కడప

ఓటర్ల జాబితాలో తప్పులు సరిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 24: జాతీయ ఓటర్ల జాబితాలో ఉన్న తప్పు ఒప్పులను సరిదిద్ది నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ, జెసి శే్వత, శాసనసభ నియోజకవర్గ ఇఆర్వోలు , ఏఇ ఆర్వోలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ అన్ని మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లో సరిహద్దులతో కూడిన పోలింగ్ కేంద్రాల పటాన్ని తయారుచేయాల్సిందిగా సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్‌పరిధిలో చేసిన విధంగా నజార్ నక్ష, మ్యాపింగ్ తదితర అంశాలతో కూడిన అన్ని మున్సిపాల్టీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, సాంకేతిక సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించి సరిహద్దులతో కూడిన పోలింగ్ కేంద్రాల చిత్రపటాన్ని తయారు చేయాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించి ఓటర్ల ఫోటోను సరిచేసి డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. మున్సిపాల్టీ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్‌కు మ్యాపింగ్‌ను సెప్టెంబర్ 5లోగా పూర్తిచేయాలని, అలాగే ప్రతి పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఓటర్ల సంఖ్య వెయ్యి నుంచి 1100లోపు ఉండేలా మ్యాపింగ్ తయారుచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వభవనాల్లో ఏర్పాటుచేయాలని ఓటర్ల సంఖ్య అధికంగా ఉండి అక్కడ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని పక్షంలో సమీపంలో ఉన్న మరో ప్రభుత్వ భవనంలో పోలింగ్ స్టేషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇవిఎంల భద్రత కోసం నూతన కలెక్టరేట్‌లో ప్రత్యేక గోడౌన్లు ఏర్పాటుచేశామని ఎన్నికల అధికారి దృష్టికి తెచ్చారు. సమావేశంలో డిఆర్వో సులోచన, ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఇఆర్వోలు, ఏఇఆర్వోలు పాల్గొన్నారు.

ఉక్కుకర్మాగారం ఏర్పాటయ్యేనా..

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 24: జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు ప్రత్యామ్నాయంగా ముద్దనూరు, జమ్మలమడుగు, మైలవరం, కడప ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధితశాఖ ఉన్నతాధికారులు కేంద్ర సెయిల్ అధికారులు కేంద్రప్రభుత్వానికి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అధికారుల సమన్వయలోపంతో హెమటైటీస్, మ్యాగ్నటైటీస్ ఖనిజం లభ్యం కావడం లేదని ఉక్కు ఉత్పత్తికి రెండు రకాల ఖనిజాలతోపాటు చైనా, ఒరిస్సాల నుంచి కొంతమేరకు ముడిసరుకు తెప్పించుకుంటే తప్ప ఉక్కుకర్మాగారం పనిచేయదని కొంతమంది అధికారులు తేల్చి చెప్పారు. బ్రహ్మణీ స్టీల్స్ సిఎండి కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి కర్నాటకలోని ఓబులపురం గనులు నమ్ముకుని అక్కడి నుంచి ఐరన్ ఓర్‌ను జిల్లాకు తెప్పించుకుని ఇక్కడ ఐరన్ ఓర్ నిక్షేపాలు లభించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి బ్రహ్మణీ స్టీల్‌సు స్థాపించేందుకు పన్నాగం పన్నారు. అయితే బ్రహ్మణి స్టీల్స్ యజమాని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, సెయిల్ అధికారులు తయారుచేసిన నివేదికలకు జనార్ధనరెడ్డి తయారుచేసిన ప్రాజెక్టుకు ఏమాత్రం పొంతన కుదరలేదు. అయితే అనంతరం రాష్టవ్రిభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉక్కు ఫ్యాక్టరీని కడపలో నిర్మించాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి స్టీల్ కర్మాగారానికి శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టినా తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా బ్రహ్మణి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అన్ని సక్రమంగా జరిగివుంటే కనీసం 10వేల మందికి ప్రత్యక్షంగాను, 50వేల మందికి పరోక్షంగాను ఉపాధి లభించే అవకాశం ఉండేది. బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు జిల్లావాసులతోపాటు ఇతర జిల్లాల నిరుద్యోగ యువకులు కూడా హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య తీరడంతోపాటు పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కలలు కన్నారు. అయితే ఆ కలలు సాకారం కాకపోవడంతో నిరుద్యోగ యువకులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ప్రస్తుతం విభజన చట్టంలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్‌ను సెయిల్ ఆధ్వర్యంలో నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉక్కు ఉద్యమసాధన సమితి పేరుతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అలాగే వామపక్షాల ఆధ్వర్యంలో కూడా పలు విధాల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాదయాత్రలు, మానవహారాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారి నిరసన కార్యక్రమాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం మాత్రం జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటే తగినంత ఇనుప ఖనిజం జిల్లాలో అందుబాటులో లేదని ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. చిత్తశుద్ధి ఉండి జిల్లా అభివృద్ధికోరుకుంటే ఈ ప్రాంతంలో దొరకని బొగ్గును సింగరేణి, తాల్చేరు గనుల నుంచి దిగుమతి చేసుకుని కర్మాగారాలు స్థాపించిన ప్రభుత్వాలు ఇనుప ఖనిజాన్ని కూడా దిగుమతి చేసుకునే అవకాశాలు ఎందుకు లేవనే ప్రశ్న ప్రజల నుంచి వినవస్తోంది. ఇప్పటి వరకు స్వచ్చంధంగా నిరుద్యోగ యువకులు, వామపక్షాలు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీరికి ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రజలసహకారం మరింత తోడైతే జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఫలిస్తుందన్న ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి తప్పని సరిగా ఉక్కు ఫ్యాక్టరీని కడప జిల్లాలో ఏర్పాటుచేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై వత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఈ బాధ్యతను ఏమేరకు సఫలీకృతం చేస్తారో వేచిచూడాల్సివుంది.

