ఖమ్మం

అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 1: రాష్ట్రంలో అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఇందుకోసం నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని పథకాలకు ఏ జిల్లాలో లేని విధంగా అవిభక్త ఖమ్మం జిల్లాకు నిధులు తెచ్చినా సద్వినియోగం చేసుకోవటం లేదన్నారు. అనేక చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి పనులు ప్రారంభించాలంటున్నారని, అలాగైతే పనులు జరగవని, కొబ్బరికాయ కోట్టడం కోసం అలస్యం చేస్తే నిధులు వెనక్కివెళ్ళే ప్రమాదం ఉందన్నారు. అనేక రోడ్లు ఇజిఎస్ కింద పెట్టారని, మార్చి నెల చివరి లోగా ఈ పనులు పూర్తి కావల్సివుందని, లేని పక్షంలో పనులు జరిగిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలన్నింటిని ఈ సీజన్‌లోనే పూర్తి చేయాలని అదేశించారు.
పంచాయతీరాజ్‌శాఖ పని తీరుపై అందరికి అసంతృప్తి ఉందని, అధికారులు, సిబ్బంది తమ పద్దతిని మార్చుకోవాలని హీతవుపలికారు. చిన్నచిన్న పనులను పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. ఎవరు ఊహించని విధంగా నిధులు తీసుకువస్తున్నామని, అడ్డంకులు ఎదురైనా అధిగమించి పనులు పూర్తి చేయాలని సూచించారు. రహదారులు నిర్మాణం, హరితహారం, మిషన్‌కాకతీయ పనులలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని, భగీరధ పనులను నిర్ణిత సమయంలోగానే పూర్తి చేస్తామన్నారు. 8వేల కోట్లతో నిర్మించే సీతారామ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ ఎడాదిలోనే కెటిపిఎస్ 7వ దశ, భద్రాద్రి పవర్‌ప్లాంట్ పనులు పూర్తి చేసి రెండువేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామన్నారు. 2వేల కోట్లతో జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, 17వందల కోట్లతో సూర్యపేట-ఖమ్మం, కోదాడ-ఖమ్మం నాలుగులైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఖమ్మం-ఆశ్వారావుపేట, మహబూబాబాద్-్భద్రాచలం రహదారుల నిర్మాణ పనులు కూడ ఈ ఎడాదే పూర్తి చేస్తామన్నారు. అవిభక్త ఖమ్మం జిల్లాకు 6వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు మంజూరయ్యాయని ఉగాది నుండి వాటి ప్రారంభోత్సవాలు కూడ ఉన్నాయన్నారు. 4,200కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు జరుగుతున్నాయని, 750కోట్లతో అన్ని మండలాలో నిర్మిస్తున్న మార్కెటింగ్ గోడౌన్లు ఈ నెల చివరి నుండి అందుబాటులోకి రానున్నాయన్నారు. వ్యవసాయ, ఉద్యానవన అభివృద్ధికి 250కోట్లు కేటాయించామని తెలిపారు. తీవ్రవాద నిరోధక పనుల కింద 1290కోట్లు జిల్లాకు వచ్చాయని, మారుమూల అటవీ ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి దీనిని ఉపయోగించాలన్నారు. సాదాబైనామా ధరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. అంతకు ముందు పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్యను ఘనంగా సన్మానించారు.

పువ్వాడ సూచనతో మంచినీటిపై చర్చ
సమావేశం ప్రారంభమైన వెంటనే ఎజెండాలో తాగు నీటి అంశం లేకపోవటం పట్ల ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ స్పందిస్తూ వేసవికాలం ముంచుకోస్తున్న తరుణంలో తాగునీటిపై చర్చ జరగకపోవటం బాధాకరమని, వెంటనే చర్చించాలని సూచించటంతో అధ్యక్షురాలు గడిపల్లి కవిత చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి ఎదుర్కొనున్న సుమారు 600హ్యబిటేషన్‌లలో ప్రత్యమ్నాయ చర్యలను ప్రారంభించామని కలెక్టర్లు లోకేష్‌కుమార్, రాజీవ్‌గాంధీ హనుమంతు స్పష్టం చేశారు.
