ఖమ్మం

83 మద్యం దుకాణాలకు 39.85 కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 22: ఖమ్మంలో శుక్రవారం 83మద్యం దుకాణాలకు నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నూతన దుకాణాల ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. మొత్తం 83దుకాణాలకు ఒక్క ఏడాదికి 39.85కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖ నుండి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. శుక్రవారం స్థానిక సీక్వెల్ రీసార్ట్స్‌లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి సమక్షంలో 83దుకాణాలకు వచ్చిన 4029దరఖాస్తులను లాటరీ పద్దతిన 83మంది లైసెన్సుదారులను ఎంపిక చేశారు. ఎంతో ఉత్కంఠ బరితంగా జరిగిన ఈ లాటరీ పద్దతిలో మద్యం వ్యాపారులు ఊపిరి బిగపట్టి తమకు దక్కుతుందా లేదా అనే ఆందోళనతో లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఖమ్మం నగర పరిధిలోని 28దుకాణాలకు ఒక్కో దుకాణానికి 55లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు 13.75కోట్ల రూపాయలు, మండలాల పరిధిలోని 58మద్యం దుకాణాలకు ఒక్కో దుకాణానికి 45లక్షల లైసెన్స్ ఫీజు చొప్పున 26.10కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం చేకూరింది. దాదాపుగా సిండికేట్ వ్యాపారస్తులకే మద్యం లైసెన్స్ అదృష్టం దక్కినట్లయింది. జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్‌లు లాటరీ తీసి ప్రక్రియను ప్రారంభించారు. రెండేళ్ళ లైసెన్స్‌ను ఈ ఏడాది నుండి కేటాయించడం, దానికి తోడు సాధారణం, గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో సిండికేట్ నుండి 50నుండి 100దరఖాస్తులు ఒక్కో దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది అనుభవం ఉన్న వ్యాపారులు సిండికేట్ అయి వ్యూహాత్మకంగానే లాటరీ పద్దతిలో దుకాణాలను దక్కించుకున్నారు. వైరా ఒక మద్యం దుకాణం నుండి వ్యాపారులు సిండికేట్ అయి 49మంది పేర్లతో దరఖాస్తులు చేయించారు. ఈ దుకాణం లాటరీలో వారికే దక్కింది. ఇదే పద్దతిలో వ్యాపారులు సిండికేట్ అయి జిల్లాలోని దాదాపు మెజార్టీ దుకాణాలను దక్కించుకున్నారు. వీరిలో దాదాపు 20మంది మహిళలకు మద్యం దుకాణాలను లాటరీ పద్దతిలో వరించాయి. లాటరీ పద్దతిలో దుకాణం లైసెన్సు దక్కకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. మొత్తంమీద లాటరీ పద్దతిలో నిర్వహించిన మద్యం దుకాణాల లైసెన్సుల కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది.

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టిఆర్‌ఎస్
* ఓటమి భయంతోనే వలసలకు ప్రోత్సాహం
* బిజెపి శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఆరోపణ
కొత్తగూడెం, సెప్టెంబర్ 22: సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బిజెపి శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతోనే కార్మిక సంఘాలకు చెందిన నాయకుల వలసలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. శుక్రవారం స్థానిక కెసివోఎ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల గుర్తింపు కాల సమయంలో కార్మికులు సంక్షేమాన్ని పట్టించుకోని టిజిబికెఎస్ కార్మికులను మరో సారి మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని కార్మికులు తిప్పికొట్టాలన్నారు. కార్మిక సంఘాల నాయకులను, కార్మికులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిలో భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. నాయకులు, ఓటర్లను బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. సింగరేణి యాజమాన్యం నూతన ప్రాజెక్టుల ఏర్పాటుపై శ్రద్ద చూపకుండా తాడిచెర్ల వంటి ఓపెన్‌కాస్ట్‌లను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతుందని విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణిలో నూతన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, మెడికల్ కళాశాలకు నిధులు మంజూరీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి వరకు శ్రద్ద చూపటం లేదన్నారు. సింగరేణి సేఫ్ నిధులను సిద్దిపేట, సిరిసిల్లా, నిజామాబాద్ ప్రాంతాలకు తరలిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. రానున్న సింగరేణి ఎన్నికల్లో కార్మికుల ప్రయోజనాలను కాపాడే బిఎంఎస్‌కు కార్మికులు అండగా నిలవాలన్నారు. కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్‌కాస్ట్, సింగరేణి కార్యాలయం, ప్రధాన ఆసుపత్రి, సెంట్రల్ వర్క్‌షాప్ వద్ద జరిగిన గేట్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు మాధవ్ నాయక్, లట్టి జగన్‌మోహన్, చందా లింగయ్య, కుంజా సత్యవతి, మల్లేష్, ఎస్ కుమార్, శ్రీ్ధర్ రెడ్డి, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యర్రా కామేష్, గుమలాపురం సత్యనారాయణ, చౌదరి, బెహరా తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి జిల్లాలో 38 మద్యం షాపులకు టెండర్లు ఖరారు
* గ్రామసభల తీర్మానం లేక నిలిచిన 40 మధ్యం షాపుల టెండర్లు
* జిల్లా కలెక్టర్ సమక్షంలో షాపులకు నిర్వహించిన డ్రా
కొత్తగూడెం, సెప్టెంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలోని 38 మద్యం షాపులకు శుక్రవారం టెండర్లు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సమక్షంలో స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో డ్రా పద్దతిలో మద్యం షాపుల టెండర్లను ఖరారు చేశారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలతోపాటు కొత్తగూడెం మండలంలోని సుజాతనగర్, జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం, జూలూరుపాడు, బూర్గంపహాడ్ మండలంలోని బూర్గంపహాడ్ షాపులకు టెండర్లు ఖరారయ్యాయి. 38 షాపులకు సంబంధించి 1354 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 78 షాపులకు 2593 దరఖాస్తులు రాగా గ్రామసభల తీర్మానం లేనికారణంగా 40 షాపులకు డ్రాను వాయిదా వేశారు. పీసా చట్టం ప్రకారం ఏజన్సీ ఏరియాలో గ్రామసభల తీర్మానం వచ్చిన తర్వాత మద్యం షాపుల డ్రాను అధికారులు చేపట్టనున్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసి మద్యం షాపుల డ్రాలకు సంబంధించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు సిండికేట్‌గా మారి టెండర్లు దాఖలు చేసిన వ్యాపారులు డ్రాకు తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ఏరియా జనసంద్రంగా మారింది. టెండర్లు వేసిన వ్యక్తులతోపాటు, బినామీలు సైతం అధికంగా రావటంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. డ్రా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్శింహారెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, అశ్వారావుపేట, మణుగూరు, భద్రాచలం ఎక్సైజ్ సిఐలు నరేందర్, రాజశేఖర్, గురునాధ్, రాంమ్మూర్తి, ఇందుమతి, జయశ్రీలు టెండర్ల డ్రా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆసుపత్రిలో నాలుగు కేజీల శిశువు జననం
ములకలపల్లి, సెప్టెంబర్ 22: స్థానిక మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాలుగు కేజీల మగ శిశువు శుక్రవారం జన్మించాడు. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రియత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మంచికంటి నగర్‌కి చెందిన కుంజా సుమలత, అనిల్ కుమార్ దంపతులకు నాలుగు కేజీల మగ శిశువు జన్మించాడు. వీరికి మొదట పాప పుట్టింది. రెండవ సంతానంగా సంపూర్ణ ఆరోగ్యంతో నాలుగు కేజీల బరువున్న బాబు జన్మించాడు. తల్లిదండ్రులు, వైద్య సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. శిశువును చూసేందుకు బంధువులు ఉత్సాహంగా వచ్చారు. ప్రసవం చేసిన స్ట్ఫా నర్స్ ఇందిర, సిబ్బంది రాధమ్మను వైద్యురాలు ప్రియత అభినందించారు.

రెండవ రోజు ఉల్లాసంగా జోనల్ క్రీడలు
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 22: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతున్న నాల్గవ జోనల్ క్రీడలు శుక్రవారం రెండవ రోజు ఎంతోఉల్లాసంగా జరిగాయి. గురువారం నుండి 7 జిల్లాల స్దాయిలో జరగుతన్న ఈ పోటీలలో వివిధ విభాగాలలో గెలుపొందిన పాఠశాలల వివరాలను ప్రకటించారు. పాఠశాలలో విభాగంలో కబాడ్డిలో టేకులపల్లి, దానవాయిగూడెం, పాల్వంచ, నేలకొండపల్లి, ఎర్రుపాలెం, అడవిమల్లెల, ఖోఖో విభాగంలో పాలకుర్తి, రాయపర్తి విజేతలు. హ్యండ్‌బాల్‌లో జఫర్‌గడ్, మడికొండ విజేతలు. వాలీబాల్ వైరా, నేలకొండపల్లి, అడవిమల్లెల, మడికొండ, పాల్వంచ, టేకులపల్లి విజేతలుగా నిలిచారు. కబడ్డీ కాలేజి విభాగంలో పర్వతగిరి, పరకాల, తొర్రూరు, నేలకొండపల్లి, టేకులపల్లి విజేతలు. వాలీబాల్‌లో రాయపర్తి, మణికొండ, అంబేద్కర్‌కాలేజి ఖమ్మం, పరకాల, జఫర్‌గడ్, పాలకుర్తి, కల్లూరు విజేతలు. ఖోఖో అండర్ 14లో దుగ్గొండి, కాటారం, కూచిమంచి, ధర్మాసాగర్, నర్శింహులుపేట విజేతలు. అథ్లెటిక్స్ స్కూల్స్ విభాగంలో 800 పరుగులో జె నవ్య నేలకొండపల్లి, సిహెచ్ కీర్తన పాలకుర్తి, వి సంధ్య టేకులపల్లి, కాలేజి విభాగంలో 800లో జి శీరీష పాలకుర్తి, యల్ కృప, పరకాల, బి శ్రవణి పరకాల, యం ప్రసన్న మడికొండ విజేతలుకాగా ఇంకా మరి కొన్ని విభాలలో పోటీలు జరుగున్నాయి. ఈ కార్యక్రమంలో ఉజ్వలాకుమారి, సునీత, లక్ష్మణ్, నాగరాజు, అన్ని పాఠశాలల ప్రిన్సిపాల్స్, పిడిలు, పియిటిలు పాల్గొన్నారు.

వక్ఫ్‌భూముల కబ్జాలను వెంటనే నిలిపివేయాలి
ఖమ్మం(జమ్మిబండ), సెప్టెంబర్ 22: ఆక్రమణకు గురైన వక్ఫ్‌భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కబ్జాకు గురవుతున్న భూములను వెంటనే నిలిపివేయాలని తంజీమ్ ఏ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ నాయకులు సలాం మాట్లాడుతూ వక్ఫ్ భూములకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో ఎస్‌కె సైదా, యానాలి సాంబశివారెడ్డి, ఎండి రెహ్మాన్, బాషా, కరీం, వీరాసాహేబ్, రమణ, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లిలో పెద్దమ్మతల్లి త్రిరాత్రి ఉత్సవాలు
*ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
కారేపల్లి, సెప్టెంబర్ 22: కారేపల్లి మండలకేంధ్రంలోని కొలువైన పెద్దమ్మతల్లి ఆలయకమిటీ త్రిరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపటానికి శుక్రవారం ఆహ్వానపత్రికను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటి, స్థానిక సర్పంచ్ మండెపుడి రాణి విలేఖర్లతో మాట్లాడుతూ ఈనె 27నుండి మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయన్నారు. బుధవారం సరస్వతిదేవి ఆలంకరణలో పెద్దమ్మతల్లి భక్తులకు దర్శమిస్తుందని ద్రేరోజు ఉదయం 11గంటలకు దేవాలయంలో సరస్వతిపూజ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గరువారం దుర్గాష్టమి సంధర్భంగా దుర్గాదేవి అలంకరణతో దర్శనం కలుగుతుందని, ఇదేరోజు మద్యాహ్నం అన్నదానం ఉంటుందన్నారు. శుక్రవారం మహాషాసురమర్ధిని అలంకరణ, శనివారం రోజున రాజరాజేశ్వరిదేవి అలంకరణతో పెద్దమ్మతల్లి దర్శనమిస్తుందన్నారు. ఆదే రోజు సాయంత్రం 5గంటలనుండి శమీపూజలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయలకమిటి నాయకులు మండెపుడి శ్రీనివాసరావుఅర్చకులు ఈశ్వరశాస్ర్తీ, ఎర్రా నర్సిహారావు, కంచి రమేష్, గంగరబోయిన శ్రీనివాసరావు, గొడుగు శ్రీనివాసరావు, పెద్దమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మద్యాన్ని నిషేధించాలి
* ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భిక్షాటన
ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 22: మద్యాన్ని ఆదాయ వనరులుగా చూస్తూ అనేక కుటుంబాలను ఛిద్రం చేస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పిఓడబ్ల్యూ, ఐద్యా, సిఎంఎస్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ఆందోళన నిర్వహించారు. మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ పలు వీధుల్లో మహిళలు ప్రదర్శన నిర్వహించి భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సిహెచ్ శిరోమణి, ఐద్వా జిల్లా అధ్యక్షుడు ఎం భారతి, చైతన్య మహిళ సంఘం జిల్లా కార్యదర్శి విజయలు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడితే మహిళలంతా కలసి భిక్షాటన చేసి కెసిఆర్‌కు అందిస్తామన్నారు. అనేక కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. మద్యం సేవించి చిన్నతనంలోనే తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారి బాధలకు తట్టుకోలేని కొంతమంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. మద్యం వలన మహిళలపై హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. మద్యం మత్తులో చిన్నారులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని, యువకులు, విద్యార్థులు చెడు మార్గాలను అనుసరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని, రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట పర్మిషన్లు ఇవ్వడంతో అనేక మంది ప్రాణాలు పోగుట్టుకుంటున్నారన్నారు. జనావాసాల మధ్య ఉన్న షాపులకు అనుమతులు ఇస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు టి ఝాన్సీ, స్వరూపారాణి, మంగతాయి, బేబి, రేణుక, పద్మ, నాగమణి, బేగం, రమ్య తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ సంబురాలు
చింతకాని, సెప్టెంబర్ 22: దేవినవరాత్రోత్సవాలను పురస్కరించుకుని మండలంలో దుర్గాదేవి మండపాల వద్ద బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. దేవినవరాత్రుల పూజలు, బతుకమ్మ కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు బతుకమ్మ కార్యక్రమాలు, పాటలతో మామ్రోగుతున్నాయి. నాగులవంచ, రామకృష్ణాపురం, నామవరం, చింతకాని, నేరడ, ప్రొద్దుటూరు, అనంతసాగర్ గ్రామాలలో దేవినవరాత్రులు, బతుకమ్మ కార్యక్రమాలలో జోరుగా సాగుతున్నాయి. దసరా సెలవులు కావడంతో విద్యార్ధులు ఆటపాటలలో మునిగితెలుతున్నారు. పిల్లలతో పాటు, మహిళలు కోలాటాలు, నృత్యాలతో అలరిస్తున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి పూజిస్తున్నారు. ముఖ్యంగా పందిళ్ళపల్లి ముదిరాజ్ బజారులో దేవినవరాత్రులలో భాగంగా వివిధ రకాల సాంసృతిక కార్యక్రమాలు అబ్బుర పరుస్తున్నాయి. మహిళల బతుకమ్మ ఆటపాటలు, యవకుల నృత్యాలతో దుర్గాదేవి మండపం వద్ద కోలాహలంగా ఉంటున్నది. చిన్నపిల్లలు ఆడుతున్న బతుకమ్మ నృత్యాలను చూసేందుకు గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. బతుకమ్మ నిమజ్ఞన కార్యక్రమంలో జాగ్రత్తలు వహించాలని స్థానిక పోలీసులు మండల ప్రజలకు సూచించారు. బతులమ్మలను నీళ్ళలో వదిలే సమయాలలో చిన్నపిల్లలు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు.

ఘనంగా ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు
* 3వ రోజు ఆదే జోరు
ఖమ్మం(కల్చరల్), సెప్టెంబర్ 22: బతుకమ్మ వేడుకల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం ముద్దపప్పు బతుకమ్మకు మహిళలు ఎంతో ఆనందంతో ఆడిపాడి నీరాజనాలు పలికారు. పూలను సేకరించడంలోగాని, బతుకమ్మను పేర్చడంలోగాని ఏమాత్రం తేడాలేకుండా తీరొక్క పూలతో భారీ నుండి అతిభారీ బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని నగర వీధులను తాకుతూ బతుకమ్మలను ఒకేచోటుకు చేర్చారు. వందలాది మంది పిల్లలు, యువతులు, మహిళలు బతుకమ్మల వలే రంగు రంగు పట్టు వస్త్రాలు ధరించి రావడంతో విద్యుత్ జిలుగుల మద్య మెరిసిపోయారు. రంగు రంగుల బతుకమ్మల చుట్టూ మెరిసిపోయే పట్టువస్త్రాలు ధరించిన మహిళలు ఆడుతూ పాడుతూ చేసిన కోలాటాలు, నృత్యాలు ఎంతగానో అనందింపజేశాయి. నగరంలో ఏ నాలుగు బజార్ల కూడళ్ళ వద్ద చూసినా బతుకమ్మల జోరు కొనసాగుతున్న తీరు అబ్బురపర్చింది. ఇంతటి సంబురాలను చూసేందుకు ఇంటిల్లిపాది అక్కడకు చేరుకుని చప్పట్లు, ఈలలతో ఆడపడుచులను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందిస్తున్న ప్రోత్సాహానికి మహిళలోకం మరింత ఉత్సాహాంతో ముందుకుసాగారు. కొత్త కొత్త బతుకమ్మ పాటలకు చిన్నారుల చిందులు తల్లిదండ్రులను ఆనందడోలికల్లో ముంచివేశాయి. వారు లౌడ్ స్పీకర్లకు లయబద్దంగా పాడుతూ చేసిన నృత్యాలను సెల్‌ఫోన్లు, కెమెరాలలో బంధించి స్నేహితులతో పంచుకున్నారు. ఆడిపాడిన మహిళలకు ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారుచేసిన నైవేద్యాలను ప్రసాదంగా పంచిపెట్టారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మను ప్రదర్శనగా బయలుదేరి కాల్వఒడ్డులోని మునే్నరులో నిమజ్జనం చేశారు.

వాడవాడలా బతుకమ్మ వేడుకలు
కామేపల్లి, సెప్టెంబర్ 22: బతుకమ్మ వేడుకలు మండలంలో గ్రామగ్రామాన మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన కామేపల్లిలోని ఎంపి సెంటర్‌నందు శివాలయం వీధి, గ్రామ పంచాయతీ కూడలి, రామకృష్ణాపురంలోని అభయాంజనేయస్వామి దేవాలయం, రామకృష్ణాపురం, కామేపల్లి ప్రధాన కూడళ్ళలో మహిళలు విశేషంగ బతుకమ్మలతో తరలివచ్చి ఆటపాటలతో వేడుకలు నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన వైద్య సిబ్బందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారని, అదే విధంగా 26న అంగన్‌వాడి కార్యకర్తలు, 27న మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రెండు కోట్ల చేప పిల్లలు పంపిణీ
ఏన్కూరు, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖమ్మం మత్స్య ఖాఖ ఆధ్వర్యంలో వైరా డివిజన్‌లోని 10 మండలాల్లో 2కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయటం జరుగుతుందని ఎఫ్‌డిఓ శివప్రసాద్ తెలిపారు. మండల పరిధిలోని తూతకలింగన్నపేట, పికెబంజర చెరువులకు శుక్రవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైరా డివిజన్‌లో మత్స్యశాఖ పరిధిలో 100 చెరువులు, గ్రామ పంచాయితీల పరిధిలో 393 చెరువులు ఉన్నట్లు తెలిపారు. వీటికి 2కోట్ల చేపపిల్లలకు గాను ఇప్పటి వరకు 50లక్షలు పంపిణి చేశామన్నారు. చెరువుల్లో మత్స్య సంపదను అభివృధ్ది చేసి మత్స్య ఖారుల జీవనోపాధులను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఫీల్డ్‌ఆఫీసర్ బెనర్జీ, జడ్‌పిటిసి శ్యామల, ఎంపిటిసి సునీత, సర్పంచ్ రేసువెంకయ్య, ఉపసర్పంచ్ గిద్దిగిరి సత్యనారాయణ, ముధిరాజు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతనబోయిన సీతరాములు, సంఘ సభ్యులు ఈద నరసింహారావు, అంబటి హరిక్రిష్ణ, మచ్చాశ్రీను, ఈదరాజయ్య పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిపిఎంను తిరుగులేని శక్తిగా నిలపాలి
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 22: భద్రాచలం పట్టణంలో సిపిఎం పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు పార్టీ శ్రేణులందరూ కంకణబద్దులు కావాలని సిపిఎం పట్టణ నాయకులు ఎంబీ నర్సారెడ్డి, గడ్డం స్వామి పిలుపునిచ్చారు. పట్టణంలోని కొత్తకాలనీ బి-శాఖ మహాసభ కామ్రేడ్ పారెల్లి సత్యవతినగర్‌లో కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో శుక్రవారం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటరెడ్డి పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు నిర్వహించాలన్నారు. పట్టణంలో సిపిఎంను తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ప్రతి సభ్యుడు కృషి చేయాలని కోరారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మతోన్మాదం ఏజెండాగా ప్రజలను చీల్చేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. చాయ్‌వాలా అని ప్రకటించుకున్న నరేంద్రమోడీ కార్పోరేట్ శక్తులకు ప్రతినిధిగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా ఉద్యమాలను, పోరాటాలను అణిచేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యకర్తలు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో వై.వెంకట రామారావు, చుక్కా మాధవరావు, పారెల్లి సంతోష్, రాజేంద్ర ప్రసాద్, కాసుల కళావతి, పద్మ, ఆదిలక్ష్మీ, హైమావతి, సరోజిని, కళావతి, సుశీల, జానయ్య, సత్యావతి, లక్ష్మీ, బొడ్డు కుసుమ తదితరులు పాల్గొన్నారు.