ఖమ్మం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 16: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాపాదయాత్ర నేడు ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్న యాత్ర మార్చి 12వ తేదీన హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభతో ముగుస్తుంది. గతంలో కూడా ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి పేరుతో తమ్మినేని వీరభద్రం జిల్లాలో వందరోజుల పాటు దాదాపు 2600 కిలోమీటర్లు నడిచి చరిత్ర సృష్టించారు. ఆ తరువాతే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేశారు. తమ్మినేని ఖమ్మం జిల్లాలో సైకిల్‌యాత్రలు కూడా చేశారు. యాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో తనదైన ముద్ర వేసిన తమ్మినేని వీరభద్రం మహాపాదయాత్రలో ఖమ్మం జిల్లాకు చెందిన నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి వెయ్యిమందికి పైగా నేతలు హాజరు కానున్నారు. ఇదిలావుండగా జనవరి నెలలో భద్రాద్రి జిల్లాలోని వాజేడు మండలంలోకి ప్రవేశించనున్న తమ్మినేని మహాపాదయాత్ర 23రోజుల పాటు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో కొనసాగుతుంది. అన్ని మండలాల్లోనూ తిరుగుతూ అక్కడి ప్రజల జీవన స్థితిగతులను గమనిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడే ప్రస్తావిస్తూ ఆయన యాత్ర చేపట్టనున్నారు. తమ్మినేని యాత్ర జరిగే సమయంలో రెండు జిల్లాల పరిధిలోనూ ప్రతిరోజు ఆయనతో పాటు 10వేల మంది కార్యకర్తలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రలో భాగంగా స్థానికంగా ఉన్న ప్రాజెక్టులను పరిశీలిస్తూ స్థానిక సమస్యలను లేవనెత్తనున్నారు. అలాగే టిఆర్‌ఎస్ నేతలు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, అవి అమలైన తీరుపై కూడా ప్రజలతో కలిసి ఎండగట్టనున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ ప్రధాన హామీలైన రెండు పడకగదుల ఇల్లు, మూడెకరాల భూమి, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, జిల్లా సమగ్రాభివృద్ధి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అదే సమయంలో కేంద్ర వైఖరిని కూడా ప్రజలకు తెలియజేయనున్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇచ్చిన హామీలు, వాటిని నేటికి అమలు చేయకపోగా దాటవేసే ధోరణి అవలంభిస్తున్నారంటూ ప్రజలకు చెప్పనున్నారు. ఆయన యాత్రకు ఇతర ప్రజాసంఘాలు, పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. ఆయన తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటి నుంచే ఆ పార్టీ శ్రేణులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా సన్నద్ధమవుతున్నారు.
ఇదిలావుండగా నాడు మహా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మంచిపేరు సంపాదించుకోవడంతో పాటు పార్టీ పేరు ప్రతిష్ఠను తమ్మినేని ఇనుమడింపజేశారు. ఈసారి రాష్ట్ర కార్యదర్శి హోదాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ చేపడుతున్న ఈ పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని బలోపేతం చేయడంతో పాటు సిపిఎం ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేయనున్నారు. అలాగే ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారని వస్తున్న ఆరోపణలకు కూడా ఈ యాత్రలో సమాధానం చెప్పనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ప్రారంభానికి ముందే అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆయన యాత్రకు ప్రజల నుంచి వచ్చే స్పందన ద్వారానే సమాధానమిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈర్లపూడిలో
విషాదం

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 16: ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు చెరువులో పడి మృతిచెందిన సంఘటన రఘునాథపాలెం మండల పరిధిలోని ఈర్లపుడి గ్రామంలోని పంగిడి చెరువు వద్ద జరిగింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన గ్రామస్థులను కలచివేసింది. సరదాకని చెరువు వద్దకు వెళ్ళిన చిన్నారులు శవాలై కనిపించడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను ఆవేదనకు గురిచేసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఈర్లపుడి గ్రామానికి చెందిన షేక్ నాగుల్‌మీరా(12), షేక్ నాజర్‌పాషా(10), చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన అబ్థుల్ రెహ్మాన్(6) గ్రామంలో ఆడుకుంటున్నారు. ఈ సమయంలో అటుగా బండిపై మరో ఇద్దరు పిల్లల్ని తీసుకొని అన్వర్‌పాషా అనే వ్యక్తి చెరువువైపు వెళ్తుండగా ఆయనను ఆపి వాహనంపై ఎక్కారు. మొత్తం ఐదుగురు పిల్లలను చెరువు వద్దకు తీసుకెళ్ళిన అన్వర్‌పాషా వారిని దూరంగానే ఉంచారు. అయితే బహిర్బూమికని అన్వర్‌పాషా దూరంగా వెళ్ళిన సమయంలో నాజర్‌పాషా చెరువువద్దకు వెళ్ళి చూస్తూనే జారిపడ్డాడు. దీంతో ఆయనను రక్షించబోయిన రెహ్మాన్, నాగుల్‌మీరాలు కూడా చెరువులో పడిపోయారు. మిగిలిన ఇద్దరు పిల్లలు సమాచారాన్ని అన్వర్‌పాషాకు చేరవేయగా ఆయనకు కూడా ఈత రాకపోవడంతో దూరంగానే ఉండిపోయాడు. స్థానికులు వచ్చే సమయానికే ముగ్గురు పిల్లలు మరణించారు. కాగా నాగుల్‌మీరా, నాజర్‌పాషాలు స్వయాన సోదరులు కావడం గమనార్హం. ఖమ్మం డిఎస్పీ సురేష్‌కుమార్, సిఐ నాగేంద్రాచారితో పాటు రెవెన్యూ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు.
పాలనపై కార్యాచరణకు కసరత్తు

కొత్తగూడెం, అక్టోబర్ 16: జిల్లాల పునర్‌వ్యవస్తీకరణ తరువాత తొలిసారిగా సోమవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో భద్రాద్రి జిల్లా అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మూడురోజుల క్రితం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి ఆయా ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనులు, ప్రభుత్వనుంచి విడుదలయ్యే నిధులు, వివిధ శాఖల విధులు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను రూపొందించాలని ఆదేశించిన విషయం విదితమే. త్వరలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హజరయ్యే సమావేశం నాటికి నివేదికలు రూపొందించాలని ఇచ్చిన ఆదేశాలననుసరించి సోమవారం జరిగే సమావేశానికి అధికారులు హజరు కానున్నారు. మొదట భద్రాద్రి జిల్లా భౌగోళిక పరిస్థితి, జనాభా, వనరులు, వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించాల్సిన విధులు, ప్రభుత్వం నుండి నూతన జిల్లాలకు విడుదలయ్యే నిధులు, జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇప్పటికే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం కల్గిన భద్రాద్రి జిల్లాలో ఉన్న వనరులు, వాటిని వినియోగించుకొనే పరిస్థితులు, వివిధ ప్రభుత్వ శాఖలలో నియామకం కాని ఖాళీలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముంది. నూతన జిల్లాలలో ఉన్న వనరులను గుర్తించి వాటిని వినియోగించుకోవడంతోపాటు ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులను ఆయా జిల్లాల సమగ్రాభివృద్ధికి వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన సూచనల మేరకు సమావేశంలో జిల్లా పరిస్థితులపై చర్చ కొనసాగనుంది. అంతేకాకుండా నూతన జిల్లాల అవిర్భావం తరువాత మంత్రి పాల్గొనే సమావేశం కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత ఆ జిల్లాల స్థితి గతులను అధ్యయనం చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కూడా ఆయా జిల్లా ల భాద్యతను చూస్తున్న మంత్రులపైన ఉంటుందని ముఖ్యమంత్రి సూచనల మేరకు సమావేశంలో నూతన భద్రాద్రి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వానికి కొత్త జిల్లాకు అవసరమైన నిధుల విషయంలో ప్రతిపాదనలకు సమావేశంలోనే రూపకల్పన జరుగుతుందని తెలుస్తోంది.

సీతారామ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం

భద్రాద్రి జిల్లా అధికారులతో జిల్లా సమగ్రాభివృద్ధిపై సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తి శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం మధ్యాహ్నం నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు తొలిదశ టెండర్లు పూర్తి అయ్యాయని మరో రెండుమూడు రోజులలో రెండవ దశ టెండర్లను పిలుస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావు ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించిన నేపధ్యంలో టెండర్ల ఆహ్వానంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీలున్నంత త్వరగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న కారణంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసే దిశగా కూడా కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించే అవకాశం ఉంది.
వైభవంగా శబరి స్మృతి యాత్ర
భద్రాచలం, అక్టోబర్ 16: భద్రాచలం మన్యం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు శ్రీరామదివ్యక్షేత్రంలో నిర్వహించిన శోభాయాత్ర, భద్రగిరి ప్రదక్షిణ వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించింది. ఆశ్వయుజ పూర్ణిమ వేళ వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన శబరి స్మృతి యాత్రలో శ్రీసీతారామచంద్రస్వామికి భక్తితో గిరిజనులు అడవి నుంచి తెచ్చిన పుష్పాలు, ఫలాలు సమర్పించి తమలోని భక్తి, ఆధ్యాత్మికతను చాటుకున్నారు. అమాయకులమే కానీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో మాకు ఎవరూ సాటిరారని నిరూపించారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా జడ్జి వినయ్‌మోహన్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, భద్రాచలం జడ్జి బులికృష్ణలు గిరిజనుల నిర్వహించిన శబరి స్మృతి, శోభాయాత్రలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు గిరిజనుల కొమ్మును ధరించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా నలుమూలల నుంచి వివిధ రకాల గిరిజన తెగలకు చెందిన గిరిజనులు తమ సంప్రదాయబద్ధ నృత్యాలు, సంగీత విన్యాసాలతో పట్టణ ప్రజలను మంత్ర ముగ్ధులను చేశారు. రామయ్యకు అభిషేకం చేశారు. వారిలోని భక్త్భివానికి భద్రగిరి పులకించింది.
తొలుత మననం...
ముందుగా అపర రామభక్తురాలు శబరి, వాల్మీకిలకు ఘనంగా పూజలు చేశారు. ఆరాధనలు ఇచ్చి వారి భక్తిని మననం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా జడ్జి విజయ్‌మోహన్‌లు మాట్లాడుతూ గిరిజనుల్లోని భక్తి, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు ఇకపై ఏటా శబరి స్మృతి యాత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. శబరి పరివాహక ప్రాంతంలోని గిరిజనులను కూడా ఇకపై ఏటా ఈ ఉత్సవంలో భాగస్వాములను చేస్తామన్నారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వేదపండితులు తూర్పుగోదావరి జిల్లా కూనవరంలోని శబరి నది వద్దకు వెళ్లి అక్కడ శబరి విగ్రహానికి అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, తాంబూలం, ప్రసాదం సమర్పించారు.
రేలా పాటలు...కొమ్ము నృత్యాలు...తప్పెట్లు
సుమారు గంట సేపు భద్రాచలం పట్టణంలో గిరిజనులు శోభాయాత్రగా శబరి చిత్రపటంతో ప్రదక్షిణ చేస్తూ ఆలపించిన రేలా పాటలు, కొమ్ము నృత్యాలు, తప్పెట్ల వాయిద్యాలు, నాదస్వరాలు, విచిత్ర వేషధారణలతో మైమరిపించారు. తమదే అయిన సంస్కృతి, సంప్రదాయాలకు వారసులం మేమేనంటూ వారు ప్రదర్శించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నారు. మార్గం మధ్యలో శబరి విగ్రహానికి అభిషేకం చేసి పట్టువస్త్రాలు సమర్పించి, అడవి నుంచి తెచ్చిన ఫలాలు, పుష్పాలు సమర్పించి ముగ్ధులయ్యారు. రామభక్తిని పొందిన శబరిని స్మరించుకున్నారు. దారిపొడవునా వారికి పట్టణ ప్రజలు మంగళనీరాజనాలు పలికారు. తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
రామయ్యకు ఫల, పుష్పాల సమర్పణ
శోభాయాత్ర అనంతరం ఆదివాసీలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఉదయం రామయ్యకు అభిషేకం, సువర్ణ తులసీ, పుష్పార్చనలు ముగిశాక చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అక్కడ సహస్ర నామార్చన చేశారు. అనంతరం గిరిజనులు ఆలయం నుంచి రకరకాల పుష్పాలు, ఫలాలను తమ సంప్రదాయ నృత్యాలతో మోసుకుంటూ చిత్రకూట మండపానికి వచ్చి అక్కడ రామయ్య తండ్రికి సమర్పించారు. వీరి పేరిట దేవస్థానం నిత్యకల్యాణం నిర్వహించింది. వీరిచ్చిన పుష్పాలతోనే స్వామికి అర్చన చేసి ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తశబరికి నీరాజనాలు పలికారు. అనంతరం దేవస్థానం తరుపున భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు ఆదివాసీలకు వస్త్రాలు పెట్టి స్వామి వారి ప్రసాదాన్ని,జ్ఞాపికలను అందజేశారు.
పెంచిన పెట్రో, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 16: కేంద్ర ప్రభుత్వం పెంచిన జూలూరుపాడు కేంద్రంగా అటవీశాఖ రేంజిపట్రో, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ నగర కార్యదర్శి జానీమియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ధరలు పెంచుతూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే దేశ ప్రజలు అధిక ధరలతో సతమతమవుతుంటే వాటికి తోడుగా ఇందన ధరలు పెంచడం అమానుషమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయే తప్ప వాటిని నియంత్రించలేని పరిస్థితిలో కనిపించడం లేదని దుయ్యబట్టారు. ప్రజాసంక్షేమ పాలన ప్రకటనలకే పరిమితం అవుతుందని, వాటి అమలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురుచూసిన ప్రజానికానికి బాధలు తప్ప బతుకుతెరువు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న సంక్షోభాన్ని పురించడంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. పెంచిన క్రూడాయిల్ ధరల వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని, సామాన్యులు జీవించలేని పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు. పెంచిన పెట్రో, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బిజె క్లైమెంట్, నాయకులు శ్రీనివాసరావు, సాంబశివారెడ్డి, సూరిబాబు, చామకూరి వెంకన్న, శశిధర్, వెంకటేశ్వర్లు, మందా వెంకటేశ్వర్లు, యాకూబ్, సైదా, బాబు పాల్గొన్నారు.

జూలూరుపాడు, అక్టోబర్ 16: జిల్లాల పునర్విభజనలో భాగంగా జూలూరుపాడు మండలాన్ని నూతనంగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో కలవటంతో అటవీశాఖ పరిధిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ముసాయిదా ప్రకారం మండలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించటంతో అటవీశాఖ జిల్లా అధికారులు జూలూరుపాడును ఆశాఖ రేంజి కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనంతరం జరిగిన మార్పుల్లో భాగంగా జూలూరుపాడు మండలాన్ని భద్రాద్రి జిల్లాలో కలిపినా జూలూరుపాడు అటవీశాఖ రేంజి కేంద్రంగానే ఏర్పాటు చేస్తూ ఆశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు మండల కేంద్రంలో ఇప్పటి వరకు అటవీశాఖ అధికారుల నివాస గృహంగా ఉన్న భవనాన్ని రేంజి కార్యాలయంగా మార్చేందుకు సర్వం సిద్దం చేశారు. భవనాన్ని అందంగా తయారు చేసి, రేంజి కార్యాలయాన్ని సూచిస్తున్న బోర్డును కూడా ఏర్పాటు చేసి ప్రారంభానికి ముస్తాబు చేశారు. భద్రాద్రి జిల్లాలో అటవీశాఖ కొత్తగూడెం డివిజన్, కొత్తగూడెం సర్కిల్ పరిధిలో కొత్తగా ఏర్పాటు కానున్న జూలూరుపాడు రేంజి కింద జూలూరుపాడు, గుండెపుడి, పాపకొల్లు మూడు సెక్షన్‌లుగా విభజించారు. జూలూరుపాడు సెక్షన్ కింద నాచారం, సూరారం-1, సూరారం-2 బీట్‌లు, గుండెపుడి సెక్షన్ కింద గుండెపుడి, నల్లబండబోడు బీట్‌లు, పాపకొల్లు సెక్షన్ కింద పాపకొల్లు, రేలకాయలపల్లి బీట్‌లుగా విభజించారు. అయితే గతంలో మండల పరిధిలోని పాపకొల్లు సెక్షన్ కింద ఉన్న రాజారావుపేట బీట్‌ను కారేపల్లి రేంజి, రామన్నపాలెం బీట్‌ను రామవరం రేంజిలో కలుపుతుండటంతో జూలూరుపాడు కేంద్రంగా రేంజి ఏర్పాటు జరిగినా అటవీ విస్తీర్ణం మాత్రం తగ్గే అవకాశ ముంది. నూతనంగా జూలూరుపాడు రేంజి కేంద్రం ఏర్పాటు కావటం వలన ఆశాఖ సేవలు మరింత విస్తుృతమయ్యే అవకాశముందని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇనామ్ అమలుకు నెలాఖరు వరకు గడువు

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 16: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఇనామ్ పథకం అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు లభించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డి కార్యాలయంలో ఖరీఫ్ మార్కెటింగ్‌పై మార్కెట్ కమిటీల చైర్మన్‌లు, కార్యదర్శులకు జరిగిన ప్రత్యేక అవగాహన సదస్సులో మార్కెటింగ్ శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రకటించారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తాజాగా ప్రమాణస్వీకారం చేసిన జి కృష్ణ ఈ సమావేశానికి హాజరై ఖమ్మం మార్కెట్ గురించి మంత్రికి వివరించారు.
ఈ క్రమంలో మార్కెట్ విస్తీర్ణం పెంపు, అవసరమైన అధికారుల నియామకం, రైతులకు కనీస అవసరాలైన విశ్రాంతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటిన్‌వంటి సౌకర్యాలపై కృష్ణ చర్చించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు మార్కెట్‌లో ఉదయం ఆరుగంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. అలాగే నెలాఖరు నుండి అమలు కానున్న ఇనామ్ పథకంతో పాటు ఇతరత్రా పనులను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి ఖమ్మం నుంచి వ్యవసాయ మార్కెట్, చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు హాజరయ్యారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 16: మహనీయులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన మహర్షివాల్మీకి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి గడిపల్లి కవిత, జెసి వినయ్‌కృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ ఏకాగ్రతతో ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. అడవులలో జంతువుల మధ్య నివసించిన వాల్మీకి మహనీయుడుగా మారారని అతనిని నేటి యువత అదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కఠిన సాధన చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా బోయ సంఘ నేతలు ఆమెను కలసి సమస్యలను విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి హృషికేష్‌రెడ్డి, ఎపివోడబ్ల్యూ ఎ వెంకటేశ్వర్లు, పాపారావు, సుదర్శన్, సురేందర్‌రావు, బోయ సంఘ రాష్ట్ర నాయకులు చందరావు, కృష్ణ, కత్తి నెహ్రు పాల్గొన్నారు.
వైద్యుని నిర్లక్ష్యం ఖరీదు పసివాడి ప్రాణం

చర్ల, అక్టోబర్ 16: వైద్యుడి నిర్లక్ష్యం.. ఒక పసికందు ప్రాణాలు బలి తీసుకుంది. వైద్యశాలకు వచ్చిన వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గిరిజన మహిళలకు గర్భశోకమే మిగిలింది. వివరాల్లోకి వెళితే చర్ల మండలం వద్దిపేట గ్రామానికి చెందిన ఉయికా స్నేహఆదిత్యలక్ష్మీ అనే గిరిజన మహిళ రెండో కాన్పు కోసం వద్దిపేట అటవీ ప్రాంతం నుంచి అతి కష్టం మీద చర్ల ప్రభుత్వ వైద్యశాలకు ఆదివారం తెల్లవారుజామున వచ్చారు. అనంతరం వీరిని విధుల్లో ఉన్న స్ట్ఫానర్స్ వైద్య పరీక్షలు చేసి వైద్యుడికి సమాచారం అందించారు. నొప్పులు వచ్చిపోతుండటంతో స్ట్ఫానర్స్ పరిస్థితిని వైద్యుడికి వివరించారు. ఉదయం వరకు కూడా వైద్యులు ఆమె నాడి కూడా పట్టలేదు. చివరికి సాయంత్రం కాన్పు జరిగింది. అప్పటికే శిశువు పేగు మెడలో వేసుకొని చనిపోయి జన్మించాడు. రాత్రి నుంచి నొప్పులు వస్తున్నా వైద్యులు పట్టించుకోకపోవడం వల్లనే శిశువు మృతి చెందిందని బాధితురాలి భర్త రాంబాబు, ఉప్పరిగూడెం ఎంపీటీసీ తాటా ధర్మయ్య తెలిపారు.
మా నిర్లక్ష్యం లేదు: వైద్యుడు జానకీరామ్
ఇదే విషయమై వైద్యుడిని వివరణ కోరగా తమ నిర్లక్ష్యం లేదని తెలిపారు. సాధారణ కాన్పు అవుతుందని అనుకున్నామని పేగు మెడలో వేసుకొని జన్మించడం వల్లే శిశువు మృతి చెందిందన్నారు. ఎంపీపీ కోదండరామయ్య, జెడ్పీటీసీ తోటమల్ల హరిత, టీఆర్‌ఎస్ నాయకులు బండి వేణు వైద్యశాలకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

26, 27 తేదీల్లో ఐఎన్‌టియుసి రాష్ట్ర స్థాయ సమావేశం
ఖమ్మం(ఖిల్లా), అక్టోబర్ 16: నూతన జిల్లాలు ఏర్పాడిన సందర్భంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబందించి నూతన కమిటీలను ఎన్నుకోనున్నట్లు ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎ జలీల్ తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన జిల్లాలు ఏర్పాడిన నేపద్యంలో కొత్త కమిటీలను ఈ నెల 26,27 తేదిలలో జరగనున్న రాష్ట్ర ఐఎన్‌టియుసి కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరుగుతుందన్నారు. కార్మికుల సమస్యలపై తమ సంఘ ఆధ్వర్యంలో అనేక సమస్యలు పరిష్కరించటం జరిగిందన్నారు. రాష్ట్ర సమావేశాలలో భవిష్యత్తు కార్యచరణతో పాటు నూతన కమిటీల నియామకాలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో నాయకులు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సత్యం, జానయ్య, యుగేందర్, శివారెడ్డి, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.