ఖమ్మం

మదన్‌లాల్‌కు టిఆర్‌ఎస్ టికెట్ రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, సెప్టెంబర్ 21: వైరా నియోజకవర్గానికి టిఆర్‌ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మేల్యే మదన్‌లాల్‌కు కేటాయించిన టికెట్టును కెసిఆర్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ టిఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా, మండల నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో మదన్‌లాల్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జై తెలంగాణ, జై కెసిఆర్, తెలంగాణ ముద్దు, మదన్‌లాల్ వద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడుతూనే మదన్‌లాల్‌ను తొలిగించాలని ఆందోళన చేశారు. అనంతరం కమ్మవారి కళ్యాణ మండపంలో కార్యకర్తలు, పార్టీ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో వైరా నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన మదన్‌లాల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కడ కృషి చేయకుండా ముఠా రాజకీయాలు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా స్వార్థ రాజకీయం చేస్తూ నియోజకవర్గ ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారని తెలిపారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారం చేయల్సి ఉండగా ప్రజల్లో వర్గపోరుతో చిచ్చు పెట్టారని తెలిపారు. గిరిజన ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఉన్న గిరిజనులైన లంబాడీ, కోయలకు మధ్య తగాదాలు సృష్టించారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని మరిచిన వ్యక్తికి మరలా టికెట్ ఇస్తే ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కెసిఆర్ స్పందించి మదన్‌లాల్ టికెట్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. మదన్‌లాల్ స్థానంలో టిఆర్‌ఎస్ తరుపున అధిష్టానం వైరా నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టిన అత్యధిక మెజార్టీతో గెలిపించి వైరా సీటును కెసిఆర్‌కు కానుకగా ఇస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాధవి, ఎంపిటిసి సుహాసిని, మాజీ జడ్‌పిటిసి నల్లమల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిపి ముక్తి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు గుమ్మా రోశయ్య, మెండేపూడి సత్యనారాయణ, పోట్ల శ్రీనివాసరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, స్వర్ణప్రహ్లాదరావు, ఇమ్మడి తిరుపతిరావు, స్వర్ణనేరేందర్, చింతనబోయిన సీతరాములు, పూర్ణకంటి మోషా, నల్లమల శివకుమార్, బాలునాయక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

విష జ్వరాలపై కలెక్టర్ ఆరా
* రామన్నపేట గ్రామంలో ఆకస్మిక తనిఖీ
* బాధితులతో మాట్లాడిన కలెక్టర్
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 21: విష జ్వరాలపై జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తీవ్రంగా స్పందించారు. జిల్లాలోని ప్రజలను విషజ్వరాలు పట్టి పీడిస్తుండడంతో ఆసుపత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో పండుగ దినమైన శుక్రవారం నగర కార్పొరేషన్ పరిధిలో రామన్నపేట గ్రామంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలోని మురికి ప్రాంతాలను స్వయంగా తిరిగి పరిశీలించారు. ఇళ్ళలోని కుండలు, డబ్బాలు, తొట్లలో నీళ్ళు నిలవ ఉండడాన్ని గమనించారు. ఒక దశలో టాయిలెట్లు పరిశీలించి వాటి పరిశుభ్రతపై గృహస్తులతో మాట్లాడారు. బురదమయమైన రహదారులలో సైతం కలియదిరిగారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలతో మాట్లాడి విషజ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జ్వరపీడితుల ఇండ్లలోకి వెళ్ళి వారితో మాట్లాడారు. వైద్య ఎక్కడ చేయించుకుంటున్నారు. ఏం మందులు వాడుతున్నారని, తీసుకుంటున్న ఆహారం, మంచినీటి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో విషజ్వరాలు ప్రబలడానికి గల కారణాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు గ్రామ పారిశుద్ధ్య కార్మికులతో మురికి ప్రాంతాలలో స్ప్రే చేయించారు. మురికి గంటలలో గంబూజియా చేపలను విడుదల చేయించారు. ఇళ్ళ పరిసరాలలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను ఆయన పరిశీలించారు. నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ సిబ్బందిని ఆదేశించారు. విష జ్వరాలు ప్రబలడానికి ముఖ్యంగా పరిసరాల అపరిశుభ్రతే కారణమన్నారు. ఇండ్లలో వాడుతున్న ప్లాస్టిక్ బకెట్లలో పాకుడు పట్టడాన్ని గమనించారు. బకెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. పాకురు పట్టడం వలన సూక్ష్మక్రిములు చేరి ఆ నీటి ద్వారా అనారోగ్యం పాలవుతారన్నారు. పరిసరాలతో పాటు ఇండ్లలోని వస్తువులు సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను మహిళలు, గ్రామస్తులు ఏకరువు పెట్టారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించాలని పారిశుద్ధ్య కార్యక్రమాలపై యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మురికినీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని జ్వరంతో బాదపడే గ్రామాలలో ఎప్పటికప్పుడు వైద్యశిభిరాలు నిర్వహించి వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ కె శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కళావతిబాయి, అర్భన్ తహసీల్దార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.