అనంతపురం

కలకలం రేపిన ఖైదీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఉరవకొండ సబ్‌జైలులో ఘటన
* మృతిపై పలు అనుమానాలు
* గుట్టుచప్పుడు కాకుండా ఆసుప్రతికి తరలింపు
* పోలీసుల హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు
గుంతకల్లు/ఉరవకొండ, డిసెంబర్ 4 : ఉరవకొండ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. జైలుకు వచ్చిన మరుసటి రోజే రిమాండ్ ఖైదీ పటాన్‌షేక్ షామీర్‌ఖాన్ మరుగుదొడ్డిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని జైలు సిబ్బంది చెబుతుండగా, సిబ్బందే తన భర్తను పొట్టన పెట్టుకున్నారని భార్య షాను ఆరోపిస్తోంది. జైలు సిబ్బంది, ఉరవకొండ సిఐ సూర్యనారాయణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెనె్నకొత్తపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామానికి చెందిన పఠాన్‌షేక్ షామీర్ ఖాన్ (36) అనంతపురంలోని గుల్జార్‌పేటలో నివాసం ఉంటూ చిల్లర దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతనిపై కర్నాటక, చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల్లో దాదాపు 33 కేసులు ఉన్నాయి. విడపనకల్లులో 2014 నవంబర్ 13న ఓ ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో పిటి వారెంట్ కింద షామీర్‌ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అక్టోబర్ 28న మదనపల్లి సబ్‌జైల్లో నుంచి పిటి వారెంట్ కింద అనంతపురం పోలీసులు షామీర్‌ను తీసుకొచ్చారు. గతనెల 23న కర్నాటకలోని గౌనేపల్లి, శ్రీనివాసపురం పోలీసులు పిటి వారెంట్ కింద షామీర్ ఇక్కడి నుంచి కర్నాటకకు తీసుకుని వెళ్లారు. విచారణ అనంతరం గురువారం పోలీసులు ఉరవకొండ సబ్ జైలు అధికారులకు అప్పగించారు. కాగా శుక్రవారం ఉదయం షామీర్‌ఖాన్ మరుగుదొడ్డికి వెళ్లి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ సంఘనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ హుసేన్‌సాబ్ శవాన్ని పరిశీలించారు.
కాగా షామీర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 33 కేసుల్లో ప్రధాన నిందితుడిగా వున్న ఖైదీ పట్ల జైలు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడిపై నిఘా పెట్టకపోవడం, ఆఘమేఘాలపై వైద్య చికిత్స నెపంతో శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇద్దరి ఖైదీలు మాత్రమే వున్న సబ్‌జైలులో పర్యవేక్షణను ప్రజలు అనుమానిస్తున్నారు. అన్నం వండేందుకు తాడును ఉపయోగిస్తారని, తాడు సహయంతో కిటికి ఊచలకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్న జైలు అధికారులు గుట్టుచప్పడు కాకుండా శవాన్ని తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
సబ్‌జైలులో కేవలం ఇద్దరు ఖైదీలు మాత్రమే వున్నారని సబ్‌జైలు సూపరిండెంట్ రఘునాథ్‌రెడ్డి వివరించారు. ఒకరు మండలంలోని రాకెట్ల తండాకు చెందిన శంకర్‌నాయక్‌ను ఎక్సైజ్ కేసులో నిందితుడగా రిమాండ్‌కు తీసుకుని వచ్చారన్నారు. అదే విధంగా పలు చోరీ కేసుల్లో ప్రధాన నిందితుడు పఠాన్‌షేక్ షామీర్‌ఖాన్‌ను గురువారం సబ్‌జైలుకు తీసుకుని వచ్చారన్నారు. అయితే శుక్రవారం ఉదయం టీ చేసేందుకు గాను ఇద్దరిని సెల్ నుండి బయటకు వదిలామన్నారు. శంకర్‌నాయక్ టీ చేసేందుకు పొయ్యి వద్దకు వెళ్లాడని, ఇంతలో షామీర్ బాత్‌రూంలోకి వెళ్లాడన్నారు. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. కొన ఊపిరితో వున్న అతడిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడని వివరణ ఇచ్చారు.
విచారణ చేపట్టిన జిల్లా జైళ్ల అధికారి
పట్టణంలోని సబ్ జైలులో రిమాండ్ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై జిల్లా జైళ్ల అధికారి సుదర్శనరావు శుక్రవారం విచారణ చేపట్టారు. విచారణ పూర్తికాగానే డిఐజికి నివేదికలు పంపుతామని సుదర్శన్‌రావు తెలిపారు.
పోలీసులే హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు
పఠాన్‌షేక్ షామీర్‌ను పోలీసులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుని భార్య షాను ఆరోపించారు. సమాచారం మృతుని భార్య, బంధువులు అనంతపురం నుండి ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. శరీరంపై గాయాలున్నాయని, పోలీసులు చితక బాధి హత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
‘బాబు’ను కలిసిన పామిశెట్టి
హిందూపురం, డిసెంబర్ 4 : ముఖ్యమంత్రి చంద్రబాబును ఇటీవల బిసి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన పామిశెట్టి రంగనాయకులు శుక్రవారం విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా తనపై నమ్మకం ఉంచి బిసి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించిందుకు సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికు, ఇటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని సిఎంతో పేర్కొన్నట్లు రంగనాయకులు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు, మీలాంటి సీనియర్ల సేవలు పార్టీకి అవసరమని బాధ్యతలు అప్పజెప్పామంటూ సిఎం తెలిపారన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. త్వరలోనే సమాచారం అందిస్తామని అప్పుడు వచ్చి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలని కోరారన్నారు. రంగనాయకులుతోపాటు తనయుడు, తెలుగు యువత నాయకుడు పామిశెట్టి కార్తీక్ సిఎంకు బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
పేదలందరికీ సంక్షేమ ఫలాలు
* రానున్న కాలంలో అనంతకు ఐటి కంపెనీలు : మంత్రి పల్లె
కొత్తచెరువు, డిసెంబర్ 4:సంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్యయాత్రలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మీర్జాపురం, తలమర్ల పంచాయతీల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పల్లె పాల్గొని తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. ఆ తరువాత ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్నాయన్నారు. లోటు బడ్జెట్ వున్న ఏ రాష్ట్రంలోను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. జిల్లా లో కరవు ప్రారద్రోలడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన హంద్రీనీవా కాలువ పనులను పూర్తి చేస్తోందన్నారు. త్వరలోనే జిల్లా వాసులకు త్రాగు, సాగునీటి సమస్య తీరుతుందన్నారు. నీరు పుష్కలంగా వున్నపుడే పరిశ్రమలు వస్తాయని, కావున భవిష్యత్తులో జిల్లాకు అనేక పరిశ్రమలు రానున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాకు బెంగుళూరు నగరం దగ్గరగా వుండడం, అంతర్జాతీయ విమానాశ్రయం సైతం దగ్గరగా వుండడంతో భవిష్యత్తులో అనేక ఐటి కంపెనీలు సైతం జిల్లాకు వస్తాయన్నారు. గత కాంగ్రెస 10 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఏవిధంగా సరఫరా అయిందో కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. ఎప్పుడు విద్యుత్ ఉంటుందో, ఉండదో అనే విషయాన్ని అధికారులే చెప్పలేని పరిస్థితి ఉండేదని ఎద్దేవాచేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. పరిశ్రమలు రావాలంటే విద్యుత్, నీరు అత్యవసరమని, ఈ సమస్యను ప్రభుత్వం తీరుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వాణి, జడ్పీటిసి మహాలక్ష్మి, మండల కన్వీనర్ రమేష్‌నాయుడు, దేశం నేతలు శ్రీనివాసులు, రఘుపతి, లక్ష్మినారాయణ, దాల్‌మిల్ సూరి, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

టిడిపితో అవినీతిని అంతం
* చరిత్రలో నిలిచిపోనున్న రుణమాఫీ : మంత్రి పరిటాల సునీత
చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 4:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి దక్కేలా జన్మభూమి కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు సమిష్టి కృషితో పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం మండలంలోని ప్యాదిండి, బసినేపల్లి, వెంకటాంపల్లి గ్రామ పంచాయతీల్లో జరిగిన రైతు చైతన్య యాత్రలో మంత్రితో పాటు తనయుడు పరిటాల శ్రీరామ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మోదీన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు గత ప్రభుత్వాలు అవినీతికి నాందిగా మారాయని, ప్రస్తుతం తెదేపా అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర మాసంలోనే అవినీతిని అంతం చేశామన్నారు. అదేవిధంగా 7ప్రాజెక్టులను రైతన్నల సంక్షేమం కోసం రూ.9250కోట్లు వెచ్చించి ముఖ్యమంత్రి నిర్మిస్తున్నారన్నారు. అనంతను సస్యశ్యామలం చేయాలన్న సదుద్దేశ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమ పాలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు టిడిపిలో సముచిత స్థానం కల్పించామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు జన్మభూమి కమిటీల దృష్టికి తీసుకురావాలని, వారి ద్వారా తక్షణమే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణం కింద రూ.2.75లక్షలతో అర్హులకు ఇళ్ళు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మార్చిలోగా 20లక్షల దీపం కనెక్షన్లు అందజేస్తామన్నారు. జనవరిలో కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామన్నారు. ఇళ్ళపట్టాలు, చేనేత రుణమాఫీ, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. వ్యక్తిగత దూషణలకు స్వస్తి చెప్పి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతకు దాదాపు రూ.500కోట్ల పంటనష్టపరిహారాన్ని అందజేశామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏమడిగినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి గ్రామస్థులకు తెలియజేశారు. ప్యాదిండి గ్రామంలో ఎస్‌ఎస్‌ఎ నిధులు రూ.11.80లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ జన చైతన్య యాత్రలో మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీరు-చెట్టు కింద ఎస్‌సి, ఎస్‌టిలకు, రోడ్లు, గుంతలు పూడ్చడం, చెరువు మట్టిని పొలాలకు తరలించడం తదితర వంటివి చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్ళ మరమ్మతుకు కూడా రూ.10వేలు అందజేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.24,500కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఎల్.నారాయణచౌదరి, రేగాటిపల్లి మధుసుదన్‌రెడ్డి, ధర్మవరం మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ దండు ఓబులేసు, కన్వీనర్ శ్రీరాములు, ఎంపిపి అమరేంద్ర, జెడ్‌పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపిపిలు రంగయ్య, ప్రసాదమ్మ, టిడిపి నాయకులు అంకె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* జన చైతన్య యాత్రలో ఎమ్మెల్సీ పయ్యావుల, చీఫ్‌విప్ కాలవ
