ఖమ్మం

శ్రీకృష్ణావతారంలో భ్రదాద్రి రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 19: శ్రీ సీతారామచంద్రస్వామి తన భక్తులకు శనివారం శ్రీ కృష్ణావతారంలో దర్శనమిచ్చారు. శ్రీ కృష్ణావతారం అధ్యయనోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ అవతారాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కృష్ణావతారాన్ని భక్తి ప్రవత్తులతో భక్తులు దర్శించుకున్నారు. తొలుత అంతరాలయంలో స్వామివారిని శ్రీ కృష్ణావతారంలో అలంకరించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు ద్రవిడ ప్రబంధం, అతిహాసం పఠించారు. స్వామికి మంగళ నీరాజనాలు ఇచ్చారు. అనంతరం గర్భగుడి నుంచి స్వామిని తీసుకొచ్చారు. భక్తులు శ్రీ కృష్ణావతారాన్ని దర్శించుకుని నీరాజనాలు పలికారు. అనంతరం శ్రీకృష్ణావతార రామయ్యకు ఊంజల్ సేవ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఊయలను సుందరంగా అలంకరించి అందులో కృష్ణయ్యను ఉంచి లాలలు జోలలు పాడారు. ఆస్థాన విద్వాంసులు కీర్తనలతో స్వామికి అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని పల్లకీలో ఊరేగింపుగా కల్యాణమండపం వేదిక వద్దకు తీసుకెళ్లారు. స్వామివారిని ఊరేగింపుగా రామాలయం నుంచి రాజవీధి, గోదావరి తీరం వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కల్యాణ మండపం వేదిక వద్దకు తెచ్చారు. గుంటూరుకు చెందిన ధూళిపాల శివరామశర్మ నిర్వహించిన తులసీదాసు హరికథ ఆకట్టుకుంది. అర్చకులు శ్రీ కృష్ణావతార వైశిష్ట్యాన్ని వివరించారు. అనంతరం కల్యాణ మండపం వేదిక వద్ద స్వామికి మంగళ నీరాజనాలు పలికారు. మంగళహారతులు ఇచ్చారు. భక్తులు స్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు. కల్యాణ మండపం నుంచి తాతగుడిసెంటర్ వరకు ఈ తిరువీధి సేవ జరిగింది. భక్తులు దారి పొడవునా స్వామి దర్శనం కోసం బారులు తీరారు. కృష్ణావతారంలో కొలువుదీరిన స్వామిని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అక్కడి నుంచి స్వామిని రామాలయానికి తీసుకొచ్చి భక్తుల సందర్శనార్థం ఉంచారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మాదే
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 19: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు విజయం వారిదేనని చెప్పుకుంటున్నాయని, 27న జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలవడం ఖాయమన్నారు. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి టిడిపి, కాంగ్రెస్ పార్టీలతో జత కట్టిన వామపక్ష పార్టీలు తమను విమర్శించే స్థాయి లేదన్నారు. జిల్లా అభివృద్ధి కోసమే తుమ్మలతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరామని, పువ్వాడ నాగేశ్వరరావు తుమ్మలను విమర్శించడం అర్ధరహితమన్నారు. అజయ్‌కుమార్ సిపిఐ, వైసిపి, కాంగ్రెస్ ఇలా పలు పార్టీలు మారారని, పదవి కోసమే పార్టీ ఫిరాయించారా అని ప్రశ్నించారు. పువ్వాడ ముందు తన చరిత్ర చూసుకొని మాట్లాడాలన్నారు. సాధారణ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఒకదానిని ఒకటి ఓడించుకోవడం కోసం వైసిపితో సిపిఎం, కాంగ్రెస్‌తో సిపిఐ పొత్తులు పెట్టుకున్నాయని, ఇప్పుడు ఏలా కలిసి పని చేస్తున్నారని ప్రశ్నించారు. బషీర్‌బాగ్, ముదిగొండ కాల్పులకు కారణమైన పార్టీల సహకారం వామపక్షాలు ఎందుకు తీసుకుంటున్నాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, సామినేని హరిప్రసాద్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, చింతనిప్పు కృష్ణచైతన్య, మందడపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

