ఖమ్మం

ఏకగ్రీవం కోసం సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 11: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకునేందుకు అనేక గ్రామాల్లో పెద్ద మనుషుల ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ దాఖలైన 13మండలాలతో పాటు ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న 13మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నామినేషన్ దాఖలైన గ్రామాల్లో గ్రామపెద్దలు పలు పార్టీల నేతలు ఒక్కటై గ్రామాభివృద్ధికి అధిక నిధులు ఇచ్చేవారికి మిగిలిన వారు మద్దతు పలకాలని, అందుకు అనుగుణంగా ఈ నెల 13వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆయా గ్రామానికి చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు గ్రామ సర్పంచ్ పదవిని తమకు కట్టబెడితే అభివృద్ధికి నిధులిస్తామని బాహటంగానే చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలకతీతంగా ఆయా గ్రామాల్లోని నేతలు ఒక్కటవుతున్నారు. అయితే ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు తమ ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు తీసుకొస్తామని, సర్పంచ్ పదవిని తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థికి ఇవ్వాలని సూచిస్తుండటం గమనార్హం. అవసరమైతే పోటీకైనా సిద్ధమని ప్రకటించిన గ్రామాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి పేరుతో నిధుల సేకరణకు ఎన్నికలను ఉపయోగించుకుంటుండటం గమనార్హం. ఇదే విధమైన పరిస్థితి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కనిపిస్తున్నది. ఆయా గ్రామాలకు చెందిన పలువురు ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఆర్థికంగా బలంగా ఉండటంతో తమ బంధువులను అక్కడ నిలబెట్టి వారిని ఏకగ్రీవం చేయాలని కోరుతున్నారు. ఇందుకోసం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ కోవలోకి కొందరు వైద్యులు కూడా చేరడం గమనార్హం.
ఇదిలా ఉండగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తరహా ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ తరహా ప్రక్రియను ఒప్పుకోమని చెబుతుండగా ఆయా గ్రామాల్లోని పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే వీటిపై పోలీస్ ఇంటిలిజెన్స్ శాఖాధికారులు కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

త్వరలోనే ఖమ్మంలో ఓపెన్ జైల్
* డీఐజీ మురళి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 11: ఖమ్మం జిల్లాలో త్వరలో ఓపెన్ జైల్‌ను ఏర్పాటు చేస్తామని డీఐజీ మురళి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా జైల్‌ను పరిశీలించి అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీవితశిక్ష పడిన ఖైదీలు ఓపెన్‌జైల్ గురించి అడగగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. జైలులోని లైబ్రరీ, బ్యారెక్స్, వంటశాల, మహిళా ఖైదీలు, వృద్దుల బ్యారెక్స్, ఖైదీల నర్సరీలను తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలో భోజనాన్ని తిని చూశారు. ఖైదీలకు భోజనం కోసం ఉన్న సామాగ్రిని అన్నింటిని పరిశీలించారు. వారికి కల్పించే సౌకర్యాలు, తరగతి గదులను తనిఖీ చేశారు. ఇదే సమయంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ వినోద్‌కుమార్ రావడంతో ఇద్దరూ కలిసి ఈ మిలాఖత్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం జైలు నిర్వహణ బాగుందంటూ పర్యవేక్షణ అధికారి రామచంద్రంను అభినందించారు.

కొత్తగూడెం జిల్లాలో కోటి మొక్కల పెంపకం లక్ష్యం
* జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగత్‌కుమార్‌రెడ్డి
జూలూరుపాడు, జనవరి 11: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా డిఆర్‌డిఓ ఆధ్వర్యంలో 398నర్సరీలను ఏర్పాటు చేసి కోటి మొక్కలను పెంచటం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగత్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపాధిహామీ పథకం ఉద్యోగులను ఆయన ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి ఉద్యోగులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటి వరకు 22 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించటం, లేదా ప్రైవేటు భూములను లీజుకు తీసుకోవటం జరిగిందని అన్నారు. మొత్తం 5.2లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 1.22 లక్షల బ్యాగుల్లో మట్టిని నింపటం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ నాటికి బ్యాగుల్లో మట్టిని నింపటం 25వ తేదీ వరకు విత్తనాలు నాటించి పనులు వేగం చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం పడమట నర్సాపురంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం పనులపై ఉద్యోగులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిడివో విద్యాచందన, ఎపివో జమీర్‌పాషా, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రముఖ కళాకారుడు మృతి
వేంసూరు, జనవరి 11: ప్రముఖ కళాకారుడు వెల్లంకి బస్వాచారి (85) శుక్రవారం మరణించారు. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక జానపద, పౌరాణిక, సాంఘిక నాటకాలను ప్రదర్శించారు. అనేక మంది ప్రముఖలతో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బస్వాచారి పేరు ఈ ప్రాంతంలో తెలియని వారుండరు. వృత్తిరీత్య మెకానిక్ అయినప్పటికీ కళల పట్ల అపార ప్రేమతో జీవితంలో ఎక్కువ భాగం కళారంగంలోనే గడిపారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటు అని పలువురు పేర్కొంటున్నారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ కళలపట్ల ప్రేమతో చుట్టుప్రక్కల జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై, వారిని ప్రోత్సహించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బస్వాచారి మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు.

విద్యుత్ కేంద్రాల అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి
* సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం
* రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు
* సింగరేణి డైరక్టర్ (పా) చంద్రశేఖర్
కొత్తగూడెం, జనవరి 11: దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలకు అనుగుణంగా బొగ్గును ఉత్పత్తి చేసేందుకు సింగరేణి యాజమాన్యం నిరంతరం శ్రమిస్తుందని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక సింగరేణి ఇల్లందు క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల నుంచి సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద కోల్‌బెల్ట్ ఏరియాలో రూ 1600 కోట్లు మంజూరు చేయగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలేనే కాకుండా సింగరేణి సంస్థ ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను ఏర్పాటు చేసి బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన అనుమతులను సాధించిందన్నారు. నూతన ప్రాజెక్టు ఏర్పాటుకు భూ సేకరణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులను నిర్వహించేందుకు సింగరేణి నిధులను మంజూరీ చేసిందన్నారు. ఇప్పటికే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో సంస్థలో నూతన ఉద్యోగ నియామకాలకు అవసరమైన చర్యలు చేపట్టి, ఇప్పటికే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. మార్కెట్‌లో సింగరేణి బొగ్గుకు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిపై దృష్టి సారించి ఉత్పత్తి లక్ష్యాలను ప్రతి ఏడాది పెంచుతున్నట్లు ప్రకటించారు. సోలార్ విద్యుత్ నిర్మాణం కోసం రూ 1163కోట్లతో 300మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. రానున్న దీపావళి నాటికి సోలార్ విద్యుత్‌ను అందిస్తామని అన్నారు. కారుణ్య నియామకాల పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నెలా మెడికల్ బోర్డును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్రాంతి కార్మికులకు సైతం మెరుగైన వైద్యం అందించేందుకు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సింగరేణి ఇ అండ్ ఎం డైరెక్టర్ శంకర్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరక్టర్ భాస్కర్‌రావు, డైరక్టర్ ఫైనాన్స్ బలరాంలు మాట్లాడుతూ సింగరేణి సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు సమష్టి కృషి జరుపుతున్నట్లు తెలిపారు. సాంకేతికంగా, సామాజికంగా సింరగేణి సంస్థ అన్ని రంగాల్లో ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో సింగరేణి జనరల్ మేనేజర్‌లు ఆనందరావు, బసవయ్య, రుష్యేంద్రుడు, డీజీఎం సాల్మోన్, పర్సనల్ మేనేజర్‌లు బేతిరాజు, రమేష్‌లు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి
* ఏకగ్రీవాలకు ప్రాధాన్యతనివ్వండి
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క
కామేపల్లి, జనవరి 11: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించుకున్న విధంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ భట్టివిక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని తాళ్ళగూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచ్ రాకావత్ సునీత ఇంటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని, గ్రాప స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అలజడులు, అల్లర్లు జరిగే సమ్యసాత్మక గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మండలంలో పాతలింగాల, తాళ్ళగూడెం, లాల్యాతండ గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎంపిక చేయడం పట్ల స్థానిక నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డిని అభినందించారు. అనంతరం ఇటీవల మరణించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లమోతు కోటయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించి బాదిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, జిల్లా బిసి సెల్ నాయకులు పుచ్చకాయల వీరభధ్రం, మండల నాయకులు సుందరం, రమేష్‌చౌదరి, నర్సింహరావు, రామకృష్ణ, పుండరీ, గంటి నర్సయ్య, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.