ఖమ్మం

నూతన జిల్లాలో ఆధిపత్యం కోసం ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 23: జిల్లాల పునర్విభజన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ కోలాహలం మొదలైంది. నూతన జిల్లాలో ఆధిపత్యం కోసం పార్టీలన్నీ ఆరాటపడుతున్నాయి. అధికార పార్టీ మొదలు, ప్రతిపక్షాలన్నీ తమదైన శైలిలో పట్టుకోసం వ్యూహ రచనలు చేస్తున్నాయి. భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో తమ బలగాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఒక్కరే ప్రతిపక్ష పార్టీ ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాలతో పాటుగా, మహబూబ్‌బాద్ ఎంపి స్థానాలన్నీ అధికార పార్టీ తెరాస గుప్పెట్లోనే ఉన్నాయి. ఎమ్మెల్సీ కూడా అధికార పార్టీదే. జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికార పార్టీకి చెందిన నేతలంతా ఇపుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై కనే్నశారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం మినహా మిగిలిన ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, మహబూబ్ లోక్‌సభ స్థానం అన్నీ ఎస్టీకే రిజర్వ్ చేశారు. అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ముందుగానే అన్ని పార్టీల్లోని బలమైన నేతలను కారెక్కించుకుంది. అయితే జిల్లాలో రాజకీయ పరిస్థితులు మిగిలిన జిల్లాల కంటే భిన్నంగా ఉంటాయి. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా కావడంతో ఓటరు నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో? తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార పార్టీలోని లోపాలను, వైఫల్యాలను ఎండగడుతూ దూసుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో నూతన జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ప్రధాన పార్టీలన్నీ ఏ స్థాయిలో ఇక్కడ దృష్టి సారించాయో ప్రస్ఫుటవౌతోంది. ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భద్రాచలంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించగా, ఇటీవలే సింగరేణి కార్మికుల సమస్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కొత్తగూడెం, మణుగూరు గనుల్లో పర్యటించారు. సిపిఎం విషయానికొస్తే ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర జిల్లాలో కార్యకర్తల్లో జోష్ నింపింది. అధికార పార్టీ హామీలు నీటిపాలు అంటూ గ్రామగ్రామాన తమ్మినేని వివరించిన తీరుతో ఆ పార్టీ బలం రెట్టింపు అయిందని తెలుస్తోంది. జన ఆవేదన సమ్మేళనాల పేరుతో కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, కెసిఆర్ కుటుంబ పాలనను ఎండగట్టింది. రెండేళ్ల ముందు నుంచే గ్రామ స్థాయిలో ఉన్న తమ క్యాడర్‌ను తట్టి లేపి ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడంలో ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కృతకృత్యులయ్యారు. సీనియర్ నేతలు వనమా వెంకటేశ్వరరావు, పోరిక బలరాంనాయక్, రేగా కాంతారావు తదితరులు నిత్యం తమ తమ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తమ శ్రేణులు, సంప్రదాయ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సిపిఐ, తెలుగుదేశం, వైకాపా ఇవి కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ కోలాహలం జోరందుకుంది.
ఎన్నికల ఖర్చు వివరాలివ్వని
వారికి నోటీసులు
* జిల్లాలో 12మందికి జారీ

ఖమ్మం, ఫిబ్రవరి 23: 2013సంవత్సరంలో జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని వారికి నోటీసులు జారీచేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లను అదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ కార్యనిర్వాహక అధికారులు, జిల్లా పంచాయితీ, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013-14సంవత్సరంలో జరిగిన పంచాయతీ, పట్టణ సంస్థలకు నిర్వహించిన ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని వారికి నోటీసులు అందజేయాలని సూచించారు. వచ్చే సంవత్సరంలో జరగనున్న ఐదవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్, రెండు నగర పంచాయితీలలో 12మంది అభ్యర్థులకు నోటీసులు జారీచేయటం జరిగిందని ఎన్నికల కమిషనర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మారపాక నాగేష్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, ఎంపిడివో ఏలూరి శ్రీనివాస్‌రావు, తహశీల్ధార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్బంధాలతో నిరంకుశ పాలన
* విద్యార్థి, యువజన సంఘాల నిరసన
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 23: నిరుద్యోగుల నిరసన ర్యాలీ, సభ జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రెండు రోజుల ముందే నాయకులను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ గురువారం నగరంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అభిప్రాయం చెప్పక ముందే అనేక సాకుల చూపించి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, వేధింపులు, ఇబ్బందులకు గురి చేయటం టిఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిదర్శనమన్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రొఫెసర్ కొదండరామ్ ఇంటిపై దాడి చేసి ఆయన్ని అరెస్ట్ చేయటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ సత్వరమే ఉద్యోగాల ఖాళీలను భర్తి చేయాలని, నిరుద్యోగుల అకాంక్షలను గుర్తించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి
ఖమ్మం(ఖిల్లా): హైదరాబాద్‌లో నిరుద్యోగ ర్యాలీకి వెళ్తున్న పిడిఎస్‌యు, పివైఎల్, ఎఐఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల కార్యకర్తలు, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నగరంలో ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు, పివైఎల్ జిల్లా నాయకులు తమ్మిడి మురళీకృష్ణ, నరేష్‌లు మాట్లాడుతూ అణచివేతలు, అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించారని, వారి త్యాగ ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి ఎంతోకాలం నిలవదన్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమాలను అణచాలనుకోవడం అవివేకమన్నారు. నిరుద్యోగ సమస్యను తెలిపేందుకు శాంతియుతంగా వెళ్తున్న నేతలు, నాయకులను అరెస్టు చేయడం కెసిఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. ఉద్యోగ ప్రకటన విషయంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలను అణచాలనుకున్న గత పాలకులకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుందన్నారు. ఇప్పటికైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రాకేష్, ముఖేష్, రేవంత్, నరేష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
కొత్తగూడెం, ఫిబ్రవరి 23: ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అస్సైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల నమోదు చేయటంతోపాటు రైతుల ఆత్మహత్యల కేసుల పరిష్కారం, చేనేత కార్మికుల సంక్షేమం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్‌రూం పథకాల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామంలో శ్మస్మశానవాటికలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేయాలని అన్నారు. జిల్లాలో హరితహారం పథకం కోసం ఏర్పాటు చేసిన 89 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో కూడా మొక్కల పెంపకాన్ని చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత కార్మిక కుటుంబాల స్థితిగతులపై సమగ్ర నివేదక రూపొందించాలన్నారు. జిల్లాలో 170 చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించగా, 322 చెరువుల పనులకు ప్రతిపాదనలు పంపించామని అన్నారు. నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో పనులు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనులను రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్వో కిరణ్ కుమార్, భద్రాచలం ఆర్డీవో శివనారాయణరెడ్డి, నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వెంకటేశ్వరరెడ్డి, సిపివో బాలసౌరి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ప్రతాప్, జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఆర్ కొత్తగూడెంలో ట్రాక్టర్ బోల్తా
* ఒకరు మృతి
* 8 మందికి తీవ్ర గాయాలు
* క్షతాగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
భద్రాచలం, ఫిబ్రవరి 23: చర్ల మండలం ఆర్‌కొత్తగూడెం గ్రామంలో గురువారం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో మడకం బుద్రి (38) చికిత్స పొందుతూ మృతి చెందింది. ట్రాక్టర్‌లో మొత్తం 60 మంది ప్రయాణిస్తున్నారు. 20 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిష్టారం ప్రాంతంలో గల తీగనపల్లి, ఇత్తనపల్లి, తుమ్మనపల్లి, బూరుగుపల్లి గ్రామాల నుంచి చర్ల మండలం మొగళ్లపల్లికి మిర్చి కోతలకు కూలీలను ట్రాక్టర్‌లో తీసుకొస్తున్నారు. చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామానికి రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే గ్రామస్థులు క్షతగాత్రులను చర్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. 20 మందికి గాయాలు కాగా స్థానిక వైద్యులు డా.మల్లిఖార్జున్ వారికి చికిత్స చేశారు. ఎస్సై సత్యనారాయణ అక్కడకు చేరుకుని క్షతగ్రాతులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండగా భద్రాచలంలో చికిత్స చేస్తున్నారు. మడకం బుద్రి అనే మహిళ గాయాలతో మరణించింది. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కోటిరెడ్డిని ఆదేశించారు.
గిరిజనుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
* సేవాలాల్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోరం
కామేపల్లి, ఫిబ్రవరి 23: గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఇల్లెందు శాసన సభ్యుడు కోరం కనకయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ 278జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదే విధంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం దీనికి నిదర్శనమన్నారు. అనంతరం సేవాలాల్ మహరాజ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, సేవాలాల్ సంఘ నాయకులు కిషన్‌నాయక్, బాణోత్ నర్సింహనాయక్, కస్తూరిభాయి, మంగ్యజీ, ఇంచార్జ్ తహశీల్దార్ శ్రీనివాస్, మండల పర్యవేక్షకులు శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌బిఐ సేవలను వినియోగించుకోవాలి

* జిఎం గిరిధర్
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 23: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను వినియోగించుకోవాలని ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ గిరిధర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్టీసి డిపో రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్, లాకర్‌రూంలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ఇది 6వ బ్రాంచ్ అని ఈబ్రాంచ్ అభివృద్ధికి వ్యాపారస్తులు, ప్రజలు తోడ్పడాలని కోరారు. ఇదే స్ఫూర్తితో నగరంలో మరో రెండు బ్రాంచ్‌లను మమతా రోడ్డు, ఎదులాపురం రోడ్డులో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లు రెండు త్వరలో మెర్జ్ అవుతున్నట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో తమ బ్యాంకు ద్వారా 3లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఎస్‌బిఐ రుణసౌకర్యాల గురించి వివరించారు. ముఖ్యంగా గృహ రుణాలకు 8,65 శాతం తక్కువ వడ్డితో రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కార్ రుణాలు, వ్యాపార రుణాలు, విదేశాలలో విద్యాను అభ్యసించేందుకు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. మాక్స్ గెయిన్ రుణాలను కూడ ఇస్తున్నట్లు వెల్లడించారు. ముద్రా రుణాలు 50వేల నుండి 10లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటి లేకుండా అందిస్తున్నామన్నారు. కొన్ని రుణాలకు ఆదాయం పన్ను మూడేళ్ళు రిటన్స్ ధాఖలు చేసి ఉండాలని, రూపే కార్డు ద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు విక్రయించేటప్పుడు నగదు రహిత లావాదేవిలు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి జనరల్ మేనేజర్ బివిఎస్‌కేటి భాస్కర్, రిజినల్ మేనేజర్ ఎ నారాయణరాజు, డిపో మేనేజర్ కె రవీంద్ర, కార్పొరేటర్లు దొరేపల్లి శే్వత, దీపక్‌చౌదరి, కుమ్మరి ఇందిర, వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన

ములకలపల్లి, ఫిబ్రవరి 23: సా మాన్య ప్రజలు న్యాయం కావాలని అడిగితే వారిపై అక్రమ కేసులు పెట్టడం తప్ప తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన జనావేదన, జన సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం కావాలని అడిగే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల బతుకులు మారతాయని, ఇంటికో ఉద్యోగం వస్తుందని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ను గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఇప్పటికైనా కుటుంబ పాలన పక్కనపెట్టి ఎన్నికల హామీలు అమలు చేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఐత సత్యం, ములకలపల్లి మండల నాయకులు పికేటి నర్సింహరావు, ఖాదరబాబా, నర్సింహరావు, గాంధీ, నాగేశ్వరరావు, సురేష్, కారం శ్రీరాములు, వనమాగాంధీ, రమాదేవి, హుస్సేన్, చన్నకేషవులు తదితరులు పాల్గొన్నారు.

5,6,7 తేదీల్లో క్రీడాపోటీలు
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 23: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 5,6,7 తేదీల్లో ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో మహిళలు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తాటి నిర్మల, ఏపూరి లతాదేవిలు తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా మహిళలకు మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, లెమన్‌స్పూన్, తాడుగుంజుట తదితర క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ సదస్సుకు నేలకొండపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా పద్మావతి, పొలిటికల్ సైన్సు రిటైర్డ్ అధ్యాపకురాలు డాక్టర్ పి రాధాగోపినాధ్, తెలంగాణ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్ఫర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సిహెచ్ సీతామాలక్ష్మి, ఖమ్మం రూరల్ ఎంపిపి మేళ్ళచెర్వు లలిత తదితరులు పాల్గొంటారన్నారు. క్రీడలతో పాటు జిల్లాస్థాయి సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనుననట్లు తెలిపారు.
పకడ్బందీగా శాంతిభద్రతల పర్యవేక్షణ

* ఐజిపి నాగిరెడ్డి
ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 23: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కీలకమైన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలని నార్త్‌జోన్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై నాగిరెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తొలుత పోలీస్ క్లబ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఖాసీం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలకగా సాయుధ పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం ఖమ్మం నగరంలోని ఏసిపి కార్యాలయానికి చేరుకొని వరకట్న హత్య, ఎస్సీ, ఎస్టీ, నిర్భయ చట్టం కేసులపై చర్యలు, కేసుల స్థితిగతులు, దర్యాప్తు అంశాలను పరిశీలించారు. అనంతరం సబ్ డివిజన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్లతో సమావేశమై మెరుగైన సేవలనందించేందుకు తగు సూచనలు చేశారు. అనంతరం ఏసిపి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
సమావేశంలో అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, ఖమ్మం ఏసిపి సురేష్‌కుమార్, సిఐలు సారంగపాణి, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటనర్సయ్య, నాగేంద్రచారి, వెంకన్నబాబు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

త్రివేణి పాఠశాలలో శివరాత్రి వేడుకలు
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 23: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక త్రివేణి పాఠశాలలో గురువారం శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపాలతో విద్యార్థులు ఏర్పాటు చేసిన శివలింగాలు చూపరులను ఎంతగానో అకట్టుకున్నాయి. పూజారి, శివుడు వంటి విచిత్రవేషదారాణలతో విద్యార్థులు అలరించారు. పూజరి వేషదారణలో ఉన్న విద్యార్థి పఠించిన మంత్రోచ్చరణ, శ్లోకాలు మంత్రముగ్ధులను చేసాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరక్టర్ వీరేంద్రచౌదరి మాట్లాడుతూ శివరాత్రి రోజున ఉపవాస నియమనిష్టలతో గడిపి తెల్లవారు జామునా శివలింగానికి పంచాబృతాలను అభిషేకిస్తే అనేక పలితాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వరరావు, మురళికృష్ణ, అన్నపూర్ణదేవి, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.

నిఘా నేత్రాల మధ్య ‘తీర్థాల’ జాతర

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తీర్థాల సంగమేశ్వరాలయం వద్ద ఐదు రోజుల పాటు జరిగే జాతరకు అధికారులు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆలయం, ఆలయం వెలుపల మొత్తం 10 సిసి కెమెరాలను అమర్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు వారు వివరించారు. పుణ్య స్నానాల కోసం సాగర్ నీటిని మునే్నరులోకి వదిలామని, మహిళల కోసం జల్లు స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించినట్టు తెలిపారు. తాగునీటి కోసం ట్యాంక్‌లు, ప్రత్యేక బోర్లు నిర్మించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి నాలుగు వైపులా ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు. నిరంతరం విద్యుత్ ఉండేలా తగు ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోరా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం తీర్థాల వంతెన ప్రక్కన, అదేవిధంగా కామంచికల్లు - తీర్ధాల మధ్యగల మునే్నటిలో గ్రావెల్‌తో రోడ్లు నిర్మించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్లకు ఆలయ ప్రాంగణం వద్దకు వెళ్లేలా అవకాశం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం ఖమ్మం నుంచి కామంచికల్లు వరకు ఆర్టీసి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కామంచికల్లు బస్‌స్టాప్ నుంచి తీర్థాల సంగమేశ్వరాలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. వివిధ రకాల దుకాణాలను ప్రధాన రహదారికి 10 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. పోలీస్, పిహెచ్‌సి, రెవెన్యూ, పంచాయితీరాజ్ తదితర శాఖలకు ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు.
జాతర సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిఐ తిరుపతిరెడ్డి తెలిపారు. సిఐలు-6, ఎస్‌ఐలు 15, ఎఎస్‌ఐ/హెచ్‌సిలు 30, కానిస్టేబుళ్లు 120 మంది, మహిళా పోలీసులు 30, హోంగార్డులు 50, మహిళా హోంగార్డులు 10 మంది విధులు నిర్వహిస్తారని ఆయన వివరించారు.