ఖమ్మం

బడ్జెట్‌పై కోటి ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌జైట్లి బుధవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతానికి భిన్నంగా రైల్వేబడ్జెట్‌ను కూడా కలిపి సాధారణ బడ్జెట్‌గానే ప్రవేశపెడుతుండటం గమనార్హం. ఈ బడ్జెట్‌లో సాధారణ ప్రజానికానికి లబ్ధిజరిగేలా నిర్ణయాలు ఉంటాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగులు ఆదాయపన్ను పరిమితిని ఐదులక్షలకు పెంచుతారని ఆశిస్తున్నారు. అదే క్రమంలో నగదురహిత లావాదేవిలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజలకు లబ్ధిజరిగేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించిన ప్రతిపక్షాలకు ఈ బడ్జెట్‌లో సమాధానం చెప్పే అవకాశం ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లా ప్రజానికానికి ఈ బడ్జెట్ ద్వారా మరింత లబ్ధిజరగనుందనే ప్రచారం జరగనుంది. భద్రాచలం దేవస్థానాన్ని శ్రీరామ కారిడార్‌లో ప్రభుత్వం ఉంచడం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వేప్రాజెక్టులు ఖమ్మం నగరంలో పలురైళ్ళ నిలుపుదల లాంటి అంశాలు ఈ బడ్జెట్‌లో ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖాజీపేట-విజయవాడ మూడవమార్గం నిర్మాణంతో పాటు ఈ ప్రాంతంలోనే రైల్వేప్రాజెక్టులు నిర్మించేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, ప్లాట్‌ఫాంల అధివృద్ధికి నిధులు కేటాయిస్తారని, విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మరిన్ని హైస్పీడ్ రైళ్ళు, ఖమ్మం-తిరుపతి మధ్య మరికొన్ని రైళ్ళు ఏర్పాటు చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు అమృత్ పథకం కింద విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రభుత్వ విధానాలను తెలియజేస్తుందని, పేదలపక్షాన ఏ నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉందని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలే అజెండా
* ఏడాదిన్నరలో సీతారామ ప్రాజెక్టు పూర్తి
* ఓర్వలేకనే ప్రతిపక్షాల ఆరోపణలు
* భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో సిఎం

ఖమ్మం, జనవరి 31: ప్రజల ఆకాంక్షలే అజెండాగా తెలంగాణ ఉద్యమం కొనసాగిందని, అదే లక్ష్యంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కూసుమంచి మండల పరిధిలోని యర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్భ్రావృద్థి జరుగుతుందని, తాము తలపెట్టిన ప్రాజెక్టులన్నింటిని కట్టితీరుతామని స్పష్టంచేశారు. కోటి ఎకరాలకు నీరిచ్చేంత వరకు తాము విశ్రమించేది లేదన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు తెలంగాణను గోదావరి, కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ తలపెట్టిన ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టు అనతికాలంలోనే ప్రారంభించుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. తిరుమలాయపాలెం మండలాన్ని దశాబ్ధాలకాలంగా వెంటాడుతున్న కరవు భక్తరామదాసుతో తీరనుందన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుంది అన్న వారికి భక్తరామదాసు నిర్మాణమే నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 60వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. చివరి గ్రామాలకు నీరందించేందుకు వెంటనే పనులు ప్రారంభిస్తామని, ఎంత ఖర్చయినప్పటికీ నిధులను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు కావాలనే నిందారోపణలకు పాల్పడుతున్నారన్నారు. మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకులు చిదంబరం తెలంగాణలో అభివృద్థి జరగలేదని ఆరోపించారని, దానికి తాము చేపడుతున్న సంక్షేమ పథకాలకు తోడు భక్తరామదాసు ప్రాజెక్టే సమాధానమన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినప్పటికీ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు అందించి తీరుతామన్నారు. యాభై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ చేయలేనిది కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే చేసి చూపించామన్నారు. 35వేల కోట్ల ఖర్చుతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, చరిత్రలోనే నిలిచిపోయే విధంగా వెయ్యి రూపాయల పెన్షన్లు అందించామన్నారు. ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థులకు సన్నబియ్యం అందించడంతో పాటు ప్రజలందరికి బియ్యం అందిస్తున్నామన్నారు. ఆడపిల్లల పెళ్ళికి కల్యాణలక్ష్మి, ఈద్ ముబాకర్ పథకాలతో ఆదుకుంటున్నామన్నారు. 17,500కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఒంటరి మహిళలు 3లక్షల మందికి ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ అందించనున్నట్లు, అదే విధంగా ఐదున్నర లక్షల మంది బిడి కార్మికులకు పెన్షన్‌ని అందించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో మిషన్ భగీరథతో ఇంటింటికి స్వచ్చమైన నీరు అందిస్తామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా 16వేల చెరువులను బాగుచేశామని, 30వేల చెరువులు బాగుచేసే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన డబ్బా ఇండ్ల స్థానంలో తాము డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో 6వేల ఇండ్ల నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం పచ్చగా ఉండే విధంగా హరితహారం కార్యక్రమం చేపట్టామని, ఈ పథకం ద్వారా 2.30కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అదే విధంగా ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు, వారి పిల్లలు చదువుకునేందుకు 200గురుకుల విద్యాలయాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎస్టీ, ఎస్సీ, బిసి, ఓసి విద్యార్థులు విదేశాలకు వెళ్ళేందుకు విద్యార్థులకు 20లక్షల స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నామన్నారు. దళిత ఆడబిడ్డల విద్యాభివృద్ధికి ప్రస్తుతం ఉన్న 25కళాశాలలకు తోడు 60కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం 100కోట్ల నిధులు, బ్రాహ్మణులకు 100కోట్లు, జర్నలిస్టు సంక్షేమం కోసం 10కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో వెట్టిచాకిరికి గురైన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యాదవ కలస్తులకు 75శాతం సబ్సిడితో 4లక్షల గొర్రెల యూనిట్లను అందిస్తామని, మత్స్య, చేనేత కార్మికులకు అండగా ఉంటామని, అర్హులైన హోంగార్డులను పోలీసులుగా నియమిస్తామని హామీనిచ్చారు.

భక్తరామదాసు చిరస్మరణీయుడు
* విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
* ప్రారంభమైన జయంతి ఉత్సవాలు
నేలకొండపల్లి, జనవరి 31: భద్రాచలం శ్రీసీతారమచంద్రస్వామి దేవాలయం నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన శ్రీ్భక్తరామదాసు చిరస్మరణీయడని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నేలకొండపల్లిలోని శ్రీ్భక్తరామదాసు ధ్యాన మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతికశాఖ, భక్తరామదాసు విద్వత్ కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా తొలిసారి నిర్వహించనున్న శ్రీ్భక్తరామదాసు జయంతి ఉత్సవాల వేడుకలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. తొలుత మంత్రి తుమ్మలను మంగళవాయిద్యాలతో, పూర్ణకుంభంతో వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భక్తరామదాసు ధ్యాన మందిరంలోని శ్రీసీతారామచంద్రస్వామి, శ్రీ్భక్తరామదాసు దేవతామూర్తులకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఇక్కడి భక్తరామదాసు ధ్యాన మందిరంకు పంపిన శ్రీ్భక్తరామదాసు శిలావిగ్రహంను ఆయన ఆవిష్కరించారు. ధ్యాన మందిర ఆవరణలో జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కేంద్రంను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ్భక్తరామదాసు జయంతి ఉత్సవాలను తను ప్రారంభించటం పూర్వజన్మ సుకృతంగా భావించారు. భద్రాద్రి దేవాలయం ఉన్నంతకాలం భక్తరామదాసు ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భక్తరామదాసు జన్మస్థలంలో పుట్టిన వారందరు ధన్యులేనన్నారు. తెలంగాణ, సాంస్కృతి, సాంప్రదాయాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మంచి ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. భక్తరామదాసు జయంతి రోజునే భక్తరామదాసు ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోత్సవం చేయనుండటం గొప్ప విషయమన్నారు. వచ్చే ఏడాది జరిగే శ్రీ్భక్తరామదాసు జయంతి ఉత్సవాల నాటికల్లా నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్, మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. యాదాద్రి తరహాలోనే భద్రాచలం రామాలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. భద్రాచలం దేవాలయం అభివృద్ధి కోసం వంద కోట్లేకాదు, ఎన్ని వందలకోట్లు వెచ్చించైనా భద్రాద్రి దేవాలయం అభివృద్ధి చేసేందకు ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని హామీనిచ్చారు. భద్రాచలంతో పాటు ఇక్కడి శ్రీ్భక్తరామదాసు ధ్యాన మందిరంను కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. భక్తరామదాసు మందిరం అభివృద్థికి ఎమేమి చేస్తే బాగుంటుందో ఈ ప్రాంతంకు చెందిన సిఎం సిఆర్‌ఓ వనం జ్వాల నర్సింహారావుతో స్థానిక పెద్దలు చర్చించి ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. భావితరాలు హర్షించే విధంగా శాశ్వతంగా గుర్తుండిపోయో విధంగా ఇక్కడి భక్తరామదాసు ధ్యానమందిరం అభివృద్ధి జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంఎల్‌ఏ పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కొండబాల కోటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య, సిఎం పిఆర్‌పిఓ జ్వాల నర్సింహరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి సుమన్‌చక్రవర్తి, భక్తరామదాసు పదోతరం వారసులు కంచర్ల శ్రీనివాసురావు, నేలకొండపల్లి ఎంపిపి నందిగామ కవితరాణి, జెడ్పీటిసి అనిత, స్థానిక గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, ఎంపిటిసిలు చిలకల సీతారావమ్మ, ముత్తినేని అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు.

