ఖమ్మం

తెలంగాణలో గెలుస్తామన్న ధైర్యం ఏ పార్టీకి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, మార్చి 26: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న దమ్మూ, ధైర్యం ఏ ఒక్క పార్టీకి లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నాయుడుపేటలోని మద్ది యల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో సాధు రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన టిఆర్‌ఎస్ పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికాబద్దంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మనమంతా వివిధ పార్టీల నుంచి వచ్చినవారమేనని, పాతకక్షలు విడనాడి ఐక్యంగా ఉండి ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి కార్యకర్తలకు హితబోధ చేశారు. సభ్యత్వం కావాలని అడిగినవారందరికీ ఇవ్వాల్సిన బాధ్యత గ్రామ నాయకత్వానిదేనని, ఈవిషయంలో ఎవరు బెట్టు చేసినా సహించేదిలేదని హెచ్చరించారు. మరో 10-15 రోజులు మాత్రమే ఎన్‌ఎస్‌పి ద్వారా నీరు విడుదల అవుతుందని, ఈలోగా నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నింపుకోవాలని ఆయన సూచించారు. వారం రోజుల్లో గ్రామ, మండల కమిటీలు ఎన్నుకోవాలని సూచించారు. ఈనెల 27వ తేదీన వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సాధు రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు బేగ్, కొండబాల కోటేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ కృష్ణ, మేయర్ పాపాలాల్, రామ్మూర్తినాయక్ తదితరులు పాల్గొన్నారు.

మిర్చిలారీ బోల్తా - డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
పాల్వంచ, మార్చి 26: వరంగల్ జిల్లా కమలాపురం నుండి మిర్చి లోడుతో ఖమ్మం వెళ్తున్న లారీ ఆదివారం స్థానిక అయ్యప్పగుడికి సమీపంలో గల భద్రాచలం రోడ్డుపై అదుపు తప్పి బోల్తాపడింది. కాగా ఈ ప్రమాదంతో డ్రైవర్ రవీందర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబందించిన వివరాలు మిర్చిలోడుతో బయలు దేరిన లారీ పట్టణంలో రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో రోడ్డు గుంతలుగా ఉన్న కారణంగా అదుపు తప్పి మిర్చిలారీ బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల బారీ ప్రమాదం తప్పినట్లైంది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్

ఖమ్మం, మార్చి 26: పాత ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న బయ్యారంలో సాధారణ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. బయ్యారంలో లభించే ఇనపఖనిజంలో నాణ్యత లేనందున విశాఖపట్నం తరహలో భారీ స్టీల్‌ప్లాంట్ సాధ్యం కాదని, ఛత్తీస్‌గడ్ తరహలో పిపిపి విధానంలో ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అక్కడ ప్లాంట్ ఏర్పాటుకు తగిన సర్వేలు చేసి ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని బయ్యారం ఉక్కును అక్రమంగా తరలించుకుపోతున్నారని జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఆందోళనలు నిర్వహించాయి. ఆ సమయంలోనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బినామిగా ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత అక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆందోళనలు జరిగిన సేయిల్ అధికారులు నిర్వహించిన సర్వేలో ఉక్కు నాణ్యత లేదని గమనించారు. అలాగే ఉక్కు కర్మాగారానికి సరిపోయేంత ముడిసరుకు ఇక్కడ లేదని నివేదిక సమర్పించారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రెండు రోజుల క్రితం కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో మాట్లాడారు. దీనికి స్పందించిన ఆయన సాధారణ ఉక్కు ఫ్యాక్టరీని బయ్యారంలో ఏర్పాటు చేసేందుకు నివేదిక ఇవ్వాలని అధికారులను కోరటంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడ సూచించారు. ఈ నేపధ్యంలో జిల్లాల విభజనతో ఖమ్మం జిల్లా నుండి మహుబూబాబాద్ జిల్లాలో కలసిన బయ్యారం ప్రాంతం ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది.

పాల్వంచలో గంజాయి పట్టివేత
* 10 లక్షల విలువ చేసే గంజాయి, బొలోరో వాహనం స్వాధీనం
పాల్వంచ, మార్చి 26: ఛత్తీస్‌గడ్ నుండి హైద్రాబాద్‌కు తరలిస్తున్న సుమారు 10 లక్షలు విలువ చేసే గంజాయిని అటవీశాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇరువురు వ్యక్తులను వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఒరిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఖయ్యిం, ఉత్తమ్‌కుమార్ ముజాందర్‌లు ఛత్తీస్‌గడ్ నుండి బోలోరో వాహనం ద్వారా గంజాయిని హైద్రాబాద్‌కు తరలిస్తున్నారన్న విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో స్థానిక చెక్‌పోస్ట్ వద్ద కాపుకాసారు. బోలోరో వాహనం చెక్‌పోస్ట్ వద్ద ఆపకుండా అతివేగంగా వెళ్లటంతో అటవిశాఖ అధికారులు వాహనాన్ని వెంబడించి పాతపాల్వంచలో వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 208 కేజీలు(104) ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వాహనాన్ని, నిందితులను పాల్వంచ పోలీస్‌లకు అప్పగించారు.
అక్షరమే శక్తివంతమైన ఆయుధం

సత్తుపల్లి, మార్చి 26 : శాస్త్ర, సాంకేతిక రంగాలలో మనం ఎంత ఉన్నత స్థితికి ఎదిగినప్పటికి, అక్షరమే శక్తివంతమైన ఆయుధమని, పుస్తకానికి ఉన్న ప్రాధాన్యతను విస్మరించలేమని ప్రముఖ సినీ, టివి నటులు సరస్వతి, ప్రదీప్ అన్నారు. ఆదివారం సత్తుపల్లిలోని జెవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సృజనా సాహితీ సమాఖ్య 15వసంతాలు వేడుకలలో బాగంగా సిద్ధారం పాఠశాల ఉపాధ్యాయురాలు మాదిరాజు మాలతి రచించిన ఔనునిజం మినీ కవిత్వ సంకలనాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కంప్యూటర్‌లో వేలాది పుస్తకాలు చదివినప్పటికి ఒక్క పుస్తకాన్ని చేత్తో పట్టుకొని చదివిన అనుభూతి వేరుగా ఉంటుందన్నారు.కాగితం, అక్షరాలనే కాదు అక్షరాల వెనుక ఉన్న భావాలను కూడా ఇముడ్చుకుంటుదన్నారు. సాహిత్యం ఆలోచనామృతం వంటిదన్నారు. మాలతి రచనల ద్వారా సమాజసేవ చేస్తున్నారని ఆమె రచనలలలో సామాజిక స్ప్రహ, వ్యక్తిత్వ వికాసం, మానవతా విలువలు, వైజ్ఞానిక అంశాలు ఒక వృక్షంలా దాగి ఉన్నాయన్నారు. కవి కళ్యాణశర్మ, కట్టా శ్రీనివాస్‌లు పుస్తకావిష్కరణ కావించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిఫాల్ గండ్రోతు నర్సింహారావు, లైబ్రేరియన్ రామకృష్ణ, ఎంపిడిఓ రవి, మధుసూధన్‌రాజు, గట్టే వాసు, గురుజ్యోతి చిత్తలూరి ప్రసాద్, రాంబాబురెడ్డి, వనమా చెంచురెడ్డి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 4న మాదిగ మేధావుల జాతీయ సదస్సు

ఖమ్మం(మామిళ్ళగుడెం), మార్చి 26: ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో నిర్వహించే మేధావుల జాతీయ సదస్సును జయప్రదం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దైవ వసంతరావు, చెరుకుపల్లి వెంకయ్యలు కోరారు.
ఆదివారం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగ మేధావులు జాతీయ మహా సమ్మేళనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుమడైన ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సుకు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘ నేతలు, మేధావులు పాల్గొంటారని తెలిపారు. మాదిగ ఉద్యగులు, మాదిగ కార్యకర్తలు, అన్ని వర్గాల మాదిగలు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు మంద దేవేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, రామచంద్రరరావు, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు, వినోద్‌కుమార్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల్లో అక్రమాలు
ఖమ్మం(జమ్మిబండ), మార్చి 26: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ అంటూ అవినీతి పాలనను సాగిస్తున్నాడని ఎన్‌వైకె నేషనల్ వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు.
అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా, కొత్త ప్రాజెక్టులు ప్రకటించి, వాటికి నిధులు కేటాయించి వారికి సంబంధించిన వారికే కాంట్రాక్ట్‌లు అప్పగిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిని భయపెట్టి, మభ్యపెట్టి దొరల పాలనను తలపిస్తున్నాడన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారికి అణగదొక్కే ధోరణిని అవలంభిస్తున్నాడన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు 4లక్షలు కట్టి ఇస్తానని ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఇంత వరకు టెండర్లు కూడా పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా డబ్బా కొట్టుకుంటూ పాలన సాగిస్తున్నాడన్నారు. కేంద్ర నిధుల ఏ పథకానికి ఎంత వరకు ఖర్చు చేశారో ఇంత వరకు కేంద్రానికి వ్రాత పూర్వకంగా చెప్పలేదన్నారు.
అదే విధంగా రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నయంగా బిజెపి మారబోతుందనే సత్యాన్ని గ్రహించిన కెసిఆర్ 2019లో టిఆర్‌ఎస్, బిజెపి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం కూడా జరుపుతున్నారని ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. బిజెపి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలోనే లేదని, ఒంటరిగానే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసి వాటిని వినియోగించుకునేలా చైతన్యం తెస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు చేయనున్నామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సనె్న ఉదయ్‌ప్రతాప్, నగర కార్యదర్శి రుద్రప్రదీప్, నాయకులు కొండి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రామయ్యను దర్శించుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే
భద్రాచలం, మార్చి 26: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.లక్ష్మీదేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
ట్రాక్టర్ బోల్తా.. 18 మందికి గాయాలు

ములకలపల్లి, మార్చి 26: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి 18 మందికి గాయాలైన సంఘటన ఆదివారం మండల పరిధిలోని ఊకె రామవరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొట్టకూటి కోసం ఊకె రామవరానికి చెందిన కొడిమే భద్రమ్మ, ఊకె లక్ష్మీదేవి, ఊకె రమణ, కారం కోటమ్మ, తెల్లం ఈశ్వరి, సోయం సావిత్రి, ఆంగోతు రాణి, వెంకటమ్మ, రాజమ్మ, సుజాత తోపాటు మరికొంత మంది రోజుమాదిరిగా మిరప కాయల కోతకు పక్క గ్రామమైన రంగాపురానికి వెళ్తుండేవారు. ఇదే క్రమంలో ఆదివారం కూడా ట్రాక్టర్‌పై కూలీకి వెళ్తున్న సమయంలో ఊకె రామవరం గ్రామ శివారు మూలమలుపు వద్ద ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో 18మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వీరిలో తీవ్ర గాయాలైన భద్రమ్మ, లక్షీదేవి, రమణలను మెరుగైన వైద్య నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌హెచ్‌వో పుల్లారావు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను ఆదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి
ఖమ్మం(ఖిల్లా), మార్చి 26: రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు తక్షణమే వేతనాలు పెంచాలని ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మున్సిపల్ వర్కర్స్ మహసభలో ఆయన మాట్లాడుతూ కార్మికులు తెల్లారక ముందే రోడ్లమీదకు వచ్చి నగర పరిసరాలను శుభ్రం చేస్తున్నారని అలాంటి కార్మికులు వేతనాలు పెంచకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలను పెంచి మున్సిపల్ కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కార్మికులను అధికార పర్టీలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని పాలకులు హామీలు ఇస్తూ కార్మికులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే డొక్కాడని కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడనాడాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులు సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సభకు ముందు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళుర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహయ కార్యదర్శి ఆవుల అశోక్, ఏరియా కార్యదర్శులు రామారావు, విప్లవ్‌కుమార్, గురవయ్య, తాళ్ళపల్లి రాములు, నారాయణ, నాగేశ్వరరావు, సూర్య, కాంతమ్మ, రాధ, సంఘమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.