ఖమ్మం

కమ్యూనిస్టు శక్తులు పునరేకీకరణ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 18: కమ్యూనిస్టు శక్తులన్నీ పునరేకీకరణ కావాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని మద్ది యల్లారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సిపిఐ 21వ జిల్లా మహాసభల రెండోరోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. వామపక్షాల ఐక్యత వల్లే నేపాల్‌లో ఎర్రజెండా పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. త్రిపురలో వామపక్ష కూటమిని దెబ్బతీసేందుకు బిజెపి ప్రభుత్వం కుటిల యత్నాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, తెలంగాణాలో కుటుంబ పాలన సాగిస్తున్న కెసిఆర్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మోదీ నోట్లు రద్దు చేసి, జిఎస్టీ అమలు చేయడంతో సామాన్య ప్రజలు మరింత పేదవారిగా, కార్పోరేట్ సంస్థలు మరింత ధనవంతులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లడబ్బును బయటకు తెచ్చి ప్రజలకు పంచిపెడతానని చెప్పిన మోదీ కల్లబొల్లి మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న మోదీ పాలనలో మైనార్టీలు, దళితులు, మహిళలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుందని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్న కార్పోరేట్ సంస్థల అప్పులు రద్దు చేయించేందుకు మోదీ బ్యాంకులు దివాళాతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రోజురోజుకూ ప్రజా స్వామ్యవిలువలు పతనమైపోతున్నాయని, ప్రజల స్థితిగతులు ఆగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలతో కుటుంబ పాలన సాగిస్తూ ప్రజలను సంక్షేమానికి దూరం చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్యం, ఉద్యోగం లేక ప్రజలు, యువత పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందన్నారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తామని, డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తానని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడని విమర్శించారు. అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన ప్రజలు కోరుకునే రీతిలో లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నాయని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి వామపక్ష, లౌకికవాద శక్తులు, కలసివచ్చే పార్టీలతో ప్రత్యామ్నాయ విశాల వేదికను ఏర్పాటు చేసేందుకు సిపిఐ పార్టీ ప్రత్యేక చొరవ చూపిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపర్చాలన్నారు. గ్రామాలలో క్షేత్ర స్ధాయిలో భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఆదిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తొలుత సిపిఐ సీనియర్ నాయకుడు అచ్చల లాలయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా, అమరవీరుల జ్యోతిని తారాచంద్ ఆవిష్కరించారు. మహ్మద్ వౌలానా అధ్యక్షతన జరిగిన మహాసభలో సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, మహిళా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దినేని కర్ణకుమార్, సాబీర్‌పాషా, రామ్మూర్తి నాయక్, ఉన్నం రంగారావు, ఎంపిపి ఎం లలిత తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ వైద్యుల సేవలు ఎంతో అవసరం
* ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 18: ప్రథమ చికిత్సలో గ్రామీణ వైద్యుల సేవలు ఎంతో అవసరమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం టిటిడిసిలో జరిగిన తెలంగాణ ముస్లిం, మైనార్టీ, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాలలో ప్రథమ చికిత్సనందించి మెరుగైన వైద్యసేవల కోసం జిల్లా ఆసుపత్రులకు సిఫార్సు చేయడంలో వారు కీలకమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ నజురుద్దీన్, షేక్ జానీమియా, కోశాధికారి షేక్ బాబుసాహేబ్‌తో పాటు మరో 20మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సంఘం ముస్లిం, మైనార్టీ గ్రామీణ వైద్యుల సమస్యలపై పోరాడుతుందన్నారు. మందులు, జబ్బులు, వైద్యం తదితర అంశాలపై ప్రముఖ వైద్యులచే శిక్షణా తరగతులు నిర్వహించి గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించనున్నామన్నారు. గ్రామీణ వైద్యులు(ఆర్‌ఎంపి,పిఎంపి) లకు ప్రభుత్వ వైద్య పరమైన గుర్తింపునివ్వాలన్నారు. కమ్యూనిటీ పారా మెడికల్ ట్రైనింగ్ కొనసాగించాలని, గ్రామీణ వైద్యులందరికి డబుల్‌బెడ్‌రూమ్ పథకాన్ని వర్తింపజేయాలని, వారికి వృత్తిపరమైన భద్రత కల్పించాలని, 60సంవత్సరాలు నిండిన గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

ఆర్‌పీల గౌరవ వేతనానికి కృషి
* ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బేగ్
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 18: జిల్లాలో పట్టణ, పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న రీసోర్స్ పర్సన్లకు గౌరవ వేతనాలు అమలుకు కృషి చేస్తానని ఇండస్ట్రీయల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ అన్నారు. ఆదివారం స్థానిక టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల రీసోర్స్ పర్సన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనసున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న కెసిఆర్ త్వరలోనే ఆర్‌పిల వేతనాలు అమలు చేస్తారని, అందుకు తగిన కృషి చేస్తామన్నారు. ఆర్‌పిలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తమవంతుగా పనిచేయాలన్నారు. ఆర్‌పిల ద్వారానే మహిళా సంఘాలు బలోపేతం అవుతాయని, ప్రభుత్వం ఎల్లప్పుడు వారికి అండగా ఉంటుందన్నారు. అనంతరం ఇరు జిల్లాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ ఉషా, అంజలి, ఉపాధ్యక్షురాలు మంగా, సహాయ కార్యదర్శి షేక్ పాతిమా, కోశాధికారి సుధా, కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తిరుపతమ్మ, గంగా, ఉపాధ్యక్షురాలు నాగమణి, సహాయ కార్యదర్శి రాధిక, కోశాధికారి బి అరుణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రూప్‌సింగ్, కాసాని నాగేశ్వరరావు, ఎం సునిత, ఎం విజయ్ తదితరులు పాల్గొన్నారు.