ఖమ్మం

నేటి నుండి జమలాపురంలో బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, ఏప్రిల్ 7: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయని సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి తెలిపారు. ఏప్రిల్ 8 నుండి 15వ తేదీ వరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 13వ తేదీ అలివేలు మంగా, పద్మావతి అమ్మవార్లతో శ్రీవెంకటేశ్వర స్వామివారి కల్యాణం, 15న శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంచినీటి వసతి, వైద్య సదుపాయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అన్నదానం చేస్తామన్నారు.

నేడు తెలుగు సంవత్సరాది

ఖమ్మం(కల్చరల్), ఏప్రిల్ 7: హిందువులుకు తొలి పండుగ ఉగాది. దీనినే తెలుగు సంవత్సరాదిగా ప్రతి ఇంటా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగ వస్తుంది. అన్ని పండుగలలాగే ఈ పండుగకు ప్రజలు ఉదయానే్న తలస్నాన మాచరించి, కొత్తబట్టలు ధరించి పూజలు నిర్వహిస్తారు. ఉగాదికి ప్రత్యేకంగా ఏ దేవుడ్ని పూజించాలనే నియమనిబంధన లేకపోవడం విశేషం, అందుకే ప్రజలు అన్ని దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలతో పాటు ఇష్టదైవాలను కొలుస్తుంటారు. అనంతరం పరగడుపునే ఉగాది పచ్చడి తీసుకుంటారు. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడని పండింతులు చెబుతారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన మధురమైన పచ్చడే ఉగాది. సంవత్సరం పొడవున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశం నేడు తినే ఉగాది పచ్చడిలో ఉంటుందని పెద్దల విశ్వాసంగా చెప్పుకుంటారు. ఉగాది పచ్చడి తయారీలో చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపూత, చింతపండు, జామకాయలు, పచ్చిమిర్చి, జిలకర, వాము తదితర కొత్తపంటలను వాడతారు. శాస్ర్తియంగా తయారుచేసిన ఈ ఉగాది పచ్చడ్ని శ్రీరామనవమి వరకు ప్రతిరోజు ఉదయానే్న తీసుకోవడం మంచిదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ముందుగా ఆలయాలకు వెళ్ళే ముందు స్వామివారికి ప్రసాదంలో భాగంగా పానకం, వడపప్పు సమర్పిస్తారు. నగరాలు, పట్టణాలలో ఎక్కువగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు నిర్వహిస్తుంటారు. దీని కోసం అన్ని ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. గ్రామాల్లో రైతాంగం వ్యవసాయ పరికరాలు, ఎడ్లు, పాడి పశువులు, బండ్లు తదితరాలను నీటితోశుభ్రపరిచి, వాటికి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఉగాది రోజున పాత వ్యవసాయానికి స్వస్తి పలికి, నూతన వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారులు కొత్త వ్యాపారాలను ఈ సందర్భంగా ప్రారంభించుకోవడం ఆనవాయిగా వస్తున్న విధానం.
ఐద్వా ఆధ్వర్యంలో సంబురాలు
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో త్రీటౌన్‌లో ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గురువారం ఐద్వా త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు స్థానికులను ఆకట్టుకుంది. చిన్న చిన్న కుండల్లో ఉగాది పచ్చడిని తయారుచేసి, వాటిపై అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కు కల్పించాలని, మహిళా హక్కుల కోసం మహిళలంతా సంఘటింతంగా ఉద్యమించాలని, ఐద్వా జిందాబాద్ అంటూ నినాదాలు దర్శనమిచ్చాయి. అనంతరం ఉగాది పచ్చడిని ప్రజలకు ఒకరోజు ముందుగానే పంచిపెట్టారు. ఈ సందర్భంగా 30వ డివిజన్ కార్పోరేటర్, ఐద్వా జిల్లా నాయకురాలు అఫ్రోజ్‌సమీనా మాట్లాడుతూ ఈ నూతన తెలుగు సంవత్సరంలో మహిళలు తమ సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషిచేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అములు చేయాలన్నారు. నగరంలో గతంలో పేద మహిళలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు స్ధలాలు చూపించాలని, అర్హులైన పేదలందరికి డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా త్రీటౌన్ అద్యక్ష,కార్యదర్శులు యర్రా సుకన్య, పత్తిపాక నాగసులోచన, బజ్జోరి ఇందిర, వజినేపల్లి కనకలక్ష్మీ, రవీంద్రమణి, యల్లంపెల్లి పద్మ, అమీనా, ఎ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

