ఖమ్మం

గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 21: జిల్లాల విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోంది. గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పరిపాలనా సౌలభ్యంతోపాటు ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం జరిగేలా చూసే లక్ష్యంతో ఏర్పడిన కొత్త జిల్లాలో రెండు నెలలు గడుస్తున్నా జిల్లా పంచాయతీల శాఖలో మాత్రం ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. గ్రామ పంచాయతీల పరిపాలనకు రధసారధులైన గ్రామ కార్యదర్శులను అన్ని గ్రామాలకు సరిపడా నియమించే కనీస చర్యలపై ఆ శాఖ దృష్టిసారించటం లేదు. సమైక్య ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడటంతో మండలాల సరిహద్దులు మారి పంచాయతీల్లోని గ్రామాల పొలిమేర్లు కూడా చెరిగిపోయాయి. అయినా ఇప్పటి వరకు శాఖాపరంగా సరిదిద్దే ప్రయత్నం జరగలేదు. 17 మండలాల పరిధిలో మొత్తం 205 గ్రామ పంచాయతీలు, 7 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలను 5 వేల జనాభాతో ఒక్క క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. మొత్తం 182 క్లస్టర్‌లున్నాయి. ఒక్కో క్లస్టర్‌కు గ్రామ కార్యదర్శిని నియమించాల్సి ఉండగా ప్రస్తుతం 86 మంది విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన క్లస్టర్‌లలో కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో కొంతమంది కార్యదర్శులకు అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో కొందరు కార్యదర్శులు పనిభారంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతే కాకుండా పంచాయతీలను పర్యవేక్షించే విస్తరణాధికారులు 17 మంది ఉండాల్సి ఉండగా చర్ల, అశ్వారావుపేట, మణుగూరులలో ఇవోఆర్డీ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్యదర్శులు నిబంధనల ప్రకారం గ్రామాల్లో 64 రకాల పనులను నిర్వర్తించాల్సి ఉంది. అసలు గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులదే కీలకపాత్ర. పంచాయతీల పాలకవర్గాల సమావేశాల నిర్వహణ, గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానాలు జరిపించటం, పంచాయతీలకు సంబంధించిన అన్ని రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పర్యవేక్షణ వంటి పనులు ఇందులో ప్రధానంగా ఉంటాయి. కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో ఈ పనులన్నీ కుంటుబడిపోతున్నాయి. పన్నుల రూపేణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ 12.30కోట్లు డిమాండ్ ఉండగా కేవలం రూ 2.09లకోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటిలో పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ఈనెల రోజుల వ్యవధిలోనే రూ 1.09 కోట్లు వసూలైంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా పరోక్షంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కారం జరుగక ప్రజలు పలువిధాలుగా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.