రామదాసు కీర్తనలతో భద్రాద్రి పులకింత
* భక్తాగ్రేసరునికి అభిషేకం
భద్రాచలం, జనవరి 31: భక్త రామదాసు 384వ జయంతి వేళ భద్రగిరి ఆయన కీర్తనలతో ఓలలాడింది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రామదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వాగ్గేయకారోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం రామదాసు రచించి ఆలపించిన కీర్తనలతో కళాకారులు ఆయన చిత్రపటం చేతపట్టి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. గోదావరి తీరానికి చేరుకుని గోదారమ్మకు పూజలు చేశారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి తల్లికి పూజలు చేసి, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ఇచ్చారు. గోదావరి మాత విగ్రహానికి అలంకరణ చేసి ఆరాధన, పూలతో అలంకరణ చేశారు. మరో వాగ్గేయకారుడు తూము లక్ష్మీనర్సింహదాసుకు కూడా పూజలు చేశారు. అనంతరం ఆలయానికి చేరుకుని రామదాసు విగ్రహానికి అభిషేకం చేశారు. నూతన వస్త్రాలను అలంకరించి, గర్భగుడిలో ఆయన పేరిట అర్చన చేసి, స్వామి వారి శేష వస్త్రాలు, శేషమాలికలు, ప్రసాదం అందజేశారు. తర్వాత రామదాసు చిత్రపటంతో ముందుగా కళాకారులు నడుస్తూ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకెళ్లారు.
నవ కీర్తనల గోష్ఠి: ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆరాధన, నైవేద్యం అనంతరం రామదాసు చిత్రపటం వద్ద హారతి ఇచ్చి వివిధ రకాల ఫలాలు, పుష్పాలు నివేదన చేశారు. దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు, శ్రీ చక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ఆర్డీఓ శివనారాయణరెడ్డి, తాహశీల్దారు రామకృష్ణ జ్యోతి వెలిగించి వాగ్గేయకారోత్సవాలను ప్రారంభించారు. దివంగత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి రామదాసు కీర్తనల్లోని ఆణిముత్యాల్లాంటి 9 కీర్తనలతో రూపొందించిన నవ కీర్తనల గోష్ఠిని కళాకారులంతా కలిసి ఆలపించి ఆ భక్తాగ్రేసరుడు రామదాసుకు అభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఆలపించిన కీర్తనలతో శ్రీ రామదివ్యక్షేత్రం సంగీత సాగరంలో ఓలలాడింది.

కెసిఆర్ వెంట జనం

ఖమ్మం, జనవరి 31: ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తే ఎలా ఉంటుందో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి పర్యటన ఆ విధంగా జరిగింది. కరవు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో నీరందించేందుకు రూపొందించిన భక్తరామదాసు ప్రాజెక్టును ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని యర్రగడ్డగూడెం వద్ద 60వేల ఎకరాలకు నీరందించేలా కేవలం 11నెలల కాలంలో నిర్మించిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత 10కిలోమీటర్ల దూరంలోని ఇస్లావత్‌తండా వద్ద నీళ్ళు కాల్వలోకి వచ్చే ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చేరుకునే సమయానికే అక్కడికి నీళ్ళురావడంతో ఆనందం వ్యక్తంచేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, నేతలతో మాట్లాడారు. అనంతరం మాదిరిపురం వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. అక్కడే తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా నీరందని ఎనిమిది గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారికి కూడా నీరందేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి సుమారు 40కిలోమీటర్ల మేర జిల్లాలో బస్సుద్వారా ప్రయాణించిన సందర్భంలో ప్రతి గ్రామంలోనూ మామిడితోరణాలు కట్టి ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్లాస్టిక్‌ను రద్దుచేసినా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, స్థానిక నేతలకు స్వాగతాలు చెప్పేందుకు భారీగా ప్లాస్టిక్ ఫ్లెక్లీలనే వినియోగించారు. ముఖ్యమంత్రి ఆయా గ్రామాలగుండా వెళ్తున్న సమయంలో గ్రామస్తులంతా పూలు చల్లుతూ స్వాగతం చెప్పడం విశేషం. ఆయన వెంట ఉన్న నాయకులకు బస్సులోనే భక్తరామదాసు ప్రాజెక్టు ప్రాధాన్యత వివరిస్తూ ముందుకు సాగారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, రాజేందర్, కడియం శ్రీహరిలతో పాటు ఎంపిలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్య, సీతారాంనాయక్, ప్రభాకర్‌రెడ్డి తదితరులతో పాటు 25మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజల నుంచి స్పందనను కూడా రాబట్టారు. పెన్షన్లు వస్తున్నాయా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలోనూ ,విద్యుత్ 24గంటలు అందుతుందా లేదా అనే అంశంపైనా చేతులెత్తాలని కోరడం గమనార్హం. హరీష్‌రావు మాట్లాడుతున్న సమయంలో ప్రజల నుంచి భారీ స్పందన రావడం విశేషం. బహిరంగ సభ ప్రారంభం కాగానే ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన దరిపల్లి రామయ్య దంపతులను సన్మానించిన కెసిఆర్, భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించిన మెగా కనస్ట్రక్షన్స్ అధినేత రామిరెడ్డిని సన్మానించారు. ముఖ్యమంత్రిని డిసిసిబి అధ్యక్షుడు మువ్వా విజయ్‌బాబు నాగలి బహుకరించగా, పార్టీ నాయకులు సత్కరించారు.

