ఖమ్మం

వర్షానికి నాని విరిగిన రాతి ఫలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వర్షం వల్ల రాజగోపురం నాని ఒక రాతిఫలకం విరిగి కిందపడిందని పురావస్తు శాఖ అధికారులు నిర్థారించారు. శతాబ్ధాల కాలం నాటి రాజగోపురం కావడంతో స్వల్పంగా బీటలు వారిందని, ఆ బీటల గుండా వర్షపు నీరు గోపురంలోని వివిధ భాగాలకు చేరుకోడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వారు పేర్కొన్నారు. భద్రాచలం రామాలయంలో శనివారం తెల్లవారుజామున రాజగోపురం పై నుంచి ఒక రాతిఫలకం కింద పడిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశం కావడంతో ఆలయ ఇవో దేవాదాయశాఖకు ఘటనపై సమాచారం ఇచ్చారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని పురావస్తు శాఖ అధికారులకు విషయం వివరించి ఆదివారం భద్రాచలం పంపారు. పురావస్తు శాఖ బృందం భద్రాచలం చేరుకుని ఆలయ ఇవో ప్రభాకర శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజగోపురం నుంచి పడిపోయిన రాతిఫలకాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన ఎప్పుడు జరిగింది, రాయి పరిమాణం ఎంత, ఎక్కడ పడింది అనే దానిపై వారు వివరాలు నమోదు చేశారు. నిచ్చెన సహాయంతో గోపురంలోని భాగాలను వారు పరిశీలించారు. గోపురం వద్ద వర్షపు నీటి తడి కనిపించడంతో మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించారు. 350 ఏళ్ల నాటి గోపురం కావడంతో వర్షం కారణంగా గోపురం కింది భాగాలకు వర్షపు చెమ్మ చేరుకుందని, దీనివల్లే రాతిఫలకం బాగా నాని కింద పడిపోయిందని వారి పరిశీలనలో వెల్లడైంది. రాజగోపురం పటిష్టంగా ఉందని, తగిన రక్షణ చర్యలు తీసుకుంటే ఇప్పట్లో ఎటువంటి ఢోకా ఉండదని వారు తెలిపారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖ ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ రాజగోపురానికి స్వల్పంగా బీటలు వారాయని, ఈ బీటల గుండా వర్షం పడినప్పుడు నీరు కింది భాగాలకు చేరుకుంటుందని తెలిపారు. ఏళ్ల తరబడి నీటి చెమ్మ రాతిఫలకాల వద్దకు చేరుకున్న నేపథ్యంలో రాతిఫలకం దాని స్థానం కోల్పోయి విరిగి పడిందని ఆయన తేల్చి చెప్పారు. ఇటువంటివి జరిగినప్పుడు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాజగోపురం వద్ద ఇనుపుమెష్ ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు. ప్రస్తుతానికి రాజగోపురం పటిష్టతపై ఎటువంటి ఆందోళన లేదని, రక్షణ చర్యలు చేపడితే సరిపోతుందన్నారు. అనంతరం ఈవో ప్రభాకర శ్రీనివాస్ మాట్లాడుతూ పురావస్తు శాఖ అధికారుల సూచనలు మేరకు ఇనుపమెష్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. విరిగి పడిన రాతిఫలకానికి మరమ్మతులు చేస్తామని, స్తపతిని సంప్రదించి ఆగమశాస్త్రం అనుసరించి ఏ విధంగా చేస్తే బాగుంటో తెలుసుకొని తగిన విధంగా పనులు చేస్తామన్నారు. ప్రస్తుతానికి రాజగోపురం గుండా దర్శనాలను నిలిపివేశామని, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తరద్వారం గుండా పంపిస్తున్నామని తెలిపారు. రాతిఫలకం పడిన సమయంలో భక్తులెవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని, ఇనుప మెష్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణను అరికట్టవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. రాజగోపురాన్ని స్తపతి వల్లి నాయిగంతో పాటు ఎస్‌ఈ వెంకట్రావ్, ఏడీసీ శ్రీనివాస్, ఈఈ నర్సింగరావు తదితరులు పరిశీలించారు.