ఖమ్మం

ఊరికి కీడొచ్చిందని... వనానికి వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 21: జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదులాపురం గ్రామపంచాయతీ శివారు వరంగల్ క్రాస్‌రోడ్‌కు కీడొచ్చిందని స్థానిక ప్రజలంతా మంగళవారం ఒక రోజు వనవాసం చేశారు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రజలు కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాలను ఆచరించడం మండలంలో చర్చనీయాంశంగా పరిణమించింది. వివరాలు ఇలావున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే గ్రామానికి చెందిన సుమారు 30 మంది వరుస మరణాలకు గురయ్యారు. మృతులలో కొందరు మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంటిలో ఇద్దరు మరణించడం, ఒకే వీధిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం, మంగళవారం వచ్చేనాటికి ఎవరో ఒకరు ఆకస్మికంగా ప్రాణాలు విడుస్తుండడం గ్రామస్థులను కలవరపెట్టింది. దీంతో గ్రామానికి చెందిన పెద్దలు కొందరు సిద్ధాంతిని సంప్రదించగా, మృతులలో ఒకరు మంగళవారం మూలా నక్షత్రంలో చనిపోయారని, వరంగల్ క్రాస్‌రోడ్ ప్రాంతంలో వెయ్యి గడపలు దాటినా ఇంతవరకూ వీరాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభం వేయలేదని, అందువల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. గ్రామాన్ని పట్టిన కీడు వదిలిపోవాలంటే ఊరి జనమంతా ఒకరోజు ఊరొదిలి ఊరి పొలిమేరలు దాటి పోవాలని, అదికూడా ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి తిరిగి సూర్యాస్తమయం తరువాతనే ఇళ్ళకు చేరుకోవాలని సిద్ధాంతి చెప్పినట్టు గ్రామస్థులు వివరించారు. గ్రామంలో శాంతి చేకూరాలని భావించిన వరంగల్ క్రాస్‌రోడ్, ఆటోనగర్, మారుతినగర్, లెప్రసీ కాలనీకి చెందిన సుమారు 90 శాతం కుటుంబాలు సూర్యోదయానికి ముందే వాకిళ్లు ఊడ్చకుండా, పొయ్యి వెలిగించకుండా ఊరి పొలిమేర ఆవల ఉన్న మామిడి తోటల్లోకి కొందరు, కరుణగిరి పార్కు, మారెమ్మ టెంపుల్ తదితర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ జనంలేక నిర్మానుష్యంగా మారాయి. ఇలా ఊరొదిలి బయటకు వచ్చిన ప్రజలంతా అక్కడే స్నానాలు ఆచరించి, వంటలు చేసుకొని వనదేతలకు ప్రత్యేక పూజలతో సమర్పించి సామూహిక భోజనాలు చేశారు. ఆతరువాత పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ఆటలు ఆడి, పాటలు పాడి సూర్యాస్తమయం వరకూ కాలక్షేపం చేశారు. అనంతరం తిరిగి ఇళ్ళకు చేరుకొని వాకిళ్లు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు వేసి ఇళ్ళల్లోకి ప్రవేశించి తమను వెంటాడుతున్న భయాందోళనలకు మంగళం పలికారు. ఇదిలావుండగా గ్రామంలోని కొందరు క్రైస్తవ, ముస్లిం కుటుంబాలు మాత్రం ఇళ్ళలోనే ఉండిపోయారు. ఈసందర్భంగా పేరు చెప్పేందుకు ఇష్టపడని కొందరు వ్యక్తులు మాట్లాడుతూ ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించిన ఘనత మన భారతదేశానికి దక్కిందన్నారు. ఈతరుణంలో జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మూఢ నమ్మకాలను పట్టించుకోవడం శోచనీయమన్నారు. సమాజాన్ని మేల్కొల్పాల్సిన ఉపాధాయులే ఈసందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఒకరోజు వనవాసం వెళ్లొచ్చిన వారిని ఈవిషయంపై ప్రశ్నించగా గ్రామ సంక్షేమం కోసం అందరూ ఏ బాటలో నడిస్తే తాము కూడా అదేబాటలో నడుస్తామని, ఈవిధంగా ఊరొదిలి వెళ్ళినప్పటికీ..కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేచోట ఒక రోజంతా గడపడం మాత్రం మర్చిపోలేనిదని స్పష్టం చేశారు.