సమాచారం ఇవ్వకుండానే పనులా..?
తమకు సమాచారం అందించకుండానే అధికారులు పనులు చేయటం పట్ల జడ్పిటిసిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మండల పరిధిలో తమకు తెలియకుండానే అనేక పనులు జరుగుతున్నాయని, తమకు ఎందుకు చెప్పటం లేదంటూ మంత్రి ఎదుటే అధికారులను ప్రశ్నించారు. పాత పనులు పూర్తి కాకుండానే కొత్త వాటిని ప్రారంభించటం సరికాదన్నారు. దీనికి మంత్రి జోక్యం చేసుకొని క్షేత్రస్థాయి పనులను మండల ప్రజాప్రతినిధులకు తెలిపి జరపాలని అదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వల్సిందేనన్నారు. మంచి పనులు చేసే అధికారులను ప్రశంసిస్తామని, చేయని వారి పట్ల కఠినంగానే ఉంటామన్నారు. అనుమతి లేకుండా పాఠశాలలు నడుస్తున్నాయని, కనీస వౌళిక వసతులు కల్పించకుండానే నడుపుతున్న పాఠశాలలపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
అందంగా సమావేశ మందిరం
జిల్లాల విభజన తరువాత జరిగిన రెండో సమావేశానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నడనే సమాచారంతో మందిరాన్ని అందంగా తీర్చిదిద్దారు. గేటు వద్ద నుండి రెడ్‌కార్పెట్ వేసిన అధికారులు సమావేశ మందిరాన్ని పూలతో అందంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తెలిపేలా సమావేశ మందిరంలో ఫ్లెక్సిలను ఏర్పాటు చేశారు. మందిరంలో నాలుగు వైపులా ఎసిలను పెట్టారు. ఈ హడావిడి చూసి కొందరు సీనియర్ ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి రాకతో రూపురేకలు మారుతున్నాయని గుసగుసలాడటం విశేషం.

ముగ్గురు నేతలకు కార్పొరేషన్ పదవులు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 1: అవిభక్త ఖమ్మం జిల్లాలోని ముగ్గురు నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టారు. ఎంతోకాలంగా నేతలు ఎదురుచూస్తున్న పదవులను ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బి బేగ్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గానూ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావును తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గానూ నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యుడు తాటి వెంకటేశ్వర్లును తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్‌గానూ నియమించారు.
బేగ్ గత సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖమ్మం ఎంపిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నుంచి ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కొండబాల కోటేశ్వరరావు టిడిపి హయాంలో డిసిసిబి చైర్మన్‌గా, మధిర శాసన సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికల అనంతరం తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరారు. అశ్వారావుపేట శాసన సభ్యుడైన తాటి వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ ముగ్గురుతో పాటు ఇప్పటికే జిల్లాకు చెందిన పిడమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. దీంతో జిల్లాలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కినట్లయింది.

