ఖమ్మం

పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, డిసెంబర్ 14: మండల పరిధిలోని గంగారం గ్రామ పంచాయతీ మేళ్లమడుగు అటవీ ప్రాంతంలో కోడెవాగు సమీపంలో గురువారం తెల్లవారుఝామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దళ కమాండర్‌తోసహా ఏడుగురు సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని సిపిఐ(ఎంఎల్) సిపిబాటకు చెందిన నక్సల్స్‌గా గుర్తించారు. పాల్వంచ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన ఎట్టికుమార్ అలియాస్ రాఖీ (38) నాయకత్వంలోని సిపి బాట దళం ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నక్సల్స్‌కు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎనిమిది మంది దళం సభ్యులు మరణించారు. మంచిర్యాలకు చెందిన జాగటి ప్రవీణ్ కుమార్ అలియాస్ ఆజాద్ (28), మహబూబాబాద్ జిల్లా పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన బోయిన ఓం ప్రకాష్ అలియాస్ గణేష్ (38), గుండాల మండలం కొడవటంచ గ్రామానికి చెందిన ఈసం నరేష్ అలియాస్ సుదర్శన్ (30), భద్రాచలం ఏరియా సారపాక గ్రామానికి చెందిన నూనావత్ అర్జున్ అలియాస్ నవీన్ (22), గుండాలకు చెందిన తిరుక్కులూరి మధు (35), మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన రషీద్, టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన గాడుదుల శ్రీను (40)లు మృతి చెందినట్లు గుర్తించారు.
పోలీపులపైకి కాల్పులు జరిపారు.. ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా
మేళ్లమడుగు గ్రామ సమీపంలో నక్సలైట్లు సంచరిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారని, ఈ క్రమంలోనే పోలీసులకు నక్సల్ దళం తారసపడిందని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. సంఘటనా స్థలంలో ఎస్పీ విలేఖరులతో మాట్లాడారు. పోలీసులు ముందుగా లొంగిపోవాలని ఆదేశించినా నక్సల్స్ పోలీసులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. కొంత సమయం తర్వాత నక్సల్స్ నుంచి కాల్పులు ఆగిపోయాయని, ఆ ఏరియాలోగాలించగా పోలీసులకు ఎనిమిది మృత దేహాలు లభించాయని ఆయన అన్నారు. వారిని సిపిబాట గ్రూపు నక్సల్స్‌గా గుర్తించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో తుపాకులు, విప్లవ సాహిత్యం లభించినట్లు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వివిధ గూ పుల నుంచి బయటికి వచ్చిన సభ్యులు కలిసి ఎట్టి కుమార్ నాయకత్వంలో సిపి బాట పేరుతో గ్రూపును ఏర్పాటు చేసుకున్నారని ఆయన అన్నారు. కాగా వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని, వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.

నీతి అయోగ్ ద్వారా జిల్లాల్లో అభివృద్ధి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 14: దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం అందులో ఖమ్మం జిల్లాను కూడా చేర్చింది. దేశవ్యాప్తంగా 115జిల్లాలను ఇందులో ఎంపిక చేయగా అందులో తెలంగాణలో మూడు జిల్లాలున్నాయి. మూడింటిలోనూ ఖమ్మం జిల్లా ఉండటం గమనార్హం. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాగు, తాగునీటి ప్రాజెక్టులు కూడా ఈ పథకం కింద చేపడుతారు. నీతి అయోగ్ పర్యవేక్షించే ఈ పథకాన్ని జిల్లాలో పర్యవేక్షించేందుకు జిల్లాతో అనుబంధం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీమ్‌ను నియమించారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ఖమ్మం జిల్లాలో ప్రజలకు వౌళిక సదుపాయాల కల్పనతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తారు. ప్రధానంగా కేంద్రం చేపడుతున్న అనేక పథకాలను రాష్టమ్రే చేపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నదని వస్తున్న ఆరోపణలను తప్పించి పథకాల అమలు తీరుపై విస్తృత ప్రచారం గావించేందుకు కూడా ప్రయత్నించనున్నారు. ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామాలలో కనీస వౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు అవగాహన, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి వాటిని తొలి విడతలో చేపట్టనున్నారు. మూడు నెలలకు ఒకసారి నీతి అయోగ్ అధికారులు ప్రత్యక్షంగా వీటిని పర్యవేక్షించనున్నారు.

పాలకవర్గాలపై పోరాడాల్సిందే
* చల్లప్ప కమిటీ ఓ చిత్తుకాగితం
* పోరుగర్జనలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 14: ఆదివాసీల హక్కులు కాపాడుకంటూ, సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గాలపై నిరంతరం పోరాడాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయమంచ్ రాష్ట్ర అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రీయ మంచ్ జిల్లాకమిటి ఆధ్వర్యంలో గురువారం సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి మయూరి సెంటర్, వైరా రోడ్ మీదుగా ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దుగ్గి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అడవి మీద హక్కు లేదంటూ చట్టాల పేరుతో ఆదివాసిలను ముఖ్యమంత్రి కెసిఆర్ అణగతొక్కుతున్నారన్నారు. జిఓ నెంబర్ 3ప్రకారం స్థానికులైన ఆదివాసిలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందన్నారు. వసల వచ్చిన వారికి వందల ఎకరాలు కట్టబెడుతూ అడవిని నమ్ముకొని పోడుభూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసిలపై పాలకవర్గాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడవి నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చట్టసభల్లో అనేక దఫాలుగా ఆదివాసి హక్కుల చట్టాన్ని కాపాడేందుకు తాను కృషి చేశానని, 11మంది ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఉన్నప్పటికీ జిఓ నెంబర్ 3ని సవరించే ప్రభుత్వ వేతనాన్ని తానొక్కడినే అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. పది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చల్లప్ప కమిటీ ఇచ్చిన నివేదిక చిత్తుకాగితంగా మారిందన్నారు. అవగాహన లేని పాలకవర్గాలు చల్లప్ప కమిటీ లాంటి వాటి పేరుతో ఆదివాసీలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇలాంటి వాటిని ప్రయోగిస్తూ ఆదివాసీ హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లాలో ఐటిడిఏ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, ఏజన్సీ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఆదివాసీలు లేరని ప్రభుత్వం వాదించడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలకవర్గాలు అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాల వల్లనే తాము ఆందోళనలు చేపట్టవల్సి వస్తుందన్నారు. కొమరం బీం, అల్లూరి సీతారామరాజు, గంటందొర, మల్లుదొరల స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోరుగర్జన అనంతరం జిల్లా కలెక్టర్‌కు సమస్యలతో క కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘ నాయకుడు ముక్తి భాస్కర్‌రావు, టి భీమ్‌రావు, బొర్రా తిరుపతయ్య, పొట్టయ్య, సుబ్బయ్య, కుంజా రాములు, కొమరం రాంబాబు, దోనేపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తాం
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 14: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కూసుమంచి మండలం చేగొమ్మలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ గృహ సముదాయాలను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంగా మొదట నిరుపేదలకు ఇళ్ళు కేటాయిస్తున్నామని, దశలవారీగా జిల్లాలో అర్హత కలిగిన అందరికి ఇళ్ళు కట్టిస్తామన్నారు. ఇళ్ళు మంజూరు కాలేదని ఎవరూ నిరాశపడాల్సిన అవసరం లేదన్నారు. పాలేరు నియోజకవర్గం ఒకప్పుడు ఎండిపోయిన బీడు భూములతో ఉండేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణాజలాలతో పాలేరును సస్యశ్యామలం చేశామన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజల కష్టాలను గమనించి ముఖ్యమంత్రితో చర్చించి కృష్ణాజలాలను రప్పించి సస్యశ్యామలం చేశామన్నారు. రెండవ పంటకు కూడా నీరు విడుదల చేస్తామన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ నిర్మాణంతో పాటు క్రైస్తవులకు క్రిస్టమస్ వేడుకను పురస్కరించుకొని దుస్తులు పంపిణీ చేశారు. క్రైస్తవులు సుఖః సంతోషాలతో వేడుకలు జరుపుకునేందుకు ప్రభుత్వం పదిలక్షల రూపాయలను, దుస్తుల కిట్‌ను మంజూరు చేసిందన్నారు. ఆ పదిలక్షల రూపాయల నిధులను క్రిస్టమస్ వేడుకల నిర్వాహకులకు అందజేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలనే ఆశయంతో ప్రభుత్వం క్రిస్టమస్‌తో పాటు రంజాన్‌తో పాటు ఇతర వర్గాల ప్రజల పర్వదినాలకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్‌కు బుడాన్ బేగ్, నగర మేయర్ పాపాలాల్, సంక్షేమాధికారి రమేష్, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రవీంద్రకుమార్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, చేగొమ్మ సర్పంచ్ మర్రా రేణుక, ఎంపిపి రామసహాయం వెంకటరెడ్డి, జడ్పీటిసి రాంచంద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలను సంక్షేమంతో ముడిపెట్టను
* ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల
ఖమ్మం రూరల్, డిసెంబర్ 14: రాజకీయాలను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముడిపెట్టడం తనకిష్టముండదని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం కొణిజర్ల మండలంలోని ఇండోఖతర్ ప్రదేశంలో ఆయన పాలేరు నియోజకవర్గ విలేఖరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తాను రాజకీయాలలో ఉన్నా, లేకున్నా ప్రజల సుఖమే కోరుకుంటానన్నారు. మంత్రిగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. తాను వ్యక్తిగతం కంటే సామూహిక అభివృద్ధినే ఇష్టపడతానన్నారు. పాలనలో అందరికీ సమన్యాయం చేయలేమని, అలాగని అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు మాత్రం వినియోగించనని మంత్రి స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాన్నైనా లాటరీ విధానం ద్వారానే అమలు చేశామన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలు తనకు రెండు కళ్ళలాంటివని, వాటి అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. పాలేరు చుట్టూ జలవనరులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని, వృథాగాపోతున్న నీటిని ఒడిసిపట్టేందుకే మునే్నరు, ఆకేరు నదులపై చెక్‌డ్యామ్ కమ్ వంతెలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. పాలేరును సస్యశ్యామలం చేసేందుకు భక్తరామదాసు పథకాన్ని తీసుకొచ్చామని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఎటువంటి లోటుపాట్లు నెలకొన్నా నిర్మొహమాటంగా తనదృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తానన్నారు. తొలుత మంత్రి పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన జర్నలిస్టులందరినీ పరిచయం చేసుకున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంఘాల నాయకులు రమణ, నాగిరెడ్డి తదితరులు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి విన్నవించారు. ముఖ్యంగా ఇళ్ళస్థలాలు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రమాదబీమా వంటి సౌకర్యాలను కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి కలెక్టర్‌తో మాట్లాడతానని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేపడుతున్న చేస్తున్న కృషికి తోడ్పాటునందించాలని కోరారు.

తెలంగాణ సుసంపన్నంగా ఉండాలి
* మంత్రి తుమ్మల
ఖమ్మం రూరల్, డిసెంబర్ 14: ప్రభువు దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సెమిక్రిస్మస్ వేడుకల్లో భాగంగా గురువారం మండలంలోని మద్దులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆర్డీవో పూర్ణచందర్‌రావు ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు అన్నాదమ్ముల్లా కలిసుండడమే భారతీయ సంస్కతికి నిదర్శనమన్నారు. అటువంటి ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలనే తారతమ్యం లేకుండా అందరూ ఆయా పండుగ దినాల్లో సుఖ, సంతోషాలతో ఉండాలనే అధికారికంగా దుస్తుల పంపిణీ, సహపంక్తి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. డిసెంబర్ 25వ తేదీన యేసుప్రభువు జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సహోదరులు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఆప్రభువు అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. తొలుత సంఘ పెద్దల ప్రార్ధనతో ప్రారంభమైన కార్యక్రమంలో మంత్రి తుమ్మల కేక్ కట్‌చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుమారు 250 మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐడిసి చైర్మన్ బేగ్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ డాక్టర్ పాపాలాల్, జెడ్పీటిసి భారతి, ఎంపిపి మేళ్ళచెరువు లలిత, తహశీల్దార్ నరసింహారావు, ఎంపిడిఓ శ్రీనివాసరావు, సంఘ పెద్దలు జెఎస్ ఫిలిప్, సిహెచ్ రమేష్, సుందర్‌రావు, డేవిడ్, లాజర్, చారి తదితరులు పాల్గొన్నారు.