ఖమ్మం

ఇసుక మాఫియా డొంక కదులుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఏప్రిల్ 20: జిల్లాలో కొనసాగుతున్న ఇసుక మాఫియా డొంక కదులుతోంది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన అధికారులపై కొరడా ఝుళిపించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక మాఫియాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఎట్టకేలకు సంబంధిత అధికారులు, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, పొగళ్లపల్లి, ములకలపల్లి గ్రామ ప్రాంత సమీపంలోని మొర్రేడు వాగు ఇసుక రీచ్‌ల నుంచి భద్రాద్రి కొత్తగూడెంతోపాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గత కొనే్నళ్లుగా తరలిస్తున్నారు. లక్షలాది రూపాయిల ఇసుకను అధికారుల కనుసన్నలతోనే తరలించారంటూ జెడ్పీటిసి సభ్యులు బత్తుల అంజి జడ్పీ సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటంతో అధికార యంత్రాంగం ఇసుక మాఫియా డొంకను కదిలించింది. ములకలపల్లి మండలంలోని వివిధ పంచాయతీల్లో పనిచేసిన కార్యదర్శులు టి మురళీమోహన్, చెన్నకేశవులు, ప్రభాకర్‌లను సస్పెండ్ చేయగా, తహశీల్దార్లుగా పనిచేసిన స్వర్ణ, ఖాదర్‌బాబా, రాంనరేష్, రాజేంద్ర ప్రసాద్‌లకు షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధం చేశారు. ఖాదర్‌బాబా రిటైర్డ్‌కాగా రాజేంద్ర ప్రసాద్ 20 రోజులు ఇన్‌చార్జి తహశీల్దారుగా పనిచేసినట్లు తెలుస్తోంది. గుండాల మండలంలోని ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ, అనిశెట్టిపల్లి, కారుకొండ రామవరం, చుంచుపల్లి మండలంలోని పెనుబల్లి, టేకులపల్లి మండలంలోని శంభునిగూడెం గ్రామాల్లో ఇసుక సీనరేజీల్లో సైతం అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. భవన నిర్మాణరంగంలో కీలకంగా ఉపయోగించే ఇసుకకు మంచి డిమాండ్ పలుకుతుండటంతో అధికారులు ఇసుక అక్రమాల్లో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక తరలింపులో కీలకపాత్ర పోషించే కార్యదర్శులు, తహశీల్దార్లపైనే విచారణలు జరుగుతుండటంతో చర్చనీయాంశంగా మారింది. అన్నపురెడ్డిపల్లి మండలంలో సైతం వాగుల నుంచి తీసుకొచ్చిన ఇసుకను గ్రామాల్లో విక్రయిస్తుండటంతో ఆ ప్రాంతంలో గొడవలు జరిగి కేసులు పెట్టుకునే స్థాయికి రావటం గమనార్హం. గత రెండేళ్లుగా జిల్లా వ్యాప్తంగా వివిధ ఇసుక సీనరేజీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం కావటంతో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ముగ్గురు కార్యదర్శులపై సస్సెన్షన్ వేటు, నలుగురు తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు సరిపెడతారా? మిగతా అధికారులపై చర్యలు తీసుకుంటారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.