కెసిఆర్‌ది అధికార దాహం

పాల్వంచ, జనవరి 31: అధికార దాహంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర సారథి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయ సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో 5 నెలల క్రితం చేపట్టిన తమ్మినేని మహాజన పాదయాత్ర మంగళవారం పాల్వంచకు చేరుకుంది. పాదయాత్రకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు యడవల్లి కృష్ణ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోనేరు సత్యనారాయణ, సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాధం, వివిధ కుల సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిన కెసిఆర్‌కు ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. మాట తప్పడంలో, మాయ చేయడంలో దేశంలోనే కెసిఆర్ నెంబర్ వన్‌గా నిలిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి అంటే గారడి మాటలు చెప్పడం కాదని, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని బతుకు తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే గులాబి జెండా కాదన్నారు. తెలంగాణలో పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిన చరిత్ర ఎర్ర జెండాదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. సామాజిక తెలంగాణ వచ్చేంత వరకు సిపిఎం పోరాటం చేస్తుందన్నారు. సబ్ ప్లాన్ చట్టాన్ని సవరిస్తే ఉద్యమిస్తామన్నారు. తాను చేస్తున్న పాదయాత్రలో తమకు 34 వేల దరఖాస్తులు ఇచ్చారని, రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటే ఇన్ని దరఖాస్తులు ఎందుకు వస్తాయని అన్నారు. అభివృద్ధిపై భద్రాచలంలో జరిగే సభలో చర్చకు రావాలని పిలిచినా ఏ ఒక్క పాలకుడు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, దొడ్డా రవికుమార్, ఆదాం, రాజు, పాల్గొన్నారు.

కెసిఆర్ స్వప్నం ఫలించింది
* నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు
తిరుమలాయపాలెం, జనవరి 31: కరవుతో అల్లాడుతున్న పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నం ఫలించినట్టయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలను జలయజ్ఞం పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని, అధికారంలోకి వచ్చిన అతి కొద్ది సమయంలోనే కెసిఆర్ అనేక ప్రాజెక్టులను చేపట్టి అపరభగీరధుడుగా పేరుతెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక ఎత్తిపోతల పథకాలు మరుగున పడిపోయాయని, తెలంగాణా ప్రభుత్వం వచ్చాక వాటిని పునరుద్దిరించామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి కినె్నరసాని, పాలెంవాగు ఆయకట్టు భూములను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. భక్తరామదాసు పథకం స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

నదీ జలాలతో జిల్లాను పునీతం చేస్తాం

ఖమ్మం రూరల్, జనవరి 31: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, సహచర మంత్రి హరీష్‌రావు సహకారంతో కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను పునీతం చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. పాలేరు నియోజకవర్గంలో శాశ్వత కరవును తీర్చేందుకు చేపట్టిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని భక్తరామదాసు జయంతి రోజున ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. ఇదేస్ఫూర్తితో సీతారామప్రాజెక్టును, అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. భక్తరామదాసు పథకంపై ప్రతిపక్షాలు పొంతనలేని ఆరోపణలు చేస్తున్నాయని, ఈపథకం ప్రారంభంతో వారి నోళ్లు మూయించగలిగామన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మానుకొని అభివృద్ధికి తోడ్పాటునందించాలని హితవు చేశారు.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా చెరువులు నింపుతామని, భవిష్యత్తులో మోటార్ల సహాయం లేకుండా కాల్వల ద్వారా పూర్తిగా నీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టులను పరిపూర్తి చేయడంలో రామబంటులా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత సస్యశ్యామలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రజలు నిరంతరం అండగా నిలవాలని ఆకాంక్షించారు.
పండుగ వాతావరణం
తిరుమలాయపాలెం, జనవరి 31: ఇచ్చిన మాట ప్రకారం అతి తక్కువ సమయంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలేరు నియోజకవర్గానికి విచ్చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది.