ఖమ్మం

అధ్యయనోత్సవాలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 30: శ్రీరామ దివ్యక్షేత్రం జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది. అధ్యయనోత్సవాలకు శ్రీకారం జరగ్గా శ్రీ సీతారామచంద్రస్వామి మత్స్యావతారంలో సాక్షాత్కరించి భక్తులను మురిపించారు. ఉత్సవాల సందర్భంగా వైకుంఠ రాముని సన్నిధి శ్రీరామ దివ్యక్షేత్రంలోని ప్రధాన ఆలయం పూలాలంకృతమై, శోభాయమానంగా భక్తులకు స్వాగతం పలికింది. దిక్కులు పిక్కటిల్లేలా రామనామ స్మరణ చేస్తూ భక్తకోటి కోలాటాలు, రామ భజనలతో ఆ మత్స్యావతారునికి జేజేలు పలికారు.
ఉత్సవాలకు అనుజ్ఞ: అంతకు ముందు ఉదయం గోదావరి నుంచి మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ బిందె తెచ్చారు. సుప్రభాత సేవ చేశారు. ఆరాధన, బాలభోగం సమర్పించాక ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. శ్రీ సీతారామచంద్రస్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, తిరువారాధన చేశాక గర్భగుడికి వెళ్లి మూలవరుల వద్ద అధ్యయనోత్సవాల నిర్వహణకు ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాకార మండపంలో వేంచేసిన రామయ్యను మత్స్యావతారంలో అలంకరించి వేద విన్నపాలు చేశారు. ఆళ్వార్లకు ప్రత్యేక మర్యాదలు చేశారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, దివ్య ప్రబంధం, శ్రీ్భష్యం, శ్రీమద్రామాయణం, క్షేత్ర మహత్యం వైభవంగా పారాయణం చేశారు. అధ్యయనోత్సవాలు ప్రారంభ సూచికగా ఉత్సవాలు నిర్వహించే రుత్విక్కులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యావతార రామయ్యను భక్తులు తిలకించారు.
మిథిలా స్టేడియానికి ఊరేగింపుగా: అనంతరం సాయంత్రం భక్తుల ఆనందోత్సవాల మధ్య, కోలాటాలు, రామ భజనలు నడుమ స్వామి మిథిలా స్టేడియంలోని ప్రత్యేక వేదికకు పయనమయ్యారు. మత్స్యావతారానికి ప్రత్యేక ఆరాధనలు చేశాక భక్తులు వరుస క్రమంలో వచ్చి స్వామిని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదిక వద్ద శ్రీకృష్ణ ప్రేమ కోలాట భజన మండలి రామనామ భజన నిర్వహించింది. శ్రీ రామభట్టార్ భక్త కుచేల హరికథా కాలక్షేపంతో భక్తులకు ఆధ్యాత్మికత పంచారు. అల్లం రమాదేవి తన శ్రావ్యమైన గాత్రంతో భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. వైజాగ్‌కు చెందిన చిన్నారులు కూచిపూడి శాస్ర్తియ నృత్యంతో కనులవిందు చేశారు. సురభి వారి మాయాబజార్ నాటకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
తిరువీధి సేవ:అనంతరం స్వామిని ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా తిరువీధి సేవగా రాజవీధి గుండా తాత గుడి సెంటర్‌కు తీసుకెళ్లారు. మార్గ మధ్యలో భక్తులు, మహిళలు మంగళనీరాజనాలు పలికారు. గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకుని తిరిగి ప్రధానాలయానికి వచ్చారు.
అభివృద్ధి, సంక్షేమం కెసిఆర్ లక్ష్యం
* ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జూలూరుపాడు, డిసెంబర్ 30: బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్నారని పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన భారీ బహింరగసభలో ఎంపి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిందే మొదలు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిఎం కెసిఆర్ పకడ్బంధీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణాగా రాష్ట్రాన్ని తిర్చిదిద్దేందుకు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి ఆహ్వానించటంతో, ఇందుకు సిద్ధమైన ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు సాగారన్నారు. కులామతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. పెంచిన పింఛన్లను అందించటంతోపాటు, మహిళా సాధికారికతకు టిఆర్‌ఎస్ పెద్దపీట వేస్తుందని తెలిపారు. గడచిన రెండున్నరేళ్లలో తెలంగాణలోప్రభుత్వ పరిపాలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేవిధంగా మారిందని అన్నారు. మిషన్ కాకతీయ పథకంతో తరాలనాటి చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టడంతో నీళ్లతో కళకళలాడుతున్నాయన్నారు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో మత్స్య సంపదను అభివృద్ధి చేస్తూ పేదలకు జీవనాధారం కల్పిస్తున్నారని ఎంపి అన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రు.40వేల కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరధ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇంతే కాకుండా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. గత పాలకులు అర్థాంతరంగా వదిలేసిన ప్రాజెక్టుల నిర్మాణాలను సైతం రీడిజైన్ చేయించి, ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికలనాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి ఈప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతాంగానికి రు.25వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇంతే కాకుండా అన్ని వర్గాల పిల్లల కోసం గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యారంగంలోనే పెనుమార్పులు తీసుకురావటం జరుతుందన్నారు.
ఎంపి శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం...
అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లేళ్ల వెంకటరెడ్డి, చండ్ర నరేంద్ర కుమార్‌ల ఆధ్వర్యంలో ఎవరికివారే పోటాపోటీగా జన సమీకరణ చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఇరువైపులా కట్టిన బ్యానర్లు గులాబీ రంగుతో గుబాళించాయి. నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల్లో రు.18లక్షలతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎంపి శంకుస్థాపనలు చేశారు.

పాత నోట్లకు పాతరే

ఖమ్మం, డిసెంబర్ 30: కేంద్రం సరిగ్గా 50 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం నాటికి పాతనోట్లు పూర్తిగా రద్దయ్యాయి. గత అక్టోబర్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆతరువాత బ్యాంకుల నుంచి తమ నగదును తీసుకునేందుకు కఠినతరమైన నిబంధనలు విధించిన నేపధ్యంలో ప్రజలు నేటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో నిత్యం జరిగే వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజలకు సరిగా అందడంలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 70వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగులు, ఐదు లక్షలకు పైగా కార్మికులతో పాటు తదితర ప్రజానీకం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పెన్షన్‌దారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఉదయం 7 గంటలకే బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒక్కొక్క బ్యాంకులో ఒక్కోవిధంగా డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా డ్రా చేసుకున్నవారి సంఖ్యను వేళ్ళపై లెక్కించవచ్చు. వివిధ మార్గాల ద్వారా వచ్చిన రూ.500, 1000 నోట్లను మార్చుకునే గడువు 30వ తేదీతో ముగియడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఖమ్మం జిల్లాలో నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా అధికారులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో మొట్ట మొదటిగా ఖమ్మం కార్పోరేషన్‌ను నగదు రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం కూడా చుట్టారు. అయితే ఆదిశగా జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించే విషయంలో ప్రారంభదశలో చూపిన శ్రద్ధ ప్రస్తుతం కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో స్వైప్ మిషన్లు సౌకర్యం ఉన్న వ్యాపార సంస్థలు వాపార లావాదేవీల్లో దూసుకుపోతుంటే, ఆ సౌకర్యంలేని వ్యాపార సంస్థలకు మాత్రం వ్యాపారంలో నిలదొక్కుకునే పరిస్థితి కరవైంది. ప్రతి ఏడాది నూతన సంవత్సరాన్ని అత్యంత వేడుకగా జరుపుకునే అన్నివర్గాల ప్రజల్లో నగదులేని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఇప్పుడిప్పుడే నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారిస్తున్నప్పటికీ, నిబంధనలు సడలించి బ్యాంకుల ద్వారా ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తేనే పరిస్థితి చక్కబడుతుందని పలువురు భావిస్తున్నారు.
నేడు కూర్మావతారం
భద్రాచలం, డిసెంబర్ 30: శ్రీ సీతారామచంద్రస్వామి అధ్యయనోత్సవాల్లోని పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శనివారం భక్తులకు కూర్మావతారంలో దర్శనం ఇవ్వనున్నారు. దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై నిలిపి పైకెత్తారు. ఈ అవతారాన్ని దర్శించడం ద్వారా శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలుగుతాయి.
కెసిఆర్ పాలనలో అభివృద్ధి వేగవంతం
* తెలంగాణాతల్లి విగ్రహావిష్కరణలో ఎంపి
బోనకల్లు, డిసెంబర్ 30: తెలంగాణా రాష్ట్రం సిఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తుందని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణాతల్లి విగ్రహాన్ని జిల్లా అధ్యక్షుడు ఎస్‌బి బేగ్‌తో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన టిడిపి, సిపిఎం పార్టీల నుండి 30 కుటుంబాలు టిఆర్‌ఎస్ పార్టీలో ఎంపి పొంగులేటి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు. రైతులకు రుణమాఫి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరాఫించన్లు, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరద వంటి పధకాలు అమలు చేసిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్‌బి బేగ్, నల్లమల వెంకటేశ్వరరావు, లింగాల కమల్‌రాజు, బందం శ్రీనివాసరావు, కొయినేని ప్రదీప్, పారా ప్రసాద్, మోదుగుల నాగేశ్వరరావు, చావా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పిఆర్‌టియు క్యాలెండర్ ఆవిష్కరణ
పెనుబల్లి, డిసెంబర్ 30: పెనుబల్లి మండలం విఎం బంజర్‌లో పిఆర్‌టియు క్యాలెండర్, డైరీలను విఎం బంజర్ ఎస్‌ఐ నరేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షులు చలపతిరావు, కార్యదర్శి రంగారావు, పివి రామారావు, ప్రభుదాస్, వనమా నాగేశ్వరరావు, అబ్రహం, వెంకటేశ్వరరావు, రవి, నాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి
నిధులు కేటాయించాలి
గార్ల, డిసెంబర్ 30: క్రీడాభివృద్ధికి ప్రభుత్వం నిధుల కేటాయింపు చెయ్యటంతో పాటు గ్రామీణ క్రీడాకారులకు సహకారం అందించాలని పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి సివై. పుల్లయ్య కోరారు. మండలం పరిధిలోని చిన్నకిష్టాపురంలో పివైఎల్ అధ్యర్యంలో నిర్వహించనున్న మండల స్థాయి కబడ్డీ క్రీడా పోటీలను శుక్రవారం అయన ప్రారంభించి ప్రసంగిస్తూ ప్రభుత్వ అదరణ కరువైందని, దీంతో గ్రామీణ క్రీడలు అంతరించి పోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జడసత్యనారాయణ, పివైఎల్ రాష్ట్ర సహయ కార్యదర్శి జి.సక్రు, నాయకులు సురేష్, ముల్కనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యధికారి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

9 గంటలకు పరిచయం...12 గంటలకు హత్య
ఖమ్మం రూరల్, డిసెంబర్ 30: పరిచయమైన మూడు గంటల్లోనే ఓ వ్యక్తిని కత్తితో హత్య చేసి మృతదేహాన్ని చెట్లపొదల్లో పడవేసిన కేసును రూరల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఖమ్మం డిఎస్‌పి సురేష్‌కుమార్ నిందితులను చూపి హత్యా సంఘటన పూర్వాపరాలను వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనోజ్(22) అనే యువకుడు ముదిగొండలోని ఉజ్వల గ్రానైట్ ఫ్యాక్టరీలో కట్టర్‌గా పనిచేస్తున్నాడు. తాగుడు, చెడుతిరుగుళ్లకు అలవాటుపడ్డ మనోజ్ ఈనెల 24వ తేదీ రాత్రి మయూరి సెంటర్‌లో ఓ బార్‌షాపు వద్ద ఓ మహిళను పరిచయం చేసుకొని సమీపంలోని లాడ్జీకి వెళ్లాడు. ఆ తరువాత బార్‌షాపులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌కంకన్ అలియాస్ చోటు పైల్‌వాన్, గ్యాన్‌సింగ్‌లు పరిచయమయ్యారు. వీరు ప్రస్తుతం రూరల్ మండలంలోని చిన్నతండాలో నివాసం ఉంటూ గప్‌చుప్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యం మత్తులో మనోజ్ ఆ ఇరువురితో గొడవపడి దుర్భాషలాడాడు. ఆ అవమానాన్ని జీర్ణించుకోలేని ఆ ఇరువురు వ్యక్తులు మనోజ్‌ను హతమార్చాలని పథకం పన్ని మనోజ్‌ను మయూరి సెంటర్‌లో రాత్రి 11:30 గంటల సమయంలో ఆటో ఎక్కించుకొని తాళ్లేసేతండా సమీపంలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల వద్ద మహబూబాబాద్ ప్రధాన రహదారి వెంబడి చెత్తకుప్పల్లోకి బలవంతంగా తీసుకెళ్ళి కత్తితో గొంతుకోసి పొట్టలో పొడిచి చంపేశారు. ఈ సంఘటన డిసెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం వెలుగులోకి రావడంతో రూరల్ సిఐ తిరుపతిరెడ్డి, సిసిఎస్ ఎస్‌ఐ ఇబ్రహీం, రూరల్ ఎస్‌ఐలు చిరంజీవి, వెంకటేశ్వర్లు, రఘునాధపాలెం ఎస్‌ఐ గోపి, హెడ్‌కానిస్టేబుల్స్ నాగేందర్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ వాల్యాలు విచారణ జరిపి హత్య కేసు పూర్వాపరాలను తెలుసుకోవడంలో ఎంతో కృషి చేశారన్నారు. అతికొద్ది రోజుల్లోనే హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసులను డిఎస్‌పి ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో సిఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐలు చిరంజీవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యమా

మధిర, డిసెంబర్ 30: అంగన్‌హడీ కేంద్రానికి వచ్చే చిన్న పిల్లల సంరక్షణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం స్థానిక సిపిఎస్ ప్రాధమిక పాఠశాలలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంగన్‌వాడీ కేంద్రంలో ఉండాల్సిన నిత్యావసర సరుకుల స్టాక్ లేకపోవడంతో పాటు పిల్లల ఆట వస్తువులు కూడా వారికి ఆడుకునేందుకు ఇవ్వకుండా మూలన దాచి ఉంచడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం తల్లీ పిల్లల సంరక్షణ కోసం,పౌష్టికాహరం అందించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నప్పడికీ అంగన్‌వాడీ కేంద్రంలో కనీసం నిత్యావసరాలకు కూడా స్టాకు లేకపోవడం ఏమిటిని ప్రశ్నించారు.100 గ్రాముల బరువు గల కారంపొడి ప్యాకెట్లను చూసి ఇవి మంచివేనా,నకిలీ కారానివా అని ప్రశ్నించారు.తాను రోజు పదహరు గంటలు పనిచేస్తున్నానని మీరు కూడా ఎదో వచ్చాము,పోయాము అనేలా కాకుండా తల్లీ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.పదిహేనుమంది పిల్లలకు గాను కేవలం ఏడు, ఎనిమిది మందే వచ్చారని మిగిలిన వారు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.తొలుత సిపిఎస్ ఉన్నత పాఠశాల నందు మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు.సాంబరు రుచి చూసి మంచిగా ఉందని రోజు ఇదే విధంగా భోజనం పెడుతున్నారా,ఈరోజు తాను వస్తున్నానని మంచి భోజనం తయారు చేశారా అని పిల్లలను అడిగి తెలుసుకసన్నారు.అదే విధంగా గత సంవత్సరం పాఠశాలల్లో పదవ తరగతిలో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారని,ఎన్ని జిపిఎ గ్రేడ్లు వచ్చాయని ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు మంచిగా చదువుకొని అత్యుత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.ఆమె వెంట ఎంపిడివో పి.ఆల్బర్ట్,ఎంఇవో వై.ప్రభాకర్‌రావు,సిడిపివో అషఫ్ మున్నీనాభేగం, టిఆర్‌ఎస్ నాయకులు తేళ్ళ వాసు,ఈదర సుబ్బారావు తదితరులు ఉన్నారు.
ఆపరేషన్ స్మైల్-3ను నిర్వహించాలి
* కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆపరేషన్ స్మైల్-3 స్పెషల్‌డ్రైవ్‌ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధితశాఖాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబం నుండి తప్పిపోయిన పిల్లలను గుర్తించటం, ఆ పిల్లలను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. తప్పిపోయిన పిల్లలే కాకుండా భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాలకార్మికులు, బడిబయట పిల్లలను గుర్తించి బాలల సంక్షేమ కమిటీ ద్వారా పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. జనవరి 1నుండి చివరి వరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీస్, కార్మికశాఖ, జాతీయ బాల కార్మిక సంస్థ, విద్యాశాఖ సమన్వయంతో టీంలను ఏర్పాటు చేసి రెస్క్యూ నిర్వహించటం జరుగుతుందన్నారు. సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, డిసిపివో విద్యావందన, సిఐడి అధికారి సధానిరంజన్, బిసి సంక్షేమశాఖ అధికారి ముఖేష్‌రెడ్డి, లేబర్ అఫీసర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

తానా బాలల కవితల పోటీల్లో ముదిగొండ
విద్యార్థినికి ప్రథమ బహుమతి
ముదిగొండ, డిసెంబర్ 30: తానా సాహిత్య, సాంస్కృతిక సంబరాలలో భాగంగా ఖమ్మంలో జరిగిన హైస్కూల్ స్థాయి బాల బాలికలకు నిర్వహించిన కవితా పోటిల్లో ముదిగొండ హైస్కూల్‌లో పదవతరగతి చదువుతున్న ఎ. ఉషశ్రీ ప్రథమ బహుమతి గెలుచుకుంది.మొత్తం 1250 మంది పాల్గొన్న ఈ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్న ఉషశ్రీని శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, ఉషశ్రీని కవితలు రాయడానికి ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయుడు కనె్నగంటి వెంకటయ్యలు అభినందించారు.
నూరుశాతం పన్నుల వసూలు లక్ష్యం
* డిపిఓ శ్రీనివాసరెడ్డి
కామేపల్లి, డిసెంబర్ 30: మార్చి 30తేదిలోగా నూరుశాతం ఇంటి పన్నుల వసూలు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా పంచాయితీ అధికారి జె శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కామేపల్లి గ్రామపంచాయితీ కార్యాలయాన్ని ఆయన అకస్మికంగా సందర్శించారు. పంచాయితీ రికార్డులు, చేపట్టిన పనులు, పన్నుల వసూలు తదితర అంశాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22కోట్ల 85లక్షల ఇంటి పన్నులు వసూలు కావల్సి ఉందని, వీటిలో నవంబర్ 10కి పూర్యం 3లక్షల డెబ్బైయిదు వేలు, పెద్దనోట్లు రద్దు అనంతరం స్పేషల్ డ్రైవ్ చేపట్టి నాలుగు కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసినట్లు వెల్లడించారు. అదే విదంగా గ్రామాలలో అభివృద్ది పనులు చేపట్టడంతో పాటు ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని ప్రతి గ్రామ పంచాయితీలో డంప్‌యార్డు, స్మశాన వాటిక తప్పకుండ ఉండేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారిచేసిందని, పంచాయితీలలో ఫ్లేక్సిల వాడకం, ప్లాస్టిక్ నిషేధించినట్లు తెలిపారు. భవనాలు లేని పంచాయితీలకు నిధులు కేటాయిస్తున్నట్లు అదే విధంగా కార్యదర్శులు నియమకాలను భర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇవోఆర్డి ఉమాకుమారి, సర్పంచ్ ఆజ్మీరహరి, కార్యదర్వి జోగారావు, తదితరులు పాల్గొన్నారు.