ఖమ్మం

కూటమికే పట్టం కట్టిన ఓటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 11: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమికి ప్రజలు మద్దతు పలికారు. మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా అందులో 8 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించగా ఒక్క స్థానంలో టిఆర్‌ఎస్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి పోటీచేయగా 8 స్థానాల్లో విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేయగా ఖమ్మం నియోజకవర్గంలో మినహా మిగిలిన రెండు స్థానాలైన సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో విజయం సాధించింది. అలాగే సిపిఐ పోటీచేసిన వైరా స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం విశేషం. మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే పోటీచేసి విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం గమనార్హం. కాగా రెండవసారి పోటీచేసిన పువ్వాడ అజయ్‌కుమార్(ఖమ్మం), మూడవసారి పోటీచేసిన మల్లు భట్టివిక్రమార్క(మధిర), సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి)లు విజయం సాధించారు. తొలిసారి పోటీచేసిన కందాల ఉపేందర్‌రెడ్డి(పాలేరు) కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సీనియర్ నేత అయిన తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. అలాగే సిపిఎంకు కంచుకోటగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ ఓటమి పాలవ్వగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి నేత గుమ్మడి నర్సయ్య ఇల్లెందు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఖమ్మం స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థికి 1,02,760ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి టిడిపికి చెందిన నామా నాగేశ్వరరావుకు 91,769ఓట్లు వచ్చాయి. అజయ్‌కుమార్ 10,991ఓట్ల తేడాతో విజయం సాధించారు. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డికి 89,407ఓట్లు రాగా టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు 81,738ఓట్లు వచ్చాయి. కందాలకు 7,669ఓట్ల మెజార్టీ దక్కింది. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భట్టివిక్రమార్క 3,487ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ భట్టికి 80,178ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు 76,691ఓట్లు వచ్చాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు 1,00,044ఓట్లు రాగా టిఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి 81,042ఓట్లు వచ్చాయి. సండ్రకు 19,002ఓట్ల మెజార్టీ వచ్చింది. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్ 2,752ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ రాములునాయక్‌కు 48,119ఓట్లు రాగా టిఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌కు 45,367ఓట్లు వచ్చాయి. ఇల్లెందు నియోజకవర్గంలో చివరి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియనాయక్ 2650ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హరిప్రియకు 69,575ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యకు 66,925ఓట్లు వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్యకు 45,987ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్‌కు 34,864ఓట్లు వచ్చాయి. వీరయ్యకు 11,123ఓట్ల మెజార్టీ వచ్చింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుకు 60,825ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు 47,397ఓట్లు వచ్చాయి. దీంతో మెచ్చా 12,612ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగూడెం స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు 4,296ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ వనమాకు 80,141ఓట్లు రాగా, టిఆర్‌ఎస్‌కు చెందిన జలగం వెంకట్రావ్‌కు 75,845ఓట్లు లభించాయి. పినపాక నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావుకు 19,495ఓట్ల మెజార్టీ దక్కింది. రేగాకు 71,994ఓట్లు రాగా, టిఆర్‌ఎస్‌కు చెందిన పాయం వెంకటేశ్వర్లుకు 52,499ఓట్లు లభించాయి.

