ఖమ్మం

శంభో శివశంభో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగాయి. శుక్రవారం తెల్లవారుఝామునుండి భక్తులు ఆలయాలకు చేరుకొని శివునికి అత్యంత ఇష్టమైన రీతిలో పంచామృతాలతో అభిషేకాలను చేశారు. ఖమ్మం నగరంలోని పురాతన గుంటుమల్లయ్యస్వామి, శుక్రవార తోటలోని శివాలయం, ముస్త్ఫానగర్, రోటరినగర్, బ్రాహ్మణబజార్ ప్రాంతాలలోని శివాలయాలలో భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారే సరికే ఏ శివాలయంలో చూసినా వందల సంఖ్యలో భక్తులు ఉండటం విశేషం. కొంత మంది తమ పిత్రుదేవతలకు పిండప్రదానాలు కూడ చేశారు. ఖమ్మం నగర సమీపంలోని తెల్దారుపల్లి, తీర్థాల సంఘమేశ్వరాలయం, కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయం భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఖమ్మం డిఎస్పీ సురేష్‌కుమార్, ఆర్డీవో పూర్ణచంద్రరావులు గుంటుమల్లయ్యస్వామి, తీర్థాల సంఘమేశ్వరస్వామి ఆలయాలలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ బాలసాని కుటుంబ సమేతంగా తీర్థాలలో, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవితలతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూసుమంచి శివాలయంలోను పూజలు నిర్వహించారు.
ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామంలో పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే ఖమ్మం నగరంలో పూజలు నిర్వహించారు. ఇలా ఉండగా కూసుమంచి మండలం జక్కేపల్లి శివారులోని శివాలయంలోను, తీర్ధాల సంఘమేశ్వరస్వామి ఆలయం, కారేపల్లి కొటిలింగాల, పెనుబల్లి నీలాద్రిశ్వరస్వామి ఆలయం వద్ద జాతరలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
పండగ వేళ విషాదం
* గోదావరిలో మునిగి నలుగురు విద్యార్థుల మృతి
* శోకసంద్రంలో ఏడూళ్ల బయ్యారం, ఉప్పాడ గ్రామాలు
పినపాక, ఫిబ్రవరి 24: తెల్లవారక ముందే శివ దర్శనం కోసం వెళ్లి ఆలయంలో పూజలు చేసి చెంతనే ఉన్న పవిత్ర గోదావరి నదిలో స్నానాలకు వెళ్లిన నలుగురు ఐటిఐ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం పినపాక మండలం చింతల బయ్యారంలో జరిగింది. మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన అల్లి నాగేంద్రకుమార్ (20), గూదే ప్రేమ్‌కుమార్ (21), తంతరపల్లి మురళీకృష్ణ (20), ఉప్పాకకి చెందిన భువనగిరి పవన్ (20) వారం రోజుల క్రితమే ఐటిఐ పరిక్షలు రాసి వారి వారి గ్రామాలకు చేరుకున్నారు. మహా శివరాత్రి సందర్భంగా చింతలబయ్యారం పవిత్ర గోదావరి నది చెంతనే ఉన్న ఆలయానికి వెళ్లారు. ఉదయానే్న శివాలయానికి చేరుకుని పూజలు చేసి గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. వెళ్లిన కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరు నదిలో మునిగిపోయారు. ఒకరిని ఒకరు రక్షించుకోబోయి నలుగురూ గల్లంతయ్యారు. ఐదో విద్యార్థి సంఘటనను చూసి కేకలు వేసుకుంటూ ఒడ్డుకు చేరుకుని చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. నదిలో చేపల వేటకు వచ్చిన జాలర్లతో గ్రామస్థులు గాలించగా నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్లు స్థానికులు, ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికందిన పిల్లలు తమకు అండగా ఉంటారని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు.
ప్రముఖుల పరామర్శలు: గోదావరిలో స్నానానికి వెళ్లి చింతలబయ్యారంలో మృతి చెందిన నలుగురు ఐటిఐ విద్యార్థుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి ఆయన చేరుకుని జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు. మృతదేహాలకు గోదావరి నది ఒడ్డునే పంచనామాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డిఎస్పీ అశోక్‌కుమార్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మైత్రీ చేయూత : మృతుల కుటుంబాలకు దహన ఖర్చుల నిమిత్తం ఏడూళ్ల బయ్యారానికి చెందిన మైత్రీ ట్రస్ట్ నుంచి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని వెంకటరెడ్డి అందించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
* పలువురికి తీవ్ర గాయాలు
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 24: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరికొంత మందికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైన సంఘటనలు శుక్రవారం మండలంలో చోటు చేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం ముల్కలపల్లి నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఆటోను ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ మండలంలోని వాల్యాతండా వద్ద ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణీకుల్లో మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన కొర్లపాటి సుధారాణి అక్కడికక్కడే మృతి చెందింది. డోర్నకల్ మండలం గొల్లచర్లకు చెందిన అమరబోయిన భద్రమ్మ తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మిగిలిన ప్రయాణీకులుప్రాణాలతో బయటపడ్డారు.
కాగా తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన ఆటో ఖమ్మం వస్తుండగా, అదే సమయంలో ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ బారుగూడెం సమీపంలో ఢీకొంది. ఆటోలో ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ తెట్టెలపాడుకు చెందిన పుల్లూరి నాగేశ్వరరావు, అతని భార్య పద్మ, అదే గ్రామానికి చెందిన గోకినపల్లి శ్రీను, నేలమర్రి రమేష్, వల్లోజి రాజు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో వీరందరికీ బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పద్మను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పద్మతో పాటు గోకినపల్లి శ్రీను కూడా మరణించారు. పుల్లూరి నాగేశ్వరరావు, పద్మలకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్ళయిన కొద్ది నెలల్లోనే పద్మ మృతి చెందడం విచారకరం. ఒకేగ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నియంతృత్వం వైపు కెసిఆర్ అడుగులు
* సిపిఎం రాష్ట్ర నాయకుడు పోతినేని ఆందోళన
ఖమ్మం (కల్చరల్), ఫిబ్రవరి 24: కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతృత్వంవైపు అడుగులేస్తోందని, జలగం వెంగళరావు పాలనను గుర్తుచేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయాన నిర్మించుకున్న హామీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయానా చేసిన వాగ్ధానాలు 3 సంవత్సరాలైనా అమలుకు నోచుకోనందుకు నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేయడమే సియంకు రాజద్రోహంలా కనిపించిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ సమైక్యాంద్రా పాలకులు కూడా చేయనంత దౌర్జన్యంగా అర్ధరాత్రి కోదండరామ్ ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్టు చేయడం, కేసిఆర్ అసహనాన్ని, నిరంకుశవైఖరిని తెలియజేస్తుందన్నారు. రాష్టమ్రంతటా నిరుద్యోగులను, విద్యార్థులను, జెఎసి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడమే కాకుండా, హైద్రాబాద్‌లో పాకిస్తాన్ సరిహద్దుల్లోలాగా పోలీసు బలగాలను మోహరించి ఎమర్జెన్సీని తలపించారని విమర్శించారు. యూనివర్శిటిలను జైళ్ళుగా మార్చిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. వెంగళరావు లాంటి ముఖ్యమంత్రులను, ఎమర్జెన్సీ చీకటి రాజ్యాన్ని, నిరంకుశ నైజాం పాలనకు చమరగీతం పాడిన చరిత్ర తెలంగాణ ప్రజలకుందని హెచ్చరించారు. ఇప్పటికైనా సిఎం నిరంకుశ చర్యలు మానుకొని, ప్రజా సంఘాలతో, ఉద్యమనాయకులతో, ప్రతిపక్షాలతో చర్చించి చేసిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహాజన పాదయాత్ర జిల్లాలో సుమారు 16 రోజులపాటు 342 కిలోమీటర్లు సంపూర్ణంగా విజయవంతమైందని సిపియం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. సుమారు 2 లక్షల మంది పాల్గొన్నారని, గ్రామ గ్రామాన, మండల, పట్టణ కేంద్రాల్లో అపజలు పాదయాత్రకు బ్రహ్మరధం పట్టి స్వాగతించారన్నారు. రాజకీయ పార్టీ నాయకులు, వామపక్షాలు, సామాజిక సంఘాలు, మేధావులు, విద్యావంతులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, గిరిజన తదితరులు తమ సమస్యలపై వేలాది దరఖాస్తులు ఇచ్చారన్నారు. సమావేశంలో పార్టీ రాట్ర కమిటి సభ్యులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, మరో 35 మంది జిల్లా కమిటి సభ్యులు పాల్గొన్నారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణం
* కొణిజర్లలో ఎంపి ప్రత్యేక పూజలు
కొణిజర్ల, ఫిబ్రవరి 24: శివ, పార్వతుల కల్యాణ మహోత్సవాన్ని మండలంలో వివిధ ఆయాలలో శుక్రవారం వైభవంగా జరిపారు. మండల కేంద్రం కొణిజర్ల తనికెళ్ళ, పల్లిపాడు, రెడ్డిగూడెం గ్రామాలలో శివాలయాలలో కల్యాణాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కొణిజర్లలో ఉదయం, తనికెళ్ళ, పల్లిపాడు, రెడ్డిగూడెం ఆలయాలలో స్వామి వారికి రాత్రి కల్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. కొణిజర్లలోని కట్ట్భుగలింగేశ్వర స్వామి వారి కల్యాణానికి స్థానిక ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పుష్పలత హజరై ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కల్యాణ అనంతరం భక్త బృందం భక్తులకు అన్నదానం చేశారు.

తీర్థాలలో జనం జాతర

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తీర్థాలలోని గంగా పార్వతీ సమేత సంగమేశ్వరాలయం శుక్రవారం భక్తజనం సందోహంతో కిక్కిరిసిపోయింది. గురువారం అర్థరాత్రి నుంచే భక్తులు తీర్థాల సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని దీవెనలందుకున్నారు. శుక్రవారం ఖమ్మం ఆర్డీవో పూర్ణచందర్‌రావు, ఖమ్మం డిఎస్‌పి సురేష్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం రూరల్, రఘునాధపాలెం తహశీల్దార్లు శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, కార్పోరేటర్లు దారావత్ రామ్మూర్తినాయక్, తోట రామారావు, ఎంపిపి లలిత తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు గురువారం రాత్రే ఆలయం వద్దకు చేరుకొని జాగారం చేశారు. మునే్నరు, ఆకేరులో నీరు తక్కువగా ఉండడంతో సగానికి పైగా భక్తులు ఇళ్లవద్దనే స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు. ఆలయానికి నాలుగు దిక్కులా ద్వారాలు ఏర్పాటు చేయడంతో భక్తులు అతికొద్ది సమయంలోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించింది. కుటుంబాలతో సహా జాతరకు వచ్చిన వారంతా ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న పామాయిల్, మామిడి తోటల్లో చెట్ల కింద వంటలు ఆవాసం ఏర్పర్చుకున్నారు. మునే్నరు, ఆకేరులో ఉన్న కొద్దిపాటి నీటిలో కొందరు పుణ్యస్నానాలు ఆచరించగా, మరికొంతమంది సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద స్నానమాచరించి ఆలయాన్ని సందర్శించుకున్నారు. మునే్నరు ఆవల ఉన్న రఘునాధపాలెం మండలం కామంచికల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన బస్టాప్ నుంచి భక్తులను ఆలయం వద్దకు చేర్చేందుకు ఉచిత బస్‌సౌకర్యం కల్పించారు. భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో వేయించిన రోడ్లు సత్ఫలితాన్నిచ్చాయి. దుకాణాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేయడంతో భక్తజనంతో అవి కిటకిటలాడాయి. ఆలయ ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల అత్యంత సులువుగా స్వామివారిని దర్శించుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, దాతల ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోరా ప్యాకెట్లను పంపిణీ చేశారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జైంట్‌వీల్స్, రంగుల రాట్నం భక్తులను ఎంతో ఆహ్లాదపరిచాయి. సిసి కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను ఆర్డీవో పూర్ణచందర్‌రావు, డిఎస్‌పి సురేష్‌కుమార్, సిఐ తిరుపతిరెడ్డి, తహశీల్దార్ నరసింహారావు, ఇఓ సూర్యప్రకాష్ తదితరులు పర్యవేక్షించారు. ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భక్తుల దాహార్తిని తీర్చేందుకు 60వేల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎవిపాలెం పిహెచ్‌సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో వైద్య సేవలు అందించారు.

భక్తులతో పోటెత్తిన లక్ష్మీపురం

వైరా, ఫిబ్రవరి 24: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం ఆలయంలో జరిగిన పూజలతో భక్తుల శివనామస్మరణ ఘనంగా జరిగింది. శుక్రవారం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడి వైరానదిలో తెల్లవారుజామున భక్తులు శిరోస్నానాలు ఆచరించి అక్కడి 3గంటల నుండి ప్రారంభమైన ఆలయ దర్శనం మధ్యాహన్నం 3గంటల వరకు కూడా అదే రీతిలో ఆగకుండా దర్శనం జరిగింది. ఒకింత ఆలయ ఉత్సవకమిటి భక్తులు క్యూలో నిలబడ్డతీరును నిరోధించలేకుండా పోయారు. అటువంటి సమయంలో పోలీసువారు కలుగజేసుకుని భక్తుల ఉధృతిని చాలా వరకు తొక్కిసలాటను ఆపగలిగారు. మరోవైపు వచ్చిన భక్తులకు వంట భోజనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడానికి స్థలం దొరకక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మహిళలు నదిలో స్నానాల తరువాత బట్టలు మార్చుకోవడానికి సరియైన వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. గతంలో ఈవిషయమై స్థానిక ఎమ్మెల్యే మదన్‌లాల్ అధికారులతో చర్చించినప్పటికీ ఏర్పాట్లా విషయంలో మహిళా భక్తులు కొంత నిరాశకు గురయ్యారు. కనీస వసతులలో భాగంగా మహిళలకు స్నానఘట్టాలు ఏర్పాటులో అధికారుల విఫలం కొట్టొచ్చినట్లు కన్పించిందనే చెప్పాలి. భక్తులకు రవాణసౌకర్యం మాత్రం ఘనంగా జరిగింది. వైరా బస్టాండ్ నుండి ప్రతి 5నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటైతే జరిగింది. మరో వైపు గత సంవత్సరం రబీపంటల సాగులేనందున భక్తులు ఎక్కడబడితే అక్కడే వంటలు చేసుకుని ఆరగించారు. కాని పొలాలు పచ్చని పంటలతో ఉండటంతో గత ఏడాదికంటే ఈయేడు దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. వంటల ఇబ్బంది బాగా జరిగింది. శివపార్వతుల కళ్యాణానికి మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ సైతం స్వామిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గ్రామ సర్పంచ్ దొడ్డా ఉషారాణి, దొడ్డా పుల్లయ్య, వనమా విశే్వశ్వరావు, మచ్చా వెంకటేశ్వరావు, తన్నీరు జ్యోతి, తాతా నిర్మల, చింతనిప్పు రాంబాబు, పోట్లపల్లి నాగేశ్వరావు, బొమ్మిడాల శ్రీనివాసరావు, నూతి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.