ఖమ్మం

అటవీ భూముల ఆక్రమణదారులపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 23: అటవీ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూముల్లో చెట్లు నాటాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం టిటిడిసిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరితహారంలో జిల్లా సత్ఫలితాలు సాధించినప్పటికీ ఇంకా చేయగలిగే పరిస్థితులు ఉన్నా చేయకపోవడం బాధాకరమన్నారు. అనేక చోట్ల అటవీ భూములకు ట్రెంచ్ వేయకపోవడం వల్ల ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలందరికి అందించే బాధ్యత అధికారులదేనని, ఇందులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అటవీ శాఖాధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాల్లో ఆలస్యం గురించి ప్రశ్నించగా కలెక్టర్ లోకేష్‌కుమార్ పనిఒత్తిడి వల్ల పూర్తిచేయలేకపోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న విధులతో పాటు అదనపు పనులు వస్తున్నాయని, సిబ్బంది లేమితో పనులు సాధ్యంకావడం లేదన్నారు. అలాగే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు కాంట్రాక్టర్లు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యం అవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంటున్నదన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న భూసమగ్ర సర్వే, మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆయా గ్రామాల్లోని అన్ని ఇళ్ళకు నల్లా ద్వారా నీళ్ళందించేందుకు ప్రయత్నిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మంత్రి తుమ్మల జోక్యం చేసుకొని విధులలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అలా చేయకుండా పనులు ఆలస్యం చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. అధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. సమావేశంలో డిఆర్వో శివ శ్రీనివాస్, డిఆర్‌డిఏ పిడి మురళీధర్‌రావు, అడిషనల్ పిడి ఇందుమతి, నగర కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తాం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని
కొత్తగూడెం, సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీని భద్రాద్రి జిల్లాలో గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) తెలిపారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలతో నూతనోత్సాహాన్ని నింపుతామన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తానని ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలోని ఐదు నియోజక వర్గాల్లో పర్యటించి అన్ని నియోజక వర్గాల ఇన్‌ఛార్జిలతో స్థానిక సమస్యలు చర్చించి వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరారవు స్ఫూర్తితో పార్టీ అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. జిల్లా అధ్యక్షునిగా నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, మోతుకుపల్లి నర్శింహులు, నామా నాగేశ్వరరావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూక్యా అరుణ, తెలుగుదేశం నాయకులు కంచర్ల గోపాలకృష్ణ, రావి రాంబాబు, నాయుడు, తులసి రెడ్డి, గుగులోతు కృష్ణ, స్టీవెన్, ఆవుల శ్రీనివాస్, జోగు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

గుర్తింపు ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
పావులు కదుపుతున్న టిజిబికెఎస్
* వలసల ప్రోత్సాహంతో పట్టు నిలుపుకునేందుకు పాకులాట
* వేడెక్కుతున్న సింగరేణి గుర్తింపు సంఘం ప్రచారం
కొత్తగూడెం, సెప్టెంబర్ 23: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పావులు కదుపుతోంది. ఇతర కార్మిక సంఘాల నాయకులను తన గూటిలోకి చేర్చుకునేందుకు వలసలను ప్రోత్సహిస్తూ పట్టుకోసం పాకులాడుతోంది. గుర్తింపు సంఘంగా ఉన్న టిజిబికెఎస్ మరో విడత అధికారాన్ని దక్కించుకునేందుకు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సింగరేణి వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అధికార పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించటంతోపాటు మైన్స్, డిపార్ట్‌మెంట్ల వద్ద ఇన్‌ఛార్జిలను నియమించి కార్మికులకు అవసరమైన సదుపాయాలను సమకూర్చే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని శ్రీరాంపూర్, రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి తదితర ఏరియాల్లో పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్, వినోద్ కుమార్, మంచిర్యాల శాసన సభ్యులు దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తెలంగాణ ఆర్టీసి చైర్మన్ సోమవరపు సత్యనారాయణ, చీఫ్ విప్ నల్లాల ఓదేలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాం నాయక్, శాసన సభ్యులు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్ వంటి కార్మిక సంఘాల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో సఫలీకృతులవుతున్నారు. ఇటీవల కొత్తగూడెం ఏరియాలో ఎఐటియుసికి చెందిన బ్రాంచి కార్యదర్శి కూసన వీరభద్రయ్యను, మణుగూరులో ఐఎన్‌టియుసికి చెందిన పిచ్చేశ్వరరావును తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేర్చుకోవటం చర్చనీయాంశంగా మారింది.

అర్ధరాత్రి ఆర్తనాదాలు
* అదుపుతప్పి పల్టీకొట్టిన ట్రాక్టర్
* ఇద్దరు మహిళలు మృతి * 14 మందికి తీవ్రగాయాలు
* క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
జూలూరుపాడు, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహాదారిపై శుక్రవారం అర్ధరాత్రి ట్రాక్టరు అదుపుతప్పి పల్టీకొట్టిన సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పది మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమాంనగర్ గ్రామానికి చెందిన లకావత్ శ్యామ్‌లాల్, సునీత దంపతులు కుమార్తె జనితకు మొక్కులు తీర్చుకునేందుకు భద్రాచలం ట్రాక్టరులో కుటుంబ సభ్యులు, బంధువులతో బయలుదేరారు. బయలు దేరిన కొద్ది సమయానికే జూలూరుపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీగొట్టింది. ప్రమాదంలో ట్రక్కులో ఉన్న వాళ్లంతా రోడ్డుకు దూరంగా చెల్లాచెదురుగా పడటంతో లకావతు శాంతి (45) అనే మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ట్రాక్టరులో మొత్తం 25 మందికి పైగా ప్రయాణిస్తుండగా వీరిలో 14 మందికి తీవ్ర గాయాలుకాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన సంఘటనతో ప్రమాద స్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గాయాలపాలైన వారంతా పెద్ద ఎత్తున రోదిస్తుండటంతో రహదారికి ఇరువైపులా బారులుతీరి నిలిచిపోయిన వాహనాల ప్రయాణికులు సహాయం అందించే ప్రయత్నం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సంఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే పోలీసు స్టేషన్ ఉండటంతో రోడ్డు ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న ఎస్సై ఇళ్లా రాజేష్, సిబ్బందితో హుటాహుటిన ఆక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను కొంత మందిని పోలీసు వాహనంలో, మరి కొందరిని 108 వాహనంలో కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళ లకావతు లాలమ్మ (65) మార్గం మధ్యలోనే మృతి చెందింది. బానోతు తరుణ్, లకావత్ సర్వర్‌లాల్, లకావతు హర్షవర్ధన్ లాల్, రాములాల్, మహేష్, మేఘన, జాటోతు రాంబాబు, లకావతు వశ్యాలాల్, మాధవి, శాంతి, అనూషలను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు వీరిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. అయితే శ్యామ్‌లాల్ ఆర్‌ఎస్సైగా పనిచేస్తుండగా, ఆయన సోదరుడు సర్వేశ్‌లాల్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారంతా ప్రమాదానికి గురవటంతో ఏన్కూరు, జూలూరుపాడు మండలాలకు చెందిన సమీప బంధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలం వద్దకు చేరుకుని బోరున విలపించారు.
సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం
* కొండపల్లి, వైజాగ్‌లకు సత్తుపల్లి రైల్వే జంక్షన్ * రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి, సెప్టెంబర్ 23: సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్మికుల పక్షపాతిగా సీఎం కెసిఆర్ పనిచేస్తున్నారని రాష్టర్రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక జెవిఆర్ ఓసి ప్రాంగణంలో శనివారం జరిగిన టీబీజీకెఎస్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ కార్మికుల పొట్టగొట్టే సంఘాలు మనకు అవసరం లేదన్నారు. వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకెళ్ళి నిలిపి వేశారని సింగరేణిమీది, మీ ఆస్తిని మీరే బతికించుకోండి, మీ కోరికలను తీర్చే భాద్యత నాదన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకెఎస్ గెలుపు ఖాయమని, మెజార్టీ ఓట్లు సాధించే దిశగా కార్మికులు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా తయారయ్యాయని, అసలు నాయకత్వమే లేని సంఘాలు కూడా కార్మికుల జేబులు కొట్టి బతకాలని ప్రతయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
చట్టసవరణ చేసైనా వారసత్వం...
సత్తుపల్లికి మంచి భవిష్యత్ ఉంది, కొత్తబొగ్గుగనులు వస్తున్నాయ్, ఇప్పటికే ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. భవిష్యత్‌లో సింగరేణి లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వారసత్వ ఉద్యోగాల కోసం అవసరమైతే చట్టసవరణ చేసైనా ఉద్యోగాలు ఇచ్చేందకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.700 కోట్ల నిధులు విడుదలయ్యాయని త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు. కొండపల్లి, వైజాగ్‌లకు సత్తుపల్లి రైల్వేజంక్షన్‌గా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, నగరపంచాయితీ చైర్మన్ దొడ్డాకుల స్వాతి, ఎంపిపి జ్యేష్ట అప్పారావు, టీబీజీకెఎస్ ఫిట్ కార్యదర్శి సందిరి శ్రీనివాస్, ఏరియా చర్చల కమిటీ సభ్యులు చెన్నకేశవరావు, శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* మంత్రి తుమ్మల
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 23: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని రఘునాధపాలెం గ్రామంలో హోమియో వైద్య క్యాంప్‌ను ప్రారంభించారు. అనంతరం బచ్చోడుతండాలో మిషన్ భగీరథ వాటర్‌ట్యాంక్‌కు శంకుస్థాపన చేశారు. రఘునాధపాలెంలో జరిగిన ఈ సభలో తుమ్మల మాట్లాడుతూ ప్రధాని మోడీ స్వచ్ఛ్భారత్ అని పిలుపునిచ్చారని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, శారీరకంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే స్వచ్ఛ్భారత్ నెరవేరతుందని ఆయన తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో రఘునాధపాలెం గ్రామాన్ని హోమియో క్యాంప్‌లు నిర్వహించడం అదృష్టమని, ప్రతి ఒక్కరూ హోమియో మందును వాడేవిధంగా ప్రజలు చూడాలని ఆయన కోరారు. సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధిలో ప్రభుత్వం ముందుందని, అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ళు తదితర పథకాలను అమలు చేస్తామని, ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. కాగా హోమియో వైద్యులు మాట్లాడుతూ 15జిల్లాలోని రఘునాధపాలాన్ని ఎన్నుకోవడం ప్రజల అదృష్టమని, ఈ గ్రామానికి పదిలక్షల రూపాయలు కేటాయిస్తూ వారికి హోమియో మందులు సరఫరా చేస్తామని వారు తెలిపారు. నెలకు రెండుసార్లు క్యాంపులు నిర్వహిస్తామని, ప్రతి జబ్బుకు నివారణ మందులు ఉన్నాయని, జబ్బు అనేది తగ్గకుండా ఉండదని వారు పేర్కొన్నారు. హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో 934కోట్లు ఖర్చు చేయలేదని, ఆ నిధులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పోయాయని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 60శాతం నిధులను కేటాయిస్తుందని, ఆ నిధులు ఖర్చు చేయాలని కోరారు. రఘునాధపాలెం గ్రామాన్ని సోలార్ ప్రాజెక్టుగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, ఎంపిటిసి వీరన్న, సర్పంచ్ పద్మ తదితర అధికారులు పాల్గొన్నారు. కాగా మంత్రి చివ్వరిలో మాట్లాడుతూ మండలంలోని మర్రిపెడ మండలంలోని గ్రామానికి, జూపెడ, కాకరవాయి గ్రామానికి కలుపుతూ హైవేరోడ్డును మంజూరు చేస్తున్నట్లు, త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మూడోరోజు ఉత్సహభరితంగా జోనల్ క్రీడలు
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 23: ఎర్రుపాలెం గురుకుల కళాశాలలో జరుగుతున్న 7జిల్లాల బాలికల జోనల్‌స్దాయి క్రీడలు శనివారం ఉత్సహాభరితంగా జరిగాయి. కబాడ్డి అండర్ 17లో తిరుమలాయిపాలెం విద్యార్దులు, అడవిమల్లెల విద్యార్దులు గెలుపొంది సెమీస్‌కు చేరారు. వాలీబాల్‌లో మడికొండ విద్యార్దులు, ఖోఖోలో ఎర్రుపాలెం విద్యార్దులు, టెన్నీకాయిట్‌లో అండర్ 19లో ఎర్రుపాలెం విద్యార్దులు గెలుపొంది సెమీస్ చేరారు. చెస్‌లో పరకాలకు చెందిన జె ఇందు విజయం సాదించారు. ఈ క్రీడాపోటీలను ఆర్‌సివో యం పుల్లయ్య, డిసివో కె శారద, ప్రిన్సిపాల్ ఉజ్వలాకుమారి, నాగరాజు, సునీత, లక్ష్మణ్, కోటా రాంబాబు, అన్ని పాఠశాలల ప్రిన్సిపాల్స్, పిడిలు, పియిటిలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

జమలాపురం ఆలయంలో వైభంగా పుష్పార్చన
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 23: తెలంగాణ తిరుపతిగాప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి శనివారం వెకువ జాముననే పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అమ్మవార్లకు పట్టువస్తమ్రులు ధరింపజేసి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవములలో భాగంగా శ్రీపద్మావతి అలివేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు వైభవపేతంగా పుష్పయాగము అర్చకులు శ్రీనివాసశర్మ వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈపూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అయ్యప్ప ఆలయంలో ఉచిత అన్నదానం నిర్వహించారు. ఆదివారం భక్తులచే లోకకళ్యాణార్దం చండీసప్తశతి హోమం నిర్వహిస్తున్నట్లు ఇవో రమణమూర్తి, చెర్మన్ శివరాం ప్రసాద్ తెలిపారు. ఈకార్యక్రమంలో కెవిఆర్ అంజనేయులు,సోమయ్య,విజయదేవశర్మ,రమణబాబు.తదితరులు పాల్గొన్నారు.

శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు
నేలకొండపల్లి, సెప్టెంబర్ 23: స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ఘనంగా బ్రహోత్సవాలు ప్రారంభమైనాయి. శనివారం స్వామి వారికి తొళక్కం అధ్యయనోత్సవం కార్యక్రమం ప్రారంభించారు. అలాగే ద్రవిడ ప్రబంధ పారాయణం నిర్వహించారు. అలాగే 24వతేదిన స్వామి వారికి ఉదయం ప్రాబోధిక, మధ్యాహ్నం ద్రవిడ ప్రబంధ పారయణం, రాత్రి అధ్యయనోత్సవము నిర్వహించనున్నారు. 25న పరమపదోత్సవము, 26న ప్రాభోధక, చాత్మర, అంకురారోపణ, ధ్వజారోహణము, హోమం, బలిహరణము, 27న శ్రీ స్వామి వారికి తిరుక్కళ్యాణోత్సవము, 28న ప్రాబోధిక హోమబలిహరణములు, పూర్ణతళిహ ఆరగింపు, శ్రీ స్వామి వారికి గరుడసేవ, 29న హనుమత్సేవ, 30న విజయదశమి పర్వదినం సందర్బంగా పారువేట, శమీపూజ, ఆలయ ప్రవేశం, పూర్ణాహుతి, ధ్వజపట ఉద్వాసన, 1న దోపుసేవా, గ్రామ సేవ, అవబృధ స్నానము, శ్రీపుష్పయాగము, ద్వాదశ తిరువారాధనలు, ద్వాదశ ఆరగింపులు నిర్వహించనున్నారు. ఇట్టి కార్యక్రమాలకు భక్తులు హజరు కావలని ఆలయ చైర్మన్ చవళం వెంకటేశ్వరరావు, ఆలయ పూజారి మధుసూధనచార్యులు కోరారు.
గొర్రెల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలి
* రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 23: జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల సంవరక్షణ కోసం పశుఆరోగ్య సేవా ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాల వాహనాలను కలెక్టర్ లోకేష్‌కుమార్‌తో కలసి స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే దాదాపు 21లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. వాటి ఆరోగ్య సంవరక్షణ కోసం పశువులను ఆసుపత్రులకు తరలించేందుకు రైతులు ఏలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలతో సంచార వైద్యశాలలను ప్రారంభించిందన్నారు. ఇకనుండి ఇంటివద్దకే వచ్చి పశువులకు వైద్యం అందించే చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి 1చొప్పున 5వాహనాలను మంజూరు చేశామన్నారు. ఈ వాహనాల ద్వారా ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజువారి వైద్యసేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ పాపాలాల్, ఎస్‌ఇ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎఎంసి చైర్మన్ జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టిడిపి కమిటీల్లో ఇరుజిల్లాలకు సముచిత స్థానం
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీ శనివారం విడుదల చేసిన పోలిట్ బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వాసులకు అవకాశం కల్పించారు. పోలిట్‌బ్యూరో సభ్యులుగా నామా నాగేశ్వరరావు, కేంద్ర కమిటీ ఉపాధ్యాక్షులుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా మద్దినేని బేబి స్వర్ణకుమారి, అధికార ప్రతినిధిగా కోలేటి భవానిశంకర్, కార్యదర్శులుగా మోచ్చా నాగేశ్వరరావు, కాపా కృష్ణమోహన్, రాయల వెంకట శేషగిరిరావు, వల్లకొండ వెంకట్రామయ్యలకు అవకాశం కల్పించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు సముచిత స్థానం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి నూతనంగా ఎన్నికైనా జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, కోనేరు సత్యనారాయణలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ
వైరా, సెప్టెంబర్ 23: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ అని జడ్పిటీసి బొర్రా ఉమాదేవి అన్నారు. శనివారం స్థానిక శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకబతుకమ్మ ఆట - పాట కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలంగాణ జాగృతి నిర్వాహకులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన బొర్రా ఉమాదేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన అనంతరం మన బతుకమ్మకు ప్రత్యేక ఆదరణ దేశ, విదేశాల్లో పెరుగుతుందని ఆమె అన్నారు. స్ర్తి ఆత్మ గౌరవం, సమానత్వం, స్వేచ్చ కోసం ప్రతిఒక్కరు బతుకమ్మ సంబరాలలో పాల్గొనాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిపి బొంతు సమత, వైఎస్ ఎంపిపి తన్నీరు జ్యోతి, సర్పంచ్ బాణోతు వాలీ, కళాశాల ప్రిన్సిపాల్ వెంకన్న, వైద్యులు కోటయ్య, ఐద్వా కార్యదర్శి రజిత, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ మాదినేని సునీత, జాగృతి బాధ్యులు మాధవి, రజిని, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అనాదిగా మహిళలను ఏకం చేస్తున్న బతుకమ్మ పండుగ
కారేపల్లి, సెప్టెంబర్ 23: అనాదిగా బతుకమ్మ పండుగ మహిళలను ఏకం చేస్తున్న పండుగ అని సింగరేణి సర్పంచ్, టిడిపి మహిళా నాయకురాలు మండెపుడి రాణి అన్నారు. శనివారం స్థానిక శ్రీకవిత ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో ఆమె మాట్లాడుతూ నేడు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా చెరువుల వద్ద బతుకమ్మ సందడి కొనసాగుతున్నప్పటికీ నేడు ఆర్ట్ఫిషియల్ పూలతో బతుకమ్మ పండగ నిర్వహించడంలో గతంలోలా ఆనందం కలుగదన్నారు. బతుకమ్మ పండుగకు అవసరమైన తంగేడు వంటి పూలు చాలా వరకు కనుమరుగౌతున్నాయని, వాటిని సంరక్షించి మళ్ళీ వనాలుగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణా ప్రభుత్వం తంగేడు పువ్వును అధికార పుష్పంగా గుర్తించిన సంధర్భంగా వాటిని మరింతగా లభించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకవిత విద్యార్థినులు పాల్గొన్నారు.