటల నుంచి క్రమేపీ నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పెన్నానదిలో 3500 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె పెన్నానదిపై నిర్మించిన ఆనకట్ట నుంచి 250 క్యూసెక్కులనీటిని కడప కెసి కెనాల్ ద్వారా పాతకడప చెరువుకు నీటిని మళ్లించారు. అలాగే మండలంలోని రాచినాయపల్లె చెరువుకు కూడా పెన్నానీటిని మళ్లించారు. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట కడప కాలువ ద్వారా గేట్లు ఎత్తి నీటిని మళ్లించడంతో కడప కెసి కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది. మండలంలో శుక్రవారం తెల్లవారు జామున నుంచి కురిసిన వర్షం కారణంగా పంట పొలాల్లో భారీ ఎత్తున నీరు నిలచిపోవడంతో పసుపు, ఆకుతోటలు, పూలతోటలు , పండ్లతోటలు సాగుచేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 15సంవత్సరాలుగా కురవని వర్షం ఆరుగంటల్లో 12 సెం.మీ.వర్షం నమోదుకావడంతో ఆయా గ్రామాల్లో రోడ్లలో నీరు నిలిచింది. అనేక పూరిగుడిసెలు, ఇళ్లల్లోకి నీరు చేరింది. మండలంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపోవడం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాత్రి 8గంటల తర్వాత ఎట్టకేలకు విద్యుత్‌ను అధికారులు పునరుద్దరించారు.