ఖమ్మం

మన్యాన్ని వీడని ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 4: మన్యాన్ని ముసురు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా ఒకటే వాన. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారి స్తంభించింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. పాలెం, తాలిపేరు ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి 21వేల 500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. పొంగిన వాగులు, ఉపనదుల నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదకరం కానప్పటికీ పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తులు వరద నీటితో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
33.02 అడుగులకు వరద: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.02 అడుగులకు చేరుకుంది. బుధవార అర్థరాత్రి వేళ 30 అడుగులు వున్న వరద గురువారం తెల్లవారుఝామున 30.09 అడుగులు, ఉదయం 6 గంటలకు 31.08, 10గంటలకు 32, మధ్యాహ్నం 12 గంటలకు 33, సాయంత్రం 3 గంటలకు 33.02 అడుగులకు చేరుకుంది. గడిచిన నాలుగు రోజులుగా భద్రాచలం మన్యంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆగస్టు 1వ తేదీన వాజేడు మండలంలో 14.6మి.మీలు, వెంకటాపురంలో 3.4 మి.మీల వర్షపాతం నమోదైంది. 2వ తేదీన వాజేడులో 7.2మి.మీలు, వెంకటాపురంలో 6.6మి.మీలు, చర్లలో 17.2, దుమ్ముగూడెంలో 28.6,్భద్రాచలంలో 12.2 మి.మీలు కురిసింది. 3వ తేదీన వాజేడులో 25.4, వెంకటాపురంలో 13.6, చర్లలో 21.4, దుమ్ముగూడెంలో 27.2, భద్రాచలంలో 35.2 మి.మీలు వర్షపాతం నమోదైంది. ఇక గురువారం మాత్రం కుంభవృష్టిని తలపించింది. వాజేడులో అత్యధికంగా 139.2.మి.మీలు, వెంకటాపురంలో 109.4, చర్లలో 70.2, దుమ్ముగూడెంలో 94.2, భద్రాచలంలో 33.4 మి.మీలు నమోదైంది. తాలిపేరుతో సహా గుండ్లవాగు, పాలెం, కంకలవాగు, బల్లకట్టు, టపా వాగు, తూరుబాక వాగులు ప్రమాదకరస్థాయిలో పొంగిప్రవహిస్తున్నాయి.

ముమ్మరంగా వరినాట్లు
ముసురు నేపథ్యంలో అన్నదాతలు వరినాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు కింద 22వేల ఎకరాల్లో, వర్షాధారంతో వాజేడులో 20వేలు, వెంకటాపురంలో 18వేలు, దుమ్ముగూడెంలో 5వేలు ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అయితే పత్తి చేలల్లో నిలిచిన నీటిని తొలగించే ప్రక్రియకు రైతులు శ్రీకారం చుట్టారు. కుండపోత కారణంగా పత్తి చేలల్లో భారీగా నీరు నిలిచింది.