ఆర్టీపీపీలో కార్మికుల వెట్టి!

ఎర్రగుంట్ల,ఆగస్టు 24: ఆర్టీపీపీలో 600 మెగావాట్లసామర్థ్యంతో నిర్మిస్తున్న ఆరవ యూనిట్ నిర్మాణపు పనులు చురుకుగా సాగుతున్నా కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఆరవ యూనిట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపు 1500 మందికి పైగా కార్మికులు వివిధ కంపెనీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే ఈకార్మికులకు కార్మిక చట్టంప్రకారం వర్తించాల్సిన కనీస వేతనాలు కానీ, వసతులు కానీ ఏమాత్రం కాంట్రాక్టర్లు కల్పించడం లేదు. కనీస వసతులు కూడా లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా పనులు జరుగుతున్నా కార్మికశాఖ అధికారులు ఇటువచ్చిన దాఖలాలు కూడా లేవు. దాదాపు రూ.3,600కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ఆరవ యూనిట్ పట్ల కార్మికశాఖ నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కార్మికులకు ఈఎస్‌ఐ కానీ, ఈపిఎఫ్ కానీ, సేఫ్టీ అలవెన్సులు కానీ ఓవర్‌టైమ్ వేతనం కానీ ఇవ్వడం లేదు. కనీసం కార్మికులకు విశ్రాంతి గదులు కూడా లేకపోవడంతో ప్రాజెక్టు ప్రాంతంలోనిలవనీడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు తగు నీటివసతి కూడా ఆయా కంపెనీలు ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిహెచ్‌ఎల్, విఏటెక్, ఏబిపి, గామన్ ఇండియా, రిత్విక్ తదితర కంపెనీల్లో దాదాపు 2వేల మంది వరకు స్కిల్డ్ అన్‌స్కిల్డ్‌తోపాటు హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరికి కార్మికచట్టం ప్రకారం దినసరి వేతనం రూ.400 పైగా చెల్లించాల్సివుండగా కేవలం రూ.300లు కంటే ఎక్కువ ఇవ్వకపోవడం కొందరికి రూ.200లు మాత్రమే నిర్ణయించడం లాంటి సంఘటనలు జరుగుతున్నా నిరుద్యోగులు ఎంతోమంది తమ శ్రమను ఆయాకంపెనీల యాజమాన్యాలకు దారపోస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్టీపీపీ ఆరవ యూనిట్ ప్రారంభమైనప్పుడు చుట్టుపక్కల గ్రామాలప్రజలకు కనీసం కూలి పనులైనా దొరుకుతాయని ఆశించిన నిరుద్యోగులకు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కూలి పనికి కూడా రాజకీయ నాయకుల సిఫార్సులేనిదే పనులు జరగడం లేదు. రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో కేవలం కొన్ని వర్గాల వ్యక్తులకు మాత్రమే ఈపనులైనా దక్కుతున్నాయి. దీంతో రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతున్న ఆయా కంపెనీల యాజమాన్యాలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ విషయంపై గతంలో కొన్ని కార్మిక సంఘాలు కార్మికశాఖ దృష్టికి తీసుకుపోయినా ఫలితం మాత్రం లేదు. కార్మికశాఖ అధికారులు వస్తున్నారో లేదో యాజమాన్యాలతో ఏమి చర్చిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ప్రస్తుతం ఆర్టీపీపీ ఆరవ యూనిట్ నిర్మాణంలో చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా కార్మికశాఖ తగు చర్యలు తీసుకుని శ్రమ దోపిడీకి గురౌతున్న కార్మికులకు కనీస వేతనాలతోపాటు కనీస అవసరాలు కూడా కల్పించాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానంతో క్రీడల్లో రాణించాలి
ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 24: క్రీడల్లో రాణించాలంటే శరీర ధారుఢ్యంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సభాభవన్‌లో జిల్లా ఉన్నతపాఠశాలల ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ క్రీడ అనేది మనస్సుకు సంబంధించిన అంశమని స్వతహాగా క్రీడలపట్ల ఆసక్తి ఉన్నప్పుడే క్రీడాకారులకు గుర్తింపు వస్తుందన్నారు. క్రీడల పరిస్థితి దేశంలో హీన స్థితిలో ఉందని,కొన్నిక్రీడల అసోసియేషన్లు స్వలాభం, స్వార్థం కోసం పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో క్రీడలు అధికారికంగా నిర్వహిస్తామని ఇందులో రాజకీయాలకు చొరవ ఇవ్వనన్నారు. సాంకేతిక పరమైన పరిజ్ఞానం, ప్రతి క్రీడాకారునికి అవసరమన్నారు.
ప్రతి పాఠశాలలో చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలన్నారు. క్రీడాభివృద్ధికి ప్రతి మండలానికి రూ.5వేలు విలువైన క్రీడాసామాగ్రిని అందిస్తున్నామన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, రూ.100కోట్లతోస్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధిచేస్తున్నట్లు ఆయన వివరించారు. అనంతరం 2015-16 విద్యాసంవత్సరంలో క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరచిన ఉన్నత పాఠశాలలకు క్రీడా ప్రతిభా అవార్డులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు బచ్చల పుల్లయ్య, ఆర్‌ఇపిలు భానుమూర్తిరాజు, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామసుబ్బన్న, పిఇటి అసోసియేషన్ ప్రెసిడెంట్ శివశంకర్‌రెడ్డి, సెక్రటరీ ప్రమోద్‌కిరణ్, వ్యాయామశిక్షణ ఉపాధ్యాయులు తదితర అధికారులు పాల్గొన్నారు.

వేరుశెనగ రైతులను ఆదుకోవాలి

గాలివీడు, ఆగస్టు 24: ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వేరుశెనగ పంటను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గోపనపల్లె గ్రామం శివపురంవాండ్లపల్లెలో ఎండిన వేరుశెనగ పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి యేటా వేరుశెనగ పైరు సాగు చేయడం సక్రమంగా వర్షాలు కురవక సాగు చేసిన పైరు ఎండిపోతుండటంతో రైతులు అపార నష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం అన్నదాతలైన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఈ ఖరీఫ్‌లో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. పంట నష్టం, పంటలబీమా తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. గత ఖరీఫ్‌లో సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇంత వరకు ఇన్‌పుట్ సబ్సిడీ కానీ పంటలబీమా ప్రకటించకపోవడంతో రైతులతో ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. అనంతరం ఆయన వెలిగల్లు ప్రాజెక్టు కుడికాల్వను పరిశీలించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసి పైర్లకు పూర్తి దశ వరకు నీటిని అందించేందుకు చర్యలు చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమాపతిరెడ్డి, వైకాపా నాయకులు చెన్నకేశవరెడ్డి, డాక్టర్ కోటిరెడ్డి, డీలర్ నాగేశ్వర, వెంకటనారాయణ, మైనార్టీ నాయకులు మహబూబ్‌బాష తదితరులు పాల్గొన్నారు.

డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించండి

వేంపల్లె, ఆగస్టు 24: ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు జీవనోపాధి కల్పించే దిశగా వెలుగు సిబ్బంది పనిచేయాలని డీ ఆర్‌డీ ఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో పులివెందుల, కమలాపురం నియోజకవర్గంలోని వెలుగు సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేటట్లు సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే తీసుకున్న రుణం సద్వినియోగమయ్యేలా చూడాలన్నారు. అక్కడక్కడా కొన్ని మొండి బకాయిలు ఉన్నాయని వాటిని కూడా గాడిలో పెట్టాలన్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి నిధుల కొరత ఏమీ లేదని, స్వయం ఉపాధికి సంబంధించి నిధులు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా భారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో వెలుగు సిబ్బంది చొరవ చూపాలని ఆయన తెలిపారు. ప్రతి మాసం వెలుగు సిబ్బంది యొక్క ప్రోగ్రెస్‌ను గమనిస్తూ ఉండాలని అన్నారు. తద్వారా డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఏపీ ఎం రాజు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలలోని వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పింఛాలో తగ్గుతున్న నీటిమట్టం
సుండుపల్లె, ఆగస్టు 24: కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన సుండుపల్లె మండలం ముడుంపాడులో ఆదినారాయణరెడ్డి రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. 327 ఎంసీఎఫ్‌టీ సామర్థ్యం గల జలాశయంలో సుమారు 130 ఎంసీఎఫ్‌టీల నీరు ఉంది. గత జూన్, జూలై నెలల్లో కురిసిన వర్షాలకు పింఛా జలాశయంలోకి ఆగస్టు మొదటి వారానికి సగం వరకు నీరు చేరింది. తలకోన, చెయ్యేరు నదులలో జలాశయంలోకి వస్తున్న నీటి ప్రవాహం ఆగిపోవడంతో రోజు రోజుకు ఎండతీవ్రత వలన పింఛా ప్రాజెక్టులోని నీరు తగ్గుతోంది. అంతేకాకుండా ఈ లీకేజీల ద్వారా నీరు వృధాగా పారుతోంది. గతంలో వరదల తాకిడికి పింఛా కాలువతో పాటు గేట్లు పనిచేయకపోవడంతో అందులో వస్తున్న లీకేజీ నీరు కిందికి వెళ్తుండటంతో ప్రాజెక్టులోని నీరు గత రెండు వారాల్లో తగ్గుముఖం పట్టింది. అయితే ఆగస్టు రెండు వారాల్లో 30 ఎంసీటీ ఎఫ్‌ల నీటిమట్టం ఉంది. పింఛా కాలువలలో నీరు అలాగే గేట్లలో లీకేజీ నీటిపై పింఛా జేఈ రెడ్డయ్యను వివరణ కోరగా ఇదివరకే ప్రతిపాదనలు పంపించాం వచ్చిన వెంటనే పనులు చేస్తామన్నారు. అయితే మొత్తం పింఛా ప్రాజెక్టు నిండితే రబీలో మాత్రమే రైతులకు ఎడమ, కుడికాల్వలో నీరు అందిస్తామన్నారు.
కాలువ పనుల్లో నిర్లక్ష్యం: కాలువ పనుల్లో పింఛా నీటి సంఘం అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఒకవేళ వర్షాలు భారీగా పడి పింఛా నిం డితే ఆ నీరు కుడికాలువలోకి వదిలి రైతులకు పంట పొలాలకు చేరువయ్యే మార్గం కనిపించడం లేదని మాచిరెడ్డిగారిపల్లె, ముడుంపాడు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

మూతపడిన వసతి గృహాలు!

ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఆగస్టు 24: జిల్లాలో పలు వసతి గృహాలు మూతపడ్డాయి. దీంతో అనేక మంది పేద విద్యార్థులు రోడ్డున పడ్డారు. చదువుకునే స్తోమత లేని విద్యార్థులవ భవితవ్యం ఆగోమ్యచరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పేద ప్రజల విద్యాభివృద్ధికోసం గతప్రభుత్వాలు వసతి గృహాలు నిర్మించి తద్వారా పేదలకు వసతులతోపాటు భోజన సదుపాయాలు కూడా కల్పించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయాలు కూడా సక్రమంగా లేవన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో చాలా వసతి గృహాల్లో విద్యార్థులు లేరంటూ మూసివేయడంతో ఉన్న విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతి గృహాలు ఒకేచోట ఉండాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పేద విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో చాలా మండలాల్లో వసతి గృహాలను ఉన్న ఫలంగా మూసివేశారు. మూసివేసిన వసతి గృహాల విద్యార్థులను సంబంధిత గురుకుల పాఠశాలలకు బదలాయించడం జరిగినా అవి జిల్లాలో అక్కడక్కడ ఉండటంతో పేద విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. వేంపల్లెలో బిసి,ఎస్టీ వసతి గృహాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం కనికరించలేదు. దీంతో విద్యార్థులు చదువులకు పుల్‌స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. గోపవరం మండలంలో రాచాయపేటలో బాలుర, బాలికల వసతిగృహాలు సంస్కరణల పేరుతో మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బ్రాహ్మణపల్లెలో ఎస్టీ వసతి గృహం రాచాయపేటకు తరలించారు. ఈనిర్ణయం చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు కలగచేస్తోంది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే చాపాడు మండలంలో ఆనందాశ్రమంలోని ఎస్టీ హాస్టల్‌ను బ్రహ్మంగారి మఠానికి మార్పు చేశారు. అక్కడున్న హాస్టల్‌ను కూడా మూసివేయడంతో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాపాడులో ఉన్న బాలికల వసతి గృహాన్ని ప్రొద్దుటూరుకు తరలించారు. ఈ హాస్టళ్ల తరలింపు విద్యార్థుల విద్యావసతికి తీవ్ర ఇబ్బంది కలగచేస్తోంది. గాలివీడులో వసతి గృహాలు ఉన్నా వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎస్సీ హాస్టళ్లు అయితే తాగునీరుకూడా లేదు. అలాగే నూలివీడులో హాస్టల్స్‌కు ప్రహరీగోడ కూడా లేకపోవడంతో ఆలనా పాలనా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ బిసి హాస్టల్‌ను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే చిన్నమండెంలో గతంలో రెండు హాస్టళ్లు ఉండగా ఇటీవల ఎస్సీ బాలికల హాస్టల్‌ను ఇతర ప్రాంతానికి తరలించారు. వంద మంది విద్యార్థులున్నా వారి ఆలనా పాలనా కానీ భోజన వసతికాని సక్రమంగా లేవని విమర్శలు వస్తున్నాయి. సంబేపల్లె మండలంలో బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు సంక్షేమ హాస్టల్‌లో విద్యను అభ్యసించేవారు. ఇక్కడ సిబ్బంది సక్రమంగా లేకపోవడంతో వసతిగృహాల నిర్వహణ ప్రసవంగా మారింది. అలాగే పులివెందుల మండలంలో ఎస్సీ హాస్టళ్లు 4, బిసి హాస్టళ్లు 3 ఉన్నా సరైన వసతులు లేవు. పరిశుభ్రత సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేని హాస్టళ్లలో విద్యార్థులు చదవాలంటే ఎన్నో అవకతవకలకు గురికావాల్సివస్తోంది. బి.కోడూరు మండలంలో కూడా హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. మండల పరిధిలోని కాసాన నగరం కస్తూరిబా గురుకులపాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు. సరైన మెను కూడా పాటించలేదన్న విమర్శలు విద్యార్థుల నుంచి వినవస్తున్నాయి. అలాగే జిల్లాలోని ఇతర మండలాల్లో కూడా హాస్టళ్ల నిర్వహణ దారుణంగా తయారైందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పేద విద్యార్థుల విద్యా ఉన్నతికి వసతి గృహాల నిర్వహణ ఎంతో ముఖ్యంగా భావించి ప్రభుత్వం అధికారులు తగు చర్యలు తీసుకుని వసతి గృహాల నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

చవితి ఉత్సవాలకు గణనాథులు సిద్ధం

సుండుపల్లె, ఆగస్టు 24: వినాయకచవితి సందర్భంగా వాడవాడల గణనాథులు విక్రయాలు ఊపందుకున్నాయి. పండుగను ప్రజలు ఎంతో సంబరంగా చేసుకుంటారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వాడవాడలా నిర్వహించుకునే పండుగ వినాయకచవితి. ఈ పండుగకు మరో పది రోజులు గడువు ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో చవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఉత్సవ కమిటీలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఉత్సవాల నిర్వహణకు యువకులు చందాలను వసూలు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే వినాయక చవితి పండుగ రోజున కొలువుతీరే గణనాథుల విగ్రహాలను వ్యాపారులు విక్రయాలకు సిద్ధం చేశారు. దీంతో అనేక ప్రాంతాలకు చెందిన కమిటీలు విగ్రహాలకు అడ్వాన్సులు చెల్లించి బుక్ చేసుకుంటున్నారు. రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన కళాకారులు దాదాపు రెండు నెలల నుంచే విగ్రహాలను తయారుచేశారు. చిన్న విగ్రహాల నుంచి దాదాపు 15 అడుగుల విగ్రహాల వరకు వివిధ రూపాల్లో గణనాథులను సిద్ధం చేసి ఉంచారు. దీంతో ఉత్సవ కమిటీలు తమ ఆర్థికస్థోమతను బట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. సుండుపల్లె మండలంలోని బెస్తపల్లె సమీపంలో వినాయక విగ్రహాలను సిద్ధం చేసి ఉంచారు.
ఆర్కెస్ట్రాలకు డిమాండ్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉన్న ఉత్సవ కమిటీలు సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేశాయి. ఆర్కెస్ట్రాపై ప్రజల్లో ఇప్పటికీ ఉన్న క్రేజ్ తగ్గలేదు. దీంతో ఆర్కెస్ట్రాలకు అమాంతంగా డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా ఎంతైనా ఖర్చు పెట్టి గణనాథుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే మండలంలోని చెన్నంశెట్టిపల్లె, మాచిరెడ్డిగారిపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో ఇప్పటికే విగ్రహాలను కొనుగోలు చేసి ఉత్సవాలకు సిద్ధమవుతున్నట్లు పలువురు తెలిపారు.

తెలుగుగంగ కాలువకు
ఐదువేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి

దువ్వూరు, ఆగస్టు 24: రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు కర్నూలుజిల్లా వెలుగోడు నుంచి తెలుగుంగ కాలువకు ఐదువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని ఎస్‌ఆర్-1 తెలుగుగంగ కాలువను తెలుగుగంగ డిఈ చిన్నయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాలువ నీటికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్-1,2 డ్యామ్‌లకు ఐదు టిఎంసీలు, బ్రహ్మంసాగర్‌కు 12 టిఎంసీల నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ప్రస్తుతం 120 క్యూసెక్కుల నీరు వస్తోందని, ఇలాగే వస్తే ఏడాదిపొడవైనా డ్యామ్ నిండదని, కావున ఐదువేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే కడపజిల్లాలో 98 వేల కిలోమీటర్‌కు వచ్చేసరికి కనీసం 1500 క్యూసెక్కుల నీరైనా వస్తుందన్నారు. అలా వస్తే మరో రెండునెలల్లోపు డ్యాములు నిండుతాయని ఆయన తెలిపారు. లేకపోతే బ్రహ్మంసాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం ఆర్టీపీపీకి, తాగునీటి కోసం బద్వేలుకు చుక్క నీరు కూడా పోదని, రాష్ట్ర ప్రభుత్వం దయ వుంచి నీటిని వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తెలుగుగంగ ఎఈ శివరామక్రిష్ణారెడ్డి, వైకాపా నాయకులు జయచంద్రారెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, కానపురెడ్డి సంజీవరెడ్డి, అబ్దుల్‌బాషా, పద్మనాభరెడ్డి, కె.వాసు, లింగాపురం సర్పంచ్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.

అంతర్ పంటల సాగుపై రైతుల ఆసక్తి!

రాజంపేట, ఆగస్టు 24: వర్షాభావ పరిస్థితుల కారణంగా రాజంపేట ప్రాంత నిమ్మ, మామిడి, అరటి, బొప్పాయి తదితర వాణిజ్య రైతులు ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టారు. వాణిజ్య తోటల రైతులు అంతర్ పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాణిజ్య తోటల రైతులు నాటిన నాటి నుండి కాపుకు వచ్చే వ్యవధిలో మరికొంత ఆదాయాన్ని గడించాలన్న ఉద్దేశంతో అంతర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిరప, టమోటా తదితర అంతర్ పంటలకు నిమ్మ, మామిడి తోటల్లో రైతులు వేసి మరికొంత రాబడిని పెంచుకుంటున్నారు. రాజంపేట ప్రాంతంలో గత 15 ఏళ్ళుగా వర్షాలపై నమ్మకం లేకపోవడంతో తక్కువ వ్యవధి గల వరి, వేరుశెనగ పంటలను కాక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిమ్మ, జామ, మామిడి తోటలను విరివిగా సాగులోకి తెస్తున్నారు. ఈ తోటలు పెంచేటప్పుడు సుమారు పది అడుగుల వరకు స్థలాన్ని ఖాళీగా ఉంచుతారు. మొక్కలు నాటిన మొదట్లో ఎక్కువ ఖాళీ స్థలముంటుంది. వాటిని నాలుగైదు ఏళ్ళకు మొక్క కాపుకు వస్తుంది. అప్పటి వరకు ఈ చెట్ల మధ్య స్థలంలో తక్కువ వ్యవధి పంటలైన వేరుశెనగ, మినుములు, మిరప, టమోట తదితర పంటలను వేసి రైతులు ఆదాయాన్ని గడించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిరపతోటలకు అవసరమైన గింజలను చెన్నై, తిరుపతి, కడప తదితర ప్రాంతాల నుండి తెస్తామని వీటిని నారుపోసిన తరువాత మామిడి, నిమ్మ, జామ మొక్కల మధ్య వేసిన పాదుల్లో నాటుతామన్నారు. 90 రోజులుండే పంటలను ఎక్కువగా అంతర్ పంటలుగా వేసి రైతులు లబ్ది పొందుతున్నారు. మామిడి, నిమ్మ, జామ తోటలకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రైతులు నిర్ణీత కాలవ్యవధి కలిగిన అంతర్ పంటలకు ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరముందడు. నిర్ణీత వ్యవధిలో నీటిని పారుదల చేసుకుంటూ అంతర్ పంటలను రైతులు పండిస్తున్నారు. అయితే అంతర్ పంటలకు రసాయనిక ఎరువులను వాడేందుకు నిమ్మ, జామ, మామిడి తోటలకు నష్టం కలగని రీతిలో వ్యవసాయాధికారుల సూచనల మేరకు రైతులు వాడుతుంటారు. అరటితోటల్లో బూడిద గుమ్మడికాయ తదితర అంతర్ పంటలకు రైతులు పెట్టే పెట్టుబడులు మామూలు పంట కంటే తక్కువగానే ఉంటుంది. ఇప్పటి ధరల్లో వేరుశెనగ పెట్టుబడులు పెట్టి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఆదాయాన్ని గడించడం రైతులకు కష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో అంతర్ పంటలపై రైతులు ఎక్కువగా దృష్టి పెడుతుండడం జరుగుతుంది. వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు కూడా రైతులు లబ్ది పొందేందుకు వీలుగా అంతర్ పంటల సాగులో మెళకువలపై తగు సూచనలు, సలహాలు వాణిజ్య రైతులకు అందిస్తుండడం జరుగుతూ వస్తుంది.

బృందావనమాలి...రారాదే ఇంటికి ఓసారి..

కడప,(కల్చరల్)ఆగస్టు 24: దేశావ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణాష్టమి ముఖ్యమైనది. శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి రోహిణి నక్షత్రయుక్త అష్టమినాడు కృష్ణుడు జన్మించడంతో కృష్ణాష్టమి పేరుగాంచింది. గురువారం కృష్ణాష్టమిని భక్తులు, ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. భగవత వచనం ప్రకారం శ్రీమన్నారాయణుడు ఏకవిశంతి 21వ అవతారమూర్తిగా కనిపిస్తాడు. వీటిల్లో దశావతారాలు 10 ప్రఖ్యాతమైనవి. శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమ తిథుల్లో 8వ తిథిగా శ్రీకృష్ణఅవతారం దశావతారంలో ఎనిమిదవది. వసుదేవుని సంతానంలో శ్రీకృష్ణుడు 8వ వాడు. అష్ట్భార్యలు ఉన్నవాడు. రోహిణి నక్షత్ర జాతకుడు. 16వేల మంది గోపికలకు మనోహరుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని జీవనకాలం 130 సంవత్సరాలు అని పురాణాలు తెలుపుతున్నాయి. అనేక ప్రత్యేకతలు కలిగిన శ్రీకృష్ణుడంటే సమస్త హృదయాలను ఆకర్షించే అవతారపురుషుడు. కృష్ణుడు మానవునిగా వ్యవహరిస్తూ బాల్యంలో అల్లరివాడైన తన మహిమలు చూపిస్తూ ప్రేమమూర్తిగా, శాంతి దూతగా ధర్మసంస్థాపన చేసిన మహనీయుడు. అర్జునుడికి రథసారధిగా ఉండి, ముక్తిసాధనమైన గీత అమృతాన్ని ఉపదేశించి కర్తవ్యోన్ముకుడిని చేసిన జగద్గురు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణజననంతోప్రకృతి అంతా వసంత శోభతో అలరించింది. కృష్ణుడు జన్మించగానే వసుదేవుడు విప్రులకు గోవులు దానం చేశారు. కృష్ణాష్టమి అవతారాలు భారతదేశమంతటా వైవిద్యభరితంగా జరుగుతాయి. ఉత్తర భారతంలో నందవజ్రం, బృందావనం, మధుర పట్టణాల్లో ఉత్సవాల కోలాహలం మిన్నంటుకుంది. మన రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుతారు. ఆలయాల ముందర నుంచి పూజా మందిరం వరకు బాలకృష్ణుని పాదముద్రలు వేసి అనేక విధాలుగా పూజించి తరిస్తారు. కృష్ణాష్టమి వ్రతం, కృష్ణజయంతి వ్రతం ఆచరించి భక్తితో కొలుస్తారు. రాధాకృష్ణుల ప్రణయం సర్వసృష్టి ఆరాధనకు ప్రతీకగా చెప్పవచ్చు. వీరిని ఏకీకృత యుగలమూర్తులని కూడా పిలుస్తారు. జయదేవుని గీతాగీవిందంలో రాధాకృష్ణులు జీవేశ్వర్లు. కృష్ణతత్వం గ్రహించడం కత్తిమీద సాములాంటిది. శ్రీకృష్ణుడు జన్మించిన కృష్ణాష్టమినాడు ఆచరించవలసిన పూజా విధివిధానాలను స్కంధ, బ్రహ్మాండ, బ్రహ్మనైవర్త, మార్కండేయ పురాణాలు తెలియజేస్తున్నాయి. కృష్ణ జయంతి నాడు ఉపవాసం ఉండి పూజిస్తే సప్తజన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. బమ్మెరపోతన మహాకవి సహజ పాండిత్యులు మందార మకరంద్రాలు చిందిస్తూ కృష్ణ్భక్తిని లోకానికి భాగవతం రూపంలో అందించాడు. కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్ల ఉత్సవం ప్రధానమైనది. ఈ ఉత్సవంలో పాల్గొనే వారికి సర్గతులు కలుగుతాయి. ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారికి అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, తిరుమంజనంతోపాటు ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తారు. కృష్ణాష్టమినాడు స్వామివారిని పూజించిన వారికి యోగక్షేమాలు స్వామివారే చూస్తారని పురాణాలు తెలుపుతున్నాయి. యుగాలు గడిచినా వనె్నతగ్గని దేవుడు శ్రీకృష్ణ్భగవానుడని చెప్పవచ్చు.

