ఖమ్మం

నిత్య సమరం.. త్యాగం అమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 20: సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రు సేనలను తరిమికొట్టే వీరుడు సైనికుడైతే.. అంతర్గతంగా శాంతి భద్రతలను పరిరక్షించి, ప్రజా శ్రేయస్సుకు పాటుపడే ధీరుడు, ప్రజాహితుడు పోలీసు ఒక్కడే. సైనికుడు నిరంతరం శత్రు సేనలతోనే సమరం సాగించాలి. పోలీసు మాత్రం అనేక రకాల సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేయడానికి విరామమెరుగక పరిశ్రమించాలి. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నేరస్తులకు ధీటైన సమాధానం ఇవ్వడమే కాదు.. వేదనతో ఉద్రిక్తమయ్యే ప్రజల విషయంలో సంయమనం చూపాల్సిన గురుతర బాధ్యతా పోలీసులదే. నేర ప్రవృత్తి ఉన్న వారిలో సైతం పరివర్తన తీసుకురావాల్సిన విశిష్ట కర్తవ్యమూ వారిదే. అన్నిటికీ మించి.. సాయుధ శక్తులతో సమరం సాగించాల్సిన తరుణంలో మరో ఆలోచన లేక ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడానికి సంసిద్ధులు కావాల్సిందీ ‘కనిపించని ఈ నాలుగో సింహాలే’. ఇలా ఆత్మబలిదానం చేసి చరితార్థులైన వారెందరో. అలాంటి అమరవీరులకు నేడు యావద్ధేశం సలాం చేస్తోంది. విధి నిర్వహణలో వెన్ను చూపక అత్యున్నత త్యాగం చేసిన పోలీసు వీరులను స్మరిస్తూ పౌర సమాజం శిరస్సును అవనతం చేస్తోంది. భారత పోలీసు వ్యవస్థకు ఈ ఏడాదితో 156 వసంతాలు పూర్తయ్యాయి. 1861లో స్వాతంత్య్ర సంగ్రామాన్ని అణచివేయడం కోసం సిఫాయి తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయులు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాన్ని, వారి కర్తవ్యాన్ని, కష్టాలను గుర్తు చేసుకునే ప్రత్యేక కథనం.
చిరస్మరణీయం వారి త్యాగం
నిర్భీతికి ప్రతిరూపాలు వారు.. నిరుపమాన త్యాగానికి ప్రతీకలు వారు. కష్టాలకు వెరవక, సమస్యలకు బెదరక, సవాళ్లకు వెనుదీయక.. చివరకు మృత్యువుతూ వెరవక.. గుండెకు గుండెతో ఎదురొడ్డె ధీరులు, శూరులు పోలీసులు. మామూలుగా విధులు నిర్వహించే సాధారణ ఉద్యోగులు కాదు వారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. కఠోర పరిస్థితులనూ తట్టుకుని శాంతి భద్రతలను కాపాడే సమాజ రక్షకులు పోలీసులు. అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుంటూ విధులు నిర్వహించడమే కాదు.. అనేక సందర్భాల్లో విధుల్లోనే మహత్తర బాధ్యతతో ప్రాణాలు త్యజిస్తున్నారు. రాజ్యాంగ రక్షణ- ప్రజాస్వామ్య పరిరక్షణ- శాంతిస్థాపన.. ఈ మూడే లక్ష్యాలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో పని చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే నమ్ముకున్న వారికి కన్నీరు మిగులుస్తున్నారు. విద్యుక్త విధి నిర్వహణలో అమరులై తమ శాఖకు గర్వకారణంగా నిలుస్తున్నారు. సహచరులకు స్ఫూర్తిదాయకంగా మెరుస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికే వస్తే నిరుపమాన త్యాగధనులై, ఆకాశంలో అమరతారలై కీర్తిని సముపార్జించిన పోలీసులు ఎందరో. మావోయిస్టు ప్రాబల్యమున్న మన్యంలో ఇలా రుధిర తర్పణం చేసిన వీరులు చాలామందే ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 23మంది వివిధ సంఘటనల్లో అమరులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కృష్ణారావు(ఆర్‌ఐ), ఎండీ ఖాజావజీరుద్దీన్(ఎస్సై), ఆర్‌ఆర్ సింగ్(ఎస్సై), ఎ.రామారావు(ఏఎస్సై), కుమారస్వామి(ఏఎస్సై), వెంకటేశ్వర్లు(పీసీ), విక్టర్‌పాల్(పీసీ), సాంబశివరావు(పీసీ), వెంకటేశ్వర్లు(పీసీ), నాగేశ్వరరావు(పీసీ), వీరయ్య(పీసీ), చంద్రకుమార్(పీసీ), రమేష్‌బాబు(పీసీ), హరినాథ్(పీసీ), వెంకటనారాయణ(పీసీ), టి.వెంకటేశ్వర్లు(పీసీ), వీఎస్‌ఆర్ కోటిరెడ్డి(పీసీ), వి.శ్రీనివాసరావు(పీసీ), శ్రీనివాస్(పీసీ), బి.వెంకటేశ్వర్లు(పీసీ), వరప్రసాద్(గ్రేహౌండ్స్ ఆర్‌ఐ) కర్తవ్యదీక్షలో మొక్కవోని తెగువ చూపి అమరులయ్యారు. వారి బలిదానాలు వృథా అవ్వరాదన్న ధ్యేయంతో ఏటా అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుంటూ పోలీసుశాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది..
నిత్య శ్రామికులు
ఎప్పుడు ఎక్కడికి బందోబస్తుకు వెళ్లాల్సి వస్తుందో తెలియదు. బందోబస్తు విధుల్లో కనీస సదుపాయాలు ఉండవు. దుమ్మూ, ధూళి మధ్య విధులు నిర్వహించాలి. మరోవైపు నేరస్తులు, మోసగాళ్లు, దొంగలపై నిఘా ఉంచి వారిని పట్టుకోవాలనే తపన. ఖాకీ దుస్తులపై ఉండే మమకారంతో ఎన్ని అటుపోట్లు వచ్చినా తలొగ్గక శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా విధులు నిర్వహించాల్సి వచ్చినా, పనిభారం ఎక్కువైనా చలించక చిరునవ్వుతో వృత్తిని దైవంగా భావించి ప్రజలకు మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రత్యేక కేసులు, వీవీఐపీల రక్షణ, శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ.. ఇతర అనేక రకాలుగా తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్న కొందరు పోలీసులు భార్యాబిడ్డలకు తీరని శోకాన్ని మిగిల్చి విధి నిర్వహణలోనే అమరులవుతున్నారు. ఇలా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుండె, ఊపిరితిత్తులు, మధుమేహం ఇతర అనారోగ్య కారణాలతో మృతిచెందిన వారే ఎక్కువ. క్రమం తప్పకుండా వీరికి అరోగ్య పరీక్షలు అందడం లేదు. ఆ దిశగా పాలకులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
టిడిపి నేతల్లో అలజడి
* సండ్ర వైఖరి కోసం ఎదురుచూపులు

ఖమ్మం, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల టిడిపి నేతల్లో అలజడి సృష్టిస్తున్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో నెలకొన్న పరిణామాలు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం టిడిపి శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో టిడిపిలోని ప్రధాన నేతలంతా అధికార టిఆర్‌ఎస్‌లో చేరినా శ్రేణులు ఇంకా పార్టీలోనే ఉన్నారనే ప్రచారం ఉన్నది. అలాగే రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల నాయకత్వంలో పనిచేస్తామని అనేక మంది ఇప్పటికే స్పష్టం చేశారు. రేవంత్ జిల్లాకు వచ్చినప్పుడు కాని, సండ్ర పర్యటనలప్పుడు కాని ఆ పార్టీ శ్రేణుల హడావుడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పార్టీ మారుతున్నాడనే ప్రచారం శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపడమే కాకుండా ఇన్నాళ్ళు పార్టీని కాపాడుకుంటూ ఉన్నామని, ఇప్పుడు తమ భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని బాహటంగానే పేర్కొంటున్నారు.
ఖమ్మం జిల్లాలో టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వైఖరి కోసం శ్రేణులు వేచి చూస్తున్నాయి. రేవంత్‌రెడ్డి లాంటి ప్రజాదరణ కలిగిన నేత పార్టీ మారినా సండ్ర నిర్ణయంపైనే రెండుజిల్లాల పరిధిలోని పార్టీ నేతలు తమ వైఖరిని చెప్పే అవకాశం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్, టిడిపిల మధ్య పొత్తు కుదురుతున్నదనే ప్రచారం ఆ శ్రేణుల్లో మరింత ఇబ్బంది కలిగిస్తోంది. అనేక మంది నేతలు టిఆర్‌ఎస్ అధినేతల నుంచి పార్టీలో చేరాలని పిలుపులు వచ్చినా తెలుగుదేశాన్ని వీడలేక అందులోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజా ప్రచారాలతో తమ భవిష్యత్తు ఏమిటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళలేమని, అలాగని టిడిపిలో ఉండలేమని, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాన నేతలంతా వెంకటవీరయ్య నిర్ణయం కోసం ఎదురు చూస్తుండటం విశేషం. ఇటీవల కాలంలో ఆయన కూడా రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కెసిఆర్‌ను విమర్శిస్తుండటంతో ఆయన పార్టీ మారరనే ఆశాభావాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవంత్‌లాంటి నేత పార్టీ మారితే రాష్ట్రంలో పార్టీకి చరిష్మా కలిగిన నేత లేకుండా పోతారని కూడా పేర్కొంటున్నారు. రాష్టస్థ్రాయిలో తెలుగుదేశం పార్టీలో ఏర్పడుతున్న పరిణామాలు జిల్లాలో పార్టీ మనుగడనే ప్రశ్నించేలా ఉన్నాయని మరో ప్రధాన నేత వ్యాఖ్యానించారు.

భాజపా ప్రైవేట్ సైన్యాల ద్వారా
వామపక్షాలపై దాడులను ప్రోత్సహిస్తోంది
* సిపిఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు
కొత్తగూడెం, అక్టోబర్ 20: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రైవేట్ సైన్యాలను పెంచి పోషిస్తూ వామపక్ష పార్టీలపై దాడులను ప్రోత్సహిస్తోందని సిపిఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు ఆరోపించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆర్‌ఎస్‌ఎస్),విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రైవేటీకరణ చేసేందుకు ఉత్సాహం చూపుతుందన్నారు. 50, 100 పడకల ఆసుపత్రుల్లో కీలకమైన విభాగాలను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. ఉపాధిని సృష్టించే సంస్థలను మూసివేస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ నెలలో నిర్వహించే జాతీయ సదస్సులో కీలక నిర్ణయాలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన శక్తులను అణచివేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం టీమాస్ వంటి సంస్థలను ప్రారంభించామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సిపిఎం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మంజూరు, మల్లన్న సాగర్ నిర్మాణాలపై సిపిఎం ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. హరితహారం పేరుతో ఆదివాసీ గిరిజనులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. అడవులను నాశనం చేసిన స్మగ్లర్లను వదిలి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. గో సంరక్షణ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా రైతులు, సామాన్యులపై దాడులు చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య, అన్నవరపు సత్యనారాయణ, భూక్య రమేష్ పాల్గొన్నారు.

కలెక్టరేట్ తరలిస్తే ఉద్యమం తప్పదు
* వామపక్షాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 20: జిల్లా ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను తరలిస్తే మరో ఉద్యమం తప్పదని వామపక్ష నేతలు హెచ్చరించారు. కేవలం అధికార పార్టీ నేతలకు లాభం చేకూర్చేందుకే ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ తరలింపును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్టీసి బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ సమీకృత కలెక్టరేట్ నిర్మాణం సాకుతో జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులైన అధికార పార్టీ నేతలకు లాభం చేకూర్చేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రస్తుత కలెక్టరేట్, జడ్పీ కార్యాలయం, ఆర్‌అండ్‌బి, జిల్లా ప్రధానాసుపత్రి, ఆర్డీఓ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలకు అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుత కలెక్టరేట్‌కు పక్కనే ఉన్న జడ్పీ స్థలం 20ఎకరాల భూమిలో సమీకృత కలెక్టరేట్ నిర్మించవచ్చునని స్పష్టంచేశారు. అయితే టిఆర్‌ఎస్ నేతల స్వప్రయోజనాలు ఆశించే ఇక్కడున్న కలెక్టరేట్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కలెక్టరేట్ తరలింపును వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శులు బాగం హేమంతరావు, పొన్నం వెంకటేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, సలాం, ఎస్‌కె జానీమియా తదితరులు పాల్గొన్నారు.