భర్త సాహసం.. నీటితో పోరాటం
* గిరిజన గర్భిణి అవస్థలు
* ప్రాణాలకు తెగించి వాగు దాటించిన యువకులు
* ఆటోలోనే ప్రసవం
* 108 వైద్యసిబ్బంది చొరవతో తల్లీబిడ్డలు క్షేమం
దుమ్ముగూడెం, ఆగస్టు 4: మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామం పైడాగులమడుగు గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళ పురిటినొప్పులతో బాధపడుతూ వాగులు దాటి ఎట్టకేలకు 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పైడాగులమడుగు గ్రామానికి చెందిన గొంది లక్ష్మీ అనే గర్భిణికి బుధవారం అర్థరాత్రి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఆ గ్రామానికి చెందిన ఆశావర్కర్లు, కుటుంబ సభ్యులు కలిసి ఆటో ద్వారా పర్ణశాల పీహెచ్‌సీకి బయలుదేరారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కె.లక్ష్మీపురం, చింతగుప్ప గ్రామాల మధ్య ఉన్న చప్టా వద్ద వర్షపునీరుతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వారు ఎట్టకేలకు కె లక్ష్మీపురం చేరుకున్నారు. అయితే ఎంతసేపటికి వాగు ఉధృతి తగ్గకపోవడంతో వారు స్థానిక ఎఎన్‌ఎం పార్వతికి, 108కి సమాచారం అందించారు. వైద్య సిబ్బంది పార్వతి, హెల్త్‌అసిస్టెంట్ రాంప్రసాద్ హుటాహుటీన కె.లక్ష్మీపురం చేరుకున్నారు. 108 వాహనం కూడా అక్కడకు వచ్చింది. వాగు అవతల ఉన్న గర్భిణి ఇవతల ఒడ్డుకు రావడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో సుమారు గంటపాటు అక్కడే పురిటినొప్పులతో వేదనకు గురయింది. నొప్పులు పెరిగి ఆమె ఆటోలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతసేపటికి ఆమెకు ఫిట్స్ రాగా స్థానికులు కంగారు పడ్డారు. ఆలోచించకుండా భర్త శ్రీరాములు, పైడాకులమడుగు యువకులతో కలిసి ఒక రోప్‌ను అవతలి ఒడ్డు వరకు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ ట్యూబ్‌లో గాలి నింపి దానిపై బాలింతను పడుకోబెట్టి యువకులు నీటిలోనే మునుగుతూ ఆ ట్యూబ్‌ను వాగు అవతల ఉన్న 108 వద్దకు చేర్చారు. ఒకానొక దశలో అక్కడ ఉన్నవారికి ఆ ప్రవాహ ఉధృతికి వాగు దాటిస్తున్న యువకులు నీటిలో గల్లంతవుతారనే భయం ఏర్పడింది. ఎట్టకేలకు వాగు దాటడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న 108కు పర్ణశాల సిబ్బంది తల్లిబిడ్డను ఎక్కించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
వాగులపై బ్రిడ్జి నిర్మించాలి
వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకు కె.లక్ష్మీపురం, చింతగుప్ప గ్రామాల మధ్య చఫ్టాలపై వరద నీరు చేరి మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోతున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ వాగులపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరుకుంటున్నారు. వర్షాకాలం మూడు నెలలు నిత్యవసర వస్తువులకు, మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని, సకాలంలో వైద్యం అందక కూడా మృత్యువాత పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

9వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్ కోర్సులు
* సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి ప్రవీణ్, జెసి దివ్య
ఖానాపురం హవేలి, ఆగస్టు 4: 9వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్ కోర్సులు ప్రవేశపెట్టినట్లు, సంవత్సరానికి 320మంది విద్యార్థులను సివిల్ సర్వీస్ కోర్సులు కోసం తీసుకుంటున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కార్యాలయాన్ని జెసి దివ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమన్వయ కార్యాలయాలను బలోపేతం చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలల ఇంజనీరింగ్ పనులకు 3,500కోట్లను రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసి, జాతీజాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐఐటి, ఎన్‌ఐటిలో ప్రావీణ్యం కలిగిన వారిచే స్కైప్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ దివ్య మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు పాఠశాలల్లో నీడనిచ్చే మొక్కలతో పాటు వసతిగృహాలకు ఉపయోగకరమైన మొక్కలను కూడా నాటాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ట్రీ గార్డ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ దివ్య, గురుకుల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ భేటి అయ్యారు. జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు, పౌర సరఫరాలు, హరితహారం, గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గురుకుల విద్యాలయాలను అనుసంధానం చేయబడిన నెట్‌వర్క్ ద్వారా ఆయా విద్యాసంస్థల దృశ్యాలను సమన్వయ అధికారి కార్యాలయం నుంచి పరిశీలించారు. తొలుత కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల్లో జిల్లా సమన్వయకర్త భరత్‌బాబు, సహాయ సమన్వయకర్త వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు నాగరాజు, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

పోడు భూములపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం (ఖిల్లా), ఆగస్టు 4: పోడు భూముల్లో చేతికొచ్చిన పంటల విధ్వంసాన్ని సమర్ధించుకోవడానికి టిఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి పోటు రంగారావు తీవ్రంగా ఖండించారు. గురువారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము, ఇతర వామపక్ష నేతలు పోడుదారులు, పేదల తరుపున నిలబడి పోరాడుతున్న దానిని సహించలేని బేగ్ తప్పుడు ఆరోపణలకు దిగుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వివిధ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు నేడు అధికార పార్టీలో చేరింది వారు ఆక్రమించిన భూములను కాపాడుకునేందుకేనని వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ నేత లక్కినేని సురేందర్ 50ఎకరాలు, ఏలూరి కోటేశ్వరరావు 30ఎకరాలు, గంధం బుచ్చిరెడ్డి వంద ఎకరాల పోడు భూములను అనుభవిస్తున్నారన్నారు. ఇల్లెందు, దమ్మపేట లాంటి అనేక మండలాల్లో ఇటువంటి ఆక్రమణలు అనేకం ఉన్నాయన్నారు. వీటన్నింటిని బహిరంగంగా చర్చించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. బతుకుదెరువు కోసం పోడుభూముల్లో సాగు చేసుకుంటూ జీవిస్తున్న పోడుదారులపై తప్పుదారి పట్టించేందుకు బేగ్‌లాంటి వారు తప్పుడు మార్గాలు అనుసరించడం సరైందికాదన్నారు. అడవిలో సాగుచేసుకొని బ్రతికే పేదలపై పిడి యాక్ట్ పెడతానని బెదిరించడం అమానుషమన్నారు. 123జివొను హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పోడు సమస్యలు పరిష్కరం అయ్యేంత వరకు వారికి అండగా ఉంటామన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు రాయల చంద్రశేఖర్‌రావు, ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, సివై పుల్లయ్య, ఎ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టిడిపికి లేదు
* జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
మధిర, ఆగస్టు 4: దశాబ్దాలుగా వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టిడిపికి లేదని జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత తెలిపారు. టిఆర్‌ఎస్ నాయకులు మల్లాది వాసు గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని టిడిపి నాయకులు విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 33శాతం ఉండాల్సిన అడవులు 24శాతానికి పడిపోయాయని, దీంతో కాలుష్యం పెరిగిపోయి సకాలంలో వర్షం కురవడం లేదన్నారు. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఎంసెట్ లీకేజి విషయంలో ప్రభుత్వం నిస్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించడంతో పాటు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తుందన్నారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, పార్టీ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, చీదిరాల వెంకటేశ్వర్లు, దేవిశెట్టి రంగారావు, చుంచు విజయ్, మొండితోక సుధాకర్, గడ్డం భద్రయ్య, దేవిశెట్టి రంగారావు, వాసు తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్ పనులకు రూ. 3,500కోట్లు
ఖానాపురం హవేలి, ఆగస్టు 4: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలల ఇంజనీరింగ్ పనులకు రాష్ట్రంలో 3,500కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐఐటి, ఎన్‌ఐటిలో ప్రావీణ్యం కలిగిన వారిచే స్కైప్ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 9వ తరగతి నుంచే సివిల్స్‌కు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని, అందులో ఏడాదికి 320మందిని మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ సూపర్ విద్యార్థులతో కింది స్థాయి విద్యార్థులకు విద్యాబోధన చేయిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న 2,444పోస్టుల భర్తీకై ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్ జారీ కానుందన్నారు.

గిరిజన విద్యార్థుల సమస్యల
సాధనకు ఉద్యమిద్దాం
* ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్
ఖమ్మం (కల్చరల్), ఆగస్టు 4: రాష్ట్రం లో గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాలే శరణ్యమని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ శ్రీకాంత్‌నాయక్ తెలిపారు. నగరంలో స్థానిక ఎస్‌ఎంహెచ్‌లో గిరిజన విద్యార్థుల సమస్యలపై గురువారం జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు చెందిన అన్ని హాస్టల్స్‌లో రేషన్ బియ్యాన్ని పాలీష్ చేయించి పెడుతున్నారని ఆరోపించారు. 2013వ సంవత్సరంలో అమలులో ఉన్న కాస్మోటిక్ చార్జీలనే నేటికి అమలు చేయడం దారుణమన్నారు. పెరిగిన నిత్యావరస వస్తువుల ధరలకు అనుగుణంగా చార్చిలను సవరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్‌లో సరైన వసతులు లేక అనేక ఇబ్బందుల నడుమ చదువు సాగడం లేదని తెలిపారు. కనీస అవసరమైన త్రాగునీరు లేక విద్యార్థులు అనారోగ్యానికి గురౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న వార్డెన్, ఇతర పోస్టులను వెంటనే భర్తీచేయాన్నారు.

ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వద్దు

సత్తుపల్లి, ఆగస్టు 4: ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక దృష్టిసారించి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపిపి జ్యేష్ఠ అప్పారావు అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని నెరవేర్చాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వసభ్య సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరవుతున్నారని, మరికొన్ని శాఖల అధికారులు వారు రాకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా యాతాలకుంట ఎంపిటిసి సభ్యుడు మోదుగు పుల్లారావు మాట్లాడుతూ యాతాలకుంట, రేగళ్ళపాడు రహదారిపై విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు అధికారులు క్షుణంగా పరిశీలించి సరిచేయాలని, అదే విధంగా పశువులు తమ గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని, అయినప్పటికి పశువైద్యాధికారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంగారం పిహెచ్‌సి వైద్యాధికారిణి ప్రశాంతి మాట్లాడుతూ తమ పిహెచ్‌సి కేంద్రంలో బోరు లేకపోవడంతో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని, నీటి కొరత వల్ల ఆపరేషన్లు కూడా వాయిదా వేయాల్సి వస్తుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈవోఆర్‌డి అశోక్ మాట్లాడుతూ గ్రామపంచాయితీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచ్‌లకు సూచించారు. సమావేశంలో ఎంపిడిఓ నల్లబోతుల రవి, తహశీల్దార్ దొడ్డా పుల్లయ్య, ఫారెస్ట్ రేంజర్ నాగసాయిప్రసాద్, సిడిపిఓ కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.

బేగ్ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం(జమ్మిబండ), ఆగస్టు 4: రాష్ట్రంలో గిరిజనులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. హరితహారం పేరుతో చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తూ పోడుదారులపై అక్రమ కేసులు బణాయిస్తూ జేళ్ళకు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళుగా పోడుభూముల్లో సాగుచేసుకుంటూ జీవిస్తున్న పోడుదారులను భయబ్రాంతులకు గురిచేస్తూ వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోందని దుయ్యబట్టారు. పోడు భూములపై టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ చేసిన ఆరోపణలన్నింటిపై బహిరంగ చర్చకు సిద్ధమని, వారు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గిరిజనేతర తమ పార్టీకి చెందిన వారెవరైనా పోడు ఆక్రమించినట్లు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అటవిని దున్ని సాగు చేస్తున్నది టిఆర్‌ఎస్ నాయకులేనని, ధైర్యముంటే చర్చకు తీసుకురావాలన్నారు. గిరిజన సంక్షేమమంటూ ప్రకటనలు చేస్తూ మరోపక్క అధికారులతో పంటలను ధ్వంసం చేయిస్తున్న టిఆర్‌ఎస్ ద్వంద్వనీతి బహిర్గతమైందన్నారు. ప్రభుత్వ భూమినుంచి గిరిజనులను తరిమేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 2005కు ముందు గుర్తించిన 80వేల ఎకరాలకు హక్కుపత్రాలిప్పించి గిరిజనుల పట్ల టిఆర్‌ఎస్ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జితేందర్‌రెడ్డి, నర్సింహరావు, నాయకులు రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.