కక్షసాధింపు చర్యలను ప్రతిఘటిస్తాం

ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 19: కాంగ్రెస్ నేతలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలను ప్రజల సహకారంతో అడ్డుకుంటామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నేషనల్‌హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసే బిజెపి ప్రయత్నాన్ని నిరసిస్తూ శనివారం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం నుండి మయూరిసెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి ప్రధాని నరేంద్రమోది దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోది సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని ధ్వజం ఎత్తారు. దేశం కోసం త్యాగాలు చేసి, దేశాభివృద్ధికి పాటు పడిన గాంధీ కుటుంబాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జవహర్‌లాల్ స్థాపించిన నేషనల్‌హెరాల్డ్‌ను రాజకీయ లబ్ధికోసం వాడుకునే ప్రయత్నాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కేంద్రం వ్యహరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రతిపక్షాలను కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోది నిరంకుశ పోకడలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యం, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ నియాజకవర్గ అధ్యక్షుడు శ్రీచరణ్‌రెడ్డి, నాయకులు సోమ్లానాయక్, ఫజల్, కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు.
మా నలుగురివి పక్కపక్క ఇళ్లే
భద్రాచలం, డిసెంబర్ 19: అందాల రాముడు, మంచివాడు చిత్రాల దర్శకుడు లక్ష్మీనారాయణ. 1986 నుంచి దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి మేటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన ఈయన తాజాగా ‘బ్యాంకాగ్ బ్రహ్మానందం’ అనే హాస్యభరిత చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే క్రమంలో భద్రాద్రి రామయ్య ఆశీస్సుల కోసం శనివారం ఆయన కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమితో మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆయన మాటల్లోనే చదవండి..
నానే్న నాకు స్ఫూర్తి: మాది గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామం. నాన్న కోటేశ్వరరావు రంగస్థల నటులు. గణపతి సినిమాలో హీరో శ్రీహరికి తండ్రిగా కూడా ఆయన నటించారు. ఎన్నో వేల నాటకాలు ప్రదర్శించారు. ఆయనే నేను చిత్రరంగంలోనికి రావడానికి స్ఫూర్తి. పోసాని కృష్ణమురళి, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివలది మా ఊరే. మా ఇళ్లన్నీ పక్కపక్కనే ఉంటాయి. నేను 1986లో సినిమాలపై మక్కువతో నాటి మద్రాస్‌కు వెళ్లాను దాసరి నారాయణరావు వద్ద చేరదామని వెళ్తే కుదరక కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించాను. అత్తగారు స్వాగతం, ఇంటిదొంగ, మూడిళ్ల ముచ్చట సినిమాలకు పనిచేశాను. తర్వాత దాసరి నారాయణరావు వద్ద సుదీర్ఘకాలం పనిచేశాను. అమ్మరాజీనామాతో పాటు 18 చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసి ఆర్‌బి చౌదరి తెలుగులో సినిమాలు నిర్మిస్తుండటంతో సూపర్‌గుడ్ ఫిలింస్‌లో కో డైరక్టర్‌గా చేరాను. శుభాకాంక్షలు, శ్రీను, సూర్యవంశం, రాజా, నువ్వువస్తావని, నినే్న ప్రేమిస్తా, సింహరాశి, శివరామరాజు, సంక్రాంతి వంటి 16 చిత్రాలకు పనిచేశాక ఆయన నాకు సునీల్ హీరోగా అందాల రాముడు చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత తనీష్ హీరోగా మంచివాడు సినిమాకు కూడా దర్శకత్వం వహించాను. తాజాగా బ్యాంకాగ్ బ్రహ్మానందం చిత్రాన్ని చేశాను. దర్శకుడిగా ఇది నాకు మూడో సినిమా.
రాముడు సెంటిమెంట్: సంక్రాంతి సినిమా భద్రాచలంలో షూటింగ్ చేసే సమయంలో కో డైరక్టర్‌గా భద్రాచల రామయ్యతో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి నాకు రాముడు సెంటిమెంట్. అందాల రాముడు, మంచివాడు సినిమాల రిలీజ్ ముందు రామయ్యను దర్శించుకున్నాను. ఇపుడు మూడో చిత్రం బ్యాంకాగ్ బ్రహ్మానందం కోసం స్వామిని దర్శించుకునేందుకు వచ్చాను.