ఖమ్మం

క్షణ క్షణం...్భయం భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం/ భద్రాచలం,నవంబర్ 2: పక్క తెలుగు రాష్ట్రంలో ఎఒబిలో జరిగిన జంత్రి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్రాతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్టల్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు అల్టిమేటం...ఇరువైపులా మాటల యుద్ధం...న్యాయపోరాటాలకు గురువారం జరిగే బంద్ తీవ్ర ఉత్కంఠకు పరాకాష్టగా నిలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లోని గిరిజన గ్రామాలు బిక్కుబిక్కు మంటున్నాయి. క్షణ క్షణం భయం భయంతో గిరిజన పల్లెలు బెంబేలెత్తిపోతున్నాయి. కొందరు ఇప్పటికే గ్రామాలు ఖాళీ చేసి వలస వెళ్లిపోయారు. గతంలో మావోయిస్టుల హెచ్చరికలు పొందిన వారు, హిట్‌లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు అంతా పట్టణాలకు వలస వెళ్లిపోగా భద్రతా బలగాల బూటు చప్పుళ్లతో, ఆకాశంలో హెలీకాప్టర్ల చక్కర్లతో భయానక యుద్ధవాతావరణం నెలకొంది. అరణ్యంలో అన్నల కోసం భద్రతా బలగాలు అనే్వషిస్తుంటే, ఒకవేళ యాక్షన్ బృందాలు మైదాన ప్రాంతంలో దాడులు చేసే అవకాశం ఉండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో రెడ్ అలర్ట్‌ప్రకటించి ఆకస్మిక, మెరుపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దుతో పాటుగా, జిల్లాలోని అన్ని ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీస్ స్టేషన్ల అదనపుబలగాలు పహారా కాస్తున్నాయి. సరిహద్దుల్లో నిర్వహించే వారపు సంతలకు వ్యాపారులు, గిరిజనులు వెళ్లడం లేదు. దీంతో అక్కడ సంతలన్నీ వెలవెలబోతున్నాయి.
వెంటాడుతున్న నిఘా నేత్రాలు
చిన్న నుంచి ఓ మోస్తారు పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ పోలీసులు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, లాడ్జీలు, ఇతర కార్యాలయాల్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజీల ద్వారా గత రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లో సంచరించిన, అనుమానిత, కొత్త వ్యక్తుల సమాచారాలను పోలీసులు సేకరిస్తున్నారు. లొంగిన నక్సల్స్, ఇన్‌ఫార్మర్ల సాయంతో అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. హిట్‌లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇతరులను పోలీసు నిఘా బృందాలు వెంబడిస్తున్నాయి. పట్టణాలు వదిలి 24 గంటల పాటు రావొద్దని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు చేశారు. ఉన్నతాధికారుల పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు ఎంతకైనా తెగిస్తారని విశే్లషించుకుంటున్న భద్రతా బలగాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా అన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది సెలవులు రద్దు చేసి, ఆయా స్టేషన్ల వారీగా సెట్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా దండకారణ్యం సరిహద్దున ఉన్న చర్ల, దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్లపైనే ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఇటీవల భూపాల్‌పల్లి జిల్లాలో విలీనమైన వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలపై నిఘాను పెంచారు. దళాలు, మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది.

విషజ్వరాలపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం
* సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం విమర్శ
బోనకల్లు, నవంబర్ 2: విషజ్వరాలపై అవగాహన కల్పించడంలోప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని గోవిందాపురం, రావినూతల, బోనకల్లు పిహెచ్ కేంద్రాలలో జ్వర బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విషజ్వరాలపై ముందస్తు అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందిందన్నారు. మండలంలో డెంగ్యూతో 23మంది మృతి చెందగా ఓ వైద్యాధికారి 9మందని, మంత్రి ఇద్దరేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. తూతూ మంత్రంగా నాలుగు గ్రామ పంచాయితీలకు నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకోవడం సరైందికాదన్నారు. డెంగ్యూ జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మధిర డివిజన్ కార్యదర్శి మందడపు నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, ఏనుగు గాంధీ, ఆనందరావు, రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలే అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్
బోనకల్లు, నవంబర్ 2: డెంగ్యూకు మందులేదని ప్రజలే అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం విషజ్వరాలపై అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. అనంతరం విషజ్వరాలతో ప్రబలుతున్న రావినూతలకురూ.లక్ష, బోనకల్లుకు లక్ష, గోవిందపురం(ఎల్)కు లక్ష, గత మూడు నెలలుగా జ్వరాలతో బాధపడుతున్న ఆళ్ళపాడుకు ఐదు లక్షలు చొప్పున పారిశుద్ధ్య నిర్వహణకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతు డెంగ్యూ జ్వరాలకు మందులేదని డబ్ల్యు హెచ్‌ఒ నిబంధనల ప్రకారం పెరాసెటిమాల్‌తో పాటు గ్లుకోజ్‌లు అందించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు వైద్యులు జ్వర బాధితులకు స్టెరాయిడ్‌లు, యాంటిబయెటిక్స్ వాడవద్దని సూచించారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు బోనకల్లు పిహెచ్‌సిలో 18వేల మంది ఒపి నమోదు చేయించుకోగా 4, 300మందికి వైరల్ ఫివర్ గుర్తించగా, 380 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా గుర్తించడం జరగిందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పూర్తి వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జడ్పిటిసి బాణోత్ కొండ, ఎంపిటిసి చిటిమోదు నాగేశ్వరరావులు మండలంలో మిగతా గ్రామాల్లో కూడా జ్వరాలతో బాధపడుతున్నారని ఆయా గ్రామ పంచాయితీలకు కూడా నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. మండల వ్యాప్తంగా వైరల్ ఫివర్ విస్తృతంగా ఉందని, రానున్న రోజుల్లో లార్వాలు మరింత వృద్ధిచెంది జ్వరాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జ్వరపీడితులను పరామర్శించి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యాధికారి బృంద సభ్యులు ప్రభావతి, సంజీవరెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు, తహశీల్దార్ సుదర్శన్‌రావు, ఎంపిడిఓ విద్యుల్లత, మండల వైద్యాధికారి బాలాజి, ఎపిఎం పద్మలత, ఎంఇఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి కళ్ళు, చెవులు పనిచేయడం లేదు
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని విమర్శ
ఖమ్మం(కల్చరల్), నవంబర్ 2: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ మరణాలపై పెద్ద ఎత్తున పతాక శీర్షికన పత్రికలు,ప్రసార మాధ్యమాల్లో కథనాలు వెలువడుతుంటే ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక పోతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే మంత్రులు డెంగ్యూ మరణాలపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బుధవారం సుందరయ్యభవన్‌లో భూక్యా వీరభద్రం ఆధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శులు, ఇన్‌చార్జుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోనకల్ మండలంలోనే 23 మంది డెంగ్యూతో చనిపోయారని, రావినూతల గ్రామంలో 9 మంది చనిపోగా ఆయా ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తుండగా కంకణాల రాములు అనే వ్యక్తి చనిపోయాడని గుర్తుచేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో అధికారికంగా గుర్తించిన డెంగ్యూ కేసులు 350 ఉన్నాయని, సుమారు 1200 మంది బోనకల్ మండలంలో ఉన్నారని తెలిపారు. కొణిజర్ల, చింతకాని, మధిర, బోనకల్ సహా జిల్లా వ్యాప్తంగా 50 మంది వరకు చనిపోయారన్నారు. 