కొలువుదీరెందుకు సిద్ధమైన గణనాథులు

ప్రొద్దుటూరు టౌన్, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకొనే గణనాధుడి వినాయకచవితి పండుగను పురస్కరించుకొని పట్టణంలో వినాయకుని ప్రతిమలు విక్రయాలకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్, రాజమండ్రి, కర్ణాటక, ముంబై, గుజరాత్ తదితర ప్రాంతాల్లో తయారైన ప్రతిమలను వ్యాపారులు ఇక్కడకు తెప్పించుకొని వాటికి రంగులు అద్ది, తుది మెరుగులు దిద్ది సిద్ధం చేస్తుంటారు. ఇందుకుగాను వ్యాపారులు కొందరు నిపుణులను ఏర్పాటుచేసుకొని, రంగులు, ఇతర ముడి సరుకును కొనుగోలుచేసి పెట్టుబడిపెట్టి ప్రతిమలను అందంగా తీర్చిదిద్ది తుది రూపాన్ని తీసుకువస్తారు. స్థానికంగా సినీహబ్ మల్టీఫ్లెక్స్ థియేటర్స్ వద్ద, మైదుకూరు రోడ్డులోని రియలయన్స్ పెట్రోల్‌బంక్, హోమస్‌పేట, గాంధీరోడ్డు, కొర్రపాడురోడ్డు, జమ్మలమడుగురోడ్డు తదితర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటుచేసుకొని ప్రతిమలను విక్రయిస్తున్నారు. అయితే మూడు అడుగుల నుంచి మొదలుకొని 15 అడుగుల ఎత్తున్న ప్రతిమలను విక్రయించడం జరుగుతోంది. ప్రతిమ యొక్క ఎత్తును బట్టి, దాని అలంకరణనుబట్టి వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. రూ.1000 నుంచి రూ.2000 వేల వరకు, గరిష్టంగా రూ.50 వేల వరకు వినాయక ప్రతిమను విక్రయించడం జరుగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చవితి ప్రారంభం కానున్నందున చాలామంది భక్తులు వారి వారి ప్రాంతాల్లో ప్రతిమను ఏర్పాటు చేసుకొనేందుకుగాను నెలరోజులు ముందుగానే ప్రతిమలను ముందస్తుగా బుక్‌చేసుకున్నారు. ఈ వ్యాపారంలో మంచి లాభాలు వస్తుండడం వలన వ్యాపారులు కూడా ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో పట్టణం మొత్తమీద నాలుగైదు చోట్ల మాత్రమే వినాయక ప్రతిమల విక్రయ కేంద్రాలు వుండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పట్టణంలో దాదాపు 20 ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు వెలిశాయి. లక్షలు పెట్టుబడి పెట్టి విగ్రహాలను దిగుమతి చేసుకొని వాటికి తుది మెరుగులు దిద్ది విక్రయాలు సాగిస్తున్నారు. ప్రతిమల వ్యాపారం ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వేలాదిమంది వ్యాపారులు, కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికే పట్టణంలోని విక్రయ కేంద్రాల్లో ప్రతిమలను ఔత్సాహికులు అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకున్నారని, దాదాపుగా ప్రతిమలన్నీ అమ్ముడయ్యాయని వ్యాపారులు అంటున్నారు. మరి కొన్నింటిని మరో రెండుమూడు రోజుల్లో దిగుమతి చేసుకోనున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, పంట కాలువలకు నీరు సకాలంలో విడుదలయ్యాయని, దీంతో రైతులు, ప్రజలు వినాయక చవితి పండుగ నిర్వహణ పట్ల అధికంగా మక్కువ చూపుతున్నారని, అనుకున్నంత మేర ప్రతిమలు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. ఏది ఏమైనా వినాయక ప్రతిమల వ్యాపారం ద్వారా వ్యాపారులు ఆశించిన మేరకు లాభ