ఖమ్మం

ప్రభుత్వాన్ని తట్టిలేపిన మహాజన పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 17: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత ఏడాది అక్టోబర్ 17న సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించి రాష్టవ్య్రాప్తంగా 4500 కి.మీ. పాదయాత్ర నిర్వహించడం రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిందని, ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపిందని సిపిఎం జిల్లా నాయకుడు ఎజె రమేష్ అన్నారు. అప్పటిదాకా బంగారు తెలంగాణ, హైటెక్ సిటీ, ఫ్లైఓవర్లు, టీ హబ్ అంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌కు ఈ యాత్ర వణుకు పుట్టించిందన్నారు. మహాజన పాదయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో మంగళవారం మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. మహాజన పాదయాత్ర సమయంలో అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద పార్టీ జెండాను రమేష్ ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల్లో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని పాదయాత్ర ద్వారా తమ్మినేని నిలదీశారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కేసీఆర్, తెరాస నేతలు పదేపదే చెప్పారని, కానీ సమస్యలు పరిష్కరించలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క నిరుద్యోగికి అయినా ఉద్యోగం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు మనకే అని చెప్పి కేసీఆర్ కుటుంబానికి నాలుగు మంత్రి పదవులు, కాంట్రాక్టులు దక్కించుకున్నారని విమర్శించారు. పాదయాత్ర జరుగుతున్నంత సేపు ప్రభుత్వానికి నిద్ర పట్టలేదని, ఎంబీసీ కార్పొరేషన్, యాదవులకు గొర్రెలు, బర్రెలు, సామాజిక న్యాయం గురించి బడ్జెట్‌లో కేటాయింపులు చేయించిన ఘనత పాదయాత్రకే దక్కిందన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా అసమానతలు లేని రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కమిటీ నాయకురాలు మర్లపాటి రేణుక, నర్సారెడ్డి, స్వామి, శరత్‌బాబు, మాధవరావు, జ్యోతి, నాగరాజు, లీలావతి, రత్నం, సంతోష్, గంగ, కొండలరావు, లక్ష్మి, కుసుమ, శ్రీను, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
* 35.85 తులాల బంగారం స్వాధీనం
* జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా
కొత్తగూడెం, అక్టోబర్ 17: ఎలాంటి శ్రమ లేకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో బంగారు ఆభరణాలను దొంగిలిస్తూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని పాల్వంచ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాల్వంచ వనమా కాలనీకి చెందిన ధర్మసోత్ మాన్‌సింగ్ ఏడాది కాలంగా 13 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 13.85 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.10.75 లక్షలు ఉంటుందని అన్నారు. పాల్వంచలోని హమాలీ కాలనీ, వెంగళరావు కాలనీ, నవభారత్ కాలనీ, ఆదర్శ్‌నగర్, గట్టాయిగూడెం, శ్రీనగర్ కాలనీ, ఒడ్డుగూడెం, బాలాజీనగర్, అంబేద్కర్ సెంటర్ తదితర ఏరియాల్లో గృహాలకు తాళాలు వేసి ఉండగా, వాటిని పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన మాన్‌సింగ్ ఏడాది కాలంగా పాల్వంచలో నివసిస్తూ దొంగతనాలు చేస్తున్నాడని అన్నారు. దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా నవభారత్ సెంటర్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పాల్వంచ టౌన్ ఎస్సై కరుణాకర్, రాజుకు ఇతను తారసపడటంతో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దొంగతనాలను అదుపు చేసేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. దొంగను పట్టుకున్న పాల్వంచ పోలీసులకు రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఎఎస్పీ సునీల్‌దత్, పాల్వంచ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ రాఘవేంద్రరావు, ఎస్సైలు కరుణాకర్, రాజు, ఎస్‌బి సిఐ సుబ్బారావు, ఎంటివో సోములు, పిడిఆర్‌సి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు
* పట్టించుకోని అధికారులు

ఖమ్మం, అక్టోబర్ 17: వరంగల్ రోహిణి ఆసుపత్రి ఘటనతో ఖమ్మం జిల్లా అధికారులు మేల్కొనలేదు. ఆ దుర్ఘటన ఆసుపత్రుల నిర్వహణకు గుణపాఠంగా ఉండాల్సి ఉండగా ఖమ్మం జిల్లా వైద్యశాఖాధికారులు మాత్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలో అధికారికంగా 250ఆసుపత్రులు ఉన్నట్లు రికార్డులు చెబుతుండగా అందులో కేవలం 20ఆసుపత్రులకు మాత్రమే పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయి. ఫైర్ అనుమతులు లేని ఆసుపత్రులు అనేకం ఉన్నా స్పందించేవారు కరువయ్యారు. ఖమ్మం నగరంలోని వైరారోడ్డు, నెహ్రూనగర్, మామిళ్ళగూడెం ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ ఓ ఆసుపత్రి ఉండగా కనీసం నిబంధనలకు అనుగుణంగా అనుమతులు లేవు. రోహిణి ఆసుపత్రి ఘటనతో అధికారులు చర్యలు తీసుకునే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు ఇప్పుడు కూడా అదే తరహాలో ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇరుకు గదుల్లో ఆసుపత్రుల నిర్వహణ, నైపుణ్యం లేనివారితో పరీక్షా కేంద్రాలు, కన్సల్టెంట్ల పేరుతో పెద్దడాక్టర్ల నేమ్‌బోర్డులతో హడావుడి సృష్టించే వైద్యశాలలు అన్ని రకాల అనుమతులను తీసుకోకపోయినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగు, ఐదంతస్తుల్లో ఆసుపత్రులు ఉన్నా అందులోకి వెళ్ళేందుకు దారికూడా సరిగ్గా లేని పరిస్థితి ఉన్న ఆసుపత్రులు ఉన్నాయి. ఇక వైరారోడ్డులో ఉన్న ఆసుపత్రులకు పార్కింగ్ సదుపాయం కూడా లేకపోవడం గమనార్హం. వాహనం ద్వారా ఆసుపత్రికి వస్తే దానిని ప్రధాన రోడ్డుపైనే నిలపాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తూనే అనేక మంది విజిటింగ్ డాక్టర్లుగా మూడు, నాలుగు ఆసుపత్రులలో పనిచేస్తున్నారు. మరికొంత పేరున్న డాక్టర్లు కొందరు నాలుగైదు ఆసుపత్రులలో పనిచేస్తున్నట్లు బోర్డులు చెబుతున్నాయి. ఇవన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. మరోవైపు కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలకు రాజకీయ పార్టీల ప్రముఖులు అండగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. రోహిణి సంఘటనతో ఖమ్మం జిల్లాలోని ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వందల సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నా పదుల సంఖ్యలో కూడా అన్ని అనుమతులు ఉన్న ఆసుపత్రులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికే నిదర్శనమని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం దాడులు చేస్తామని మాత్రమే చెప్పుకొస్తున్నారు.