ఖమ్మం

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే బోనస్ చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 16: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే దీపావళి బోనస్‌ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కార్మికులకు బోనస్‌ను చెల్లించేంత వరకు పోరాటాలను ఉద్ధృతం చేస్తామని మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్య యాజమాన్యాన్ని హెచ్చరించారు. ప్రధాన కార్యాలయం ఎదుట జరిగిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల నుంచి పర్మినెంటు కార్మికులకు వాటాలను పంచిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను మాత్రం విస్మరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు కార్మికులు అందరినీ పెర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. దీపావళికి కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జాతీయ కార్మిక సంఘాలు సైతం కాంట్రాక్టు కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. హైపవర్ కమిటీ చేసిన తీర్మానాల ప్రకారం కార్మికులకు కనీస వేతన చట్టంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టియు, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లో కార్మికులు భాగస్వాములు కావాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ వెంకన్న, జె సీతారామయ్యలు ప్రసంగించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సింగరేణి అధికారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకులు ఎన్ సంజీవ్, ఎస్‌కె యాకూబ్ షావలి, బ్రహ్మ, ప్రసాద్, కొండపల్లి శ్రీను, నర్సయ్య, చంద్రశేఖర్, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హిందువులపై దాడులను సహించం

* విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌బాయ్ తొగాడియా

కొత్తగూడెం, అక్టోబర్ 16: హిందువులపై జరుగుతున్న దాడులను సహించమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ బాయ్ తొగాడియా అన్నారు. దేశంలో హిందువులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని కొన్ని మతతత్వ శక్తులు హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నాయని అన్నారు. ప్రపంచ దేశాల్లో హిందువులు ఉన్నప్పటికీ భారత దేశమే హిందువులకు కేంద్ర బిందువన్నారు. గ్రామస్థాయి నుంచి విశ్వహిందూ పరిషత్‌ను బలోపేతం చేసేందుకు సమిష్టి కృషి జరుపాలని పిలుపునిచ్చారు. హిందువులకు సేవ చేసేందుకు విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పడ్డాయని అన్నారు. వంద కోట్ల మంది హిందువులకు అండగా ఉండేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హిందువులపై దాడులు జరిగే ప్రమాదం ఉందని, దాడులను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు మెన్నుకంటి హనుమంతరావు, సురేందర్ రెడ్డి, నాయకులు గాదిరెడ్డి, కమటి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సురేష్, రాము, శివరామకృష్ణ, కూరపాటి రవీందర్, దారా రమేష్, పావని, విజయలక్ష్మి, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.