గులాబీ దళంలో నామినేటెడ్ పదవుల పర్వం
* టిఆర్‌ఎస్ అధిష్ఠానం ఎన్నికల వ్యూహం
భద్రాచలం, మార్చి 1: గులాబీ దళంలో నామినేటెడ్ పదవుల పర్వం నడుస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలోని కీలకమైన భద్రాచలం, చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు నియమిస్తూ జిఓలు జారీ చేశారు. భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మానె లక్ష్మి, చర్ల కమిటీ ఛైర్మన్‌గా బోదెబోయిన బుచ్చయ్యలను నియమించారు. దీంతో తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినా భద్రాచలంలో మాత్రం పార్టీ నీరసించడంతో ఈసారి ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసింది. నియోజకవర్గంలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పట్టు ఉండటంతో ఆచితూచి అధికార పార్టీ వ్యవహరిస్తోంది. నామినేటెడ్ పదవులు ఎన్నికలకు ముందు ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్‌లో, నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపడం ఆ పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడ. అంతేకాకుండా ఇప్పటికే తెలుగుదేశం నుంచి ప్రధాన నాయకులను తమ పార్టీలోకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా రప్పించుకున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా కొందరు పేరుమోసిన గిరిజన నాయకులే వచ్చారు. ప్రధానంగా సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్‌లను ఢీకొట్టాలంటే కాస్తా పదునైన వ్యూహాలు అవసరం. జిల్లాల విభజన సమయంలో తెలుగుదేశం, సిపిఎం, కాంగ్రెస్‌లకు పట్టు ఉన్న వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లి జిల్లాలో కలిపారని అధికార పార్టీపై విమర్శలు వచ్చాయి. ఇది రాజకీయ విభజనేనని ఘాటుగానే ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పటికే రాష్ట్ర విభజన ద్వారా చింతూరు, కూనవరం, భద్రాచలం రూరల్ మండలాలు ఆంధ్రాలోకి కలిశాయి. భద్రాచలం పట్టణం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు మాత్రమే ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో మిగిలాయి. ఇందులోనూ సిపిఎంకే పట్టు ఎక్కువగా ఉంది. దీంతో అధికార పార్టీలోని పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కాగా రాష్ట్రంలో ఉన్న ఏకైక సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు కూడా అధికార పార్టీ గాలం వేసింది. ఈ విషయాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే ఇటీవల మహాజన పాదయాత్రలో బహిర్గతం చేశారు. అంటే అధికార పార్టీ భద్రాచలంలో పాగా వేసేందుకు ఏ స్థాయిలో పావులు కదుపుతుందో అర్థవౌతోంది. అభివృద్ధి, మంత్రి తుమ్మల మార్కుతో వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అధికార పార్టీ అభ్యర్ధి ఎంపికపై ముందుగానే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఆ అభ్యర్ధి వ్యక్తిగత ఇమేజ్‌తో పాటుగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గెలుపుకు బాట వేస్తాయని గులాబీ పార్టీ బలీయంగా ఉంది. అందుకే క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపేందుకు నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కొత్తగూడెం, మార్చి 1: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య బుధవారం ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 పరీక్షా కేంద్రాల ద్వారా 11,119 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా వీరిలో, ఇంటర్ జనరల్ కోర్సులో 8685 మంది విద్యార్ధులకు గాను 666 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. 8019 మంది విద్యార్ధులు పరీక్షలు రాసారు. ఓకేషనల్ కోర్సులో 2434 మంది విద్యార్థులకుగాను 430 మంది విద్యార్ధులు గైరాజరుకాగా, 2,004 మంది పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణ కోసం 4 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సమీపంలోని సూర్యాతండాకు చెందిన విద్యార్థిని, జూలూరుపాడు మండలానికి చెందిన విద్యార్ధి ఒకరు ఆలస్యంగా రావటంతో పరీక్షకు అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమేరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లలో భద్రపరచారు. పటిష్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నిర్వహణ జిల్లా కోఆర్డినేటర్ సరళ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బలగాలను నియమించారు. కేంద్రాలకు సమీపంలోని జీరాక్స్ సెంటర్‌లను మూసివేయించారు.
ఖమ్మంలో ...
ఖమ్మం(ఖిల్లా): ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా బుధవారం ప్రారంభమయ్యాయి. నగరంలో 27కేంద్రాలలో ఉదయం 9గంటల నుండి 12గంటలకు వరకు జరిగాయి. 18967మంది మొదటి సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 17895విద్యార్థులు హాజరయ్యారు. 1069 మంది గైర్హాజరైనారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఆసౌకర్యాలు కలగకుండ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫర్నిచర్, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నయబజార్ జూనియర్ కళాశాలకు 1నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థి పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో విద్యార్థి కంటతడి పెట్టాడు. ఇకముందు కూడా పరీక్షకు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందు రావాలని ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని అధికారులు చెప్పారు. పరీక్షలను మూడు ఫ్లయింగ్ స్కాడ్‌లు, నాలుగు సిట్టింగ్ స్కాడ్‌లు పర్యవేక్షించారు.

