ఖమ్మం

ఉప్పొంగిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఆగస్టు 13: భద్రాచలం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. జూలైలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద రావడంతో 30 అడుగుల మేర ప్రవహించి హెచ్చు తగ్గులతో వారం రోజుల పాటు దోబూచులాడిన గోదావరి ఆగస్టులో తొలిసారి 30 అడుగులకు మించి ప్రవహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడం, ఛత్తీస్‌గఢ్‌లో కుండపోత వానలు కురుస్తుండటంతో గోదావరికి క్రమంగా వరద తాకిడి పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో 31.8 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సోమవారం రాత్రి 7 గంటలకు 36.4 అడుగులకు చేరుకుంది. 15 గంటల్లో సుమారు 5 అడుగుల మేర వరద పెరిగింది. చర్ల మండలంలోని తాలిపేరు నదికి ఛత్తీస్‌గఢ్ నుంచి వరద పోటెత్తడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు దిగువున ఉన్న గోదావరిలో కలుస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద క్రమంగా పెరిగింది. దీనికి తోడు ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం, ఇంద్రావతి, ప్రాణహిత నుంచి కూడా వరద నీరు స్వల్పంగా గోదావరికి వస్తోంది. మంగళవారం ఉదయం 38 అడుగులకు నీటిమట్టం చేరుకునే అవకాశం ఉందని, అనంతరం తగ్గుముఖం పడుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీడబ్య్లూసీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం కూడా ఒక మోస్తరు వర్షం కురిసింది. ఏజెన్సీ ప్రాంతంలో పలు వాగులు, వంకలు ఉప్పొంగడంతో వాటి పరిధిలో ఉన్న పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి వరద పరిస్థితిని సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా పర్యవేక్షిస్తూ అధికారులను తగిన సలహాలు, సూచనలతో అప్రమత్తం చేస్తున్నారు.

ఇవి రహదారులు కాదు... యమపాశాలు
ఖమ్మం(గాంధీచౌక్), ఆగస్టు 13: అసలే దెబ్బతిన్న రోడ్లు వర్షానికి మరింత దారుణంగా మారాయి. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ దాటాలంటే ఖచ్చితంగా ప్రయోగం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఖమ్మం నగరంలో ప్రధాన సర్కిల్‌గా ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌లో తెలంగాణ తల్లి విగ్రహన్ని ప్రతిష్ఠించే సమయంలో రోడ్లు వేశారు. ఇది జరిగి కొద్ది నెలలే అయినా ఇప్పుడు ఆ ప్రాంతం పూర్తిగా గుంటలతో నిండిపోయింది. రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి ఈ జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికి రోడ్డు నిర్మాణాలు నాణ్యత లోపంగా జరుగుతున్నా పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. మరో వైపు ఆ రహదారి గుండానే సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లందు వైపు వెళ్ళే వాహనాలు అన్ని వెళ్తుండటం, ప్రధాన పాఠశాలల బస్సులు ఈ మార్గం గుండానే వెళ్తుండటం విశేషం. ఇక్కడ ఏర్పడిన గుంటల్లో పడి అనేక మంది గాయాలపాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఖమ్మం నగరంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో, ఎఫ్‌సిఐ గోడౌన్, వరంగల్ క్రాస్‌రోడ్డు సమీపంలో కూడా రోడ్లపై గుంటలు పడ్డాయి. పెద్దపెద్ద గుంటలు ఏర్పాడ్డ నేపథ్యంలో ఆ ప్రాంతం నుండి వెళ్ళేందుకు సాహసం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు తిరిగి ప్రధాన రహదారులన్ని గుంటల మయంగా మారటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని త్వరితగతిన సరిచేసి తిరిగి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బీమా రైతుబంధు

ఖమ్మం, ఆగస్టు 13: ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత బీమాను తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 అర్థరాత్రి నుంచి అమలు చేస్తున్నారని రైతు సమన్వయ సమితి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 436 కోట్లతో 28లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా ఈ పథకం రూపొందించారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అమలు బాధ్యతను గ్రామ కార్యదర్శులతో పాటు వ్యవసాయ అధికారులకు అప్పగించారన్నారు. అర్హులైన రైతులు ఏ కారణంచేత మరణించినా పదిరోజుల్లో ఐదులక్షల పరిహారాన్ని చెల్లించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కావడం, ప్రపంచంలోనే అతిపెద్ద జీవితబీమా పథకంగా రికార్డు సృష్టిస్తుండటం కెసిఆర్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రైతు బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, రైతుబీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా నల్లమల అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కార్యక్రమాలను చేపట్టిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులను తరిమికొట్టిన ప్రభుత్వం రైతులకు మేలైన విత్తనాలను అందించడమే కాకుండా వ్యవసాయ పెట్టుబడి కోసం ఎకరానికి ఏడాదికి 8వేల రూపాయలు అందిస్తున్నారన్నారు. అదే విధంగా 24గంటల పాటు మేలైన విద్యుత్‌ను అందిస్తున్నారని గుర్తుచేశారు. తాజాగా బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా తాము పూర్తిస్థాయిలో రైతులకు అండగా ఉంటామని తమ ప్రభుత్వం చెప్పకనే చెబుతున్నదన్నారు. దేశంలోనే ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని విధంగా కెసిఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.