కూటమి హీరో..
కారు జీరో
* అన్ని స్థానాలు గెలుచుకున్న కూటమి * టీఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం
* విలక్షణ తీర్పునిచ్చిన జిల్లా ఓటర్లు * కనిపించని ఎర్రజెండా గాలి
భద్రాచలం టౌన్, డిసెంబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రజాకూటమి హవా సాగింది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కూటమి జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం టీఆర్‌ఎస్ చతికిలపడింది. గతంలో గెలుపొందిన కొత్తగూడెం స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. రాష్టమ్రంతా టీఆర్‌ఎస్ గాలి వీచినా జిల్లాలో ఓటర్లు విభిన్న తీర్పునిచ్చారు. ఆ తీర్పుకు గులాబీ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం రాజకీయ విశే్లషకులను సైతం ఆశ్చర్యపరిచింది. జిల్లాలో కూటమి, టీఆర్‌ఎస్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అంచనా వేసినా టీఆర్‌ఎస్ ఈస్థాయిలో ఓడిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లాకే భద్రాద్రి జిల్లాలో కూడా టీఆర్‌ఎస్ గాలి వీస్తుందని అంచనా వేసినా నేతలకు నిరాశే మిగిలింది. అభివృద్ధి తమను గెలిపిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ నమ్మినా సిట్టింగ్‌లపై నమ్మకం ఉంచి మళ్లీ టిక్కెట్ ఇవ్వడం ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా సిట్టింగ్‌లపై అతి విశ్వాసంతో టిక్కెట్లు కేటాయించడంతో సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు, అసంతృప్తులు బయటకొచ్చాయి. వాటినన్నింటినీ పక్కనపెట్టి గుడ్డిగా టీఆర్‌ఎస్ అతివిశ్వాసంతో ముందుకెళ్లడం కొంపముంచింది. ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఓటర్లు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో గట్టిగా చూపించడంలో ఆ దెబ్బకు జిల్లాలో టీఆర్‌ఎస్ గల్లంతైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. హోరాహోరీ పోరు ఉంటుందని భావించిన కొత్తగూడెంలో కూడా కూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థి వనమాకు టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. భద్రాచలం అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ పాగా వేయాలని చూసినా వారి పాచికలు పారలేదు. ఇక్కడ ఎమ్మెల్సీ బాలసాని ప్రత్యేక దృష్టిపెట్టి టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేసినా, కోట్లాది రూపాయలు ప్రచారానికి, అభ్యర్థులకు వెదజల్లినా కూటమి అభ్యర్థి ధాటికి ఏ దశలోనూ టీఆర్‌ఎస్ పోటీనివ్వలేకపోయింది. అశ్వారావుపేటలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి కూటమి బలపర్చిన తెదేపా అభ్యర్థికి ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోయారు. అలాగే ఇల్లందు స్థానంలో టీఆర్‌ఎస్‌కు మొదట్లో సానుకూల పవనాలు వీచినా చివరి వరకు ఫలితంగా ఉత్కంఠత కొనసాగింది. చివరికి కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితం కూటమికి అనూహ్యమనే చెప్పాలి. స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ గెలుపొందారు. పినపాకలో టీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత కూటమి అభ్యర్థి రేగా కాంతారావుకు బాగా కలిసొచ్చింది. ఫలితాలు వెలువడిన తొలి నుంచి రేగా ఆధిక్యత చాటుకుంటూ వచ్చారు. జిల్లాలో కూటమి తరుపున అత్యధిక మెజార్టీతో గెలుపొందింది పినపాక అభ్యర్థి రేగా మాత్రమే కావడం విశేషం. టీఆర్‌ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కూటమి ఏర్పడక ముందే పినపాకలో కాంగ్రెస్‌తో కలిసి తెదేపా, సీపీఐలు ప్రజా వ్యతిరేక ఆందోళనలు కలిసికట్టుగా నిర్వహించాయి. ఏడాదిన్నరగా పాయంకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేస్తూ వచ్చారు. ఈ దశలో రాష్ట్రంలో ఈ పార్టీలు కూటమిగా ఏర్పడటంతో క్రమంగా రేగాకు మద్దతు పెరిగింది. పాయంపై ఉన్న వ్యతిరేకతే ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించిందని చెప్పాలి. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం టీఆర్‌ఎస్ కొత్తగూడెంలో గెలుపొందింది. ఈసారి జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని ఎన్నికలకు ముందే ప్రణాళికతో ముందుకెళ్లింది. రాష్టవ్య్రాప్తంగా టీఆర్‌ఎస్ దూసుకెళ్లినా జిల్లాలో మాత్రం ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజలు ఏమాత్రం నమ్మకం ఉంచలేదన్న విషయం ప్రస్తుత ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఆ వ్యతిరేకతతోనే ప్రత్యామ్నాయ అభ్యర్థులుగా జిల్లా ఓటర్లు విభిన్న తీర్పును ఇస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించారు. దీనికి తోడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూటమిలోని పార్టీల ఓట్ల బదలాయింపు జిల్లాలో పద్ధతి ప్రకారం జరిగింది. సీట్ల సర్ధుబాటు విషయంలో కొన్ని చోట్ల అసంతృప్తి ఉన్నా నామినేషన్ల నాటికి అవన్నీ సర్ధుమణగడంతో కూటమి పార్టీలన్నీ ఐక్యంగా పనిచేశాయి. మేమంతా కలిసే ఉన్నామన్న అభిప్రాయం కలిగించడంతలో కూటమి పార్టీలు విజయం సాధించాయి. ఓట్ల బదలాయింపు కూడా అన్ని పార్టీల నుంచి సక్రమంగా జరగడంతోనే జిల్లాలో కారు జోరుగా బ్రేకులు పడి కూటమి సత్తా చాటగలిగింది. కాగా జిల్లాలో ఓట్లను చీల్చి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుతుందని భావించిన బీఎల్‌ఎఫ్ బలపర్చిన సీపీఎం అభ్యర్థులు ఘోర పరాజయం చవిచూశారు. ఓటర్లు వారిని ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం ఫలితాల్లో కనిపించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న భద్రాచలంలో ఆ పార్టీ మూడవస్థానంలోకి పడిపోవడం రాజకీయ విశే్లషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో విభిన్నమైన తీర్పు వెలువడగా కూటమి హీరోగా.. కారు జీరోగా నిలిచాయి.