సామాజిక సమర సమ్మేళనానికి తరలిరండి
* పోతినేని సుదర్శనరావు
ఖమ్మం(కల్చరల్), మార్చి 1: సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సిపియం రాష్ట్ర కమిటి ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల పాటు 4 వేల కిలోమీటర్లకు పైగా సాగిన మహాజన పాదయాత్ర ఈ నెల 19న హైదరాబాద్‌కు చేరుకుంటుందని సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిజాం కాలేజి గ్రౌండ్‌లో సామాజిక సమర సమ్మేళనం నిర్వహిస్తున్నామని, ఈ సమ్మేళనానికి ఖమ్మం జిల్లా నుండి వేలాదిగా ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కార్యదర్శుల, జిల్లా ఇన్‌చార్జుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రాత్మకమైన మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎంబిసి, మైనార్టీలతో పాటు రైతుకూలీలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మహాజన పాదయాత్ర విజయానికి చేరువలో ఉందని, దానికి వస్తున్న ప్రజా మద్దతుతో ప్రభుత్వంలో చలనం మొదలైందన్నారు. ప్రజాందోళనలు పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా ఇప్పటిదాకా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వానికి అనివార్యంగా ఒక్కొక్క మెట్టు దిగాల్సిన పరిస్ధితిని పాదయాత్ర కల్పించిందన్నారు. బిసి కమీషన్, ఎంబిసి కార్పోరేషన్, డబుల్ బెడ్‌రూం శంకుస్ధాపనలు, విఆర్‌ఎ, అంగన్‌వాడీల జీతాల పెంపు, యాదవులు, మత్స్యకారులు, ఇతర వృత్తిదారులకు ప్రకటించే పధకాలన్నీ పాదయాత్ర సాధిస్తున్న విజయాలేనన్నారు. పాదయాత్ర ముగింపునాటికి మరికొన్ని డిమాండ్లు పరిష్కరించక తప్పని స్ధితిని ప్రభుత్వానికి కల్పించడానికి ముగింపు సభకు భారీగా ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటి సభ్యుడు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, నాయకులు భూక్యా వీరభద్రం, బండి రమేష్, మాదినేని రమేష్, దుగ్గి కృష్ణ, మెరుగు సత్యనారాయణ, బారి మల్సూర్, చింతలచెర్వు కోటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావులతో పాటు కార్యదర్శులంతా పాల్గొన్నారు.

