ఖమ్మం

చిచ్చురేపుతున్న రైతు సమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితులు అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లో రైతులను సమన్వయ సమితిలో చేర్చాల్సి ఉండగా, అధికార పార్టీ నేతలకే ప్రాతినిథ్యం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తమ గ్రామాల్లో తాము సూచించిన వారికి సమితిలో ప్రాధాన్యత కల్పించలేదనే కారణంతో అనేకచోట్ల నాయకులు నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. వైరా, మధిర, ఇల్లందు, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల పరిధిలో వివాదం మరింత ముదరింది. పాలేరు, ఖమ్మం మినహా మిగిలిన చోట్ల పరిస్థితి అదుపు తప్పుతోంది. ఇప్పటికే వైరా నియోజకవర్గంలో పలువురు నేతలు పార్టీని వీడతామని బహిరంగంగానే ప్రకటించగా, మధిర, ఆశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాలలో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామంలో కనీసం తమకు ప్రాధాన్యత ప్రకటించకపోవటం బాధాకరమని కొంతమంది నేతలు స్పష్టంగా పేర్కొన్నారు. తమను పట్టించుకోనప్పుడు తాము మాత్రం ఎందుకు పార్టీలో ఉండాలని ప్రశ్నించారు. ఖమ్మం నియోజకవర్గంలో వివాదం లేనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వర్గీయుల మధ్య గ్రామ స్థాయిలోనే వివాదం ఉంది. కొన్నిచోట్ల నేతలు ప్రతిపక్ష పార్టీల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సమితిల్లో అందరికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని, వివాదాలు స్వల్పమేనని వాటిని పరిష్కరిస్తున్నామని టిఆర్‌ఎస్ అగ్ర నేతలు వెల్లడించారు. ఇప్పటికే వివాదాలు వచ్చిన జూలూరుపాడు, ఎర్రుపాలెం, బోనకల్లు, అశ్వాపురం, టేకులపల్లి, కొణిజర్ల, వైరా, కారేపల్లి, చండ్రుగొండ, బూర్గంపాడు, మధిర, ముదిగొండ, ఏన్కూరు మండలాల్లో నేతల మధ్య సమన్వయానికి జిల్లా నేతలను నియమించినట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన సమన్వయ సమితుల ఏర్పాటు నాయకులకు ఊరట కలిగిస్తుందని ముందుగా ఊహించినా అనేక చోట్ల వివాదాలకు తావివ్వటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు వచ్చిన కొత్త సమస్యలు రావటంతో ఎన్నికల ముందు ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందనే భావనతో క్షేత్ర స్థాయిలో నేతల మధ్య ఏర్పడ్డ విభేదాధాలను పరిష్కరించే పనిలో జిల్లా నేతలు పడ్డారు.

రాజకీయాలకు, కులాలకు అతీతంగా
రైతులకు మేలు చేయాలి
నేలకొండపల్లి, సెప్టెంబర్ 12 : రాజకీయాలకు, కులాలకు అతీతంగా రైతు సమస్వయ కమిటిలు రైతులకు మేలు చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌లో గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతు సమస్వయ సమితి సభ్యులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కష్టనష్టాలలో సమన్వయ సమితులు పాలు పంచుకుని సహాయం చేయాలన్నారు. ఈ నెల 15 నుండి భూ రికార్డులు సరిచేసుకునే కార్యక్రమం ప్రారంభం అమలవుతుందని దానిని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్ద రైతులు తమ పంట పొలాల బదలాయింపు, పంపకాలు ఉంటే ఇప్పడు సరిచేసుకోవాలన్నారు. ఈ రికార్టు ప్రకారం వచ్చే మేలో రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు వస్తాయన్నారు. రికార్టులలోని పేరు ప్రకారం వారి బ్యాంక్ ఎకౌంట్‌లో ఆ మొత్తాన్ని జమ చేస్తామన్నారు. రికార్టులలో భూమి వివరాలు సక్రమంగా ఉంచుకోవాలని మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతులు చూసుకోవాలన్నారు. కౌలు రైతులు ఈ విధానం వల్ల నష్టపోతున్నారని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు రైతులు సమాధానం తెలపాలన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఓట్ల కోసం ఈ కార్యక్రమం పెట్టలేదని రైతు ప్రమోజనం కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. 1936 సంవత్సరంలో భూ రికార్డులను సరిచేశారని, తిరిగి టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. రైతులకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలను అందిజేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాలలో గోదావరి నీటిని రైతులకు అందించి కష్టాలు లేకుండా చూస్తానన్నారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ పోట్ల నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, జెడ్పిటిసి సభ్యురాలు తేజవత్ అనిత, ఎంపిపి నందిగామ కవితరాణి, ఇరిగేషన్ అధికారి శ్రీనివాసరావు, ఎంపిటిసిలు శీలం వెంకటలక్ష్మీ, చిలకల సీతారావమ్మ, ఎంపిడివో ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, యడవల్లి సైదులు, ఉన్నం బ్రహ్మయ్య, సీతారాములు, కొట్టి సైదారెడ్డి, నెల్లూరి భద్రయ్య, సామినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి

కొత్తగూడెం, సెప్టెంబర్ 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అంబర్ కిషోర్‌ఝా ఆదేశించారు.
మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు అధికారులు, అన్ని విభాగాలకు చెందిన అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఇటీవల జరిగిన గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు తీసుకున్న చర్యలను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను సైతం పెద్ద ఎత్తున నాటామని అన్నారు. కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్శింహారెడ్డి మాట్లాడుతూ నాటుసారాను నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులతో దాడులు నిర్వహించటం ద్వారా మంచి ఫలితాలు లభించాయన్నారు. గ్రామా ల్లో బెల్టు షాపులను సైతం నియంత్రించామని అన్నారు. నాటుసారా, కల్తీ మధ్యం విక్రయాలపై తమ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఎఎస్పీ సునీల్‌దత్, కొత్తగూడెం డిఎఫ్‌వో రాంబాబు, మణుగూరు డిఎస్పీ అశోక్ కుమార్, ఇల్లందు డిఎస్పీ ప్రకాశరావు, పాల్వంచ డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ చనుమోలు సుబ్బారావు, ఆర్‌ఐలు ఈశ్వరయ్య, ప్రసాద్, కృష్ణ, సిఐలు షుకూర్, అజయ్, శ్రీనివాస్, రవి, రమేష్, వేణుచందర్, జయపాల్, మొగిలి, రాఘవేంధ్రరావు, శ్రీనివాస్, రవికుమార్, ఎంటివో సోములు, జిల్లాలోని పోలీసు స్టేషన్‌లకు చెందిన ఎస్సైలు పాల్గొన్నారు.

పెసల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

* ఎమ్మెల్యే పువ్వాడ
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 12: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ ద్వారా ఏర్పాటు చేసిన పెసల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్‌లో ఏర్పాటు చేసిన పెసల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయన్నారు. గతంలో గాలి పంటగా వేసే పెసల పంటకు ఎటువంటి పెట్టుబడులు ఉండేవి కావని ప్రస్తుతం పెసల పంటకు కూడా ఎకరానికి 2,500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పెసల రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టిందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా పెసల పంటకు 5,575 రూపాయలను ప్రకటించారని, దీనిని పెసల పంట రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ, మార్కెట్ కార్యదర్శి సంతోష్‌కుమార్, మార్క్‌ఫెడ్ అధికారి మహేష్‌కుమార్, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ శ్రేణుల సంఘటితంకే రైతు సమితులు
మధిర, సెప్టెంబర్ 12: ప్రభుత్వ సొమ్ముతో టిఆర్‌ఎస్ శ్రేణులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ చట్టాలు, జీవోలపై అవగాహన కలిగిన రెవెన్యూ శాఖ సిబ్బందిని రైతు సమన్వయ సమితిలో సభ్యులుగా చేర్చకుండా కేవలం టిఆర్‌ఎస్ శ్రేణులతోనే సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం ఆ పార్టీ కార్యకర్తల పునరావాసం కోసమేనన్నారు. రాష్ట్రంలో ఈనామ్, సాదాబైనామా, వారసత్వ హక్కు, పోరంబోకు, అటవీ హక్కువంటి తదితర భూములు ఉన్నాయని, వీటన్నింటి పై సాంకేతికంగా అవగాహన ఉన్నవారు మాత్రమే సమగ్రమైన సర్వే చేసి రైతులకు న్యాయం చేయగల్గుతారన్నారు. నిజాం ప్రభుత్వ హయాంలో తెలంగాణాలోని జమీందారులు, జాగీర్‌దారులు, దేశ్‌ముఖ్‌లు ఖాసీం రజ్వి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఊచకోతకు పాల్పడి శిస్తు కట్టలేని రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇందిరాగాంధీ 1973- 74లో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను తీసుకువచ్చి మిగులు భూములను భూమిలేని రైతులకు పంచామన్నారు. భూమికి చెందిన చట్టాలపై ఎటువంటి అవగాహనా లేని వారిచేతిలో భూసమగ్ర సర్వేని పెడితే రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, వ్యవసాయ అనుబంధ అంశాలపై అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఆపార్టీ నాయకులు సూరంశెట్టి కిశోర్, మిరియాల రమణగుప్త, సత్యంబాబు పాల్గొన్నారు.
ఆత్మాభిమానం ఉన్నవారు కాంగ్రెస్‌లోకి రండి
మధిర నియోజకవర్గం ఘనమైన పోరాట చరిత్ర ఉన్న నియోజకవర్గమని, ఆత్మగౌరవం ఉన్న అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఆత్మ గౌరవం ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆ వాఖ్యల అనంతరం ఆపార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.

టిఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వం
* ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 12: టిఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన కొనసాగుతోందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన గ్రామ, రఘునాధపాలెం, ఖమ్మం అర్బన్ మండల రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సాగు, తాగునీటి కొరత రానియ్యకుండా చర్యలు తీసుకుందన్నారు. వ్యవసాయానికి రెండు పంటలకు ఎనిమిది వేలు ఆర్థిక సాయం అందజేస్తూ ఆదుకుంటోందన్నారు. రైతు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడే అవసరం లేకుండా చేసిందన్నారు. రైతులను సంఘటితం చేసి రైతు సమన్య సమితులను ఏర్పాటు చేసిందన్నారు. ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున ఏర్పడే 2600 క్లస్టర్లలో రైతు సంఘాలు నిరంతరం చర్చించుకునేందుకు భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ సమితులు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్ర్తియ విజ్ఞానాన్ని చైతన్యం చేస్తాయన్నారు. వ్యవసాయ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించిందన్నారు. నిజమైన రైతుకా లాభం చేకూర్చేందుకు భూరికార్డులను పరిశీలిస్తుందన్నారు. రెవెన్యూ గ్రామం ఒక యూనిట్‌గా తీసుకొని భూ రికార్డులను రూపొందిస్తామన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారానే భూ రికార్డుల ప్రక్షాళన ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ జి కృష్ణ, నల్లమల వెంకటేశ్వర్లు, గ్రామ, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 12: సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. పెర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమాన పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న వేతనాల్లో ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాశ్వత పనుల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమించరాదని కాంట్రాక్ట్ లేబర్ చట్టం చెబుతోందని, కాంట్రాక్ట్ వర్కర్స్‌ను పెర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని, దేశంలో 30 కోట్ల మంది కార్మికులకు ఈ చట్టం వర్తింపజేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇపిఎఫ్ అమలుకాని కార్మికులందరికీ అమలుచేసేందుకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని, కార్మికులందరికి ఇఎస్‌ఐ వర్తింపజేయాలని అన్నారు. కార్మికులను ఆదుకునేందుకు అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సామాజిక భద్రతగా కనీస పెన్షన్ ఐదు వేలు ఇవ్వాలన్నారు. కనీస వేతనాల జిఓను సవరించి కనీస వేతనం 20 వేలు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో ఇఎస్‌ఐ ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, రామారావు, శ్రీనివాసరావు, అశోక్‌కుమార్, బాబు, సీతారాములు, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తెస్తా

వైరా, సెప్టెంబర్ 12: స్థానిక రిజర్వాయర్‌కు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మంగళవారం స్థానిక కమ్మవారి కళ్యాణ మండపంలో రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల ఎంపికను రాష్ట్రంలో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతాంగానికి ప్రతి ఎకరాకు రూ.4 వేలు ఇచ్చేందుకు గ్రామంలో రైతులతో ఓ కమిటీ వేసి వారికే అప్పగించామని అన్నారు. రైతులకు నేరుగా మంచి జరిగే విషయాలను ప్రోత్సహించాల్సిన ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయో వారికే తెలుసునని తుమ్మల ఎద్దేవా చేశారు. నిజంగా ప్రతిపక్షాలు తప్పుపట్టేందుకు ఎటువంటి ఆస్కారం లేకుండా రైతు సమన్వయ సమితులు పనిచేయాలని తుమ్మల సూచించారు. వైరా పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను అధికారులతో చర్చిస్తానని అన్నారు. ఈ సమావేశంలో వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాణోతు నర్సింహారావు, రైతు సమన్వయ సమితి కో - ఆర్డినేటర్ కస్తాల నాగకోటేశ్వరావు, జడ్పిటీసి బొర్రా ఉమాదేవి, సహకార బ్యాంకు అధ్యక్షుడు తాతా రంగారావు, వైఎస్ ఎంపిపి తన్నీరు జ్యోతి, సర్పంచ్ వాలీ, టిఆర్‌ఎస్ నాయకులు ఎరుపార్శపు భాస్కర్‌రావు, మచ్చా వెంకటేశ్వరావు, బొర్రా రాజా, సూతాకాని జైపాల్, తన్నీరు నాగేశ్వరావు, షేక్ లాల్‌అహ్మద్, కౌసర్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

బోజ్యా తండాలో వైరల్ జ్వరాలు

జూలూరుపాడు, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ శివారు అటవీ ప్రాంత సరిహద్దు గ్రామం బోజ్యా తండాలో వైరల్ ఫీవర్లు వ్యాపించాయి. వారం రోజులుగా ఒకరి వెంట మరొకరు జ్వరం, కీళ్ల నొప్పులతో అనారోగ్యం పాలవుతున్నారు. వ్యాధులతో బాధపడుతూ నీరసించిపోతూ, మూడు కిలోమీటర్ల దూరంలోని పాపకొల్లులో ఉన్న గ్రామీణ వైద్యుల వద్దకు వచ్చి వారు చికిత్స పొందుతున్నారు. కొందరికి ఉపశమనం కలగకపోవటంతో జూలూరుపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా కుటుంబంలో అందరూ మంచాన పడుతున్నారు. వైరల్ ఫీవర్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. వీరితో పాటు తండా పక్కనే కొన్ని రోజలు క్రితం దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆదివాసీలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శేషాద్రి గీత ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న బానోతు కృష్ణవేణి, బానోతు గోపీచంద్, మాళోతు సునీత, ధర్మసోత్ రాకేష్‌తోపాటు రోగులందరికీ శిబిరంలో పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో సాధారణంగా వ్యాప్తి చెందే వైరల్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యురాలు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మంచినీరు, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌వో పాపాయ్య, హెల్త్ సూపర్ వైజర్ పద్మ, ఎఎన్‌ఎం సావిత్రి, ఆశా కార్యకర్త సునీత, సిబ్బంది పాల్గొన్నారు.

మధిర బంద్ సంపూర్ణం
మధిర, సెప్టెంబర్ 12: ఆర్యవైశ్యులను సామాజిక స్మగ్లర్లు అని పేర్కొంటూ కంచె ఐలయ్య పుస్తకాన్ని రచించటాన్ని నిరసిస్తూ మంగళవారం మధిర పట్టణంలో ఆర్యవైశ్యులు చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండే ఆర్యవైశ్యులు రోడ్లపైకి వచ్చి షాపులను బంద్ చేయించారు. మోటార్ సైకిళ్ళతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా పుస్తకం రచించిన ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆర్యవైశ్యులపై అబాండాలను వేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం సరైన చర్య కాదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేంత వరకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు రంగా వెంకటేశ్వరరావు, ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహరావు, వేముల తిరుపతిరావు, పల్లపోతుల ప్రసాదరావు, గొండేల సూర్యప్రకాశరావు, కపిలవాయి జగన్‌మోహన్‌రావు, కుంచం కృష్ణారావు, చారుగుండ్ల నరసింహమూర్తి, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా వీరి బంద్‌కు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మల్లాది వాసు, సూరంశెట్టి కిశోర్, కర్నాటి రామారావు, బెజవాడ రవిబాబు, తలుపుల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు.