ఖమ్మం

జిల్లాలో కోరలు చాస్తున్న కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (కల్చరల్), డిసెంబర్ 12: వర్షాలు లేక జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వేసిన పైర్లు ఎండిపోయిన రైతులు, ఆ బోరు ఈ బోరు వేసి అదనంగా ఖర్చు చేసి పంటను బతికిస్తే దిగుబడి రాని రైతులు, వచ్చిన దిగుబడికి ప్రభుత్వాలు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో చితికిపోయిన రైతులు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరి సాగును లెక్కిస్తే 4 లక్షల పై చిలుకు ఎకరాలకుగాను 1.5 లక్షల ఎకరాల్లోనే రైతులు సాగు చేశారు. ఒక్క సాగర్ ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేదు. అలాగే ఎర్రుపాలెం మండలంలోని కట్టలేరు చెరువు కింద 17 వందల ఎకరాలు పొట్ట దశలో ఎండిపోయాయి. అనేక మండలాల్లో సాగులో ఉన్న వరికి వర్షాభావంతో నీరు అందక సగానికి పైగా దిగుబడి తగ్గింది. పత్తి పంటను రైతులు ఎంతో శ్రమించి సాగు చేశారు. ఏపుగా పెరిగిన పత్తి చేలు కాయ దశకు రాగానే వర్షాలు లేక దిగుబడి భారీ స్ధాయిలో పడిపోవడంతో రైతన్న నడ్డి విరిగినట్లు అయ్యింది. సగటున జిల్లాలో ఎకరానికి 3నుండి 4 క్వింటాల పత్తి దిగుబడి మాత్రమే వచ్చింది. దానికి తోడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఎస్ తేమ శాతం పేరుతో రైతును ఇబ్బందులు పెడుతున్నారు. దీనిని దళారులు తమకు అనుకూలంగా మలచుకొని రైతులను దోచుకుతింటుంన్నారు. ఇక మిర్చి సాగు గురించి చెప్పనక్కరలేదు. అనేక మంది రైతులు ఎకరానికి 40, 50 వేల రూపాయలు ఖర్చుచేసి ఉన్నారు. కౌలు రైతులైతే ప్రాంతాన్ని బట్టి ఎకరానికి 10 నుండి 20 వేలు అదనంగానే వెచ్చించారు. జిల్లాలో వాజేడు నుండి కూసుమంచి వరకు అన్ని మండలాల్లో కరువు పడగ విప్పి నాట్యమాడుతుంటే ప్రభుత్వానికి కనిపించక పోవడం దారుణమని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 201 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటిస్తే అందులో ఒక్క మండలం కూడా జిల్లా నుండి లేక పోవడం మంత్రి తుమ్మల, జిల్లా అధికారుల వైఫల్యమే నంటున్నారు జిల్లా రైతులు. కరువు మండలాల విషయంలో ఇప్పటికే జిల్లా రైతు సంఘాలు అనేక రకాలు ఆందోళనలు, జిల్లా రాష్ట్ర స్ధాయి అధికారులతో పాటు కేంద్ర కరువు బృందాన్ని కూడా కలిసి విన్నపాలు అందించారు. కానీ నేటికి కరువు మండలాలను ప్రకటించే పరిస్ధితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. రైతుల సమస్యలపై అన్ని పక్షాలను కలుపుకొని అందోళన చేసేందుకు సిద్దమవుతామని రైతు సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి నున్న నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవకపోగా ఇబ్బందులపాలు చేస్తుందని దుయ్యబట్టారు. రైతుకు భరోసా ఇచ్చే పధకాల గురించి ఆలోచించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు.

మైనార్టీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 12: ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ ఖాజా ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని 15 రోజులుగా చేస్తున్న నిరహార దీక్ష శనివారంతో ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి ఆయన వెంటనే మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన కెసిఆర్ మోసం చేస్తున్నారన్నారు. ముస్లింలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మైనార్టీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించటం తగదన్నారు. మైనార్టీలకు కనీసం నివాస గృహాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని పార్టీలలో ఉన్న ముస్లిం కమిటీలు ఏకమైనప్పుడే మైనార్టీల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమీర్‌అలీఖాన్, వివిధ పార్టీల మైనార్టీల నాయకులు పాల్గొన్నారు.

తుమ్మల సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిన వైస్ ఎంపిపి
జూలూరుపాడు, డిసెంబర్ 12: జూలూరుపాడు వైస్ ఎంపిపి కొడెం సీతా కుమారి శనివారం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మండల పరిధిలోని గుండెపుడి గ్రామ పంచాయతీ రామచంద్రాపురంకు చెందిన సీతాకుమారి భర్త దివంగత కొడెం సీతారాములు కూడా గతంలో సిపిఎం పార్టీ తరపున మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. సిపిఎం పార్టీకి చెందిన సీతాకుమారి గత ఎన్నికల్లో గుండెపుడి -1 నుంచి ఎంపిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. రాజకీయ సమీకరణలో భాగంగా సిపిఎం పార్టీకి వైస్ ఎంపిపి రావటంతో సీతాకుమారిని పదవి వరించింది. ప్రస్తుతం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆమె టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈకార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, జూలూరుపాడు సొసైటీ డైరక్టర్ కాజా రమేష్, గలిగె లక్ష్మయ్య తదితరులున్నారు.

బ్యాలెట్ నమూనా విడుదల
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 12: ఖమ్మం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు బ్యాలెట్‌లో అభ్యర్థుల పేర్ల క్రమ సంఖ్యను ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జాతీయ గుర్తింపు, రాష్ట్ర గుర్తింపు, స్వతంత్ర అభ్యర్థుల ఇలా వరస క్రమంలో బ్యాలెట్‌లో అభ్యర్థుల పేర్లు వచ్చే విధంగా ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు నిర్ణయించారు. దీంతో మొదటి స్థానంలో సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు, రెండో స్థానంలో టిఆర్‌ఎస్ బాలసాని లక్ష్మీనారాయణ, మూడో స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్‌రాజు, స్వతంత్ర అభ్యర్థులు అయిన గౌడి లక్ష్మీనారాయణ, కర్ణ లక్ష్మీనారాయణలు నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాలెట్ పత్రాల్లో ఉండనున్నారు. దీంతో పోటీలో నిలుచున్న అభ్యర్థులు నమూన బ్యాలెట్ పత్రాన్ని ముద్రించి ప్రచారం ముమ్మరం చేశారు. అధికారులు బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల క్రమ సంఖ్య ప్రకటించగానే తమ వద్ద ఉన్న ఓటర్లకు క్రమ సంఖ్యను చూపించేందుకు నమూనా పత్రాలను రాత్రికిరాత్రే అచ్చు వేయించారు.
గ్రామాల్లో ఆంధ్ర మద్యం
* చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ
ఎర్రుపాలెం, డిసెంబర్ 12: ఎర్రుపాలెం మండలానికి సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రాంతం నుండి మద్యం అక్రమంగా మండలంలోని గ్రామాలకు రవాణా అవుతోంది. మండలానికి దగ్గరగా ఉన్న ఆంధ్ర మండలాల నుండి బెల్టుషాపులకు ఈ మద్యం రవాణా అవుతోంది. మండలంలో విచ్చలవిడిగా వెలసిన మద్యం షాపుల వారు తమకు దగ్గరగా ఉన్న ఆంధ్ర ప్రాంతం నుండి మద్యం తీసుకొని వచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మండలంలో ఉన్న రెండుషాపుల నుండి కూడా బెల్టుషాపుల వారికి ఒక్కొక్క సీసాపై అదనంగా తీసుకొని మందును విక్రయిస్తున్నారు. బెల్టుషాపుల వారు ఒక్కొక్క సీసాపై 15రూపాయలు అదనంగా అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్టుషాపుల్లో అధిక ధరలను అరికట్టాలని మందుబాబులు కోరుతున్నారు.

అధికార పార్టీకి
గుణపాఠం తప్పదు
గార్ల, డిసెంబర్ 12: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలకు తగిన గుణపాఠం తప్పదని అధికారేతర పార్టీల మండల కమిటీల బాధ్యులు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రజాసేవకులు, అవినీతి పరులకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు అభివృద్ధి పేరుతో మోసపుచ్చుతున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి కమ్యూనిస్టులను విమర్శించే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన పూవ్వాడ నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా నాయకుడు కట్టబోయిన శ్రీనివాస్, తెలుగుదేశం మండల కార్యదర్శి ఎం.వెంకట్‌లాల్, సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు కందునూరి శ్రీనివాస్, జంపాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.