ఖమ్మం

సామాజిక న్యాయాన్ని పోరాటాలతోనే సాధించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 20: పోరాటాలతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సాధించుకుంటామని మహాజన పాదయాత్ర రథసారథి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండలంలోని తెల్దారుపల్లి నుంచి ప్రారంభమైన ఈపాదయాత్ర మద్దులపల్లి, పొనె్నకల్లు మీదుగా తల్లంపాడు వరకు సాగింది. తెల్దారుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగా నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలలో తమ్మినేని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వెంటనే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలన్నారు. పోడుదారులకు పట్టాలిచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసిలకు రాజకీయంగా ఎబిసిడిలుగా వర్గీకరించి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. మహాజన పాదయాత్రతో స్పందించిన కెసిఆర్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో కలిసి చర్చలు జరపడం తమ ప్రారంభ విజయంగా భావిస్తున్నామన్నారు. మార్చి 19న భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, సంజీవరెడ్డి, నండ్ర ప్రసాద్, సిద్దినేని కోటయ్య, సంగయ్య, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే
విద్యుత్ కోతల నివారణ
కొత్తగూడెం, ఫిబ్రవరి 20: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వలన తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను నివారించగలిగామని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఒప్పించి కొత్తగూడెంలో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో బొగ్గు గనుల సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న 625 ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రిజర్వేషన్లను సక్రమంగా అమలుచేయని కెసిఆర్ ప్రభుత్వం కొత్తగా ఎస్టీలకు మరిన్ని రిజర్వేషన్లు అందిస్తామని మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకునేందుకు సింగరేణి వ్యాప్తంగా నాలుగు రోజులపాటు పర్యటించి రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు అందజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విదేశీ బొగ్గును ప్రభుత్వ రంగ సంస్థల్లో వినియోగించటాన్ని నిలిపివేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు ప్రాజెక్టులను అమ్ముకుని అనేక కుంభకోణాలకు పాల్పడితే ఎన్‌డిఎ ప్రభుత్వం బొగ్గు రంగ సంస్థలను కాపాడుతోందన్నారు. అనేక రాష్ట్రాల్లో పరిశ్రమలకు, గృహావసరాలకు ఆన్‌లైన్‌లో విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలను కల్పించిందని అన్నారు. సింగరేణిలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు బిజెపి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేయటం ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కొత్తగూడెంలో ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల రవీంద్ర రెడ్డి, కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ, చిలుకూరి రమేష్, మాధవ్ నాయక్, ఎర్రా రమేష్, రవీందర్, ఎర్రా కామేష్, పద్మావతి, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్‌బుక్ పరిచయంతో అడ్డంగా దొరికిన ఎస్‌ఐ

ఖమ్మం, ఫిబ్రవరి 20: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడి ప్రజలకు చట్టాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఈ క్రమంలో నేరం చేస్తూ ఎస్‌ఐ పట్టుబడిన సంఘటన ఇది. ఫేస్‌బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికిన ఓ ఎస్‌ఐ కథనం ఇది. ఖమ్మం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ విజయ్‌కు ఫేస్‌బుక్‌లో ఓ మహిళతో పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా వారిద్దరి మద్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని పసికట్టిన మహిళ భర్త వీరిద్దరిపై నిఘా పెట్టాడు. హైదరాబాద్‌లోని మోతినగర్ కామధేను అపార్టుమెంట్‌లోని వీరబ్రహ్మం అనేవ్యక్తి ప్లాట్‌లో వీరిద్దరు కలసి ఉండగా మహిళ భర్త ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకొని ఎస్‌ఐ విజయ్‌పై 497, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మంచినీటి ఎద్దడి నివారణకు
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

భద్రాచలం, ఫిబ్రవరి 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఆర్‌డబ్య్లూఎస్, పంచాయితీరాజ్ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏలో జిల్లా, యూనిట్ అధికారులతో సోమవారం జరిగిన ప్రజావాణి గిరిజన దర్బార్‌కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించి లబ్ధి చేకూర్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధిహామీలో పని కల్పిస్తామన్నారు. గతంలో కన్నా ఈ ఏడాది వర్షాలు కురిసినందున భూగర్భజలాలు ఉండి బోర్లు ఎండిపోయే పరిస్థితులు లేనందున ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న బోర్లలో ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్నిటికి మరమ్మతులు చేయించాల్సి ఉందో తెలుసుకోని చర్యలు చేపట్టాలన్నారు. నీటి పైపులు లీకేజీ కాకుండా చూసుకోవడంతో పాటు మోటార్ల నిర్వహణ సక్రమంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్ విజ్ఞాపనలు స్వీకరించారు. గిరిజనులు అందించిన విన్నపాలను 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపుపై టీఎన్‌జీవో అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే రాజయ్య పలు సమస్యలపై కలెక్టర్‌కు విన్నపాలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డీటీడీవో జయదేవ్ అబ్రహాం, ఏపీవో జనరల్ భీమ్‌రావు, డీఎంవో పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.