ఓసీలతో పర్యావరణం విధ్వంసం
* భాజపా నేత కిషన్‌రెడ్డి
మణుగూరు, ఫిబ్రవరి 21: లాభాల కోసం ఓసీలను ప్రోత్సహిస్తూ పర్యావరణ విధ్వంసానికి ప్రభుత్వం కారణమవుతోందని భాజపా శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సోమవారం మణుగూరులో పర్యటించిన ఆయన ఓపెన్‌కాస్టు గనులను పరిశీలించి అనంతరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతమైన గాంధీనగర్ ప్రజల సమస్యలపై వారితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఉల్లంఘిస్తున్నాయన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కేసీఆర్ హామీలను తుంగలో తొక్కి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. లాభాల కోసం ఓసీలను ప్రోత్సహిస్తూ పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఓసీల పేరుతో పట్ట పొలాలను బొందలగడ్డగా మారుస్తున్నారని, అధికారంలోకి వస్తే ఓసీలను అడ్డుకుంటానని చెప్పిన కేసీఆర్ నేడు ఓసీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఈ ప్రాంత ప్రజలు కాలుష్యం కోరల్లో జీవనం సాగిస్తూ రోగాల బారిన పడుతున్నా సింగరేణి యాజమాన్యానికి కనిపించకపోవడం దారుణమన్నారు. సింగరేణి అధికారులు, స్థానిక కాంట్రాక్టర్లు కుమ్మక్కై లాభాలే లక్ష్యంగా పచ్చని పొలాలను మట్టిదిబ్బలుగా మార్చేయడమే కాకుండా నిర్వాసితులకు పరిహారం అందించడంలో కూడా విఫలమవుతున్నారన్నారు. సింగరేణి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తమ తీరు మార్చుకోకపోతే ఈ ప్రాంత ప్రజల పోరాటాలకు భాజపా అండగా నిలుస్తుందని, ఇక్కడ సింగరేణి అధికారులను అడుగు కూడా పెట్టనీయమని హెచ్చరించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, కాంట్రాక్టు కార్మికుల హక్కులను సింగరేణి యాజమాన్యం కాలరాస్తుందని, సింగరేణి అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. హక్కుల సాధనకు స్థానిక ప్రజలు, కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టబోయే భవిష్యత్ పోరాటాలకు భాజపా అండగా నిలుస్తుందని, స్థానిక గాంధీనగర్ వాసుల ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తానన్నారు. గవర్నర్‌ను కూడా కలిసి ఇక్కడ పరిస్థితులను వివరించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. నిర్వాసిత ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, నిర్వాసితులకు భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ పథకాలపై చర్చకు సిద్ధం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నేలకొండపల్లి, ఫిబ్రవరి 21: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలంలోని బోదులబండ, మండ్రాజుపల్లి, చెన్నారం, రాజేశ్వరపురం, మూటాపురం గ్రామాలలో మహాజన పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా పాదయాత్రను ఉద్దేశించి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ పద్ధతులు మార్చుకోవాలన్నారు. అభివృద్ధి చేస్తున్నామని కెసిఆర్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. రైతులు అనేక విధాలుగా నష్టపోతుంటే రైతులకు నష్ట పరిహరం చెల్లించలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచిన కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాల విషయంలో చర్చకు ఎర్ర జెండాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చర్చలకు రమ్మంటే టిఆర్‌ఎస్ మంత్రులు తోకముడిచారన్నారు. ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా ఎర్ర జెండాలు కలసికట్టుగా ముందుకు సాగుతాయన్నారు. హైదరాబాద్‌లో జరిగే మహజన పాదయాత్ర ముగింపు సభలో ఎర్ర జండాలు అన్ని కలసి ఏకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జాన్‌వెస్లీ, రమ, రమణ, అబ్బాస్, ఆశయ్య, గణేష్, శోభన్, నాయక్, రాజు, సైతం, పోతినేని సుదర్శన్‌రావు, గుడవర్తి నాగేశ్వరరావు, మందడపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మందుపాతర పేలి జవాన్‌కు తీవ్రగాయాలు
భద్రాచలం, ఫిబ్రవరి 21: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మందపాతర పేలి సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన భద్రాచలం తీసుకొచ్చి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాదుకు హెలికాప్టర్‌లో తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 212 సిఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు రోడ్డు ఓపెన్ పార్టీగా కూంబింగ్‌కు వెళ్లాయి. తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మపెంట - పైడిగూడెం గ్రామాల మధ్య మావోయిస్టులు మందుపాతర్లు అమర్చినట్లు గుర్తించారు. ఒక మందుపాతరను వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. కొద్ది దూరంలోనే ఉన్న మరో మందుపాతర సమీపంలోకి రాగానే అది పేలింది. దీంతో ఘనాశ్యామ్ అనే జవాన్ కాలికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనతో సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మందుపాతరలు పెట్టినట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తోంది.

నిరుద్యోగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 21: నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో విద్యార్థులను అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు మోసపూరిత వాగ్దానాలు చేశారని, లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. సంక్షేమ పథకాల ద్వారా నిరుద్యోగులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించని కెసిఆర్, వారి ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు పెంచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసిలకు బడ్జెట్ కేటాయించకుండా కాలయాపన చేస్తూ వెనకబడిన కులాల నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016-17 ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులందరికీ ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఎంప్లాయిమెంట్‌లో పేరు నమోదు చేసుకున్న నిరుద్యోగులకు ఐదు వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఈ ధర్నాలో నాయకులు నగేష్, గౌస్‌పాషా, సతీష్‌రెడ్డి, శ్రావణ్, రంజాన్, కలీల్, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నిర్దేశిత లక్ష్యాలను అధిగమించకపోతే చర్యలు

* జెసి రాంకిషన్ హెచ్చరిక
కొత్తగూడెం, ఫిబ్రవరి 21: నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం సన్న బియ్యం అందించేందుకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం రాంకిషన్ హెచ్చరించారు. మంగళవారం ప్రజా పంపిణీ వ్యవస్థ తీసుకుంటున్న చర్యలపై రైస్ మిల్లర్స్, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 84 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మొదటి రకం 1510, రెండవ రకం 1470 చొప్పున 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపామన్నారు. జిల్లాలోని 41 రైస్ మిల్లుల ద్వారా 68.340 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చిలోగా చేరుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సన్న బియ్యం అందించేందుకు 7.637 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని 1161 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించామన్నారు. నిర్దేశించిన సమయంలో బియ్యాన్ని అందించిన అశ్వారావుపేట మండలం వినాయకపురం రైస్ మిల్లర్ చీమకుర్తి నాగేశ్వరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌వో అమృతరెడ్డి, రైస్ మిల్లర్ల ఆసోసియేషన్ ప్రతినిధులు కంచర్ల గోపాలకృష్ణ, పాండు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 900 కోట్ల బకాయిలు

నేలకొండపల్లి, ఫిబ్రవరి 21 : జిల్లా వ్యాప్తంగా దాదాపు 900 కోట్లు బకాయిలు ఉన్నాయని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిఇవో నాగచెన్నారావు వెల్లడించారు. మంగళవారం నేలకొండపల్లిలోని కేంద్ర సహకార బ్యాంక్‌ను సందర్శించి మాట్లాడుతూ ప్రజలకు అందించిన లోన్‌లను రికవరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రాప్ లోన్‌లను రెన్యువల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల వివరాలు కంప్యూటరీకరణ చేయటం జరుగుతుందని దీనికి గాను రైతులు సమగ్ర సమాచారం అందించాలని అన్నారు. రైతుల సమాచారం డిజిటలైజేషన్ చేయబడుతుందని అన్నారు. వీటిని బట్టి రైతులకు రూపే కార్డును అందించటం జరుగుతుందని అన్నారు. వచ్చే మార్చి 10వ తేది కల్లా రైతులు సమాచారం అయా సంఘాలకు అందించాలని అన్నారు. ఏప్రిల్ నెలలో జిల్లా వ్యాప్తంగా 1లక్షా60వేల రూపేకార్డులు అందించనున్నట్లు తెలిపారు. మార్చి నెల వస్తున్న సందర్బంగా సంఘాలలో ఉన్న బకాయిలను రికవరి చేయాలని ఆయా సంఘాల సిఇవోలను ఆదేశించారు. నేలకొండపల్లి మండలంలోని 9 సంఘాలకు గాను 5 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 30 కోట్లు గేదలకు లోన్‌లు ఇచ్చామని మరల ఇప్పుడు 20 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3వేలు టూవీలర్స్‌ను, 2వేలు గేదలను రైతులకు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక రూపే కార్డులను ఖమ్మంజిల్లాకే కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఉపేందర్‌నాధ్, వివిధ సంఘాల సిఇవోలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో వంద ఎకరాల్లో పాలీహౌస్

సత్తుపల్లి, ఫిబ్రవరి 21: జిల్లాలో వంద ఎకరాల్లో పాలీహౌస్ ఏర్పాటుకు ప్రభుత్వం, డిసిసిబి వందశాతం సబ్సిడితో అందిస్తున్న డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు అన్నారు. సత్తుపల్లి శివారులోని ఎ నాగేశ్వరరావుతో కలిసి మువ్వా విజయ్‌బాబు మంగళవారం సందర్శించారు. డిసిసిబి సహకారంతో 80శాతం సబ్సిడీతో కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన పాలీహౌస్‌లో ఉత్పత్తులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, తక్కువ ఖర్చు, ఎక్కువ రాబడి వస్తుందన్నారు. పాలీహౌస్‌ల ఏర్పాటు కోసం రైతులు ముందుకువస్తే బెంగళూరు, పూణే పంపించి పంటలపై అవగాహన కల్పిస్తామన్నారు. రెండు ఎకరాలు పాస్‌పుస్తకం ఉంటే దానినే ష్యూరిటీ కింద తీసుకొని వంద శాతం సబ్సిడీ అందించి రైతులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 13 ఎకరాలకు మాత్రమే పాలీహౌస్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. సత్తుపల్లి ఆంధ్రా సరిహద్దులో ఉండటంతో దిగుబడులు, అమ్మకాలకు ఇబ్బందులు లేవన్నారు. విజయవాడ మీదుగా విదేశాలకు కూడా పంటల ఉత్పత్తులను ఎగుమతులు చేసుకునే అవకాశం ఉందన్నారు. సత్తుపల్లి పాలీహౌస్ మూడు ఎకరాలలో క్యాప్సికం, జరపర, కీరదోస, చామంతి పూలు వేసి మంచి లాభాలు అర్జిస్తున్నారన్నారు.

ఆవేదన జనానికా..? మీకా..?

భద్రాచలం, ఫిబ్రవరి 21: కాంగ్రెస్ నిర్వహిస్తున్న జన ఆవేదన సమ్మేళనాలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, అసలు ఆవేదన జనానికా? లేకా కాంగ్రెస్ పార్టీకా? అని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. భద్రాచలంలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జనం మంచిగానే ఉన్నారని, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోయి కాంగ్రెస్సే ఆవేదనలో ఉందని ఎదురుదాడి చేశారు. భద్రాచలంలో జరిగిన జన ఆవేదన సమ్మేళనంలో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క భాజపా ఆధ్వర్యంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. లక్షల కోట్ల నల్లధనం కాంగ్రెస్ వాళ్ల వద్దే ఉందని, మోదీ పెద్ద నోట్ల రద్దుతో ఆ పార్టీ ఆవేదన చెంది ప్రజలు ఆవేదన చెందుతున్నారని ప్రచారం చేస్తోందని అన్నారు. అసత్య, ఆసందర్భ ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. కిషన్‌రెడ్డి సింగరేణి కార్మికుల సమ్యస్యలపై కొత్తగూడెంలో పర్యటిస్తే ప్రతి కార్మికుడు అతన్ని గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారని, ఆయన యాత్రను విజయవంతం చేసిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎర్రంరాజు బెహరా, ములిశెట్టి రామ్మోహన్‌రావు, కోటేశ్వరీ, మారెమళ్ల సుబ్బారావు, నాగబాబు, పసుమర్తి సతీశ్, నిరంజన్, వెంకన్న, పిసి కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన జాతర.. మురిసిన భక్తజనం

దుమ్ముగూడెం, ఫిబ్రవరి 21: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముత్యాలమ్మ జాతరకు దుమ్ముగూడెంలో భక్తులు మంగళవారం పోటెత్తారు. ఈ నెల 13నుంచి జరుగుతున్న ముత్యాలమ్మ జాతర మంగళవారం చివరి ఊరేగింపుతో ఘనంగా ముగిసింది. జాతర చివరిరోజు కావడంతో వేలాది మంది భక్తులు దుమ్ముగూడెం వచ్చి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. మహిమ గల అమ్మగా పేరుగాంచిన ముత్యాలమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. భక్తుల రాకతో దుమ్ముగూడెం గ్రామం కిక్కిరిసిపోయింది. ఉదయం అమ్మవారిని నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ప్రతిరూపాలైన గరగలను మగవారు ఆడవేషాధారణ ధరించి తలపై ఉంచుకొని పోతురాజు సమేత అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామంలో గడపగడపన గరగలకు హారతులు ఇచ్చి అమ్మవారి దీవెనలను గ్రామస్తులు అందుకున్నారు. ఊరేగింపు కార్యక్రమం భక్తులకు రెండు కళ్లు చాలని విధంగా కొనసాగింది. విచిత్ర వేషధారణలు, నృత్యాలు, ఏలూరుకు చెందిన కళాకారులచే బేతాళ సెట్ చూపరులను ఆకట్టుకున్నాయి.