ఖమ్మం

పినపాక కాంగ్రెస్‌లో నూతనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, ఫిబ్రవరి 20: పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహం నెలకొంది. పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఖరారు చేయడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేగా కాంతారావును పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేగానే పోటీ చేస్తారని భావించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. పినపాక నియోజకవర్గ టిక్కెట్‌ను సీపీఐకి కేటాయించడంతో రేగా కాంతారావుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. మిగిలిన దాంతో సంతృప్తి పడదామనుకునే లోపే అధ్యక్ష పదవి కూడా దూరమైంది. ఆనాటి నుంచి నియోజకవర్గంలో కాంతారావుపై ఎన్నో ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. రేగా పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం కొనసాగింది. ఆ ప్రచారాలను తిప్పి కొడుతూ రేగా కాంతారావు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టిసారిస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ నియోజకవర్గంలో కొత్త అలజడి చెలరేగింది. రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, లేదంటే మహబూబాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగింది. అదీ కాక కాంతారావు కాంగ్రెస్‌ను వదిలి టీఆర్‌ఎస్ లో చేరనున్నారని, పినపాక టిక్కెట్‌ను రేగాకు కేటాయించేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం సిద్ధంగా ఉందని, ఈ మేరకు మంత్రి హరీష్‌రావు రేగా కాంతారావుతో చర్చలు జరిపారన్న ప్రచారం నియోజకవర్గంలో జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ టిక్కెట్‌ను ఒక మహిళా ఉద్యోగినికి ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగడంతో పాటు దీనిపై నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఉద్యోగి బంధువులు ప్రచారాన్ని నిర్వహించారు. ఢిల్లీ కేంద్రంగా పైరవీలు కొనసాగినట్లు ఆ మహిళా ఉద్యోగినికి టిక్కెట్ ఖాయమైనట్లు ప్రచారం జరిగింది. దీంతో పినపాక కాంగ్రెస్ టిక్కెట్‌పై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి అవమానాలు ఎదురైనా పార్టీని వీడకుండా పార్టీని బలోపేతం చేసిన రేగాను కాదని, మరొకరికి టిక్కెట్ కేటాయిస్తున్నారనే ప్రచారం జరగడంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదే జరిగితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందన్న సంకేతాలు వినిపించాయి. ఇంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరతీస్తూ రేగా కాంతారావును పినపాక నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందోత్సహాలు వెల్లువెత్తాయి. రేగాకు టిక్కెట్ మంజూరు కావడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.