23 మంది చనిపోయిన విషయాన్ని పత్రికా విలేకర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు స్వయాన తెలుసుకొని, వైద్య అధికారులను నిర్ధారించుకొని వార్తలు ప్రచురిస్తే మంత్రులు కళ్ళు మూసుకొని ఇద్దరే చనిపోయారని చెప్పడం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల మంది డెంగ్యూ పీడితులున్నారని, ఏ ఆసుపత్రికి వెళ్ళినా విషయం అర్ధవౌతుందన్నారు. డెంగ్యూతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు, డెంగ్యూ పీడితులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫాగింగ్, పారిశుద్ధ్య పనుల నిమిత్తం గ్రామపంచాయితీలకు 5 లక్షల గ్రాంటును వెంటనే విడుదల చేయాలన్నారు. కొణిజర్ల, బోనకల్ మండలాల్లో డెంగ్యూ బాధితులకు అండగా నిలిచి పోరాడిన కార్యకర్తలను సమావేశం అభినందించిదన్నారు. జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పత్తి క్వింటాల్ ధర 6వేల నుండి 4 వేలకు పడిపోయిందని వెంటనే సిసిఐ కేంద్రాలను రంగంలోకి దించి పత్తి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని అన్ని మేజర్లకు నీళ్ళు విడుదల చేయాలని ఫ్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటి సభ్యులు దనుదన్నా నాగేవ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, మరుగై సత్యనారాయణ, వేదగిరి శ్రీనివాసరావు, బారి మల్సూర్, కె నర్సయ్య, కె నరసింహారావు, రామారావు, ఉపేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రసవాలలో ప్రభుత్వాసుపత్రి రికార్డు
భద్రాచలం, నవంబర్ 2: ప్రసవాల నిర్వహణలో భద్రాచలం ఏరియా ఆసుపత్రి రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క అక్టోబర్ నెలలోనే 439 ప్రసవాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సాధించని రికార్డును సాధించింది. ఇదే ఆసుపత్రిలో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో 431 ప్రసవాలు చేశారు. ఆ రికార్డును ఈ ఏడాది ఆక్టోబర్ నెలలో బ్రేక్ చేసినట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి బుధవారం తన చాంబర్‌లో విలేఖర్లకు వివరించారు. సాధారణ కాన్పులు 229, సిజేరియన్ కాన్పులు 210 నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ మాసాంతం వరకు 1433 సాధారణ, 1, 193 సిజేరియన్ కాన్పులతో కలిపి మొత్తం 2, 626 కాన్పులు ఏరియా ఆసుపత్రిలో కార్పోరేషన్ ఆసుపత్రిని తలదనే్నలా నిర్వహించడం విశేషం. ఏప్రిల్‌లో 320, మేలో 359, జూన్‌లో 347, జూలైలో 310, ఆగస్టులో 430, సెప్టెంబర్‌లో 421, అక్టోబర్‌లో 439 కాన్పులు చేశారు. సరైన సిబ్బంది లేకున్నా ఉన్న వైద్యులతోనే వారి సహకారంతో ఈ రికార్డు సాధించడం సాధ్యమైందని సూపరింటెండెంట్ డా.కోటిరెడ్డి తెలిపారు. ప్రసవాల విషయంలో 2013-14లో బెస్ట్ సూపరింటెండెంట్ అవార్డు, 2015,16 సంవత్సరాలకు గాను తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ ఏరియా ఆసుపత్రిగా భద్రాచలం ఏరియా ఆసుపత్రి గుర్తింపు, అవార్డులను పొందడం గమనార్హం.
సరికొత్త మార్పులు
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మార్పులకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన సేవలు అందిసున్న ఈ సర్కారు దవాఖానాకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఆసుపత్రిలో సిసి కెమెరాలను 14 చోట్ల ఏర్పాటు చేయనున్నారు. సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరో నెల రోజుల్లోనే ఇది అమలుకు నోచుకోనుంది. ఇటీవల శిశువులు మాయం అవుతున్నందున నిఘాను పెంచేందుకు వీలుగా సిసి కెమెరాలను అత్యవసర ప్రదేశాల్లో 14 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు.

మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలి
* సిపిఐ(ఎంఎల్)న్యూడెమొక్రిసీ డిమాండ్
ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 2: ఖమ్మం జిల్లాలో గడిచిన మూడు నెలలుగా డెంగ్యూ, మలేరియా విష జ్వరాలతో చనిపోయిన వారి సంఖ్య 30వరకు చేరుకుంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు మాత్రమే మృతిచెందారని ప్రకటించడం ఘోరమని సిపిఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బుధవారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు 316మంది డెంగ్యూ జ్వరాలుగా గుర్తించామని, మరో 350మంది వరకు డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించిందన్నారు. డెంగ్యూతో ఒక్క బోనకల్ మండలంలోనే 22మంది మృతిచెందగా కొణిజర్ల, రఘునాధపాలెం, తల్లాడ తదితర మండలాల్లో డెంగ్యూ జ్వరాలతో మొత్తం 30మంది వరకు చనిపోతే మంత్రులు ఇద్దరని ప్రకటించడం ఆందోళనను కలిగిస్తుందన్నారు. వాస్తవాలను మరుగుపరచి అవాస్తవాలను చెబుతున్న మంత్రి లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కలుగజేసుకొని ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలన్నారు. డెంగ్యూ మృతుల కుటుంబాలకి పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు డెంగ్యూ, మలేరియా వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిచ్చెల రంగయ్య, జిల్లా నాయకులు గోకినపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

నర్సరీలలో 42లక్షల మొక్కలు పెంచాలి
కొత్తగూడెం, నవంబర్ 2: హరితహారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉద్యానవన నర్సరీలలో 42లక్షల వివిధ రకాల పండ్లమొక్కలను పెంచి పంపిణీకి సిద్ధంగా ఉంచాలని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమలశాఖాధికారి జినుగు మరియన్న సూచించారు. బుధవారం జిల్లా ఉద్యానవన పట్టుపరిశ్రమశాఖాకార్యాలయంలో క్లస్టర్‌స్థాయి ఉద్యానవన, పట్టుపరిశ్రమశాఖాధికారులు, బిందుసేద్య కంపెనీ జిల్లా ప్రతినిధులతో సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. సమగ్ర ఉద్యానవన మిషన్ పథకంలో అమలులో ఉన్న నిమ్మ, జామ, తెలంగాణ యాపిల్, కోకోపంటల విస్తరణ, యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం తదితర పథకాల అమలుతీరును సమీక్షించారు. బిందుసేద్య పరికరాల సరఫరాను 676హెక్టార్లలో ఆయిల్‌పామ్, పండ్లతోటలకు మంజూరు అనుకూలంగా చేయాలని సూచించారు. మామిడి, నిమ్మ, జామ, పనస, ఉసిరి, జీడిమామిడి, టేకు, కరివేపాకు, సీతాఫలం తదితర వాటిని ఉత్పత్తిచేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కామధేనువులాంటి ఆయిల్‌పామ్ తోటలపెంపకానికి అందరిని భాగస్వాములుచేసి ఆయిల్‌పామ్ విస్తరణకు పాటుపడాలని అన్నారు. ఎకరానికి సుమారుగా 50వేలకు పైగా ఆదాయాన్ని నాలుగవ సంవత్సరంనుండి పొందే అవకాశముంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. ఈపంటకు ప్రభుత్వం నుండి గిట్టుబాటుధర, మార్కెట్‌సౌకర్యం, రవాణాసౌకర్యం ఉన్నదని, అదేవిధంగా చీడపీడలబెడద తక్కువగా ఉండడంతోపాటు కుక్కల, దొంగలబెడద ఉండదన్నారు. గ్రామీణ ఉపాధిహామీపథకం ద్వారా కూడా ఆయిల్‌పామ్‌తోటలకు రాయితీ వచ్చేవిధంగా పనిచేయాలన్నారు. జిల్లాలో వంద ఎకరాలకుపైగా మల్బరీ తోటలు సాగులో ఉన్నాయని తెలిపారు. ఈతోటలకు భద్రాచలం, కొత్తగూడెం డివిజన్లు అనుకూలంగా ఉంటాయని వివరించారు. అదేవిధంగా రైతులకు కూరగాయాల పంటలను మేలైన యాజమాన్య పద్ధతులలో చేపట్టేవిధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లాలోని ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి మహిళా కళాశాల
