ఖమ్మం

భద్రగిరికి కల్యాణ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 24: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ ఘడియలు సమీపించాయి. దీంతో పుణ్యక్షేత్రంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం స్వామి కల్యాణం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన మండపంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద శ్రీ సీతారామచంద్ర స్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. నవమిని పురస్కరించుకుని పుణ్యక్షేత్రమైన భద్రాద్రిని ముస్తాబు చేశారు. ఇందుకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ దీపాలు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలతో భద్రాద్రి శోభాయమానంగా కన్పిస్తోంది. భద్రాద్రి రహదారులపై ఎటు చూసినా భక్తులు రామనామ స్మరణ చేస్తూ కనిపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా, సబ్ కలెక్టర్ పమేలా సత్పతి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. కల్యాణానికి ఇంకా ఒక్కరోజే సమయం ఉండటంతో పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత అధికం కావడంతో భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా టెంట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కల్యాణ తలంబ్రాల పంపిణీ కేంద్రాలు, తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను, సమాచార శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామచంద్రుడు జన్మించిన విలంబినామ సంవత్సరం 60 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సంవత్సరం కావడంతో ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దేవస్థానం ఆధ్వర్యంలో 3.50 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా పట్టణాన్ని పోలీసులు తన ఆధీనంలోకి తీసుకున్నారు.

భక్తజన సందోహంగా భద్రాద్రి
స్వాగత ద్వారాలు, భక్త రామదాసు కీర్తనలతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. కల్యాణాన్ని తిలకించేందుకు పలువురు భక్తులు పాదయాత్రలతో భద్రాద్రికి చేరుకుంటుండగా మిగిలిన వారు వివిధ వాహనాల్లో రామయ్య సన్నిధికి వస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు నుంచి వందల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు. నవమి సందర్భంగా ఆర్టీసీ సుమారు 650 బస్సులను నడుపుతోంది. భద్రగిరితో పాటు పర్ణశాలలోనూ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. సబ్ కలెక్టర్ పర్ణశాలలో ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు మంచినీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 6 లక్షల ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా 10 బెడ్లను సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అంబులెన్స్‌లు, 108 వాహనాలను సిద్ధం చేస్తున్నారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. పట్టణాన్ని పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ముందుగానే భద్రగిరికి చేరుకున్న భక్తులు కల్యాణ మండపం వద్ద చలువ పందిళ్ల నీడలో సేద తీరుతున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రధాన కూడళ్లలో, మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రామాలయం పరిసరాలు, గోదావరి నదీ తీరంలో భక్తుల రాకపోకలపై నిఘా ఉంచారు. జిల్లా ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా పర్యవేక్షణలో భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్‌తో పాటు 2 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.