ఖమ్మం

ఎన్నికలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 18: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. మూడు విడతలుగా జరగనున్న ఎన్నికలకు విడతల వారీగానే బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 188గ్రామ పంచాయతీల పరిధిలో 67గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఈ గ్రామాల పరిధిలో 614పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే సమస్యాత్మకమైనవిగా 40గ్రామాలను గుర్తించామని, ఈ గ్రామాల పరిధిలో 448పోలింగ్ బూత్‌లు ఉన్నాయన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అడిషనల్ డిసిపిలు మురళీదర్, శ్యాంసుందర్, ట్రైనీ ఐపిఎస్ డాక్టర్ వినీత్‌తో పాటు 11మంది ఏసిపిలు బందోబస్తును పర్యవేక్షిస్తారన్నారు. 26మంది సిఐలు, 54మంది ఎస్‌ఐలు, 243మంది ఏఎస్‌ఐలు, 672మంది కానిస్టేబుళ్ళు, 334మంది ఆర్మూడ్ రిజర్వు పోలీసులు, 468మంది హోంగార్డులు, 19మంది మహిళా కానిస్టేబుళ్ళు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా 82రూట్ మోబైల్ పార్టీలు, ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 4ఎస్‌ఎస్ టీమ్స్, 6స్ట్రైకింగ్ ఫోర్స్, 6స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 8రోడ్ ఓపెనింగ్ పార్టీ, 4చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మొదటి దశ ఎన్నికలు జరిగే ఆరు మండలాల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో గ్రూపు తగాదాలు, అలజడి సృష్టించే వారిని కట్టడి చేయడంతో పాటు రౌడీ షీటర్లను బైండోవర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్నిచోట్ల 144సెక్షన్ అమల్లో ఉందని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. రూట్ మోబైల్స్, పోలింగ్ బూత్‌ల గురించి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఎస్‌ఐలు, సిఐలు, గ్రామ పోలీస్ అధికారులు విధిగా గ్రామాలకు వెళ్ళి గ్రామస్తులతో మమేకమై ఎలాంటి అల్లర్లకు తావులేకుండా అవసరమైతే రాత్రి వేళల్లో బస చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు స్థానికులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బెల్టు షాపులపై నిఘా పెట్టాలని, డబ్బు, మద్యం, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో ఏసిపిలు ప్రసన్నకుమార్, సత్యనారాయణ, రామానుజం తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి సండ్ర...?
* కేసీఆర్ సమక్షంలో చేరుతున్నట్లు ప్రచారం...?
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 18: ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్టవ్య్రాప్తంగా తెలుగుదేశం పార్టీ కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అందులో టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నియోజకవర్గంలో విజయం సాధించగా, అశ్వారావుపేట నియోజకవర్గంలో మెచ్చా నాగేశ్వరరావులు విజయం సాధించారు. అయితే అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ప్రమాణస్వీకారం చేయని సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం చేస్తారని భావించినప్పటికీ ఆ రోజు కూడా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి కారణంగా ఆయన నియోజకవర్గాన్ని వదిలి రాలేకపోతున్నారని 17వ తేదీన ఆ పార్టీ నేతలు చెప్పగా 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన పాల్గొనలేదు. ముందస్తుగా ఆయన ఖమ్మం, సత్తుపల్లిలో పాల్గొంటారని ప్రచారం జరిగినప్పటికీ అది జరగకపోగా ఆయన కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ చేరుకున్నారని, టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని సామాజిక మాధ్యమాలతో పాటు టివి ఛానళ్ళలో ప్రచారమైంది. దీంతో ఒక్కసారిగా నీరసించిన ఆ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతిని తామే జరుపుకున్నారు.
ఇదిలా ఉండగా నాల్గవసారి శాసన సభ్యునిగా ఎన్నికైన సండ్ర వెంకటవీరయ్య టిఆర్‌ఎస్‌లో చేరుతారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉన్నది. గతంలో ఇద్దరు శాసన సభ్యులు సమావేశమై దీనిపై చర్చించినట్లు అశ్వారావుపేట శాసన సభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు బహిరంగంగానే ప్రకటించారు. అయితే టిఆర్‌ఎస్‌లో చేరే విషయాన్ని సండ్ర ఎక్కడా కొట్టి పారేయలేదు. అలాగని జిల్లా పార్టీ నేతలకు అందుబాటులో కూడా ఉండటంలేదనే ప్రచారం కూడా జరిగింది. తాజా పరిణామాలతో సండ్ర టిఆర్‌ఎస్‌లో చేరుతున్నాడనే వార్తకు మరింత బలం చేకూరింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కూడా టిఆర్‌ఎస్‌లో చేరే విషయాన్ని కొట్టిపారేయడం లేదు. సండ్ర వెంకటవీరయ్య టిఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారనే ప్రచారంతో ఇప్పటివరకు టిడిపిలో ఆయన అనుచరవర్గంగా ఉన్నవారు ఆందోళనలో పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అనేక మంది సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. ఒకటి, రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వస్తుందని టిఆర్‌ఎస్, టిడిపి నేతలు భావిస్తుండటం గమనార్హం. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములునాయక్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరడంతో సండ్ర కూడా చేరితే ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య మూడుకు చేరనున్నది.

రెండు దశల్లో 97 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
* మూడవ దశలో మరింత పెరిగే అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 18: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి, రెండవ దశల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 97సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. రెండు జిల్లాల పరిధిలో 1063గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా మొదటి, రెండవ దశల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో 97పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీమవయ్యాయి. మొదటిదశ ఎన్నికలు ఈ నెల 1వ తేదీన జరగనుండగా రెండవదశ ఎన్నికలు ఈ నెల 25వ తేదీన జరగనున్నాయి. ముదిగొండ మండలంలోని గోకినేపల్లి, మేడేపల్లి, కూసుమంచి మండలంలోని గొరిళ్ళపాడుతండా, ధర్మతండా, కొత్తూరు, నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, శంకర్‌గిరితండా, తిరుమలాపురంతండా, సుర్దేపల్లి, అప్పలనర్సింహాపురం, ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, తిరుమలాయపాలెం మండలంలోని సోలీపురం, ఇస్లావత్‌తండా, గోల్‌తండా, కామేపల్లి మండలంలోని పాతలింగాల, కొత్తలింగాల, తాళ్ళగూడెం, ముచ్చర్ల, జాస్తిపల్లి, లాల్యాతండా, రుక్కితండా, ఏన్కూరు మండలంలోని జన్నారం, రాయమాదారం, పికె బంజర, యర్రబోడుతండా, సూర్యాతండా, తల్లాడ మండలంలోని మల్సూరుతండా, తల్లాడ, వేంసూరు మండలంలోని భరణిపాడు, బీమవరం, చౌడారం, పెనుబల్లి మండలంలోని పార్థసారధిపురం, గౌరారం, బవన్నపాలెం, టేకులపల్లి, రామచంద్రాపురం, లంకపల్లి, కొత్తలంకపల్లి, కల్లూరు మండలంలోని పుల్లయ్యబంజర, లోకారం, పెద్దకోరుకొండి, ఓబుల్‌రావుబంజర, కొర్లగూడెం, నారాయణపురం, లింగాల, పాయపూర్, సత్తుపల్లి మండలంలోని గంగారం, రామగోవిందాపురం, తాళ్ళమడ, సదాశివపురం, గౌరిగూడెం, కారేపల్లి మండలంలోని టేకులగూడెం, కొత్తతండా, పాతకమలాపురం, గంగారంతడా గ్రామాలు ఏకగ్రీమవయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వాపురం మండలంలోని నెల్లిపాక, అశ్వాపురం, మణుబోతులపాడు, చర్ల మండలంలోని పెద్దిపల్లి, కుర్నపల్లి, బోడనిల్లి, దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి, కోయనర్సాపురం, అచ్చుతాపురం, పెద్దకమలాపురం, దబ్బనూతల, మణుగూరు మండలంలోని బుగ్గ, ముల్కలపల్లి మండలంలోని రామచంద్రాపురం, పాతగుండాలపాడు, పాల్వంచ మండలంలోని బంజర, చంద్రాలగూడెం, సత్యనారాయణపురం, సోములగూడెం, బీక్యాతండా, పాండురంగాపురం, బండ్రుగొండ, దమ్మపేట మండలంలోని అళ్ళిపల్లి, అకినేపల్లి, మందలపల్లి, పూసుకుంట, వడ్లగూడెం, దండుగులపల్లి, సీతారాంపురం, గణేష్‌పాడు, చండ్రుగొండ మండలంలోని దామరచర్ల, చండ్రుగొండ, వెంకటాయతండా, అశ్వారావుపేట మండలంలోని మొద్దులమాడ, అచ్చుతాపురం, చుంచుపల్లి మండలంలోని అంబేద్కర్ నగర్, పినపాక మండలంలోని భూపాలపట్నం, సీతంపేట, పాతరెడ్డిపాలెం, కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, బట్టుపల్లి, సమత్‌మోతె గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ నెల 21, 25తేదీల్లో ఎన్నికలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజకీయాలకే కొత్త ఒరవడిని సృష్టించిన ఎన్టీఆర్
* 23వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతల నివాళి
ఖమ్మం(ఖిల్లా), జనవరి 18: తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నటరత్న తారక రామారావు 23వ వర్ధంతిని నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి, ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని ఎన్‌టిఆర్ విగ్రహానికి టిడిపి రాష్ట్ర నాయకురాలు, పాలేరు ఇంచార్జ్ స్వర్ణకుమారి, నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రీటౌన్ ప్రాంతంలోని ఎన్‌టిఆర్ విగ్రహనికి త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ తెలుగుజాతీ ఎన్‌టిఆర్ చేసిన సేవలను కొనియాడారు. తెలుగువాడి ఆత్మగౌరవనాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో కేవలం 9నెలలకే అధికారం చేజిక్కించుకొని చరిత్రలో మిగిలిపోయారన్నారు. రాజకీయాలకే కొత్త ఒరవడిని సృష్టించిన మహోన్నత వ్యక్తి ఎన్‌టిఆర్‌న్నారు. తన చివరిశ్వాస వరకు తెలుగుప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పాటుపడ్డారన్నారు. ఎన్‌టిఆర్ ఆశయసాధనే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరావు, చేతుల నాగేశ్వరావు, నాగార్జునపు శ్రీను, భాస్కర్‌రావు, చావా రామారావు, రామసీతమ్మ, ప్రమీల, కొడగంటి ఆంజనేయులు, కందిబండ నరిసింహరావు, శ్రీనివాసరావు, బాలరాజు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఆలిండియా అణుశక్తి ఉద్యోగుల అథ్లెటిక్స్ పోటీలు
అశ్వాపురం, జనవరి 18: ప్రతిష్ఠాత్మకమైన భారజల అణుశక్తి విభాగం(డీఏఈ) 34వ జాతీయ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ అత్యంత వైభవంగా గౌతమీనగరంలోని ఏఈసీఎస్ పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హెవీవాటర్ బోర్డు ఆపరేషన్ డైరెక్టర్ వీకేఎం పార్థిబన్ పాల్గొని ఈ క్రీడా ఉత్సవాలను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు జాతీయ సేవాదళ్ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అణుశక్తి కేంద్రీయ పాఠశాల విద్యార్థుల స్వాగత గీతాలాపానతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భారజల ప్లాంట్ జనరల్ మేనేజర్ జితేంద్ర శ్రీవాత్సవ స్వాగతోపన్యాసం చేసిన అనంతరం ముఖ్య అతిథి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి అథ్లెటిక్స్, సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత క్రీడాకారులు, కార్యనిర్వాహకులు క్రీడాప్రమాణం ఆచరించారు. ముఖ్య అతిథి పార్థిబన్ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రీడాపోటీల సమన్వయకర్త వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న భారజల అణుశక్తి విభాగాల నుంచి 142 మంది క్రీడాకారులు ఈ పోటీలకు తరలివచ్చారు. నాగార్జున, రామేశ్వరం, గోల్కొండ, పుష్కర, ద్వారక, అజంత, ఎల్లోరా, కోణార్కా జట్లుగా ఏర్పడి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలు ఈనెల 20 వరకు జరుగుతాయి
అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు
అథ్లెటిక్స్, సాంస్కృతికోత్సవాలను పురస్కరించుకొని అణుశక్తి కేంద్రీయ ఉన్నత పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. దేశ సమైఖ్యత, సమగ్రత పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, అంకితభావాలను తెలియజేశారు.
క్రీడాస్ఫూర్తితో దేశ సమైక్యత
క్రీడాస్ఫూర్తితో ఉద్యోగులు దేశ సమైక్యత, సమగ్రతలకు బాటలు వేయాలని ముఖ్య అతిధి వీకేఎం పార్థిబన్ అన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అథ్లెటిక్స్ పోటీలు మానవ వనరుల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని, భారత అణుశక్తి విభాగం ఈ ఉత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమన్నారు. మణుగూరు భారజల కర్మాగారం జనరల్ మేనేజర్ జితేంద్ర శ్రీవాత్సవ స్వాగతోపన్యాసం చేస్తూ భారజల ప్లాంట్ ప్రతి ఏటా ఈ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలకు వేదిక కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అథ్లెటిక్స్ విజయానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని, క్రీడాకారులు స్ఫూర్తి కలిగి వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డెప్యూటీ జనరల్ మేనేజర్ వీవీఎస్ ప్రసాద్‌రావు, క్రీడల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ సంజయ్‌గౌర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంట్ ఆఫీసర్ లతా సుబ్రమణ్యం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు పీవీ బాలాజీ, జి.నవీన్, అణుశక్తి కేంద్రీయ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ బి.వెంకన్న, ఆర్‌డబ్య్లూఎస్ సెక్రటరీ కె.చంద్రశేఖర్‌రావు, క్రీడల సమన్వయకర్త మోహన్‌కుమార్, క్రీడల స్టీరింగ్ కమిటీ సభ్యులు కృష్ణారావు, కళ్యాణ్ చక్రవర్తి, ఆఫ్జల్, సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఎస్‌ఎస్ మీనా, అసిస్టెంట్ కమాండెంట్ అరూర్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.