ఖమ్మం

ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, ఏప్రిల్ 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలో తాటిచెట్ల వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒక మేకపోతు కూడా మరణించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం పీవీ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి కామా కిరణ్ (30), అతని తమ్ముడు కామా సాయిపవన్ (23) మేనల్లుడు కృష్ణస్వామియతిన్ గోపాల్ (6)ను తీసుకుని పాల్వంచ మండలం పెద్దమ్మగుడికి మొక్కు తీర్చుకునేందుకు ఇదే మండలం బాపన్నకుంటకు చెందిన ఆటోను అద్దెకు తీసుకుని ఆదివారం ఉదయం మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తుండగా పాల్వంచ నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ నిర్లక్ష్యంగా, అతివేగంగా వెళ్తూ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ఆటో డ్రైవర్ కరివెల్లి వేణు(27), కామా కిరణ్, కామా సాయిపవన్, బాలుడు యతిన్‌గోపాల్ అక్కడికక్కడే మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిజియాబాద్‌కు చెందిన కంటైనర్ లారీ భద్రాచలం క్రాస్ రోడ్డు నుంచి సారపాకలోని బిపిఎల్ కర్మాగారానికి వెళ్లాల్సి ఉంది. లారీ డ్రైవర్‌కు దారి తెలియక మణుగూరు వైపు వెళ్తూ ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు. మృతుడు కామా కిరణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయిపవన్ ఎంబిఎ పూర్తి చేసి ఇటీవలే తండ్రి వారసత్వ సింగరేణి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. బాలుడు యతిన్‌గోపాల్ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శిరీష హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. బాలుడు యతిన్ ఇటీవలే పీవీ కాలనీలో ఉంటున్న మేనమామల ఇంటికి వచ్చాడు. పెద్దమ్మ గుడి వద్ద మొక్కుబడి తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి బాలుడి తల్లిదండ్రులు కూడా ఆదివారం ఆలయానికి చేరుకునేలోగానే ఈ సంఘటన జరిగింది. ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే బాలుడి తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారు. కిరణ్‌కుమార్, సాయిపవన్ తండ్రి కృష్ణమూర్తి మణుగూరులో సింగరేణి ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు కుమారులు, మనవడు మృతి చెందడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మణుగూరు సిఐ మొగిలి, అశ్వాపురం ఎస్సై సంతోష్‌కుమార్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు ఎంతో శ్రమించారు. మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను జిల్లా తెదేపా అధ్యక్షుడు తూళ్ళూరి బ్రహ్మయ్య, సిపిఐ జిల్లా నేత అయోధ్య, సర్రెడ్డి పుల్లారెడ్డి, కమటం వెంకటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు వెంకటేశ్వరరావు పరామర్శించారు.

భూగర్భ జలాల పెంపే లక్ష్యం
* నేటి నుంచి జిల్లాలో జల నిధి

ఖమ్మం, ఏప్రిల్ 9: భూగర్భ జలాలను పెంపొందించుకోవడంతో పాటు ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం పెంపుదల, హరితహారం కార్యక్రమాలే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాబృందాల ద్వారా ప్రతిరోజు కనీసం మూడు మండలాల పరిధిలోని 20కి పైగా గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే గతానికి భిన్నంగా అవగాహన కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయనున్నారు. ఆయా గ్రామాల్లోని కూడళ్ళలో, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కళాజాతాలు, పారిశుద్ధ్యం పెంపుదలతో పాటు భూగర్భ జలాలను పెంచుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించనున్నారు. గ్రామీణాభివృద్థి సంస్థ ద్వారా ఇప్పటికే చేపడుతున్న ఇంకుడు గుంటలు, ఫామ్‌పాండ్స్, హరితహారం, వాటర్‌షెడ్స్, అందరికి ఉపాధి లాంటి అంశాలను వివరిస్తూ ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలను వివరించనున్నారు. మరోవైపు ఆయా గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని కూడా చెప్పనున్నారు. మొక్కల పెంపకం, పశువులకు నీటితొట్టెల నిర్మాణం, కూరగాయల పెంపకానికి అవకాశాలు, కాంపోస్ట్ పిట్ నిర్మాణాలను కూడా వివరించనున్నారు. ఉపాధిహామీ పథకంలో అనుమతించిన పనులలో ఏ గ్రామానికైతే అత్యధికంగా పనులు చేపట్టి ఆయా గ్రామాల్లో వౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారో ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా గుర్తించడం జరుగుతుందని చెబుతూనే అందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను పూర్తిగా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా 25రోజుల పాటు జరిగే ప్రచార కార్యక్రమాలను తొలుత నేలకొండపల్లి, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. తరువాత రోజున మరొక మండలంలో ఉండేలా కార్యక్రమం రూపొందించారు. ప్రతిరోజు ఆయా గ్రామాల్లో నిర్వహించే కార్యక్రమాలను జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నది. ఆయా గ్రామాల్లో ప్రజలు ఇంటివద్ద ఉన్న సమయాల్లో కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్థానిక ఎంపిడిఓలు, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది ఈ కార్యక్రమాలను పర్యవేక్షించనుండగా జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు.

కిరాతకంగా తండ్రిని చంపాడు
* ఓ తనయుడి ఘాతుకం
* ఆస్తి, అక్రమ సంబంధాలే కారణం
కామేపల్లి, ఏప్రిల్ 9: ఆస్తి అమ్మి అప్పులు తీర్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన సంఘర్షణ తండ్రిని కిరాతకంగా హతమార్చేందుకు దారితీసిన సంఘటన ఆదివారం స్థానిక మండలంలో చోటు చేసుకుంది. మానవత్వం మంటకలిసి, సభ్యసమాజం తలదించుకునే విధంగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కామేపల్లి మండలం, ముచ్చర్ల గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(వెంకన్న 50) వ్యవసాయం, చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య రాయల నర్సమ్మ, కుమారుడు రాయల ఉపేందర్, లక్ష్మణ్, బుల్లిబాబు ఉన్నారు. పెద్దవాడు రాయల ఉపేందర్ గత ఏడాది బ్రెయిన్‌డెడ్ వ్యాధికి గురై మృతిచెందగా రెండవ కుమారుడు లక్ష్మణ్ తల్లివద్దనే ఉంటున్నాడు. మూడవ కుమారుడు బుల్లిబాబు జీవనోపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నాడు. కాగా మృతుడు వెంకటేశ్వర్లు ఐదేళ్ళ క్రితం అదే గ్రామానికి చెందిన మరో వివాహిత వీరలక్ష్మితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని ముచ్చర్లలోనే మరోచోట జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి కుమారుడు గత ఏడాది అనారోగ్యంతో మృతిచెందడంతో, వైద్యచికిత్స నిమిత్తం చేసిన అప్పులు పెరగడంతో రెండవ కుమారుడు లక్ష్మణ్, తండ్రికి మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. తమకున్న పంటచేనుని అమ్మి అప్పులు తీర్చేద్దామని తండ్రితో ఘర్షణ పడుతున్నాడు. కాగా దానికి అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి తోడు తమ కుటుంబాన్ని వదిలి మరో స్ర్తితో జీవనం సాగించడం కుటుంబ సభ్యులకి మింగుడు పడటంలేదు. ఈ కారణాలతో గత మూడురోజుల క్రితం ఆస్తి అమ్మి అప్పులు తీర్చే విషయంపై తండ్రి, తనయుల మధ్య ఘర్షణ జరిగింది. అంగీకరించని తండ్రిని హతమార్చేందుకు లక్ష్మణ్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారజామున 5.30నిమిషాలకు మృతుడు వెంకటేశ్వర్లు బహిర్భూమికై గ్రామ చివరికి రాగా అక్కడే పొంచి ఉన్న కుమారుడు లక్ష్మణ్ తండ్రిపై గొడ్డలితో దాడిచేసి హతమార్చాడు. అనంతరం కిరాతకంగా కిరోసిన్ పోసి మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. పక్క చేనులో కాపలా ఉన్న మరోవ్యక్తి సంఘటనను చూసి గ్రామస్తులకు తెలపడంతో లక్ష్మణ్ పరారయ్యాడు. సమాచారాన్ని పోలీసులు తెలుసుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండవ భార్య వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సురేష్‌కుమార్, సిఐ ఆంజనేయులు, ఎస్‌ఐ రంజిత్‌కుమార్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఎస్‌ఐ రంజిత్‌కుమార్ కేసును విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. సంఘటనా స్థలాన్ని క్లూస్‌టీమ్ సైతం పరిశీలించింది.