రేంజర్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేత
కొత్తగూడెం, నవంబర్ 2: సింగరేణి మహిళా కళాశాల రేంజర్స్‌కు సంస్థ జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి మురళీసాగర్‌కుమార్ బుధవారం ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. సింగరేణీయుల ఆరోగ్యసంక్షేమం కోసం సెప్టెంబర్ 12నుండి 16వరకు వారంరోజులపాటు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సూపర్‌స్పెషాలిటీ వైద్యశిబిరంలో రోగులకు సహాయకులుగా సేవలందించినందుకు రేంజర్స్‌కు ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో డిజిఎం (పర్సనల్) దీక్షితులు పర్సనల్‌మేనేజర్ ఎస్ రమేష్, ఓఎస్‌హెచ్ లక్ష్మీనారాయణ, రేంజర్ లీడర్ పావని, స్కౌట్ మాస్టర్లు ఎం కొమరయ్య, సాయి నిరంజన్ పాల్గొన్నారు.
డిఎన్‌ఏ పరీక్షల కోసం
ఢిల్లీ వెళ్లిన దంపతులు
జూలూరుపాడు, నవంబర్ 2: మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామానికి చెందిన దంపతులు జజ్జర కృష్ణయ్య, గోపమ్మలు డిఎన్‌ఏ పరీక్షల కోసం మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పాకిస్తాన్‌లోని ఈది స్వచ్ఛంద సంస్థలో భారత సంతతికి చెందిన గీత అనే మూగ, చెవిటి యువతి ఉన్నట్లు పత్రికల్లో వెలుగు చూడటంతో పడమట నర్సాపురం దంపతులు బాల్యంలో తప్పి పోయిన తమ కూతురు రాణినే గీత అని చెప్పడంతో చర్చనీయాంశమైంది. అంతటితో గీత వ్యవహారం సద్దుమణగగా వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు జ్ఞానేంద్ర పురోహిత్ దంపతులు కృష్ణయ్య, గోపమ్మలతో సంప్రదింపులు జరిపి ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేయటంతో దంపతులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

ఘనంగా ఏకవీరన్న స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ
నేలకొండపల్లి నవంబర్ 2 : నేలకొండపల్లి గ్రామంలోని సింగారెడ్డిపాలెం స్కూల్ నందు గల అతి పురాతనమైన ఏకవీరన్న స్వామి విగ్రహం పునః ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అతి పురాతనమైన ఏకవీరన్న స్వామి విగ్రహం రోడ్డు ప్రక్కన పడివుండడంతోగ్రామంలోని కొంతమంది భక్తులు గుడి కట్టి పునఃప్రతిష్ఠ చేయాలని పూనుకున్నారు. దీంతో బుధవారం మండల కేంద్రంలో అత్యంత ఘనంగా వేద మంత్రాలతో ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. నేలకొండపల్లి ఎస్‌ఐ సుమన్, గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావుప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలని ఎస్‌ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగ అన్నదానం కార్యక్రమంలో దాదాపు రెండు వేల మంది పాల్గొన్నారు.అర్చకులు తాటిపాముల లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో వేదపండితులు ఈ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, గోగినేని వెంకట సీతారాంబాబు, ఎంపిటిసిలు చిలకల సీతారావమ్మ, శీలం వెంకటలక్ష్మి, గ్రామ పెద్దలు మామిడి వెంకన్న, చవళం వెంకటేశ్వర్లు, కూచిపూడి నాగేశ్వరావు, కమిటి సభ్యులు విజయ్‌కుమార్, సురేష్ కుమార్, శ్రీను, దేశబోయిన వెంకటేశ్వర్లు, సైదులు, చెరుకు శ్రీను తదితరులు పాల్గొన్నారు.