రైతాంగాన్ని విస్మరిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం

* రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా
జూలూరుపాడు, ఏప్రిల్ 7: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలక టిఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తుందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. స్థానిక కంగాల బుచ్చయ్య భవన్‌లో గురువారం జరిగిన రైతు సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు కరువు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవటం బాధకరమన్నారు. కరువు దృష్ట్యా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు ముందుగానే గిట్టుబాటు ధర ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పశుగ్రాసం కొరత కారణంగా పశువులను పోషించలేక రైతులు సంతల్లో అమ్ముకునే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని అయన అన్నారు. ఇంతే కాకుండా ప్రభుత్వం 90శాతం సబ్సీడీపై సన్న, చిన్నకారు రైతులకు అందజేయాల్సిన వ్యవసాయ పరికరాలను అనర్హులతో పాటు, అధికార పార్టీకి చెందిన వారికి అందజేశారని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించి ఆదుకోవటంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా మండల పరిధిలో ఉన్న వందల ఎకరాలకు సాగు నీరందించే సామర్ధ్యం కల్గిన పోలారం చెరువును మిషన్ కాకతీయ పథకంలో చేర్చక పోవటం విస్మయానికి గురిచేస్తుందన్నారు. మిషన్ కాకతీయ తొలి దశలో చేపట్టిన చెరువు పనులు అసంపూర్తిగా ఉండగానే మరో వైపు రెండవ దశను ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభిచటం సరికాదన్నారు. ఈసమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొంతు రాంబాబు, డివిజన్ కార్యదర్శి బోడెపుడి వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చీమలపాటి భిక్షం, బానోతు ధర్మా, మండల నాయకులు వాడా వెంకటేశ్వర్లు, బానోతు ఈశ్వర్, ఊడల వెంకటేశ్వర్లు, బానోతు మధు, భూక్యా కృష్ణ, భూక్యా సురేష్, పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, మాళోతు తులిశ్యా, మడి సీతారాములు, గడిదేశి కనకరత్నం, గార్లపాటి వెంకటిలు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఎర్రుపాలెం, ఏప్రిల్ 7: మండలంలో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే భట్టివిక్రమార్క గురువారం శంకుస్థాపనలు చేశారు. ఇనగాలిలోని చింతల చెరువుకు 37లక్షల రూపాయలతో చేపట్టనున్న మిషన్ కాకతీయ పనులకు ఎంపిపి చావా అరుణ, స్థానిక సర్పంచ్ యనమల పావని, ఎంపిటిసి అనిమిరెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఇనిద్రమ్మ చెరువు 28లక్షల రూపాయలతో చేసే పనులకు ఎంపిటిసి దేవి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. పెద్దగోపవరంలో 20లక్షల రూపాయలతో చెక్‌డ్యాం వద్ద నిర్మించే కల్వర్టుకు జడ్పిటిసి అంకశాల శ్రీనివాసరావు, సర్పంచ్ సుంకర వరలక్ష్మి, ఎంపిటిసి కృష్ణార్జనరాజులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నీటి ఎద్దడి విలయతాండవం చేస్తుందని, నీరులేక ప్రజలు, జంతువులు పలు ఇబ్బందులు పడుతున్నారని, సాగర్ నీటితో తాగునీటికి అనువుగా ఉన్న చెరువులన్నింటిని నింపుకోవాలన్నారు.
టిఆర్‌ఎస్ పాలన గాడితప్పిందన్నారు. కింది స్థాయిలో సామాన్యుడు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా పనులు కావడంలేదన్నారు. జవాబుదారీ తనం ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా లేకుండా పోతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంత వరకి ఏ ఒక్కటి పూర్తికాలేదన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఎప్పుడు వస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇంత వరకు అడ్రస్సే లేదన్నారు. జిల్లాకు లక్ష ఎకరాల నీరందించే పథకం ఏమైందో తెలియదన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అమలు కాలేదన్నారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇంత వరకు అందలేదని ఎద్దేవా చేశారు. మూడు బడ్జెట్‌లు అయిపోయినా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేరకపోవడంతో మిగిలిన రెండు బడ్జెట్‌లోనైనా అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌లపై పవర్ ప్రజంటేషన్ ఇవ్వడం కాదు ఆచరణలో చేసి చూపెట్టాలన్నారు. 70శాతం పూరె్తైన ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో మొదటి నుండి చేయడం సమంజసమా అన్నారు. కేవలం సిఎం ప్రచారం కోసమే రీడిజైనింగ్ చేస్తున్నారని, రెండులక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతాయని, దేశంలో అతిపెద్ద స్కాం ఇది అవుతుందన్నారు. దుమ్ముగూడెం, ఇంధిరాసాగర్ ప్రాజెక్టులను తీసివేయకుండా ఇప్పుడు నిర్మించేచోట వాటిని పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐబి డిఇ నారాయణ, ఎఇ రాజేశ్వర్, తహశీల్దార్ సమ్మిరెడ్డి, ఎండిఓ పి విజయ, నరేష్, నాగేశ్వరరావు, జీవన్‌రెడ్డి, నాయకులు బొగ్గుల గోవర్థన్‌రెడ్డి, అనుమోలు కృష్ణారావు, కడియం శ్రీనివాసరావు, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నర్సింహారావు, యన్నం వెంకటేశ్వరరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.