ఖమ్మం

2న కూసుమంచికి దిగ్విజయ్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన ఆవేదన సమ్మేళన సభకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్‌సింగ్ హాజరు కానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం వంతం చేసేందుకు కాంగ్రెస్ ఆధ్యర్యంలో మార్చి 2న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్లయం పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలతో అధికారం చేపట్టిన కెసిఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసిందిలేదన్నారు. దేవుడు మొక్కులు చెల్లిస్తున్న కెసిఆర్ ప్రజల మొక్కులు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరిని మాయమాటలతో మోసం చేశారని దుయ్యబట్టారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఉచిత విద్య, రైతు రుణాలు, నిరుద్యోగ సమస్య అంటూ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మాట నిలబెట్టుకోలేని కెసిఆర్‌ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు నిర్వహిస్తున్న జన ఆవేదన సమ్మేళన సభలో కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. విలేఖరుల సమావేశంలో నాయకులు వడ్డెబోయిన శంకర్, దీపక్‌చౌదరి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభువు చూపిన
మార్గంలో నడవండి
* చర్చి ప్రారంభోత్సవంలో బిషప్ పాల్ మైసన్
కల్లూరు, ఫిబ్రవరి 26: ప్రభువుచూపిన మార్గంలో నడిచినట్లయితే కుటుంబాలు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలపడతాయని, ప్రభువు పట్ల భయ భక్తులు కలిగి జీవించాలని ఆర్‌సిఎం బిషప్ పాల్ మైసన్ పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మండలపరిధిలోని టి వెంకటాపురం గ్రామంలో రూ. 3 లక్షల వ్యయంతో నిర్మించిన చర్చి ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. మండలపరిధిలోని టి వెంకటాపురం గ్రామంలో రూ. 3లక్షల వ్యయంతో నిర్మించిన మరియ తల్లి గుహను బిషప్ ప్రారంభించగా రూ. 25 లక్షలతో నిర్మించిన నూతన చర్చిని జర్మనీ దేశస్థులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ చైర్మెన్ పిడమర్తి రవి, గురువులు రాజేంద్ర ప్రసాదు, చార్లెస్ సంతోష్, ఏసు బాబు, పలువురు చర్చి ఫాదర్‌లు, కన్యాస్ర్తిలు పాల్గొన్నారు.

తీర్థాల జాతరలో అదే జోరు

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 26: తీర్థాల జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గంగా పార్వతీ సమేత సంగమేశ్వరస్వామివారిని తీర్థాల పుర వీధులలో మేళతాళాలు, కొమ్ము నృత్య ప్రదర్శనలతో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం ఆలయంలోకి తీసుకొని వచ్చిన గంగా, పార్వతీ సమేత సంగమేశ్వరస్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో భక్తులు మూడవ రోజు వేలాదిగా తరలిరావడం ఇదే మొదటిసారని స్థానిక పెద్దలు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా దుకాణాదారులు మూడోరోజే ఖాళీ చేసి వెళ్లేవారు. అటువంటిది భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో దుకాణాదారులు తమ దుకాణాలను కొనసాగించారు. జాతర సందర్భంగా తీర్థాల ఆలయ ప్రాంగణంలో స్థలాన్ని విశాలంగా చేయడం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంలో విశేష కృషి చేసిన రూరల్ సిఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ చిరంజీవి తదితర సిబ్బందిని ఆలయ ఇఓ సూర్యప్రకాష్‌రావు సాంప్రదాయ బద్దంగా శాలువాలు ఘనంగా సత్కరించారు.

దేశభక్తి నృత్యాలతో మురిసిన భరతమాత
* ఆకట్టుకున్న అంతర్జాతీయ గాంధీపథం నాట్యోత్సవం

భద్రాచలం, ఫిబ్రవరి 26: చరిత్ర సంస్కృతుల సంగమం రామదాసుని కళాక్షేత్రం భద్రాద్రి. మానవ వనరులకు కళాగంధం అబ్బితే మహోన్నత భారతం ఆవిష్కృతం అవుతుంది. అదే సంకల్పం.. అదే స్ఫూర్తి స్వాగత నవతోరణాలు నయన మనోహర నాట్యాలు భద్రాద్రిలో సుసంపన్నం, సముజ్వలం అయ్యాయి. అంతర్జాతీయ గాంధీపథం ఆధ్వర్యంలో ఆదివారం అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో నిర్వహించిన నాట్యోత్సవంలో చిన్నారులు దేశభక్తి గీతాలతో భరతమాతను మురిపించారు. దేశభక్తి గీతాలు, అందుకనుగుణంగా చిన్నారులు ప్రదర్శించిన తీరుతో ఆహుతులు సైతం గుండెల్లోని తమ దేశభక్తిని జై బోలో భారత్‌మాతాకీ జై అంటూ నినదించారు. జానపదం, కూచిపూడి, గిరిజన సంప్రదాయ నృత్యం, పాశ్చాత్యం ఏదైనా అన్ని రూపాల్లో చిన్నారులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇదిగో ఆ చిత్రమాలిక....

ఎస్సీ వర్గీకరణ కృష్ణమాదిగ వల్ల సాధ్యం కాదు
* ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 26: ఎస్సీ వర్గీకరణ కృష్ణమాదిగ వల్ల సాధ్యం కాదని, వర్గీకరణను తానే పోరాడి సాధిస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో కృష్ణమాదిగ తన పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోడి అపాయింట్‌మెంట్ కోసం తాము ప్రయత్నించగా కృష్ణమాదిగ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బిజెపి రాష్ట్ర నాయుకుడు కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన అన్నారు. ముస్లింలకు 12శాతం, ఎస్సీలకు 18శాతం, బిసిలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నామన్నారు. ఎబిసిడి వర్గీకరణ అనే అంశం అంబేద్కర్ ఆలోచనా విధానంలో లేదన్న ప్రశ్నకు సమాధానంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎబిసిడి వర్గీకరణ జరపాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో సేవాలాల్, ముస్లిం వికాస వేదిక, మాదిగ జెఎసి, బిసి జెఎసిలతో సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ల విషయంలో కలసి ఉద్యమించేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. మాదిగ జెఎసి జిల్లా అధ్యక్షుడుగా చారిశ్రీరాం, ప్రధాన కార్యదర్శిగా మురళీ, మధిర అసెంబ్లీ ఇంచార్జ్‌గా నారపోగు వెంకటేశ్వరరావులను ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు వినాయకరావు, మురళీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బౌద్ధస్తూపాన్ని సందర్శించిన విదేశీ ప్రతినిధులు
నేలకొండపల్లి, ఫిబ్రవరి 26: దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లి గ్రామంలోని బౌద్ధస్తూపంను వివిధ దేశాలకు చెందిన బౌద్ధమత ప్రతినిధులు సందర్శించారు. అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 23,24 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన రెండురోజుల కార్యక్రమంలో 16దేశాలకు గాను 33మంది విదేశీ ప్రతినిధులు హాజరై అనంతరం ఆదివారం నేలకొండపల్లి గ్రామంలోని బౌద్ధస్తూపంను సందర్శించారు. ఇక్కడకు వచ్చిన విదేశీ బౌద్ధమత ప్రతినిధులకు స్థానిక తహశీల్దార్ దొడ్డారపు సైదులు, స్థానిక గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, సిద్ధార్థ్ యోగా విద్యాలయం చైర్మన్ డాక్టర్ రామచందర్‌రావు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ విదేశీ బౌద్ధమత ప్రతినిధులు మలేషియా, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్, కెనడా, చికాగో, జాన్సీపుర, ఐలాండ్, లాసో, ఇండోనేషియా తదితర దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు సందర్శించారు. అనంతరం బౌద్ధస్థూపం