జిల్లాలో ప్రజాకూటమి హవా...
* 6 కాంగ్రెస్, 2 టీడీపీ, 1 టిఆర్‌ఎస్, 1 స్వతంత్ర

ఖమ్మం, డిసెంబర్ 11: రాష్టవ్య్రాప్తంగా టీఆర్‌ఎస్ గాలి వీచినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రజలు మహాకూటమి వైపు మొగ్గుచూపారు. మొత్తం పది స్థానాలకు గాను ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. టీఆర్‌ఎస్ తప్పనిసరిగా గెలుస్తుందనుకున్న స్థానాల్లో సైతం ప్రజాకూటమి అభ్యర్థులు గెలవడం విశేషం. ప్రజాకూటమి అభ్యర్థులు పాలేరు, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో విజయం సాధించగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి ఖమ్మంలోనూ, స్వతంత్ర అభ్యర్థి వైరాలోనూ విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాల్లో మూడు ప్రజాకూటమి, ఒకటి టిఆర్‌ఎస్, ఒకటి స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, కొత్తగూడెం జిల్లాలోని ఐదు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ టిడిపి అభ్యర్థి నామా నాగేశ్వరరావు పైన, వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి లావూడ్యా రాములునాయక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ పైన, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క, టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ పైన, పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపైన, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌కు చెందిన పిడమర్తిపై విజయం సాధించారు. అలాగే కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు టిఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ పైన, ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియనాయక్ టిఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య పైన, అశ్వారావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు టిఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు పైన, భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్య టిఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ పైన, పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు టిఆర్‌ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పైన విజయం సాధించారు.

ఓట్ల లెక్కింపు వద్ద
భారీ బందోబస్త్

* మూడంచెల భద్రతలో జరిగిన కౌంటింగ్
ఖమ్మం(కైం), డిసెంబర్ 11: విజయ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం మూడంచెల భద్రతలో కౌంటింగ్‌ను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర పారామిలటరీ దళాలతో పాటు స్థానిక పోలీసుల భద్రతా ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పర్వవేక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్ళేవారిని వాటర్ బాటిల్స్, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రవేశ ద్వారం దగ్గర లాగ్‌బుక్ ఏర్పాటుచేసి పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్క్ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ అధికారుల తగిన సూచనలు చేస్తూ ప్రశాంతంగా వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డిసిపి మురళీధర్, ఏఆర్ అడిషనల్ డిసిపి శ్యాంసుందర్, ఏసిపిలు సత్యనారాయణ, గంటా వెంకట్రావు, రామోజి రమేష్, ప్రసన్న కుమార్, ఆంజనేయులు, రెహ్మాన్, ఈశ్వరయ్య, రియాజ్, విజయబాబు, ఆర్‌ఐలు శ్రీనివాస్, రవి, మధన్‌మోహన్, సిఐలు రమాకాంత్, సంపత్‌కుమార్, వసంతరావు, వెంకటనర్సయ్య, హరినాధ్, శివరామయ్య, రమేష్, కరుణాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజా మాజీల్లో గెలిచింది ముగ్గురే!

ఖమ్మం, డిసెంబర్ 11: తాజా మాజీ శాసన సభ్యుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్, మల్లు భట్టివిక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య తిరిగి ఈ ఎన్నికల్లో కూడా గెలిచారు. అయితే 2014ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించగా ఈసారి మాత్రం ఆయన టిఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలో నిలిచి విజయం సాధించారు. మధిరలో భట్టివిక్రమార్క, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులుగానే పోటీచేసి విజయం సాధించారు. కాగా 2014ఎన్నికల్లో కొత్తగూడెంలో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన జలగం వెంకట్రావ్ ఈ దఫా టిఆర్‌ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, వైరాలో బాణోత్ మదన్‌లాల్, అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించగా ఈసారి టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇల్లెందులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన కోరం కనకయ్య ఈసారి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. భద్రాచలం నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే సిపిఎంకు చెందిన సున్నం రాజయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అక్కడ అన్ని పార్టీలు కొత్త అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి చెందిన పొడెం వీరయ్య భద్రాచలంలో పోటీచేసి విజయం సాధించడం విశేషం.
ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన తెల్లం వెంకట్రావ్(్భద్రాచలం), పిడమర్తి రవి(సత్తుపల్లి), లింగాల కమల్‌రాజ్(మధిర), ఊకే అబ్బయ్య(ఇల్లెందు), గుమ్మడి నర్సయ్య(ఇల్లెందు), యడవల్లి కృష్ణ(కొత్తగూడెం)లు ఈ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు.