ఖమ్మం

ప్రజా ప్రయోజనాల కోసమే నోట్లరద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 19:ప్రజా ప్రయోజనాలకోసమే పెద్దనోట్ల రద్దని, దీనిద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కొత్తగూడెంలో కృషి విజ్ఞానకేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తూ గురువారం ఖమ్మంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్లరద్దును దేశ ప్రజలు స్వాగతిస్తుంటే దానిని ప్రతిపక్షాలు కావాలనే రద్ధాంతం చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో వెలుగులు నింపేందుకే నోట్లరద్దన్నారు. అభివృద్ధి ఎంతో ప్రధానమని మోడి పాలనలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి, తీవ్రవాదం, నక్సలిజంపై ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పు తెస్తుందన్నారు. అట్టడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలు, దేశహితం కోసమే ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సహాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి కృషి సంచాయోజన కింద 160కోట్లు రాష్ట్రానికి కేటాయించడం జరిగిందన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద 1560కోట్ల రూపాయలు, ఇరిగేషన్ ప్రాజెక్టుకు 300కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 902కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గ్రామీణ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు. కార్మిక శాఖామంత్రిగా తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. స్కిల్, అన్‌స్కిల్ కార్మికులకు అందిస్తున్న వేతనం 216రూపాయల నుండి 300కు పెంచినట్లు, కార్మికులకు బోనస్ 3,500నుండి ఏడువేలకు పెంచడంతో పాటు మహిళా కార్మికులకు ప్రసుతి బెనిఫిట్ 26వారాలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల అభివృద్ధ్యే లక్ష్యంగా 40కోట్లమంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కార్డులను అందిస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రమాద, ఆరోగ్య తదితర బీమాలను పొందవచ్చన్నారు. విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్, నాయకులు రుద్రప్రదీప్, డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, గెంటాల విద్యాసాగర్, వెంకటేశ్వరరావు, కొండి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

నోట్లరద్దుపై కదంతొక్కిన కాంగ్రెస్ మహిళలు
* కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఖమ్మం(ఖిల్లా), జనవరి 19: నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్ మహిళా కమిటీ కనె్నర్ర చేసింది. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సమయంలో పోలీసులకు, మహిళలకు వాగ్వివాదం చోటు చేసుకోవడం తోపులాటకు దారితీసింది. ఈ సమయంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కలుగజేసుకొని ప్రదర్శనను ధర్నాచౌక్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భట్టివిక్రమార్క, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు బండి మణి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏకపక్ష నిర్ణయంతో దేశం యావత్తు ఇబ్బందుల్లో పడిందన్నారు. దాచిపెట్టిన డబ్బును తీసుకునేందుకు సవాలక్ష ఆంక్షలు విధిస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. నల్లడబ్బును వెలికితీస్తానని చెప్పిన మోడీ అది చేతకకాకపోవడంతో పెద్దనోట్లను రద్దుచేస్తూ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. ప్రజలను బాగు చేస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన నకిలీల మయం అయిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మిస్తానని చెప్పిన కెసిఆర్ తెలంగాణలో భవష్యత్తు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, నాగమణి, ఝాన్సీ, తాజుద్దీన్, బాలాజీనాయక్, జావీద్, జహీర్, మహిళా సంఘ నాయకురాళ్ళు పాల్గొన్నారు.

మధిర పంచాయతీ ఆవరణలో ఘర్షణ
* రెండు వర్గాలుగా చీలిన అధికార పార్టీ కౌన్సిలర్లు
మధిర, జనవరి 19: మధిర నగర పంచాయతీ ఆవరణలో అధికార పార్టీలోని కౌన్సిలర్లు చైర్‌పర్సన్ అనుకూల,వ్యతిరేక వర్గాలుగా ఏర్పడి వారి అనుచరులు ఘర్షణకు దిగిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మధిర నగర పంచాయతీలో గురువారం కౌన్సిల్ సర్వసభ్యుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు చైర్మన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోణలు చేసుకుంటూ పెద్దగా కేకలు వేయడంతో ఎవరు ఏమీ మాట్లాడుతున్నారో తెలియక రసాభాసగా మా రింది. ఇటీవల నగర పంచాయతీలో జరిగిన పైపుల చోరీ సంఘటనపై ఇరు వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌన్సిల్ సమావేశానికి ముందే వారి అనుచరులతో పంచాయితీ ఆవరణలో మోహరించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టౌన్ ఎస్‌ఐ బి.తిరుపతిరెడ్డి అక్కడికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కొద్ది సేపటి తరువాత కౌన్సిల్ సమావేశం ముగించుకొని సభ్యులు కిందికి దిగివస్తున్న సమయంలో ఓ వార్డు సభ్యురాలి భర్త మల్లవరపు అప్పారావు పుల్లూరి బాబుపై దాడి చేశారు. దీంతో మధిర సిఐ శ్రీదర్‌గౌడ్, ఎస్‌ఐ తిరుపతిరెడ్డిలు అక్కడ ఉన్నవారి పై లాఠీచార్జీ జరిపి అక్కడి నుండి అందరినీ పంపించివేశారు. దీంతో గొడవ సద్దు మణిగింది. మధిర నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ సమావేశం సందర్భంలో అధికార పార్టీకి చెందిన వారు వర్గపోరుతో ఘర్షణలకు దిగడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. నగర పంచాయతీలో సుపరిపాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతుంటే ప్రజాస్వామ్యం అపహస్యం పాలౌతుందని, ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని
రైతులు వినియోగించుకోవాలి
* నిపుణులైన శాస్తవ్రేత్తల సూచనలు పాటించాలి
* కృషి విజ్ఞాన కేంద్రం శంకుస్థాపనలో మంత్రులు బండారు, తుమ్మల, పోచారం
కొత్తగూడెం, జనవరి 19: వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న కృషి విజ్ఞాన కేంద్రానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాల్లో నైపుణ్యం కల్గిన శాస్తవ్రేత్తల సేవలను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో మార్పులను రైతులు ఎప్పటికప్పుడు అధ్యాయనం చేసి సస్యరక్షణ పద్ధతులను అనుసరించాలన్నారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఆర్జించే మార్గాలను అనే్వషించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని, నగదు రహిత లావాదేవీలపై ప్రజలు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు అవసరం లేకుండా నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సమావేశానికి కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు అధ్యక్షత వహించగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాల వల్ల రైతులకు నూతన వ్యవసాయ విధానంపై అవగాహన పెరుగుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భూములకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ శాఖాలో ఖాళీగావున్న వ్యవసాయ శాఖా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ విప్లవ్‌రావు, ఖమ్మం జెడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అశ్వారావుపేట, పినపాక శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ పులిగీత, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గురకులంలో కొరవడిన సంక్షేమం
* అమలుకు నోచుకోని మెను
* గుడ్డు, పండు మాయం
* అందుబాటులో లేని పెరుగు, సాంబారు
కొణిజర్ల, జనవరి 19: మండల పరిధిలోని తనికెళ్ళ సమీపంలో ఓప్రైవేటు భవనంలోఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్ర గిరిజన గురుకుల సంక్షేమ ప్రతిభా పాఠశాల, కళాశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ 8వ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు నిర్వహణ కొనసాగుతుంది. ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు 230, ఇంటర్‌లో 190మంది కలిపి 420 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం సన్న బియ్యంతోపాటు పౌష్టిక ఆహారం అందచేస్తుంది. దీనికిగాను రోజు విద్యార్థులకు అందించేందుకుగాను ప్రభుత్వం మెను విడుదల చేసింది. మెను ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం ఆల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెట్టాలి. ఇక్కడ మాత్రం మెను అమలు కానేకాదు. మెను ప్రకారం గురువారం ఉదయం అల్పాహారం కింద పాలతో రాగి జావ, పొంగలితో చట్నీ, మధ్యాహ్నం భోజనంలో కూరగాయతో భోజనం, పప్పు, గుడ్డు, మజ్జిగ, సాంబారు, పండు ఇవ్వాల్సివుంది. వారానికి మూడు రోజులు గుడ్డు పెట్టాల్సి ఉండగా నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే గుడ్డు పెడుతున్నారని, పెట్టే గుడ్డు చిన్న సైజ్‌లో ఉండటం గమనార్హం. ఉదయం కేవలం పాలు లేకుండా రాగి జావ మాత్రం ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. మధ్యాహ్నం భోజనంలో నామ మాత్రపు పలచటి పప్పు, క్యాబెజి కూరతో పాటు టమాట చారుతో భోజనం పెట్టారు. మజ్జిగ, గుడ్డు, సాంబారు, పండు జాడ లేదు. ప్రతి రోజు 60 లీటర్ల పాలు కొనుగోలు చేయాల్సి ఉండగా గురువారం భోజనం కోసం సుమారు ఐదు లీటర్లు కాచి తోడుపెట్టడం గమనార్హం. దీంతో గురుకులంలో సంక్షేమం నీటిపై రాతలా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులను తయారు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం అధికారుల అక్రమాల కారణంగా నీరుకారిపోతుంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గిరిజన గురుకులంలో మెను అమలు జరిగేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గుడ్లు, పండ్లు కాంట్రాక్టర్ పంపలేదు
* వైస్ ప్రిన్సిపాల్ కుమార్
గిరిజన గురుకులంలో మెను అమలు కాకపోవడంపై పాఠశాల వైస్ ప్రిన్సిపల్ కుమార్‌ను వివరణ కోరగా గుడ్లు కాంట్రాక్టర్ సప్లయ్ చేయలేదన్నారు. సెలవుల తరువాత స్కూల్ పునఃప్రారంభం కావటం వలన ఇంకా పిల్లలు రాలేదని అందువల్ల కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేయలేదన్నారు. గుడ్డు సైజ్ చిన్నగా ఉండటంపై అడగటంతో పిఓ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉదయం పాలు ఆలస్యంగా రావటం వలన మజ్జిగ పోయలేదన్నారు. పండు ఇవ్వకపోవటంపై అడగటంతో రేపటి నుంచి ఇస్తామని పేర్కొన్నారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కిన బుడతడు
* పలు అంశాల్లో ప్రతిభ చాటిన మిలీనియం విద్యార్థి మోక్షిత్
మధిర, జనవరి 19: స్థానిక మిలీనియం పాఠశాలలో యుకెజి చదువుతున్న ఆరు సంవత్సరాల బుడతడైన జుజ్జూరు మోక్షిత్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించి అందరిచే ప్రశంసలు అందుకున్నాడు. గురువారం స్థానిక సాయిబాబా కళ్యాణ మండపంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సభ్యులు మోక్షిత్‌ను ఎనిమిది విభాగాలలో నైపుణ్యతను పరిశీలించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జడ్ నుండి ఎ వరకు ఒక్క నిమిషంలో20 సార్లు చెప్పడం, దేశాలు, వాటి రాజధానులు, రాష్ట్రాల వాటి రాజధానులు, రసాయన శాస్త్రంలో మూలకాలు వాటి సాంకేతాలు, ఇంగ్లీష్ స్పెల్ బి, గ్లోబ్ పై వివిధ దేశాలను గుర్తించడం, భగవద్గీత 18వ అధ్యాయంలోని మోక్ష సన్యాసయోగం పఠించటం, అమ్మప్రేమపై కథ చెప్పడం వంటి విషయాలలో అసాధారణమైన ప్రతిభను కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని ఎంఇవో వై ప్రభాకర్‌రావు, సుశీల విద్యా సంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు బూసా కోటేశ్వరరావు, డైరెక్టర్లు కొలగాని శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, ప్రిన్సిపాల్ సునీల్ కుమార్, ఉపాధ్యాయ బృందం సహ విద్యార్థులు అభినందించారు. ఈ అంశానికి సంబంధించి న్యాయ నిర్ణేతలుగా పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, బాబ్లా, మాధవరపు నాగేశ్వరరావువ్యవహరించారు.

మానసిక ధైర్యంతో వ్యాధుల నివారణ
* ఎమ్మెల్యే జలగం వెంకటరావు, సినీ నటి గౌతమి
కొత్తగూడెం రూరల్, జనవరి 19: ప్రాణాంతకమైన వ్యాధినైనా ఎదుర్కొనే శక్తి మానసిక ధైర్యానికి ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుజాతనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాన్సర్ అవగాహన సదస్సులో వీరు ప్రసంగించారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించగల్గితే వ్యాధి నివారణ సాధ్యమవుతుందని, కుటుంబ భాద్యతగా ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఆరోగ్యం పట్ల ఎటువంటి సందేహాలు ఉన్నా తక్షణమే వైద్యుల దగ్గరికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా వైద్య రంగంలో ఆధునిక పరికరాలు, పరిక్షలు వచ్చాయని వాటి ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చునని అన్నారు. క్యాన్సర్ ఎక్కువగా మగవారిలో దురలవాట్ల కారణంగా రాగా మహిళల్లో సహజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మహిళలను పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య వాహనాలు ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం భయంతోనే క్యాన్సర్ తీవ్రమవుతుందని తెలిపారు. మహిళలందరు 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు క్యాన్సర్ వ్యాధి నిరోధక టీకాలను వేయించుకోవాలని సూచించారు. అనంతరం స్థానికులు సినీ నటి గౌతమిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బానోత్ కేస్లీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మాలోత్ హరిలాల్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ చినబాబు, హేమారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ శీలంశెట్టి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మిగులు నుండి అప్పుల ఊబిలోకి
* రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానం
* తెలంగాణాలో నిర్బంధకాండ
* సిపిఐ రాష్ట్ర సహయకార్యదర్శి కూనంనేని

ఖమ్మం, జనవరి 19: దేశంలోనే ధనవంతమైన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రెండున్నర సంవత్సర కాలంలోనే మిగులు నుండి లక్షన్నర కోట్ల అప్పులోకి నెట్టివేయబడిందని సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన తిరోగమన విధానాల వల్లే రాష్ట్రం అప్పుల్లోకిపోయిందన్నారు. తెలంగాణ రాకముందు ఏ కాంట్రాక్ట్‌ర్లు, ఏ రాజకీయ నేతలపైన టిఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేశారో ఇప్పుడు వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మిషన్ భగీరధ, మిషన్‌కాకతీయ పథకాలకు మినహ మరే పథకానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. ఈ రెండు పథకాల నుండి మంత్రులకు, అధికార పార్టీ నేతలకు కమీషన్‌లు రావటం వల్లే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత ఎవరిని వదలబోమని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరికి సంబందం లేదంటున్నారని విమర్శించారు. నరుూంతో సంబందాలు ఉన్న రాజకీయ నేతలను కాపాడుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి వ్యతిరేకంగా అఫిడవిట్ సమర్పించిందన్నారు. తెలంగాణలో నిర్భంధకాండ కొనసాగుతుందని, ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతూ అణచివేస్తున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యతాతథంగా అమలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా పేదవాడినంటూ ప్రధాని మోడి ధనవంతులకు సేవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో పాటు మోడి నిర్ణయాలన్ని కార్పొరేటర్‌ల సంపదలను కాపాడేందుకేనన్నారు. నల్లధనం పేరు చెప్పిన ప్రధాని మాటమార్చి నగదు రహిత సమాజమంటూ కొత్త పాట పాడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్, మోడిల అసలు రంగును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల ఆగ్రహనికి వారు త్వరలోనే గురికాక తప్పదన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి హేమంతరావు, నాయకులు జానీమియా, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.