యొక్క చరిత్రను అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. బౌద్ధస్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి బౌద్ధస్తూపం ముందు ఏర్పాటు చేసిన బుద్ధ భగవానుడి చిత్రపటం ముందు పూలువేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్తూపం ఇటుకలను తాకి కళ్ళకు అద్దుకున్నారు. అనంతరం బౌద్ధస్తూపం వద్ద గల సిద్ధార్థ్ యోగా విద్యాలయంకు బౌద్ధమత విదేశీ ప్రతినిధులు వెళ్ళగా అక్కడ చిన్నారులు భరతనాతోట్యంతో స్వాగతం పలికారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అంటూ నినాదాలు చేస్తూ ప్రతినిధులను విద్యాలయంలోకి తీసుకొనిపోయారు. విద్యాలయం వద్ద గల బుద్ధవిగ్రహానికి పూలువేసి జ్యోతిని వెలిగించి ప్రార్థనలు చేశారు. అనంతరం యోగా కేంద్రంలో ఉన్న మెడిటేషన్ హాల్‌లో విదేశీ ప్రతినిధుల గురువులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధార్థ్ యోగా విద్యాలయం చైర్మన్ డాక్టర్ రామచందర్‌రావు మాట్లాడుతూ నేలకొండపల్లి గ్రామంకు చెందిన బౌద్ధ వస్తువులతో ఇక్కడి ప్రాంతంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రజల తరుపున విన్నవించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర పర్యాటకశాఖ జిఎం మనోమర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్ట్‌కు ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించిందన్నారు. బుద్ధవనం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం 22కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. నేలకొండపల్లిలోని దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన ఈ బౌద్ధస్తూపంను అభివృద్ధి చేసేందుకు ఏమేమి చేస్తే బాగుంటుందో బౌద్ధమత గురువులు ఇచ్చే సూచనలతో ప్రభుత్వంకు నివేదిక పంపుతామన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, గ్రామపెద్దలు వెన్నపూసల సీతారాములు, మల్లిఖర్జున్, ఉన్నం వెంకయ్య, కాసాని నాగేశ్వరరావు, రావెళ్ళ సుదర్శన్‌రావు, మోరం మల్లయ్య, రవీందర్, రఘపతిరావు, రేణుక, శ్రీనివాసరావు, చిర్ర రవి, నాగభూషణం, పద్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అష్టలక్ష్మి యాగం ద్వారా ఐశ్వర్యసిద్ధి
కామేపల్లి, ఫిబ్రవరి 26: అష్టలక్ష్మియాగం నిర్వహించుకోవడం ద్వారా లకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని టిటిడి వేద పండితులు అవధానుల పరమేశ్వర ప్రసాద్ వివరించారు. ఆదివారం కామేపల్లిలోని బాలత్రిపుర సుందరి ఇష్టకామేశ్వరి స్వామి దేవస్థానంనందు నిర్వహిస్తున్న శ్రీ మహామృత్యుంజయ జప ఊర్వారుక విశ్వశాంతి మహాయాగంలో భాగంగా అష్టలక్ష్మి ఉపయాగం మూడవరోజు అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ యాగ నిర్వహణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవదానుల ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో విలువైన ఈ మహాయాగంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. భక్తులకు అఖండ దనప్రాప్తి, వ్యాపారవృద్ధితో పాటు అష్టలక్ష్మి యొక్క కరుణాకటాక్షలు ఈ యాగం ద్వారా లభిస్తాయని వివరించారు. ప్రత్యేకంగా ఈ యాగాలు నిర్వహించుకోవడం మనకి సరిపడదని, అవదూతేంద్ర భక్తమండలి ద్వారా విశ్వశాంతి యాగంలో పాల్గొనవల్సిందిగా భక్తులకు ఉపదేశించారు. ఈ యాగానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవచనం, గోపూజ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, సూర్యనమస్కారాలు, చండీ పారాయణం, మహా మృత్యుంజయ జపహోమంతో పాటు సుమారు 20మంది వేద పండితులచే ఉపనిషత్తులు, భగవద్గీత పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం శ్రీనివాస్‌చే సుందరాకాండ ప్రవచనం జరిగింది.

ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు క్యాలెండర్ ప్రకటించాలి
* ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి
* తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం
కొత్తగూడెం, ఫిబ్రవరి 26: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలకు, పోటీ పరీక్షలకు క్యాలెండర్ ప్రకటించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. విద్యావంతులైన నిరుద్యోగులకు పోటీ పరీక్షల వివరాలను ముందుగా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం స్థానిక ఉర్దూఘర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులతోపాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సామాజిక మార్పు కోసం క్రియాశీలకంగా పనిచేస్తామని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించాలని నిర్వహించిన ర్యాలీని అడ్డుకోడం అప్రజాస్వామికమన్నారు. విద్య సామాజిక మార్పుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాల నియామకాలను వెంటనే చేపట్టాలని కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్న విద్యా బోధన విధానాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలన్నారు. ప్రాథమిక విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. మానవజాతి విలువలను పెంచేందుకు విద్య ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని, ఆధునిక సమాజంలో అందరూ పాఠశాలకు పోయే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదిరించి ఉన్నత విద్యను అభ్యశించి అందరికి మార్గదర్శకాన్ని అందించారని తెలిపారు. నిజాం నవాబు పరిపాలనలో మూడు వేల బడులు మూసివేశారని, అదే విధానాన్ని ప్రస్తుత పాలకులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు సమిష్ఠి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో లేకపోవడంతో అధికశాతం ప్రజలు ప్రైవేటు విద్య వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలను ప్రోత్సహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్య ద్వారా సామాజిక అసమానతలను తొలగించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ బడా కాంట్రాక్టర్‌కే అప్పజెపుతున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఉద్యమాలను అణచివేయాలని చూసే పాలకులకు పతనం తప్పదన్నారు. ఉపాధికల్పన లక్ష్యంగా నిర్వహించే ఉద్యమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విద్యావంతులు వేదిక, రాజకీయ జెఎసి ప్రభుత్వానికి వివరించినా స్పందించపోవటంతో నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండల రెడ్డి, మనోహర్ రాజు, నాయకులు హనుమంతు, సరళ, రామారావు, ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈకార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టిపిటిఎఫ్ ప్రతినిధులు, జెఎసి నాయకులు మల్లెల రామనాధం, భరత్, కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దండకారణ్యంలో మావోల విధ్వంసం
* నేడు తెలంగాణ రాష్ట్ర బంద్
* సరిహద్దు ప్రాంతాల అప్రమత్తం
భద్రాచలం, ఫిబ్రవరి 26: ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ కూడా విడుదలైన సంగతి విదితమే. బంద్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు విధ్వంసకాండకు తెరలేపారు. గడిచిన 24 గంటల్లో రెండు ప్రైవేటు బస్సులను దహనం చేశారు. తెలంగాణలోని జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా భద్రాచలం మన్యం వెంకటాపురం మండలం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న గుప్తా ట్రావెల్స్ బస్సుకు సరిహద్దుల్లోని మెట్ల చెరువు వద్ద నిప్పు పెట్టారు. తాజాగా ఆదివారం సరిహద్దుల్లోని దంతెవాడ జిల్లా కటేకల్యాణ్ అడవుల్లో కుషాల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు నిప్పు పెట్టారు. ప్రయాణికులను కిందకు దించి వాటిని తగలబెట్టారు. మరో వైపు ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్న మిక్సర్లను కూడా దహనం చేశారు. సరిహద్దునే ఉన్న చర్ల మండలంలో ఇటీవలే మందుపాతరలు పెట్టిన మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు సైతం పామేడు స్టేషన్ పరిధిలో తెలంగాణ గ్రేహౌండ్స్‌తో కలిసి ఎన్‌కౌంటర్ చేశారు. ఇలా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నేటి తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అన్ని పోలీస్ స్టేషన్లకు భద్రత కల్పించారు. భద్రాచలం ఎఎస్పీ సునీల్‌దత్ నేతృత్వంలో బలగాలను సిద్ధం చేశారు. అటు భూపాల్‌పల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్, ఓఎస్టీ రవీందర్ ఇద్దరికీ భద్రాచలం మన్యంలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాల పోలీసులు సమాచార మార్పిడి చేసుకుంటూ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు ఉన్న దండకారణ్యంలోని పోలీసు స్టేషన్ల వద్ద బలగాలను మోహరించారు.
ముమ్మర తనిఖీలు
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. వాహనాలను నిలిపి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. దండకారణ్యం నుంచి తెలంగాణకు వచ్చే అన్ని మార్గాలపైన డేగకన్ను వేశారు. అన్ని పోలీస్టేషన్ల పరిధిలో నాకబందీ నిర్వహిస్తున్నారు. కొరియర్లు, ఇన్‌ఫార్మర్ల సాయంతో ముఖ్యమైన ప్రదేశాల్లో గస్తీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మావోయిస్టు యాక్షన్ టీంలు రంగంలోకి దిగాయనే సమాచారంతో మరింతగా వారిని గుర్తించేందుకు పోలీసు షాడో టీంలు సోదాలు చేస్తున్నారు. సరిహద్దుల్లో బస్సులు తగలబెడుతున్న తరుణంలో ఆర్టీసీ మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేసింది. మారుమూల మండల కేంద్రాల్లో నైట్ హాల్ట్ సర్వీసులను పోలీస్ స్టేషన్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.