ఖమ్మం

సూర్య ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 19: తొలకరి జల్లులు ముందే కురవడంతో వేసవి తాపం నుంచి గట్టేక్కామని ఆనందించిన ప్రజలు వారం రోజుల నుంచి వేసవిని తలపించేలా కాస్తున్న ఎండలతో అల్లాడుతున్నారు. సాధారణంగా జూన్ రెండవవారం నుంచి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జూన్ మొదటివారంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఎండలతో అల్లాడిన ప్రజలు జూన్‌లో కురిసిన వర్షాలకు హమ్మయ్య అనుకొని సేద తీరారు. పట్టుమని వారం రోజులు గడవక ముందే వర్షాలు ముఖం చాటేయడం, వాతావరణంలో మార్పులు వచ్చి తీవ్ర ఎండలు ప్రారంభం కావడంతో ప్రజలు హడలి పోతున్నారు. వారం రోజుల నుంచి జిల్లాలో ఎక్కడా చినుకు జాడ లేకపోగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిలో ఉన్న విధంగా 40 డిగ్రీల మేర నమోదు కావడం కలవర పెడుతోంది. ప్రభుత్వం జూన్ 1నే పాఠశాలలు ప్రారంభించగా ప్రస్తుతం ఎండల తీవ్రతతో పాఠశాలలకు వెళ్లాలంటేనే విద్యార్థులు జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకొని మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిందంటే భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎండలకు తోడు తీవ్రమైన వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. రాత్రిపూట విద్యుత్ లేకపోతే ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉదయం 7 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభమవుతుండగా మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వ్యవసాయ సీజన్ కావడంతో పంట పొలాలకు వెళ్తున్న రైతులు, కూలీలు సైతం ఎండ తీవ్రత తాళలేక మధ్యాహ్నం కల్లా ఇళ్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎండలతో పనులకు వచ్చేందుకు కూలీలు సైతం సిద్ధంగా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా జూన్ నెల రెండవ వారం నుంచి నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీయాల్సి ఉంది. అయితే వాయువ్య దిశ నుంచి వీస్తున్న తీవ్ర వేడిగాలులతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. దీనికి తోడు గాలిలో తేమశాతం తగ్గిపోవడం కూడా ఎండల తీవ్రతకు కారణమవుతోంది. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరికొన్ని రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా వేడిగాలులతో వడదెబ్బ తగిలి అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. చిన్నారులు జ్వరంతో ఆసుపత్రులకు వస్తుండటంతో ఎండ కారణంగానే అని వైద్యులు చెబుతున్నారు.

పోరుబాటలో రేషన్‌షాపు డీలర్లు
* జిల్లావ్యాప్తంగా డీడీలు కట్టకుండా నిరసనలు * నిలిచిపోనున్న ప్రజాపంపిణీ వ్యవస్థ
కొత్తగూడెం, జూన్ 19: రేషన్‌షాపు డీలర్లు తమ ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. రేషన్‌డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధికారులకు సమ్మెనోటీసును అందజేశారు. జిల్లావ్యాప్తంగా 442రేషన్‌షాపులకు సంబంధించి డీలర్లు ఎవరూ డీడీలు కట్టకపోవడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో 442 రేషన్‌షాపుల ద్వారా సుమారు 2 లక్షల రేషన్‌కార్డుల ద్వారా సంబంధిత లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులను ప్రభుత్వం అందజేస్తుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా రేషన్‌షాపు డీలర్లకు సైతం కమిషన్లు పెంచడంతో పాటు డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డీలర్లు సమ్మెకు సన్నద్ధమయ్యారు. రేషన్‌షాపు డీలర్లు డిడిలు కట్టకపోవడంతో ప్రజాపంపిణీ వ్యవస్థ నిలిచిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ఎలాట్ అయిన సరుకులకు సంబంధించిన డీడీలను ప్రతినెల 15 నుండి 20వ తేదీ లోపు కట్టి సంబంధిత అధికారులకు అందజేయాల్సివుంది. కట్టిన డిడిలకు సరుకును 1వ తేదీ లోపు సంబంధిత రేషన్‌షాపు డీలర్లకు అందజేస్తారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గతంలో 7 రకాల వస్తువులను ప్రతి లబ్ధిదారునికి అందజేసే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సైతం రేషన్‌షాపు నుంచి కందిపప్పు, గోధుమల, చక్కెర, కిరోసిన్, ఉప్పు, బియ్యం, సబ్బులను అందజేసే పరిస్థితి ఉండేది. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం రేషన్‌షాపులలో బియ్యం, పంచదార, కిరోసిన్‌ను మాత్రమే అందజేయడం, రేషన్‌షాపులలో ఈపాస్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో రేషన్‌షాపు డీలర్లు ఆందోళనకు దిగారు. 19వతేదీ వరకు జిల్లావ్యాప్తంగా రేషన్‌షాపుడీలర్లు ఎవరూ డిడిలను సంబంధిత అధికారులకు అందజేయని పరిస్థితి నెలకొంది. రేషన్‌షాపు డీలర్లే గ్రామంలో ప్రజలకు సరుకులు అందజేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యాన్ని సైతం సరఫరా చేయాల్సివుంటుంది. రేషన్‌షాపు డీలర్లు చేపట్టిన సమ్మెకు పలు రాజకీయ పార్టీలు సైతం మద్దతును ఇస్తున్నాయి. ప్రధానంగా అధికశాతం మంది ప్రజలు రేషన్‌బియ్యం వస్తేనే పూటగడిచే పరిస్థితి పలుకుటుంబాలలో నెలకొంది. రేషన్‌షాపు డీలర్ల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశంవుంది. గ్రామపంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రేషన్‌షాపు డీలర్ల సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సమ్మెను విరమింపచేసేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలనిస్తాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.