ఖమ్మం

మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), నవంబర్ 4: ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఐ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ప్రదర్శన వైరారోడ్డు, జడ్పీ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. కలెక్టరేట్‌లోని చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అదుపులోకి తీసుకొని స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ డెంగ్యూ, విషజ్వరాల బారిన పడి 52మంది మృత్యువాత పడ్డప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. డెంగ్యూ దోమలు కుట్టి ప్రజలు చనిపోతుంటే బంగారు రాష్ట్రాన్ని తెస్తాననడం కెసిఆర్‌కే చెల్లిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్యసదుపాయాలు, సరైన సిబ్బంది లేక ప్రాథమిక వైద్యం కూడా అందడం లేదన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ నూతన సచివాలయ భవనాలు నిర్మించుకుంటూ ఏసి గదుల కోసం ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. డెంగ్యూతో మృత్యువాతపడి మరణించిన కుటుంబాలకు ఐదులక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రకటించి మండలానికి 30పడకల ఆసుపత్రి, నియోజకవర్గానికి 100పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని కెసిఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అదే విధంగా వైద్యవిభాగంలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీచేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మారపాక రమేష్, ఎండి గౌస్‌పాషా, రామకృష్ణ, రాము, మహేష్, సతీష్‌రెడ్డి, నాగరాజు, తేజావత్‌కృష్ణ, రామారావు, బండి అమర్, పాషా, సతీష్ తదితరులు పాల్గొన్నారు.