ఖమ్మం

దండకారణ్యంలో భద్రతా బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 1: ఆంధ్రా,తెలంగాణ, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాల జైత్రయాత్ర కొనసాగుతోంది. గత నెల 28న ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను అడుగడుగునా అడ్డుకుంటున్న భద్రతాబలగాలు సోమవారం సైతం వర్షాలను లెక్కచేయకుండా వాగులను దాటుకుంటూ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు వెళ్లి మరీ స్మారక స్తూపాలను కూల్చివేశారు. బస్తర్ ప్రాంతంలోని దుర్గ్‌కొందాల్ ప్రాంతంలో కోయలీబేడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుట్టకచ్చార్, మిర్చ్‌పారా, నయాపారా, గుట్టాకాల్ అటవీప్రాంతాల్లో మావోయిస్టులు నిర్మించిన రెండు స్మారక స్తూపాలను కూల్చివేశారు. అర్జున్ పద్దా, గణేశ్, రమ్‌శీలా, ప్రసాద్, సామ్‌బాయ్, అనితాల పేరిట మావోయిస్టులు ఈ స్తూపాలను నిర్మించారు. వీటిని బాంబ్‌స్వ్కాడ్‌లతో పరీక్షించి అనంతరం నేలకూల్చారు. కాగా గత నెల 30వ తేదీన సుక్మా జిల్లా గచ్చనపల్లి అటవీప్రాంతంలో 208 కోబ్రా బెటాలియన్‌కు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా ఒక జవాన్ మృతి చెందగా, మరో జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు కోసా, బుద్రా, ముక్కాలకు కూడా గాయాలైనట్లు సుక్మా పోలీసులు గుర్తించారు. వీరిని చికిత్స కోసం తీసుకొచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో గచ్చనపల్లి అటవీప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సార్కెగూడ-తరెమ్ గ్రామాల మధ్య మావోయిస్టులు అమర్చిన 8 కిలోల మందుపాతరను భద్రతాబలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. సుక్మా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని తులసీడొంగ్రీ అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మావోయిస్టులు భారీగా చనిపోయినట్లుగా పోలీసులు పేర్కొంటున్నప్పటికీ ధృవీకరణ కావడం లేదు.

గ్రామాల్లో రాజకీయ సందడి

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఆగస్టు 1: గ్రామాల్లో మరోసారి రాజకీయ సందడి నెలకొనబోతోంది. ఆయా గ్రామాల్లో ఉన్న రాజకీయ పార్టీలు పాఠశాలల్లో కూడా పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుండటంతో ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో కమిటీ పేరుతో ఆధిపత్యం చెలాయించేందుకు పార్టీల పెద్దలు తమ అనుచరులను రంగంలోకి దింపనున్నారు. ఆయా పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులే కమిటీలో ఉండాల్సి రావటంతో ఆ తరగతుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రుల్లో తమ అనుచరులను కమిటీలో ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కొక్క కమిటీలో 9మంది సభ్యులు ఉండనుండగా, మెంబర్ సెక్రటరిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా మండల విద్యాశాఖాధికారి ఉండనున్నారు. పాఠశాల అభివృద్ధి ఈ కమిటీ నిర్ణయాలపైనే ఆధారపడనుండటంతో ఎక్కువ మంది సభ్యులు తమ వారు ఉండేలా చూసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో ఉన్న అధికార పార్టీ నేతలు తమ అనుచరులను ఆ పదవిలో ఉంచేందుకు ప్రయత్నిస్తుండగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై అధికార పార్టీ మద్దతుదారులు కమిటీలోకి రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఆయా పార్టీల పెద్ద నాయకులు కూడా దృష్టి కేంద్రీకరించటం ఈ కమిటీల ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఈ నెలాఖరులోగా ముగియనుండటంతో అనేక గ్రామాల్లో ఎన్నికల వాతావరణమే నెలకొంటుండటం విశేషం.
లక్ష్యసాధనలో కొత్తగూడెం ముందంజ
* ఏరియా జనరల్ మేనేజర్ రమణమూర్తి
కొత్తగూడెం, ఆగస్టు 1: బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో కొత్తగూడెం ఏరియా సింగరేణి వ్యాప్తంగా ముందంజలో ఉందని ఏరియా జనరల్ మేనేజర్ రమణమూర్తి తెలిపారు. స్థానిక ఏరియా జిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై మాసం లక్ష్యం 5లక్షల 26వేల టన్నులు కాగా 5లక్షల 94వేల టన్నులను సాధించి 113శాతం ఉత్పాదకరేటును సాధించినట్లు తెవిపారు. పివికె-5ఇంక్లైన్ గనిలో జరిగిన ప్రమాదం కారణంగా జూలై మాసంలో 31వేల టన్నుల లక్ష్యానికి కేవలం 9వేల టన్నులు మాత్రమే సాధించి 29శాతం, వికె-7ఇంక్లైన్ గనిలో 55వేల ఉత్పత్తి లక్ష్యానికి 25వేల టన్నులు సాధించి 46శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా రెండుభూగర్భగనులు కలిపి 86వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 34వేల టన్నులు సాధించి 40శాతం మాత్రమే ఉత్పాదకరేటును సాధించినట్లు చెప్పారు. భూగర్భగనుల ఉత్పత్తి లోటును ఓపెన్‌కాస్టు గనులు తీర్చాయని పేర్కొన్నారు. జికెఓసి ఓపెన్‌కాస్టుగని ఉత్పత్తి లక్ష్యం లక్ష 84వేల టన్నులు కాగా 2లక్షల 15వేల టన్నులు సాధించి 117శాతం, జెవిఆర్ ఓపెన్‌కాస్టుగని ఉత్పత్తి లక్ష్యం 2లక్షల 56వేల టన్నులుకాగా 3లక్షల 45వేల టన్నులు సాధించి 135 శాతం ఉత్పాదకరేటును సాధించినట్లు తెలిపారు. రెండు ఓపెన్‌కాస్టుల ఉత్పత్తి లక్ష్యం 4లక్షల 40వేల టన్నులు కాగా 5లక్షల 60వేల టన్నులు సాధించి 127శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బొగ్గురవాణాలో కూడా జూలై మాసంలో 6.69లక్షల టన్నులు చేసి 127శాతంతో సింగరేణిలో ద్వితీయస్థానం సాధించినట్లు వివరించారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించిన అధికారులు, యూనియన్లు, కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు ఉత్పత్తే కాకుండా కార్మిక సంక్షేమానికి, సింగరేణి పరిసర ప్రాంత ప్రజానీకం స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌ఓటుజిఎం షాలెంరాజు, డిజిఎం (పర్సనల్) శ్రీనివాసరావు, అధికారులు వెంకటేశ్వర్లు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ పాలనపై తిరుగుబాటు తప్పదు
కొత్తగూడెం రూరల్, ఆగస్టు 1: అమరవీరుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ, దొరల తెలంగాణ, నిర్బంధాల తెలంగాణగా, బాధల తెలంగాణగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాబుక్యాంప్, పంజాబ్ గడ్డల సిపిఐ శాఖల నిర్మాణ మహాసభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబ నియంతృత్వపాలనపై ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మాటల గారడితో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కెసిఆర్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం పేరుతో యువతను దగాచేశారన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ళ పేరుతో పేదలను వంచించారని, దళిత గిరిజనులకు మూడు ఎకరాల భూమిపేరుతో ముంచేశారని దుయ్యబట్టారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ పేరుతో కర్రుకాల్చారని, అన్ని వర్గాల ప్రజలను నట్టేటా ముంచుతూ బడా కార్పొరేట్ శక్తులకు రెడ్‌కార్పెట్ పరుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవచూపని తెలంగాణ ప్రభుత్వంపై, కెసిఆర్‌పై ప్రజలు తిరుగుబాటు చేయకతప్పదని పిలుపునిచ్చారు. ఈసభలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్‌పాషాలు ప్రసంగించగా నాయకులు బరిగెల సాయిలు, మండె వీరహనుమంతరావు, బందెల నర్సయ్య, దుర్గరాశి వెంకన్న, కూసన వీరభద్రయ్య, వై శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, దుర్గరాశి లక్ష్మి, లక్ష్మిగోవింద్, రంగారావు, జమలయ్య, దాదా, నగేష్, వెంకన్న, గోవిందు, రామారావు పాల్గొన్నారు.

ఖరీఫ్... కష్టమే
* వర్షాలు లేక ఎదగని పంటలు
* చుక్క నీళ్ళులేని 38 చెరువులు
చింతకాని, ఆగస్టు 1: వర్షాలు సరిగా పడకపోవడంతో పరిస్థితి తారుమారై వేసిన పంటలు ఎదుగుదల లేక వెలవెల బోతున్నాయి. తొలి ఏకాదశి పండుగ నాటికి వర్షాలు పడి మండలంలోని 39 చెరువులు నిండుకుండలా ఉండేవి. పంటలు ఏపుగా పెరిగి, వ్యవసాయదారులు, కూలీలు వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉండేవారు. పరిస్థితి తారుమారైంది. జూలై నెల ముగుస్తున్నా ఇంతవరకు మండలంలోని ఓక్క చెరువు కూడా నిండకపోవడం గమనార్హం. వర్షాలు లేక ఎండుతున్న పంటలు ఓకవైపు, తెగుళ్ళు, లద్దెపురుగు దాటికి పంటలు నాశనమవుతున్నాయి. మండలంలో 12 వేల ఎకరాలలో పంటలు సాగుచేశారు. 8 వేల ఎకరాలలో ప్రత్తి, 2 వే ఎకరాలలో పెసర, 1,800 ఎకరాలలో మొక్కజొన్న పంటలు సాగుచేశారు. వర్షాలు సరిగా పడకపోవడంతో పాటు మధ్యాహ్నం వాతావరణ వేసివి కాలాన్ని తలపిస్తుండడంతో తెగుళ్ళు తాండవిస్తున్నాయి. ముఖ్యంగా పెసర పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పందిళ్ళపల్లి, నాగులవంచ, నెరడ, చింతకాని, వందనం, కొదుమూరు, సీతంపేట, చిన్నమండవ, బొప్పారం, రామకృష్ణాపురం గ్రామాలలో పెసర, ప్రత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. మండలంలోని వివిద గ్రామాలలో 39 చెరువులు ఉన్నాయి. ఓక్క చింతకాని చెరువు మినహ 38 చెరువులలో చుక్క నీరు లేదు. వర్షాలు పడకపోవడం, చెరువులు ఎండిపోవడంతో బోరు బావులు, బావులు అడుగంటాయి. భూగర్భజలాలు కంటిచూపు మేర కానరావడంలేదు. విద్యుత్ ఉన్నా పంటకు నీళ్ళు వేసుకోలేని స్థితి రైతుకేర్పడింది. ఏసిన పంటలను కాపాడుకోవడంకోసం బిందెలతో నీళ్ళు పోసే అవకాశం కూడా లేకుండాపోయింది. వర్షాలకోసం రైతులు వివిద రూపాలలో ఫూజలు నిర్వహిస్తుండడం గమనార్హం. మరో పదిరోజలు వర్షాలు పడకపోతే ఫంటలు ఎండిపోవడంతోపాటు పశువులు, గ్రామాలలో ప్రజలుకు నీటి ఎద్దడి ప్రామాదం పొంచిఉన్నది. కోటి ఆశలతో ఖరీఫ్ ప్రారంబించిన రైతుకు ఎండుతున్న పంటలతో అప్పుల భారం వెక్కరిస్తుండడంతో మండల రైతాంగం ఆందోళనలో ఉన్నారు. ఖరీఫ్ సాగు కష్టంగా మారిందని అన్నదాతలు నిరాశచెందుతున్నారు.

స్వచ్ఛందంగా రహదారిపై గోతులు పూడ్చిన ఆటోడ్రైవర్లు

కల్లూరు, ఆగస్టు 1: సమస్యలను గుర్తించి పరిష్కారం చేయాల్సిన అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో విసుగెత్తిన ఆటోడ్రైవర్లు రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న గోతులను ఆదివారం ఆటోలలో మట్టి తరలించి పూడ్చుతున్నారు. మండల పరిధిలోని రఘునాథబంజర, చండ్రుపట్ల గ్రామాలకు ఆటో సర్వీసులు చేసే డ్రైవర్లు ఏకమై రహదారిపై గోతులన్నీ పూడ్చివేసి అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు జానపాటి వీరస్వామి, పర్సా వెంకటేశ్వరరావు, పి అశోక్ మాట్లాడుతూ తాము ఉదయం, సాయంకాల సమయాలలో విద్యార్థులతో ఆటోలలో ప్రయాణిస్తుంటామని అన్నారు. ఈ రెండు గ్రామాల నుండి విద్యార్థులను ఆటోలలో పాఠశాలలకు తరలించేటప్పుడు రహదారిపై గోతుల కారణంగా ఆటోలు కుదుపులకు గురై ప్రయాణీకులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. దీంతో విద్యార్థులకు, ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తామే గోతులను పూడ్చి వేసే పనులు జరుపుతున్నట్లు తెలిపారు. అంతే కాక రోడ్లపై గోతులలో వరదనీరు నిల్వ ఉండటంతో గోతుల లోతు తెలియటం లేదని, గోతులలో నిల్వ ఉన్న నీరు ఆటోలలో ప్రయాణించే విద్యార్థుల మీద, వారి బ్యాగుల మీద పడుతున్నాయన్నారు. రహదారులపై ఏర్పడిన గోతుల గురించి ఎన్ని సార్లు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంతో గత్యంతరం లేక తామే పనులు జరుపుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా వేలాది మంది విద్యార్థులు స్థానిక చండ్రుపట్ల రోడ్డులోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఈ ప్రధాన రహదారిపై డంపింగ్ చెత్త విచ్చల విడిగా వేయటంతో దుర్వాసన వెలువడుతుంది. ముళ్ల చెట్లతో రహదారి ఇరుకుగా మారి వాహనాదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్లూరు నుండి చండ్రుపట్ల వరకు ఉన్న ప్రధాన రహదారిని విస్తరించి మరమ్మత్తులు జరిపించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఎంసెట్-2 లీకేజి

ఖమ్మం(మామిళ్ళగూడెం), అగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఎంసెట్-2 లీకేజి అయిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి హరికృష్ణ ఆరోపించారు. సోమవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం పాంహౌస్‌లో కూర్చోని పాలన సాగిస్తూ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు.
కెసిఆర్ ప్రభుత్వం లక్ష మంది విద్యార్థుల జీవితాలతో చలగాటం అడుతున్నారన్నారు. లీకేజిపై నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సిఎం రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి కారుకులైన వారందరిని విచారించి కఠినంగా శిక్షించాలన్నారు. గతంలో ఇంటర్, ఎస్‌ఎస్‌సి బోర్డులకు ప్రశ్నాప్రతాలను అందించిన మ్యాగ్నెటిక్ ఇన్‌పోటెక్ సంస్థ అనర్హులని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ప్రశ్నాపత్రం రూపొందించడానికి ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ఆ సంస్థపై నేటికి విచారణకు ఆదేశాలు ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సమస్యలను పరిష్కరించకపోగా ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని ఆరోపించారు. ఎంసెట్-2ను రద్దు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం తదుపరి పరీక్షపై నేటికి షెడ్యూల్ విడుదల చేయలేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయం ప్రకటించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి సుమంత్, బిసిసెల్ అధ్యక్షుడు గొడ్డేటి మాధవరావు, శీలం ఉపేందర్, వాకదాని కోటేశ్వరరావు, అకారపు శ్రీనివాసరావు తదిరతులు పాల్గొన్నారు.

పేదల హక్కుల కోసం పోరాడిన ధన్యజీవి కృష్ణమూర్తి

ఖమ్మం(కల్చరల్), ఆగస్టు 1: తన జీవితంలో తెలంగాణ ప్రాంతంలో జమీందారీ, జాగీర్దారి విధానాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పేదల హక్కుల కోసం నిత్యం పోరాడిన ధన్యజీవి కృష్ణమూర్తి అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కొనియాడారు. తెలంగాణ పోరాట యోధుడు అమరజీవి కె కృష్ణమూర్తి 10 వర్ధంతి స్థానిక సంఘ కార్యాలయంలో జరిగింది. తొలుత ఆయన చిత్ర పటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె నర్సయ్య పూలమాల వేసి నివాళ్ళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మచ్చా మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘంలో సాధారణ కార్యకర్త స్ధాయి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి వరకు వివిధ బాధ్యతలు నిర్వర్తించారన్నారు. ఆనాడు తెలంగాణలో ఎలాంటి నిర్భందాలకు వ్యతిరేకంగా పోరాడి సాదించుకున్నామో నేటి పాలకులు వాటి కాలరాసి ప్రజా హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదోక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ళ కెసిఆర్ పాలనలో పేదలకు ఎటువంటి అభ్యున్నతి కల్పించకపోగా, అనేక సంవత్సరాలుగా పేదల సాగులో ఉన్న భూములను హరితహారం, ఫ్యాక్టరీలు, ప్రాజెక్టుల పేరుతో బలవంతంగా లాక్కోవడం, ప్రశ్నించే వాళ్ళను బెదిరించి జైళ్ళకు పంపడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. భూ నిర్వాసితులకు భారీ నష్టం వాటిల్లే 123 జీవోను తెచ్చిందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.ప్రజా ఉద్యమాల నిర్మాణమే కృష్ణమూర్తికి అర్పించే ఘనమైన నివాళిగా పేర్కోన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు అన్నవరపు కనకయ్య, పి సంగయ్య, బందెల వెం కయ్య, నండ్రా ప్రసాద్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, బొగ్గారాపు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి
* మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బండి మణి
ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 1: ఎంసెట్-2 లీకేజికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి సంబంధిత శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బండి మణి డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఎంసెట్-2 పరీక్షాపత్రం లీకైందన్న పేరుతో పరీక్షలు రద్దు చేయడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక వ్యయప్రయాసలకోర్చి విద్యార్థులను చదివించుకున్నారని, తీరా పరీక్షలు రాసిన తర్వాత రద్దు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తప్పు చేసింది ఒకరైతే శిక్ష వేరొకరికి అన్న చందంలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. పేపర్ లీకేజికి కారకులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో ఝాన్సీరాణి, తోట దమయంతి, నారాయణమ్మ, ఇందిర, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
హరితహారంలో ఖమ్మం కార్పొరేషన్‌కు ప్రోత్సాహకాలు
ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 1: రాష్ట్రం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ విజయవంతమైనందుకు గానూ మేయర్ పాపాలాల్ యాబైవేల రూపాయలు, డిప్యూటీ మేయర్ 25వేల రూపాయలను ప్రోత్సహక బహుమతులను అందుకున్నారు. సోమవారం కరీంనగర్‌లో జరిగిన హరితహారం సమీక్షా సమావేశంలో రాష్టమ్రంత్రి కె తారకరామారావు ఖమ్మం మేయర్‌ను అభినందించి యాబైవేల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఆర్జేసి విద్యార్థులకు జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్
ఖానాపురం హవేలి, ఆగస్టు 1: ఇటీవల ఉత్తర్ఖాండ్ రాష్ట్రంలో జరిగిన 3వ ఓలంపిక్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2016-17లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు గోల్డ్‌మెడల్ సాధించారని ఆర్జెసి కళాశాల చైర్మన్ కృష్ణ పేర్కొన్నారు. సోమవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన విద్యార్థులు భరత్, మేఘన్‌లు జాతీయ స్థాయిలో గెలుపొందటం అభినందనీయమన్నారు. మున్ముందు మరిన్ని పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ లింగయ్య, పిడి లక్ష్మణ్ విద్యార్థులను అభినందించారు.