బెళుగుప్ప, డిసెంబర్ 4 : రాష్ట్ర విడిపోయి ఆర్థిక లోటు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గంగవరం గ్రామంలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళల సమస్యలు తెలుసుకుని అధికారం చేపట్టిన తర్వాత పరిష్కరిస్తున్నారన్నారు. 13 జిల్లాలో రూ.27 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత టిడిపికి దక్కిందన్నారు. రాష్ట్రం విడిపోయి రూ.16 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం పింఛన్లు ఐదు రెట్లు పెంచారన్నారు. అంతేగాకుండా కరవు జిల్లా అనంతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని జిల్లాకు కేటాయించడం హర్షించదగ విషయమన్నారు. జిల్లా రైతాంగానికి సాగు నీరు అందించాలని హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 4 సంవత్సరాల్లో ఉరవకొండ నియోజకవర్గంలోని అన్ని చెరువులను హంద్రీనీటితో నింపుతామన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తుంటే ప్రతి పక్షపార్టీ నేతలు విమర్శలకు దిగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ సుబాషిణమ్మ, ఎంపిపి తిరుపతమ్మ, టిడిపి రాష్ట్ర నాయకులు ఉమమహేశ్వరనాయుడు, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఉపాధ్యక్షులు పెద్దతిప్పయ్య, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పవన్‌కుమార్, సీనియర్ నాయకులు విజయకృష్ణ, ఆనందప్ప, రాధకృష్ణ, వీరాంజినేయులు, మురళీమోహన్, ఎంపిటిసిలు కంచి రాముడు, ఎర్రెగౌడ్, సర్పంచ్‌లు జయమ్మ, వెంకటనాయుడు, నాయకులు తిరుమలరెడ్డి, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కణేకల్లు : ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చీఫ్‌విఫ్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని నల్లంపల్లి, ఉన్నంపల్లి, పూలచేర్ల, దోబుళాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పటికీ, ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పరిపాలనలో దేశం, రాష్ట్రాలని దోచుకున్న కాంగ్రెస్ ఆఖరికి ఎపికి రాజధాని లేకుండా చేసిందన్నారు. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాతిమాబీ, జడ్పీటీసీ శారద, మండల కన్వీనర్ లాలెప్ప, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బసవరాజ్, మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ వన్నారెడ్డి, ఉప సర్పంచ్ ఆనంద్‌రాజ్, టిడిపి నాయకులు చంద్రశేఖర్‌గుప్తా, చాంద్‌బాషా, వన్నారెడ్డి, ఈరప్ప, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ లేఔట్లపై కొరడా!
* కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు
హిందూపురం రూరల్/లేపాక్షి, డిసెంబర్ 4 : రియల్ ఎస్టేట్ వ్యాపారు లు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లేఔట్లను తొలగించేందుకు శు క్రవారం నుంచి అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ కోన శశిధర్ గురువా రం తూమకుంట పారిశ్రామిక వాడకు వెళ్తూ బెంగళూరు రహదారికి ఇరువైపులా ఏర్పాటైన లేఔట్లను పరిశీలించి రెవెన్యూ అధికారులతో వాకబు చేసిన విషయం తెలిసిందే. వీటికి ఎలాంటి అనుమతులు లేవని తెలియడంతో వె ంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వరమ్మ శుక్రవారం జెసిబిని తెప్పించి ఆయా లేఔట్లలో వేసిన రాళ్లను తొలగించారు. ముందుగా కిరికెర పంచాయతీ పరిధిలోని అప్పలకు ంట, వీవర్స్‌కాలనీ, కిరికెర గేట్, తూ మకుంట తదితర ప్రాంతాల్లోని లేఔట్లను తొలగించారు. అలాగే హిందూపురం రూరల్ మండల పరిధిలో అక్రమ లేఔట్లను గుర్తించినట్లు తెలిపారు. వాటన్నింటిని తప్పకుండా తొలగిస్తామన్నారు. కేవలం ఒక్క కిరికెర పంచాయతీలోనే వందకుపైగా అక్రమ లేఔట్లు ఉండటం గమనార్హం. స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించగా కలెక్టర్ పరిశీలించి ఆదేశాలు జారీ చేయడంతో ఎట్టకేలకు పంచాయతీ అధికారులు రంగంలోకి దిగి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు లేపాక్షి మండల పరిధిలోని పులమతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఔట్లను తొలగించారు. ఈ సందర్భంగా డిపిఓ జగదీశ్వరమ్మ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా లేఔట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేఔట్లు వేసే వ్యక్తులు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అరుణాచలం ఉన్నారు.
కుదిరేముఖ్ ప్రాజెక్టు ఏర్పాటుకు
స్థల పరిశీలన
రాయదుర్గం రూరల్, డిసెంబర్ 4 : కుదిరేముఖ్ ప్రాజెక్టు నిర్మాణానికి నేమకల్లు అటవీ భూములను పరిశీలించినట్లు డిఎఫ్‌ఓ రాఘవయ్య తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుదిరేముఖ్ సంస్థకు 21.96 హెక్టార్ల అటవీ భూమి అవసరమని దరఖాస్తు చేసుకోగా నేమకల్లు అటవీ భూములను పరిశీలించినట్లు తెలిపారు. ఈ భూముల్లో ఐరన్‌ఓర్ ఎంత మేరకు ఉందో బోర్లు వేసి పరిశీలిస్తామన్నారు. 14.3 హెక్టార్లు భూమి రోడ్లు, ఇతర అవసరాలకు అవసరం అవుతుందన్నారు. ఎపి మైనింగ్ డెవలప్‌మెంట్, కుదిరేముఖ్ సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో 2013లో కొత్తగా వచ్చిన జీవో మేరకు అడవి జంతువుల దాడిలో మృతి చెందిన వ్యక్తులకు రూ. ఐదు లక్షలు పరిహారం, జంతవుల దాడిలో వికలాంగులైన వారికి రూ.75వేలు, మెడికల్ బిల్లులు ఇస్తామరు. అలాగే నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.6వేలు చెల్లిస్తామన్నారు. జిల్లాలో 62 ఫారెస్టు నర్సరీలు, 290 పాఠశాల్లో కోటి మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాయదుర్గం పరిధిలోని బొందనకల్లు అటవీ ప్రాంతంలో 66 హెక్టార్లలో ‘నగరం వనం’ కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ డిఎఫ్‌వో శామ్యూల్ పాల్గొన్నారు.
వరద బాధితుల సహాయార్థం ఎబివిపి భిక్షాటన
గుంతకల్లు రూరల్, డిసెంబర్ 4 : చెన్నై వరద బాధితుల సహాయార్థం ఎబివిపి విద్యార్థులు శుక్రవారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి విద్యార్థుల సంఘం నాయకులు నాగార్జున, శ్రీకాంత్, కేశవ్ మాట్లాడుతూ చెన్నై వరద బాధితులకు సహయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని పురవీధుల గుండా విద్యార్థులు భిక్షాటన కొనసాగించారు. ఈ భిక్షాటనలో వచ్చిన మొత్తాన్ని వరద బాధితులకు పంపుతున్నట్లు తెలిపారు.
తెలుగు ప్రజల గుండెల్లో
చిరస్మరణీయులు ఘంటసాల
* మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
అనంతపురం సిటీ, డిసెంబర్ 4: గానగంధర్వ, పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, ఐటి, మైనార్టీ, సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఘంటసాల 93వ జయంతి సందర్భంగా రుద్రంపేట సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ ప్రజలతో కలసి స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, నగర మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ సాకే గంపన్నలతో కలసి మంత్రి ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలు ప్రజలందరికి గర్వకారణమై గానగందర్వ ఘంటసాల తన జీవితాన్ని మొత్తం సంగీతానికి దారపోసి అత్యుద్భుతమైన, అసాధారణమైన సంగీతాన్ని అందించి, పాటలు పాడి తెలుగుజాతీకి నిండువెలుగగా, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారని కొనియాడారు. తెలుగు భాషకు, సాంస్కృతిక పునర్జీవానికి కృషి చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, వీరేశలింగం పంతులు, వ్యవహారికి భాషా పితామహుడు గిడుగురామ్మూర్తి పంతులు, గురుజాడ అప్పారావు, గనగంధర్వ ఘంటసాల వంటి తెలుగ వెలుగులు మహానీయుల జయంతులను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఘంటసాల తన అద్భుత గానంతో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామిపై అనిర్వచనీయమైన పాటలు పాడడంతో పాటు భగవద్గీత శ్లోకాలను మధురంగా ఆలపించారని తెలిపారు. దాదాపు అన్ని భాషల్లోను 50వేల మధురమైన పాటలను పాడిన ఘనత ఘంటసాలకే దక్కిందని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మార్కెట్ యార్డు ఛైర్మెన్ ఆదినారాయణ, టౌన్ బ్యాంకు అధ్యక్షుడు మురళీ, వెంకటరాముడు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
అలరించిన సంగీత విభావరి...
ఘంటసాల 93వ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని మూడ వ రోడ్డులోగల గొంగడి రామప్ప మీని ఫంక్షన్ హాల్‌లో ఘంటసాల ఆరాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రజలను అలరించింది. అంనతరం సమితి అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వరయుగం పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయామిషన్ స్వామీజీ స్వామి ఆత్మవిదానంద, అనంతపురం డియస్పీ మల్లికార్జునవర్మలు హాజరై సర్వయుగం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
డి.హీరేహాళ్, డిసెంబర్ 4 : మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్ ఎదురుగా నివాసం ఉంటున్న సుగ్గలప్ప (30) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సుగ్గలప్ప టివి స్విచ్ ఆన్ చేయగా షార్ట్ సర్కుట్ అయి షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మోసం చేస్తున్న యువకుడి అరెస్టు
గుత్తి, డిసెంబర్ 4 : కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వృద్ధులు, నిరక్ష్యరాస్యులను దగా చేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన సిద్దేష్‌ను గుత్తి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సిద్దేష్ గత కొన్ని సంవత్సరాలు ఎటిఎంల వద్ద కాపు కాస్తూ వృద్ధులు, నిరక్ష్యరాస్యూలను లక్ష్యంగా చేసుకుని నగదు అపహరించుకుని పోయేవాడు. ఇందులో భాగంగానే గత వారంలో గుత్తిలోని స్టేట్‌బ్యాంకు ఎటిఎంలో వృద్ధులను దగా చేసి డబ్బు ఎత్తుకెళ్లాడు. ముందుగా రూపొందించుకున్న పథకం ప్రకారం నకిలీ ఎటిఎం కార్డులు తయారు చేసుకుని ఉంచుకుంటాడు. ఎటింఎల వద్ద ఉండి నిరక్ష్యరాస్యులు, వృద్ధులు లోపలికి వెళ్లినప్పుడు తానూ వెళ్తాడు. వారికి నగదు డ్రా చేసి ఇస్తానని నమ్మబలికి నిజంగానే ఖాతాలోని సొమ్ము డ్రా చేసి తిరిగి తన వద్ద ఉన్న నకిలీ కార్డు ఇస్తాడు. తిరిగి వారి ఖాతాలోని మొత్తాన్ని డ్రా చేసుకుంటాడు. ఈ ఘటనపై గతవారంలో గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తుండగా పట్టణ శివార్లలోని జయలక్ష్మి పెట్రోల్‌బంకు వద్ద సిద్ధేష్ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు సిఐ మధుసూదన్‌గౌడ్ తెలిపాడు. నిందితుడి నుంచి 24 వేల నగదు, నకిలీ ఎటిఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.
మడకశిర ఘటన హంతకులను
పట్టుకునేందుకు నాలుగు బృందాలు
మడకశిర, డిసెంబర్ 4 : పట్టణంలో సంచలనం రేపిన హత్య కేసును ఛేదించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సిఐ హరినాథ్ తెలిపారు. స్థానిక గాంధీబజార్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ గుప్త సతీమణి భారతమ్మ (పార్వతమ్మ)ను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి హతమార్చి భారీగా నగలు, నగదు దోచుకెళ్లిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో క్లూస్, డాగ్ బృందాలు చేరుకుని పరిశీలించాయి. హత్యకు పాల్పడినన వ్యక్తులు ఉపయోగించిన కత్తి, చేతి గ్లౌజులను స్వాధీనం చేసుకోగా డాగ్ స్క్వాడ్ గాంధీ బజార్‌లోని పలుచోట్ల తిరిగింది. హత్యా స్థలాన్ని ఎఎస్పీ మాల్యాద్రి, డిఎస్పీ సుబ్బారావు పరిశీలించి హతురాలి భర్త, కుమారుడితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. హంతకులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన నాలుగు బృందాలు శుక్రవారం పావగడ, శిర, టుంకూరు తదితర ప్రాంతాల్లో తిరిగి వివిధ కేసుల్లో ఉన్న నిందితుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది.
వ్యాపార సంస్థలు బంద్
పట్టణంలోని గాంధీబజార్‌లో జరిగిన భారతమ్మ హత్యకు నిరసనగా ఆర్యవైశ్యులు శుక్రవారం వ్యాపార సంస్థలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతమ్మ అంత్యక్రియలు ముగిసేంత వరకు వ్యాపార సముదాయాలకు సెలవు ప్రకటించి సంతాపం వ్యక్తం చేశారు.