ఖమ్మం

కరవును తరిమేయనున్న ’్భక్త రామదాసు‘

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 30: కరవు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో అతి తక్కువ ఖర్చుతో గతంలో వివిధ ప్రాజెక్టులకు కొనుగోలు చేసిన సామగ్రితో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు ప్రారంభించనున్నారు. కేవలం 11 నెలల కాలంలో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందేలా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గ పరిధిలోని తిరుమలాయపాలెం, కుసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ, డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండలాల్లో భూములకు సాగునీరు అందనుంది. ప్రారంభించిన ఏడాదిలోగా నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి భక్తుడైన భక్త రామదాసు జన్మదినం రోజే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తుండటం విశేషం. 330 కోట్ల రూపాయలతో కేవలం 11 నెలల కాలంలోనే 60 వేల ఎకరాలకు నీరందించేలా నిర్మించిన ఈ పథకం ద్వారా అత్యంత కరవు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. ఈ పథక నిర్మాణంలో గతంలో ఇందిరాసాగర్ పథకం కోసం సేకరించిన పంపులు, మోటర్లు, సుమారు 5,500 పైపులు వినియోగించారు. ఈ పథకానికి అవసరమైన 128.07 ఎకరాలను 123 జిఓ కింద సేకరించారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాల్సి ఉంది. ఖమ్మం జిల్లా పాలేరులో ఉన్న పాలేరు జలాశయం నుంచి 5.5 టిఎంసిల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డిబిఎం 60 కింద నీటి ఎద్దడి ఉన్న 60 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. పాలేరు జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌తండా వరకు పైపుల ద్వారా నీరు తీసుకువచ్చి అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల ద్వారా నీటిని ఆయకట్టుకు తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా పరిధిలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల పరిధిలోని 43 గ్రామాల పరిధిలోని 57 వేల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని రెండు గ్రామాల్లోని సుమారు రెండు వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఈ పథకానికి రెండు పంపులను ఏర్పాటు చేయగా మొదటి పంపును ఈ నెల 23వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించారు. రెండవ పంపును ఈ నెల 28వ తేదీన ట్రయల్న్ నిర్వహించాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో నిర్వహించలేదు. ఈ పథకం శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిత్యం పనులలో నాణ్యతా లోపం రాకుండా పర్యవేక్షించారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
ముఖ్యమంత్రి భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లు పరిశీలించారు. పాలేరులోని మిషన్ భగీరథ ప్రాంతాన్ని, ఎర్రగడ్డ తండాలోని భక్త రామదాసు ప్రాజెక్టును, ఇస్లావత్‌తండాలోని పంపు హౌస్‌ను, మాదిరిపురం వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. పోలీసులు, మండల అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి భారీగా ప్రజలు హాజరవుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు ఏఎస్పీలు, ఏడుగురు డిఎస్పీలు, 35 మంది సిఐలు, 80 మంది ఎస్‌ఐలు, 800 మంది కానిస్టేబుల్‌లు, 200 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. 40 కిలోమీటర్ల మేర ఆయన పర్యటన సాగనుండటం, అన్ని ప్రాంతాల నుండి వాహనాల ద్వారా తరలిరానుండటంతో అన్ని మార్గాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
సిఎం పర్యటన ఇలా...
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం పాలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకుని మిషన్ భగిరథ పనులను పరిశీలించిన అనంతరం భక్త రామదాసు ప్రాజెక్టు ఇంటెక్‌వెల్ నిర్మించిన ఎర్రగడ్డ తండా వద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం ఇస్లావత్ తండా వరకు కాలువల పక్కన రహదారి మార్గం గుండా ప్రయాణించి ట్యాంకులను పరిశీలిస్తారు. అనంతరం శంకుస్థాపన సమయంలో సభ జరిగిన ప్రాంతంలోనే నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలి

కొత్తగూడెం, జనవరి 30: మహాత్మగాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం రెండు నిమిషాలపాటు వౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. గాంధీజీ కలలుగన్న సమాజం కోసం గాంధీజీ చూపిన అహింసామార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర పోరాటంలో అమరులైన మంగల్‌పాండే వంటి సమరయోధుల త్యాగాలను మరువరాదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌డిఏ పిడి జగత్ కుమార్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ డిఆర్వో ఎంవి రవీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.