ఉత్పత్తి లక్ష్యసాధనలో
కొత్తగూడెం ఏరియా ముందంజ
* ఏరియా సిజిఎం రమణమూర్తి వెల్లడి
కొత్తగూడెం రూరల్, మార్చి 1: బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో కొత్తగూడెం ఏరియా ముందంజలో ఉందని ఏరియా ఛీఫ్ జనరల్ మేనేజర్ రమణమూర్తి తెలిపారు. బుధవారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది 81లక్షల 33వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా ఈఏడాది 81లక్షల 77 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం ఏరియా ముందంజలో ఉండటం శుభపరిణామమని అన్నారు. లక్ష్యసాధనలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా లక్ష్యసాధనలనో గత ఏడాది కంటే ఈఏడాది వెనుకబడి ఉన్నప్పటికీ కొత్తగూడెం ఏరియా ముందుండటం అధికారుల పనితీరుకు నిదర్శనమని తెలిపారు. 11శాతం ఉత్పత్తి, 8శాతం ఉత్పాదకత రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించటం గమనార్హమన్నారు. అదేవిధంగా జెవిఆర్ ఓసి 2మైన్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే 2వ మైన్ ప్రారంభమవుతుందని అన్నారు. వేసవికాలంలో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అగ్నిప్రమాదాలు జరుగకుండా యంత్రాలకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్మికులకు మధ్యాహ్న భోజన పథకం, తాగునీరు, షెల్టర్‌లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి సాధనలో కొత్తగూడెం ఏరియా కీలకపాత్ర పోషించటం శుభపరిణామమని, ఇదే స్ఫూర్తితో కార్మికులు, అధికారులు పనిచేసి సంస్థకు మంచిపేరు తేవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌వోటూ జిఎం షాలంరాజు, గౌతంఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు అధికారి బైధ్య, డివైపిఎం శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

మార్కెట్‌లో ‘ఈనామ్’ను ప్రారంభించిన చైర్మన్
ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 1: కేం ద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అమలు చేసిన ‘ఈనామ్’ను బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ ప్రారంభించారు. మొదటి సారిగా ఖమ్మం మార్కెట్‌లో పత్తి పంటలను ‘ఈనామ్’ ద్వారా కొనుగోళ్ళను జరిపించారు. ఈనామ్ ప్రారంభమైన దృష్ట్యా వ్యాపారులకు, రైతులు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌కు రైతులు రాత్రి 8గంటల నుండి ఉదయం 8గంటల వరకు పంటలను తరలించుకోవాలని సూచించారు. ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుందని, 10గంటల నుండి 11.30గంటల వరకు వ్యాపారులు బిడ్డింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నామని, 11.30గంటల నుండి కొనుగోళ్ళు జరుగుతాయని తెలిపారు. ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దేశ స్థాయిలో ఖ్యాతి పెరుగుతుందన్నారు. ఈనామ్ ద్వారా మార్కెట్‌లో జీరో వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని, రైతులకు అధనంగా కలిగే సమస్యలు దీని ద్వారా పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధానం ద్వారా పంటలను అమ్ముకోవటం రైతు హక్కు అని, వారి పంటలకు మొదటి సారిగా నిర్ణయించిన ప్రకారమే ధరను చెల్లించటం జరుగుతుందని, దీనిలో తిరిగి మార్పులు చేసే అవకాశం లేదన్నారు. అలాగే ఒక్కసారి నిర్ణయించిన తేమశాతంలో కూడ మార్పులు ఉండవన్నారు. ఈనామ్ అమలులో భాగంగా రైతులకు, ట్రేడర్స్‌లకు, కమిషన్‌దారులకు ఐడికార్డులను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ప్రసాద్‌రావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కొత్తగూడెం, మార్చి 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని పివోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య అన్నారు. ఇఫ్ట్యూ కార్యాలయంలో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర పివోడబ్ల్యూ ప్రథమ మహాసభలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో మహిళల జీవితాలను విధ్వంసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పివోడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న శ్రమదోపిడీకి నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు తోడ్పాటునందించి అన్ని రంగాల్లో ముందుండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలదేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కల్పించకపోవటం మహిళలను కించపరచినట్లేనని పేర్కొన్నారు. మహిళలంతా ఐక్యంగా ఉధ్యమించి మహిళా చట్టాల బిల్లును చట్టసభల్లో ఆమోదించే వరకు రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. శ్రామిక మహిళా దినోత్సవాలన్ని కొన్ని సంఘాలు వేడుకగా జరుపుకోవటం సరైందికాదని విమర్శించారు. భారతదేశంలో మహిళలు లేనిదే ఏపోరాటం విజయం సాధించలేదని గుర్తుచేశారు. ఈసమావేశంలో పివోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లి రాములమ్మ, నిర్మల నాయకులు గీత, స్వప్న, సుగుణ, నోముల కళావతి, బాదావతు బేబి, ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి విశ్వనాధం, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.