ఖమ్మం

కౌన్సిల్‌లో ‘చేపల మార్కెట్టు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జనవరి 24: ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఖమ్మం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో దద్దరిల్లింది. మేయర్ పాపాలాల్ అధ్యక్షతన కౌన్సిల్‌హాల్‌లో జరిగిన రెండవ సమావేశంలో 21 అజెండాలపై చర్చించి 15అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. వైరారోడ్డులోని చేపల, మాంసం మార్కెట్ తరలించే విషయంపై చర్చ తీవ్రంగా జరిగి, సభ్యులు ఒకరికొకరు నిందారోపణలు చేసుకునేంత వరకు వెళ్ళింది. వ్యాపారులకు అనుకూలంగా ఉన్న చేపల మార్కెట్‌ను తరలించకుండా అదే స్థలంలో దుకాణాలు కట్టించి అద్దెకు ఇవ్వాలని సిపిఐ ఫ్లోర్‌లీడర్ బిజె క్లైమెంట్ డిమాండ్‌చేశారు. ఇదే సమయంలో కార్పొరేటర్ కమర్తపు మురళి మాట్లాడుతూ నగరంలో జరిగే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయనడంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ వైరారోడ్డులోని చేపలమార్కెట్‌లో వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ స్థలంలో వారికే నూతన భవనం నిర్మించి ఇస్తామని చెప్పడంతో సద్దుమణిగింది. మార్కెట్ విషయంలో కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయని, అవి పరిష్కారం అయిన వెంటనే మార్కెట్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తామని, అంతవరకు ఎనె్నస్పీ ప్రాంతానికి తరలించడం జరుగుతుందని సర్దిచెప్పారు. నగరాభివృద్ధిపై చర్చ జరుగుతున్న సమయంలో సిపిఎం ఫ్లోర్‌లీడర్, మాజీ చైర్‌పర్సన్ అఫ్రోజ్ సమీనా ప్రజలను దోచుకునేందుకే పాలకవర్గం తీర్మానాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారపక్ష కార్పొరేటర్లు ఆమెపై తీవ్రంగా ఇరుచుకుపడ్డారు. నగరంలోనే ఎన్నడూ లేనివిధంగా చెత్తసేకరణ కోసం వ్యాపార వర్గాలకు యాబై రూపాయలు, గృహాలకు 30రూపాయలు యూజర్ చార్జ్ విధించడంపై చర్చ జరిగింది. దీనిని అఫ్రోజ్‌సమీనా తీవ్రంగా విమర్శించారు. దీనికి కమిషనర్ బొనగిరి శ్రీనివాస్ సమాధానమిస్తూ గతంలో ఉన్న వాటినే తాము అమలు చేస్తున్నామని, కొత్తగా చేసిందేమి లేదని, ధనిక వర్గాల నుండే ఆ చార్జిలను వసూలు చేస్తామని, పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. టెండర్ల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, కేవలం స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు కాంట్రాక్టర్లకు కేటాయిస్తున్నారని కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ బాలగంగాధర్ తిలక్ ఆరోపించారు. దీంతో కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, కర్నాటి కృష్ణల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కలుగజేసుకొని సమస్యను సద్దుమణిగించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ఎనె్నస్పీ ప్రాంతానికి తరలించినప్పటికీ కార్యకలాపాలు ప్రస్తుత కార్యాలయంలోనే నిర్వహించాలని అఫ్రోజ్‌సమీనా సూచించడంతో దీనిని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలే తప్పా వ్యక్తిగత ప్రాంతాల ప్రాధాన్యత కాదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. కార్పొరేషన్‌కు కేటాయించిన స్థలంలో రాష్ట్రంలోనే ఆధునిక భవనాన్ని నిర్మిస్తామన్నారు. కౌన్సిల్ ప్రవేశపెట్టిన 4,7,14 ఎజెండాలో మాస్టర్ ప్లాన్‌కు సంబంధం లేకుండా రోడ్లని కుదించాలనే అంశాలపై వాయిదా తీర్మానం చేశారు. ఈ చర్చ సమయంలో బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతున్న సమయంలో మాస్టర్‌ప్లాన్‌కు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని, దీనిని ఆమోదిస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయని, వాటిని వాయిదా వేయాలని సూచించారు. విలీన గ్రామ పంచాయతీల అభివృద్ధితో పాటు నగరంలో పారిశుద్ధ్యం మెరుగపర్చేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు వంద నూతన నియామకాలను చేపట్టాలని తీర్మానించారు. తడిచెత్త, పొడిచెత్త సేకరణకు రెండులక్షల డస్ట్‌బిన్ల కొనుగోలుకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగర పాలకంలో పారిశుద్ధ్య విభాగంలో ఉన్న శానిటరి ఇన్స్‌పెక్టర్లు, ఇతర సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని ఎమ్మెల్యే అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అమృత్ పథకం కింద 230కోట్లను మంజూరు చేసిందన్నారు. అదే విధంగా ఖమ్మం నగరాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకశ్రద్ద చూపుతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

కరవు ప్రాంతాలు
ఇక సస్యశ్యామలం
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తిరుమలాయపాలెం, జనవరి 24: కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలను సస్యశ్యామలం చేసి ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ట్రైయల్న్ విజయవంతం అయిన సందర్భంగా మండలంలోని ఇస్లావత్‌తండా వద్ద మంగళవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడుతూ 30కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన తానంచర్ల పథకం ఇప్పడు వినియోగంలోకి వచ్చిందన్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోగానే ఈ పథకాన్ని పూర్తి చేసి నీటి సరఫరా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వనిదేనన్నారు. రాష్ట్రంలోనే కరవుప్రాంతంగా ఉన్న తిరుమలాయపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించామన్నారు. ప్రస్తుతానికి ఒక పంపుహౌస్ పనిచేస్తుందని, త్వరలోనే రెండవది కూడ వినియోగంలోకి వస్తుందన్నారు. 90రోజుల పాటు పథకం పనిచేసి రైతులకు నీరు అందేలా చూస్తామన్నారు. ఈ పథకంపై అనేక ఆరోపణలు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి ప్రజల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసామన్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సుమారు 60వేల ఎకరాలను సాగు నీరు అందించనున్నామన్నారు. 123జీవో ప్రకారం రైతులు కోరిన విధంగా నష్టపరిహారం అందించి ఈ పథకానికి అవసరమైన 128.70ఎకరాల భూమిని సేకరించామన్నారు.
ఏడాదిలోగానే పూర్తి అయిన భక్తరామదాసు ప్రాజెక్టును ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతుల సహకారంతో అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు. రికార్డు కాలంలో పథకాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావటం పట్ల ముఖ్యమంత్రి కూడ అభినందనలు తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిచైర్‌పర్సన్ కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, డిసిసిబి చైర్మన్ విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం ర్యాలీ
గార్ల, జనవరి 24: తెలంగాణలో సామాజిక న్యాయం కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి కావటంతో మంగళవారం ఆపార్టీ కార్యకర్తలు గార్లలో ఎర్రదండు ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీ పురవీధుల గుండా నెహ్రూ సెంటరు వరకు కొనసాగింది. ర్యాలీనుద్ధేశించి సిపిఎం మండల కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కెసిఅర్ ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిప్రసాద్, ఈశ్వరలింగం, లోకేశ్వరరావు, శ్రీను, వీరస్వామి, కవిత, రమా తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల సందడి
* దరఖాస్తు చేసేందుకు పోటీపడుతున్న కార్మికులు
కొత్తగూడెం, జనవరి 24: సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపటంతో కార్మిక ప్రాంతాల్లో సందడి మొదలైంది. 20 ఏళ్లుగా వారసత్వ ఉద్యోగాలు పెండింగ్‌లో ఉండటం నూతనంగా వారసత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనవరి 1వ తేదీ నుంచి వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి యాజమాన్యం దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సింగరేణి కార్మికులు తమ వారసులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాలకు 24 రోజుల్లో 2591 దరఖాస్తులు సింగరేణి యాజమాన్యానికి అందాయి. ఏడాది సర్వీసు ఉన్న కార్మికుల నుంచి రెండేళ్లలోపు సర్వీసు ఉన్న 1362 మంది కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా, రెండు నుంచి నాలుగేళ్ళ సర్వీసు ఉన్న కార్మికులు 1225 మంది వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. 11 ఏరియాల్లో వారసత్వ ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి. వారసత్వ ఉద్యోగాలకు కొత్తగూడెం ఏరియా నుంచి 296 మంది కార్మికులు దరఖాస్తు చేసుకోగా, ఇల్లందు ఏరియా నుంచి 86, మణుగూరు ఏరియా నుంచి 184, రామగుండం-1 నుంచి 302, రామగుండం-2 నుంచి 156, రామగుండం -3 నుంచి 216, భూపాలపల్లి నుంచి 369, బెల్లంపల్లి 79, మందమర్రి 161, శ్రీరాంపూర్ 714 మంది సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. మార్చి 31 నాటికి సుమారు 30 వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. 2017 నుంచి 2027 వరకు సింగరేణి వ్యాప్తంగా సుమారు 35 వేల మందికిపైగా పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వం వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించటంతో కార్మికుల పిల్లలతోపాటు అల్లుళ్లు కూడా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా వారసత్వ ఉద్యోగాల సందడి కొనసాగుతోంది.

ఓటు.. అందరి హక్కు
* ప్రజాస్వామ్యానికి పునాది
* పాలనలో మార్పునకు వజ్రాయుధం
* నేడు జాతీయ ఓటరు దినోత్సవం
భద్రాచలం టౌన్, జనవరి 24: ప్రజాస్వామ్యానికి తలమానికం.. సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం.. పాలకుల రాజకీయ భవితకు శాసనం.. ఏలికలను చట్టసభలకు పంపే నిర్ణయాధికారం.. ఇవన్నీ ఒక్క ఓటు హక్కుకు మాత్రమే సాధ్యం. అందుకే ఎన్నికల వేళ ఓటరు మహారాజును ప్రసన్నం రాజకీయ నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే ప్రభుత్వాలకు గద్దె దించాలన్నా..ఎక్కించాలన్నా ఓటే కీలకం. ఒక్కమాటలో చెప్పాలంటే ఓటు వజ్రాయుధం. 2011 జనవరి 25నాటికి భారత జాతీయ ఎన్నికల సంఘం ఏర్పడి 76 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఓటుహక్కు ప్రాముఖ్యత, ఓటుహక్కు నమోదు చేసుకునే విధానం, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయనున్నారు.
ప్రయోజనాలు ఇలా..: ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే ఆయుధం ఓటుహక్కు. ఈ శక్తివంతమైన ఆయుధాన్ని వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. సంపూర్ణ ఓటింగ్ జరగడం వల్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అనధికార ఎన్నికల వ్యయం తగ్గుతుంది. పౌరులకు రాజకీయాలపైన, ప్రభుత్వంపైన పరిశీలన పెరుగుతుంది. అన్ని వర్గాలవారు ఓటు వేయడం వల్ల కులవివక్ష తగ్గుతుంది. యువతతో పాటు అన్ని వర్గాల వారు ఓటింగ్‌లో పాల్గొనడం వల్ల ప్రలోభాలు, అక్రమాలకు తెరపడుతుంది. ఇక ఓటరు గుర్తింపుకార్డులో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వ్యక్తిగత గుర్తింపునకు, వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రంగా ఉపయోగ పడుతుంది. బ్యాంకు, ఖాతా, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, సిమ్‌కార్డు తదితర అవసరాల కోసం ఓటరు గుర్తింపుకార్డు అవసరం ఉపయోగపడుతుంది. మలేషియాలో ఓటు వేయకపోతే జైలుశిక్ష విధిస్తారు. సరైన కారణం లేకుండా ఓటు వేయకపోతే అరెస్టు చేస్తారు.
వివిధ దేశాల్లో ఇలా..:్భరతదేశంలో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పిస్తుంటే ఇరాన్‌లో 15ఏళ్లకే ఓటుహక్కు కల్పించారు. పాకిస్థాన్‌లో 21ఏళ్లు, జపాన్‌లో 20 ఏళ్లకు ఓటు హక్కు కల్పించారు. సింగపూర్‌లో 21, ఇండోనేషియా, ఉత్తరకొరియా దేశాల్లో 17ఏళ్లకే ఓటుహక్కు కల్పించారు. మొనాకో దేశంలో అత్యధికంగా 25ఏళ్లు ఉన్నవారే ఓటుహక్కుకు అర్హులు. ఇక భూటాన్‌లో వయస్సుతో నిమిత్తం లేకుండానే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ దేశంలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పెరూ దేశంలో ఐదేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. ఓటు హక్కు వినియోగించుకోకపోతే రూ.1500 వరకు జరిమానా విధిస్తారు. వృద్ధులు, ఆసుపత్రల్లోని రోగులు సైతం ఓటు వేయాల్సిందేనని అక్కడి నిబంధన ఉంది. ఎన్నికలు దేశాభివృద్ధికి కీలకమని వారు భావిస్తారు.
ఓటింగ్ ప్రకియ ఇలా..:1950లో భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం కుల, మత, వర్గ, లింగ వివక్ష లేకుండా 21 సంవత్సరాలు నిండిన యువతి, యువకులకు ఓటు హక్కు లభించింది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18ఏళ్లకు తగ్గించారు. మానసిక వికలాంగులు(పిచ్చివారికి), దేశద్రోహులకు(కోర్టు ఆదేశించిన వారికి), విదేశీ రాయబారులకు, భారత పౌరసత్వం లేనివారికి మన దేశంలో ఓటు హక్కు లేదు. 1980లో ఎంబీ హనీఫా అనే వ్యక్తి ఈవీఎంలు రూపొందించారు. తొలిసారి భారతదేశంలో 1998లో కేరళలోని ఉత్తర పెరవూరు ఉపఎన్నికల్లో ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్(ఈవీఎం) ఉపయోగించారు. 2014లో ఈవీఎంలలో తొలిసారి నోటా(ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేదు) అనే ఆఫ్షన్‌ను కల్పించారు. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం 1920నుంచే శే్వతజాతి మహిళలకు ఓటుహక్కు కల్పించారు. 1965 నుంచి నల్లజాతీయులకు కూడా ఓటు హక్కు కల్పించారు. ప్రజలందరికీ 1893లోనే న్యూజిలాండ్ దేశంలో ఓటు హక్కు కల్పించారు. 1971 వరకు స్విట్జర్లాండ్‌లో మహిళలకు ఓటుహక్కు లేదు.
లక్ష్యం ఇదీ..:ప్రజాస్వామ్య దేశంలో మనల్ని మనం పరిపాలించుకునేలా రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ఓటు హక్కు. కానీ ఈ అవగాహన లేక ఇప్పటికీ చాలామంది తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోతున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించి వారికి ఓటరు గుర్తింపుకార్డు అందజేసి ఓటుహక్కు కల్పించాలనే లక్ష్యంతో ఏటా జనవరి 25న కేంద్ర ప్రభుత్వం జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది 7వ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారు. నూతన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

ప్రపంచ స్థాయిలో తెలుగుజాతి ఖ్యాతిని చాటాలి
* మంత్రి తుమ్మల
ఖమ్మం రూరల్, జనవరి 24: విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకొని తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఏకత్రా వేడుకల్లో భాగంగా మంగళవారం పొనె్నకల్లు కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘కిట్స్ ఏకత్రా 2017’ వేడుకలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జిఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ గత పది పనె్నండేళ్ళుగా విద్యా విలువలు తగ్గిపోతున్నాయన్న భావన ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. కేవలం డిగ్రీల కోసమే చదవడం వల్ల దేశానికి కలిగే ప్రయోజనమేమీ లేదని, ఆధునిక, సాంకేతిక నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకొని పోటీ ప్రపంచాన్ని అధిరోహించాలన్నారు. కిట్స్ కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఏకత్రా పేరుతో విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసి వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. హైద్రాబాద్ మాదిరిగానే వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో పలు కంపెనీలను నెలకొల్పి ఉద్యోగావకాశాలను కల్పించి నిరుద్యోగ సమస్యను తొలగించాలని ఐటి మంత్రికి విన్నవించినట్టు మంత్రి స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా అందుకు సహకరిస్తామన్నారని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులు స్వయంగా రూపొందించి ప్రదర్శించిన అంశాలను మంత్రి తిలకించి అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జిఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కోటా అప్పిరెడ్డి, చైర్మన్ నిరంజన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ దేవేందర్, డైరెక్టర్లు రంగా లింగయ్య, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మూడు మండలాల్లో ఎమ్మెల్యే జలగం విస్తృత పర్యటన

కొత్తగూడెం రూరల్, జనవరి 24: కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్, లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో ఎమ్మెల్యే జలగం వెంకటరావు మంగళవారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మిదేవిపల్లి మండలపరిధిలోని ఇల్లందు క్రాస్‌రోడ్డు వద్దగల నర్సరీని, సుజాతనగర్ మండలపరిధిలోని సింగభూపాలెం చెరువు, చుంచుపల్లి మండల పరిధిలోని చింతల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితాహారంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకాన్ని నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా తయారు చేయాలన్నారు. నీటి పారుదల పనులు చిరస్థాయిగా నిలిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సుమారు రూ 10కోట్లతో చేపడుతున్న చెరువు పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువులు కన్నతల్లి వంటివని గ్రామాలకు పట్టుకొమ్మలుగా నిలచే చెరువుల అభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. చుంచుపల్లి మండల కేంద్రంలోని చింతల చెరువును మిని ట్యాంకుబండ్‌గా తీర్చిదిద్దేంకు చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ మాలోత్ హరిలాల్, ఆత్మకమిటీ చైర్మన్ లింగం పిచ్చిరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి శరవనన్, డివిజినల్ అధికారి ముకుందరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ రాములు, సెక్షన్ ఆఫీసర్ క్రాంతికుమార్, నీటిపారుదల శాఖ జిల్లాఅధికారి వెంకటేశ్వరరెడ్డి, డిఇ తిరుపతి వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు.

రహదారి భద్రతపై
విద్యార్థులకు అవగాహన కల్పించాలి
* డిఎస్పీ సురేష్‌కుమార్
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 24: రహదారి భద్రతపై విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించాలని ఖమ్మం డిఎస్పీ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టిటిడిసిలో కళాశాలలు, పాఠశాలల యాజమాన్యానికి మైనర్ విద్యార్థులకు డ్రైవింగ్ ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రాధమికంగా విద్యార్థులకు రహదారి భద్రత గురించి చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దనే గుడుపుతున్నారు కాబట్టి రోడ్డు ప్రమాదాలు, నష్టల గురించి వారికి తగు జాగ్రత్తలు సూచించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి విద్యాసంస్థలో విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా యాజమాన్యలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు యుద్ద్భూములుగా మారుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయన్నారు. విద్యాలయాలకు మైనర్ విద్యార్థులు వాహనాలు తీసుకురాకుండా పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ బజాజ్ ధన్‌రాజ్, ట్రాఫిక్ సిఐ నరేష్‌రెడ్డి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరక్టర్ మురళి, సిఐ నాగేంద్రచారిలతో పాటు ట్రాఫిక్ ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

టిడిపి సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 24: తెలుగుదేశం పార్టీ 2017సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య తెలిపారు. నేటి నుండి ఈ నెల 31వ తేదివరకు గ్రామ, మున్సిపల్, వార్డుల ఎన్నికల అధికారుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 3నుండి 6వ తేదివరకు గ్రామ, మున్సిపల్ ఎన్నికల అధికారులకు నియోజకవర్గ కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 9నుండి 28వ తేదివరకు గ్రామ, మున్సిపల్ ఆయా వార్డులకు సంస్థాగత కమిటీల ఎన్నికల, మార్చి 1వ తేది నుండి 6వ తేదివరకు మండల డివిజన్ పట్టణ కమిటీలకు, అనుబంద సంఘాలకు ప్రతినిధుల జాబితాలను తయారు చేయనున్నట్లు, వీటికి సంస్థాగత కమిటీల ఎన్నికల అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. మార్చి 10నుండి 12వ తేది వరకు మండల, పట్టణ డివిజన్‌లలో ఎన్నికైన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, మార్చి 19నుండి ఏప్రిల్ 5వ తేది వరకు మండల డివిజన్ పట్టణాల అనుబంద సంఘాల సంస్థాగత కమిటీల ఎన్నికలు ఆయా కేంద్రాలలో జరుగుతాయని ఏప్రిల్ 24నుండి 28వ తేది వరకు జిల్లా పార్టీ అనుంబంద సంఘాల ఎన్నికలు జిల్లా కేంద్రంలో జరుగుతాయన్నారు. మే 11నుండి 23వ తేది వరకు జిల్లా మిని మహనాడు జరపనున్నట్లు తెలిపారు.

వైభవంగా రామయ్యకు విశ్వరూప సేవ
భద్రాచలం, జనవరి 24: శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం రాత్రి విశ్వరూప సేవ జరిగింది. ముక్కోటి దేవతలంతా ఒక్కచోట కొలువై దర్వనమిచ్చే క్రతువే విశ్వరూప సేవ. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల అనంతరం నిర్వహించే ఈ వేడుక శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే గొప్ప ఉత్సవం ఇది. ఆలయంలోని స్వామితో పాటుగా చుట్టు దేవాలయాల్లోని దేవతలు, దేవుళ్లు, ఆళ్వార్లు అంతా ఒకే చోట కొలువయ్యారు. ఈ సందర్భంగా వేదికను పూలతో సుందరంగా అలంకరించారు. స్వామికి విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆస్థాన విద్వాంసులు రామనామ సంకీర్తనలతో అర్చన చేశారు. అంతా రామమయం అంటూ భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలిపోయారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, ఆర్డీఓ శివనారాయణరెడ్డి, డిఎస్పీ అశోక్‌కుమార్ తదితరులు ఈ విశ్వరూప సేవలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. కదంబం అనే ప్రసాదాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టారు.

26, 27 తేదీలలో
పంటలను మార్కెట్‌కు తేవద్దు
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 24: ఈ నెల 26న రిపబ్లిక్‌డే, 27న అమావాస్య సందర్భంగా మార్కెట్ సెలవులను ప్రకటించటం జరిగిందని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ తెలిపారు. రెండు రోజులు సెలవులు ఉన్నందున రైతులు పంటలను ఆ రెండు రోజులు తరలించవద్దని సూచించారు.

సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ఖమ్మం రూరల్, జనవరి 24: యువకులు, విద్యార్థులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు పుచ్చకాయల కమలాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని గూడూరుపాడు గ్రామంలో ఎఐవైఎఫ్, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువకులు, విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని అన్నారు. ప్రపంచ స్థాయిలో పేరొందిన క్రీడాకారుల్లో చాలామంది గ్రామీణ స్థాయి నుంచి ఎదిగినవారేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, యువత, ఫీజురియంబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో వైఫల్యం చెందిందని విమర్శించారు. కార్యక్రమంలో రూరల్ ఎంపిపి ఎం లలిత, సంఘం జిల్లా కార్యదర్శి రంజిత్, ఎంపిటిసి బండి ముత్తమ్మ, అప్పారావు, టెండూల్కర్, మధు, సాయికుమార్, నవీన్ పాల్గొన్నారు.