కర్నూల్

ఎంపి ల్యాడ్స్, నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 25: ఎంపి ల్యాడ్స్, నియోజకవర్గ అభివృద్ది పనుల కింద మంజూరైన వివిధ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ భవనంలో పంచాయితీరాజ్ రహదారులు, తాగునీటి పథకాలు, ఎత్తిపోతల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసిన సిసిరోడ్ల నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పంచాయితీరాజ్ ఎస్‌ఇ సుబ్బరాయుడును ఆదేశించారు. ఎంపి ల్యాడ్స్, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, జిల్లా పరిషత్, గ్రామ పంచాయితీ నిధుల అనుసంధానంతో చేపట్టిన పనులన్నీ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్నాయని, ఇక నుండి క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తామన్నారు. పంచాయితీ రాహదారులకు సంబంధించి డివిజన్‌లోని ప్రతి ఎగ్గిక్యూటివ్ ఇంజినీరుకు ప్రతి రోజు 2 కి.మీ లక్ష్యాన్ని నిర్దేశించి ఆ మేరకు పనులు చేయించాలని ఆదేశించారు. రూ.33 కోట్లతో చేపట్టిన 561 పనుల ప్రగతి నత్తనడకన ఉందని, వాటిని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండలంలో ఎఇల వారీగా నివేదికలు అందజేయాలన్నారు. తాగునీటి పథకాల పనితీరు అసంతృప్తిగా ఉందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. రెండు సంవత్సరాల నుండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన స్కీములు ఒక్కటి పూర్తి చేయలేదని ఎపిఎస్‌ఐడిసి ఇఇ రెడ్డిశంకర్‌ను ప్రశ్నించారు. స్కీంల వారీగా పనులన్నింటిని పర్యవేక్షిస్తానని నివేదికలు సిద్దంగా పుంచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రణాళికశాఖ జెడి ఆనందనాయక్, డ్వామా పిడి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెరల్స్ ఇండియా బీమా కంపెనీ
కుచ్చుటోపీ!
చిప్పగిరి, జూన్ 25: ఎన్నో మాయమాటలు చెప్పి డిపాజిట్లు సేకరించిన పెరల్స్ ఇండియా బీమ కంపెని తమకు కుచ్చుటోపీ పెట్టిందని మండలంలోని పాలసీదారులు శనివారం లబోదిబోమన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో చాలా మంది పాలసీదారులు దాదాపు రూ.50 లక్షలకు పైగా ఇన్సూరెన్స్ పేరిట పెరల్స్ సంస్థలో డబ్బు కట్టినట్లు సమాచారం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తమ బీమా కంపెనీలో డబ్బులు కట్టుకున్న పాలసీదారులకు పూర్తి భద్రత కోసం జైపూర్‌లో స్థలాలు రిజిస్ట్రార్ చేస్తామని, తమది ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ అని, ఇదివరలో ఇండియా రాయబారి అబిద్ హుస్సేన్, కర్నాటక సాంఘిక శాఖ మంత్రి బి శివన్న, నేపాల్ మాజీ ప్రధాని పి భట్టారాయ్ గుర్తింపు అవార్డులు ఇచ్చారని తెలిపారు. ఇలా నమ్మకంకలిగే విధంగా విస్తృత ప్రచారం చేశారని, తిరిగి డబ్బులు ఇచ్చేటపుడు తమకు అన్యాయం చేసిందని, అనేక మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకున్న పిఎసిఎల్ ఇండియా కంపెనీ తమను నిలువునా ముంచిందని డిపాజిట్‌దారులు రాజేశ్వరి, శోభా తదితరులు వాపోయారు. 60నెలల పాటు డబ్బులు చెల్లించిన తమకు జూన్ మెదటి వారంలో తిరిగి డబ్బులు ఇస్తామని, కర్నూలు కంపెనీ ఉన్నట్లు గుర్తింపు రశీదు ఇచ్చారని, దానిని తీసుకుని కర్నూలులోని మార్కెట్ కమిటీ ఎదుట పిఎసిఎల్ ఇండియా కర్నూలు ఉపకార్యాలయం వద్దకు వెళ్తే అక్కడ కార్యాలయం మూసివేశారని, అధికార సిబ్బంది మాయం అయ్యారన్నారు. తమకు డబ్బు ఇచ్చే విషయమై చెప్పే నాథుడేలేరని పాలసీదారులు వాపోయారు. 10 సంవత్సరాలుగా ఆ సంస్థలో బీమా పాలసీలలో అనేకమంది డబ్బులు కట్టినట్లు డిపాజిట్‌దారులు తెలిపారు. మండలంలో 2008 సంవత్సరం నుండి పె రల్స్ ఇండియా బీమా కంపెనీ డబ్బు లు కట్టించుకుందన్నారు. కనీసం పో న్ చేద్దామన్నా వారు ఇచ్చిన లాండ్ ఫోన్‌కూడా పని చేయలేదని బాధితు లు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అమృత్‌తో నంద్యాలకు మహర్దశ
నంద్యాల, జూన్ 25: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద నంద్యాల పట్టణానికి తొలి ఏడాది రూ.23.04 కోట్లు విడుదల అయ్యాయని, ఈ నిధులతో వౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టబోయే పనులకు శిలాఫలకాన్ని చైర్‌పర్సన్ దేశం సులోచనతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమృత్ పథకం కింద నంద్యాల ఎంపిక కావడం మన అదృష్టమన్నారు. జిల్లాలో నంద్యాల, ఆదోని, కర్నూలు నగరాలు అమృత్ పథకం కింద ఎంపికయ్యాయని తెలిపారు. అమృత్ పథకం 2015 నుంచి 2020 వరకు ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని, అమృత్ పథకం కింద ఎంపికైన పురపాలక సంఘాలు ఆ పథకం కింద విడుదలైన నిధులను సద్వినియోగం చేసుకోవడాన్ని బట్టి మరుసటి ఏడాది నిధులు పెరుగుతాయన్నారు. నంద్యాల పట్టణ ప్రజలు ఈ ఏడాది తీవ్రమైన తాగునీటిని ఎద్దడిని ఎదుర్కొన్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు అమృత్ పథకం కింద నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇప్పటికే పురపాలక సంఘం అమృత్ పథకం కింద విబిఆర్ నుంచి నంద్యాల ఎస్‌ఎస్ ట్యాంకుకు తాగునీటిని తరలించేందుకు ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే పట్టణంలో 22.5 కి.మీల పొడవునా తాగునీటి కోసం కొత్త పైపులైన్ల ఏర్పాటుకు, 2.5 ఎకరాల స్తలంలో పార్కు నిర్మాణానికి కూడా ప్రతిపాధనలు పంపామన్నారు. ఈ ఏడాది విడుదలైన రూ.23.04 కోట్లతో పైపులైన్ నిర్మాణ పనులతో పాటు, రూ.50 లక్షల ఖర్చుతో పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. పైపులైన్ నిర్మాణంతోపాటు పట్టణంలో మరో నాలుగు చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తారన్నారు. అదేవిధంగా పేదలందరికీ కొళాయి కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల పట్టణ ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల్లో 10 వేల ఇళ్ల నిర్మాణాన్ని దుబాయి కంపెనీతో త్వరలో చేపట్టబోతున్నట్లు తెలిపారు. అలాగే నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈసమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్ హబ్‌గా కర్నూలు
కర్నూలు అర్బన్, జూన్ 25: కర్నూలు నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్ది దేశంలోనే ఆదర్శ పట్టణంగా మారుస్తామని రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్ అన్నారు. నగరంలోని స్టేడియంలో శనివారం జరిగిన ఒలింపిక్ డే రన్‌లో ఆయన ప్రసంగిస్తూ క్రీడాకారులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరు ఈ రన్‌లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం చైర్మెన్ కెఇ.ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సాహించాల్సిన బాధ్యత పిఇటిలపై వుందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో మనుషులందరినీ కలిపిందుకు ఒలింపిక్ రన్ దోహదం చేస్తోందన్నారు. పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సాహించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. తొలుత జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో స్టేడియం నుంచి ప్రారంభమైన ఒలింపిక్ డే రన్‌ను ఎస్పీ ఆకె రవికృష్ణ, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పి.విజయకుమార్, డిఎస్‌డివో సత్యనారాయణ, ఎపిఎస్పీ క్యాంపు వద్ద రెండో బెటాలియన్ కమాండెంట్ విజయకుమార్, కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, బి.క్యాంపు వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, 1వ పట్టణ పోలీసుస్టేషన్ వద్ద రాష్ట్ర ఒలింపిక్ సంఘం చైర్మెన్ కెఇ.ప్రభాకర్ ఒలింపిక్ కాగడాలతో రన్‌ను ప్రారంభించారు. ఐదు సెంటర్ల నుండి ప్రారంభమైన రన్ రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుండి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియం చేరుకుంది. ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కెడిసిసి బ్యాంకు చైర్మెన్ మల్లికార్జునరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు, పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి
దేవనకొండ, జూన్ 25: గ్రామసీమలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. శనివారం తన దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళలో పాఠశాల విద్యార్థులకు వసుధ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తకాలను ఎస్పీ అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశానికి పట్టు కొమ్మలు గ్రామ సీమలేనని అన్నారు. కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. విద్యార్థులు మంచి ఆలోచనతో ముందుకు పోవాలన్నారు. పరీక్షలు రాసే ముందు విద్యార్థులు ప్రాణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కొత్తగా నియమించుబోయే ఉద్యోగాల్లో కప్పట్రాళ్ళ విద్యావంతులు మంచి ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు పొందాలన్నారు. కప్పట్రాళ్ళ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు అగ్రికల్చర్ డిప్లమాకు ఎంపిక కావడంపై వారిని ఎస్పీ అభినందించారు. గత ఏడాది 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సాయిలీల, రవికుమార్‌లకు వసుధ ఫౌండేషన్ వారు రూ.5వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ సభ్యులు రమణకుమార్, శ్రీకాంత్, పత్తికొండ సిఐ విక్రమసింహ, ప్రధానోపాధ్యాయులు రామరాజు, ఆస్పరి జడ్పీటీసీ బొజ్జమ్మ, కప్పట్రాళ్ళ ఎంపిటిసి హైమావతి, దేవనకొండ ఎస్‌ఐ శ్రీనివాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

యాగంటిలో నామసంకీర్తనా సప్తాహం
బనగానపల్లె, జూన్ 25: బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్ సంఘటనా కార్యదర్శి దొంతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నామ సంకీర్తనా సప్తాహ కార్యక్రమం కొనసాగుతోంది. ఈనెల 20వ తేదీ బనగానపల్లె నుండి కాలినడకన యాగంటికి చేరుకున్న బృందం సభ్యులు రేయింబవళ్లు 3ఓం నమో భగవతే ఉమామహేశాయా2 అంటూ అఖండ నామ సంకీర్తన ఆలపిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన భజన బృందాలు రోజుకు 10 లోపు నామ సంకీర్తన చేస్తున్నాయి. ఈనెల 27వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంతో నామసంకీర్తన కార్యక్రమం పరిసమాప్తం అవుతుందన్నారు. లోకకల్యాణార్థం, సకాలంలో వర్షాలు కురియాలని రైతులు అన్నివర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఏటా యాగంటి ఆలయంలో నామసంకీర్తనా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావాలన్నారు. యాగంటి శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నిర్వాహకులు వై.రామారెడ్డి, దొనపాటి యాగంటిరెడ్డి, ఎం.దస్తగిరిరెడ్డి సహకారంతో భక్తాదులకు భోజనాదులు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.

కార్పొరేట్ సంస్థల
కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు
డోన్, జూన్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఎమ్మెల్సీ గేయానంద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం 10వ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ జిల్లా మహాసభలకు రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు తరలివచ్చారు. ముందుగా కార్మిక సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు షడ్రక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. నిరుపేదలకు అండగా ఉంటామని, మిగులు భూములు పంచి ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి తీరా గద్దెనెక్కా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. నిరుపేదలకు ఎక్కడా ఎకరా భూమి కూడా పంచలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఎంతో వెనుకబడి వుందని, అనునిత్యం కరవు, కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునే దిక్కులేదన్నారు. సీమపై నాయకులు కపట ప్రేమ కనబరుస్తున్నారని ఆరోపించారు. సీమలో పెండింగ్‌లో ఉన్న గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలన్నారు. గత ఏడాది నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని, ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నారాయణ, సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి ఈశ్వరయ్య, సిఐటియు నాయకులు మద్యయ్య, శివరామ్, కొండన్న, రామాంజనేయులు, ఆహ్వాన సంఘం నాయకులు టిఇ.సత్యంగౌడ్, పామయ్య, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే టిడిపి ధ్యేయం
డోన్, జూన్ 25: రైతుల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని టిడిపి నియోజక వర్గం ఇంచార్జి కెయి.ప్రతాప్ అన్నారు. ప్యాపిలి మండలం జలదుర్గం, మాధవరం, గార్లదినె్న, ప్యాపిలి గ్రామాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన రైతులకు రుణమాఫీ ఉపశమన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులు, మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసి హామీ నిలబెట్టుకున్నారన్నారు. వృద్దాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఐదురెట్లు పెంచి పేదల పాలిట చంద్రబాబు పెద్ద కొడుకుగా నిలిచారన్నారు. డోన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ వై నాగేశ్వరరావుయాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ప్యాపిలి ఎంపిపిటి సరస్వతి, డోన్, ప్యాపిలి మండల టిడిపి అధ్యక్షులు కొత్తకోట శ్రీనివాసులు, నేరెడుచెర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిపిలు ఆర్‌ఇ రాఘవేంద్ర, టి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల
రెగ్యులర్‌కు కృషి
ఆళ్లగడ్డ, జూన్ 25: వెలుగు పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు. పట్టణంలోని వెలుగు( ఆర్‌పిఆర్‌పి) గురుకుల పాఠశాల, పడకండ్ల సమీపంలో వున్న వెలుగు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలు సమస్యలు ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్‌పిఆర్‌పి పాఠశాలలో 22 మంది ఉపాధ్యాయులు వుండాల్సి వుండగా కేవలం 10 మంది ఉపాధ్యాయులు మాత్రమే వున్నారన్నారు. తక్కువ ఉపాధ్యాయులతో ఉత్తీర్ణత ఎక్కువ రావాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. విద్యా కౌనె్సలింగ్‌లో ఆళ్లగడ్డకు రావాలంటే రావలేదన్నారు. ఖాళీగా వున్న ఉపాధ్యాయుల భర్తీలను వెంటనే పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ మాసంలో గానీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఇవ్వరని, అప్పటి వరకు విద్యార్థులకు పూర్తి కావలసిన సిలబస్ ఏ విధంగా పూర్తవుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా అడ్మిషన్లు చాలా తక్కువ అయ్యాయన్నారు. విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో ఎక్కువ చేరడంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై జోనల్ ఆఫీసర్‌తో మాట్లాడతానన్నారు. పడకండ్ల వద్ద వున్న వెలుగు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో కూడా పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి వచ్చాయి. కాంట్రాక్టు ఉపాధ్యాయులు గత 5 సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకైతే జోనల్ స్థాయిలో బదిలీలు జరుగుతాయని అన్నారు. మీ సమస్యలపై అధికారులతో, ప్రభుత్వానితో మాట్లాడతానని ఎమ్మెల్సీ తెలిపారు. ఆయన వెంట పిఆర్‌టియు నాయకులు భార్గవరామయ్య, రమణ, మల్లికార్జున, క్రిష్టారెడ్డి, మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి తదతరులు వున్నారు.

విభజనకు రిఫరెండం నిర్వహించండి

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూన్ 25: రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగడం రాయలసీమకు ప్రజలకు ఇష్టం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. కర్నూలులో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు, విభజన అనంతరం ఆంధ్ర ప్రాంతానికి లభించిన ప్రాధాన్యత రాయలసీమకు లభించడం లేదని మండిపడ్డారు. విభజన అనంతరం అభివృద్ధి వికేంద్రీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం నిధులన్నీ అమరావతి నగర నిర్మాణానికి, కోస్తాంధ్రలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం కోస్తాంధ్ర జిల్లాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగిస్తున్నారే తప్ప వెనుకబడిన రాయలసీమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తీరును ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైకాపా కూడా ఓట్లు, సీట్ల కోసం పాకులాడుతోందని అన్నారు.. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల మొత్తం నిధుల్లో రాయలసీమలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎంత ఖర్చు చేస్తున్నారో వెల్లడవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల కోసం తాను చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకు కృష్ణానది పక్కనే ఉన్న తన స్వగ్రామానికే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పుష్కర పనులు చేపట్టకపోవడం బ్లాక్‌మెయిల్ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాయలసీమ కోసం తాను చేస్తున్న పోరాటం ఆపే ప్రశే్నలేదని తేల్చి చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు అవసరమని తాము కోరితే పరిశ్రమలు ఇస్తానన్న చంద్రబాబు ఒక్క పరిశ్రమనయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కోస్తాంధ్ర ప్రాంతం వారితో భర్తీ చేయడానికి వ్యూహరచన చేస్తున్నారని అన్నారు. అమరావతి నగరాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించి రాయలసీమవాసులను అక్కడి ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు సాగునీటి రంగం, విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు వేముల శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభ్యున్నతే టిడిపి ధ్యేయం
* ఎమ్మెల్యే బిసి.జనార్ధనరెడ్డి
కోవెలకుంట్ల, జూన్ 25: రైతుల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లవేలలా కృషి చేస్తోందని బనగానపల్లె ఎమ్మెల్యే బిసి.జనార్థనరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బిజినవేముల గ్రామంలో సర్పంచ్ గడ్డం ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిన రుణవిముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క బిజినవేమలు గ్రామంలోనే రూ.1.22 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. రైతులకు రుణవిముక్తి పత్రాలు పంపిణీ చేస్తున్నామని, నేటి వరకు ఏ ప్రభుత్వం చేయలేని పని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయగలిగారన్నారు. విభజన అంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే రుణమాఫీ అమలు చేసి చూపించిన ఘనత టిడిపిదేనన్నారు. రెండవ విడత రుణమాఫీ కింద రూ.3.5 వేల కోట్ల రుణమాఫీ పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి చెన్నకృష్ణమ్మ, తహశీల్దారు రామచంద్రారెడ్డి, ఎంపిడివో రామకృష్ణ, సహకార సంఘం అధ్యక్షుడు గువ్వల సుబ్బారెడ్డి, ఏడిఏ శ్రీనివాసరెడ్డి, టిడిపి తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భద్రత నియమాలు పాటించాలి
* మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదు
* కంటి చూపు సరిగా లేని డ్రైవర్లందరికి ఉచిత కంటి వైద్యం
* ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు, జూన్ 25: ప్రతిఒక్కరు రహదారి భద్రతా నియమాలు పాటించాలని, తద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శనివారం నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద స్కూల్, కాలేజి బస్సు డ్రైవర్లు, విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోడ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలను మోడ్రన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్కూల్, కాలేజి, ఆటో, బస్సు డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం సంతోషకరమన్నారు. 20వేల మంది కుటుంబాలు డ్రైవింగ్ వృత్తిలో కొనసాగుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లు ఎవరైనా తప్పుడు పనులు చేస్తే మిగతా డ్రైవర్లు హెచ్చరించాలన్నారు. అలాంటి వారి సమాచారం పోలీసులకు అందించాలన్నారు. డ్రైవర్లు యూనిఫాం ఖచ్చితంగా ధరించాలని, రోడ్లపై వాహనాలు ఎక్కడబడితే అక్కడ నిలుపరాదన్నారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదన్నారు. అనంతరం బుధవారపేటలో ఓమిని హస్పటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా నియమాల ప్లెక్లీలను ఎస్పీ ప్రారంభించారు. లక్ష మందితో నేత్రదానం చేయించేందుకు ఎస్పీ చేపట్టిన కార్యక్రమంలో విద్యాసంస్థల భాగస్వామ్యం తప్పక ఉంటుందని ప్రైవేటు విద్యాసంస్థల అసోషియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు.
పోలీసులు ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో మోడ్రన్ కంటి వైద్యశాల డాక్టర్లు రాజశేఖర్, అనిల్‌కుమార్, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్, కర్నూలు డిఎస్పీ రమణమూర్తి, ట్రాఫిక్ డిఎస్పీ రామచంద్ర, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు, సిఐ మధుసూదన్‌రావు, ఆర్‌ఎస్సైలు శ్రీనివాసగౌడ్, రాధాకృష్ణమూర్తి, నరేష్, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజాసాధికార సర్వే సేకరణపై ఎన్యుమరేటర్లకు శిక్షణ
* వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ టక్కర్
కర్నూలు, జూన్ 25: ప్రజాసాధికార సర్వే ద్వారా కుటుంబంలోని ప్రతి వ్యక్తి సమగ్ర వివరాల సేకరణపై ఎన్యుమరేటర్లకు సంపూర్ణ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ టక్కర్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో స్మార్ట్ పోల్స్ సర్వేపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టక్కర్ మాట్లాడుతూ స్మార్ట్ సర్వే సమగ్ర నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 35 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ వ్యక్తిగత బాధ్యత తీసుకుని వ్యవహరించాలన్నారు. ప్రతి జిల్లాలో 100 మంది ఎన్యుమరేటర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ నివ్వాలన్నారు. అవసరమైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజాసాధికార సర్వేకి వినియోగించుకోవాలన్నారు. స్మార్ట్ పోల్స్ సర్వే అధికారులతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమర్థ శిక్షణ నిచ్చే ట్రైనర్లను ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతి మండలంలో టెక్నికల్ హ్యాండ్ హోల్డింగ్ పర్సన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నెలరోజుల్లో సమగ్ర సర్వే ప్రక్రియ పూర్తయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సియం జాయింట్ సెక్రటరీ ప్రద్యుమ్న స్మార్ట్ పల్స్ సర్వేలో చేపట్టాల్సిన అంశాలపై పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ స్మార్ట్ పోల్స్ సర్వే పకడ్బందీ నిర్వహణకు 85 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేసి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. సర్వేలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి డివిజన్‌కు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను నియమిస్తున్నామన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నివేదించారు. సమస్యలను ఎప్పటిప్పడు పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైను సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి హరికిరణ్, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, డ్వామా పిడి పుల్లారెడ్డి, జెడ్పి సిఇఓ ఈశ్వర్, ప్రణాళికశాఖ జెడి ఆనందనాయక్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి ముసుగులో అవినీతి దందా
కర్నూలు సిటీ, జూన్ 25: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామంటూ అభివృద్ధి పేర అవినీతి దందా నడుపుతున్నారని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం నగరంలోని సుందరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ అటు అధికారులు, ఇటు అధికారపార్టీ నాయకులు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా ఉంచి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పుష్కరాల పనుల టెండర్లు దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఈ తతంగం పత్రికల్లో ఫొటోలతో సహా ప్రచురితమైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిస్తున్నా ఏఒక్కరిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఉపముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి మొదలు ఇంచార్జి మంత్రి, మంత్రులు, నాయకులు జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోందని గొప్పలు చెబుతున్నారన్నారు. రైతుల పంట నష్టపరిహారం వందల కోట్లలో పెండింగ్‌లో ఉన్నా దాని గురించి ఏ మంత్రీ, నాయకుడూ మాట్లాడడం లేదన్నారు. రైతు సంక్షేమం గురించి పట్టని అభివృద్ధి ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్న ప్రభుత్వం రైతులకు సరిపడ విత్తనాలు పంపిణీ చేయటంలో విఫలమైందన్నారు.
అంబేద్కర్ జయంతి రోజున హౌస్ ఫర్ ఆల్ పథకం కింద ఎన్‌టిఆర్ గృహనిర్మాణాలు చేపడుతామని చెప్పి 2 నెలలు గడిచినా ఇంత వరకు వాటి ఊసే లేదన్నారు. జలవనరుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటున్నారే తప్ప సీమ వెనకబాటు తనం గురించి ఎవర్వూ మాట్లాడటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అభివృద్ధి పేర జరుగుతున్న ఆర్థిక దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి గౌస్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఆదోని, జూన్ 25:రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునిగిరి నీలకంఠ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్దార్థనాథ్‌సింగ్, బిజెపి జాతీయ నాయకులు సతీష్‌జీ, మహిళ విభాగం నాయకురాలు పురంద్రీశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కునిగిరి నీలకంఠ మాట్లాడిన అంశాలను ఫోన్ ద్వారా ఆంధ్రభూమికి తెలియజేశారు. రాయలసీమప్రాంతం నిర్లక్ష్యనికి గురి కాబడిందని, అందువల్ల రాయలసీమలో ప్రజలు వలసలు పోతున్నారని పేర్కొన్నారు. వలసలను నివారించడానికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్దికిప్రత్యేక చర్యలు తీసుకుని ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. రాయలసీమ అభివృద్ధికి కోసం చేపట్టిన హంద్రీనీవా, గాలేరు నగరి, గుండ్రెవుల, వేదావతి, ఆర్డీఎస్ పులికాలువ, సిద్ధేశ్వరం ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. వెనుకబడిపోయిన ప్రాంతాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లభిస్తున్న ఖనీజ సంపదతో ఆధారిత పరిశ్రమలను రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో లభించే ఖనీజ సంపదను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. కడప జిల్లాల్లో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని, ఆదోని ప్రాంతంలో పత్తి ఆదారిత పరిశ్రమలైన నూలు మిల్లులను ఏర్పాటు చేయాలని ఆయన సమావేశంలో పేర్కొన్నారు. చిత్తూరు ప్రాంతంలో కూడా పరిశ్రమలను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా ఉందని, అందువల్ల నీటి పథకాలను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని కోరారు. తమ విజ్ఞప్తి మేరకు రాయలసీమకు సంబంధించిన వేదావతి, గుండ్రెవుల, ఆర్డీఎస్, సిద్ధేశ్వరం, ప్రాజెక్టులను తక్షణమే నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మాణం చేసినట్లు తెలిపారు. సీమపై ప్రత్యేక దృష్టి సారించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కంబంపాటి హరిబాబుకు కునిగిరి అభినందనలు తెలిపారు.
మహానందిలో భారీ వర్షం...
* ఇళ్లలోకి చేరిన నీరు
మహానంది, జూన్ 25: మహానందిలో భారీ వర్షం కురువడంతో స్థానిక వీధులన్నీ జలమయం అయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిసింది. దీంతో నల్లమల అడవి నుంచి వర్షం నీరు ప్రవాహంగా గ్రామంలోకి చేరింది. ఈశ్వర్‌నగర్ కాలనీలో ఉన్న సుంకులమ్మ దేవాలయం వెనుక వున్న ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పుష్కర నిధులతో నూతనంగా మురుగు కాల్వలను నిర్మిస్తుంది. ఈ వర్షానికి ఆ కాల్వలు మొత్తం చీలికలు వచ్చాయి. కాల్వల నిర్మాణం చేపట్టారే కాని నీరు ఎటు వెళ్లాలో వాలు తీయకపోవడంతో కాల్వలు సరిగా లేకపోవడంతో గుంటలుగా మారి వర్షంనీరు వీధులన్నీ జలమయంగా మారిపోయాయి. దీంతో ప్రజలు ఆ నీటిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆదోని డివిజన్‌లో తేలికపాటి వర్షాలు
ఆదోని, జూన్ 25: ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం తేలికపాటి వర్షాలు కురిశాయి. వర్షాలు పంటలకు అనుకూలంగా కురుస్తూ ఉండడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మే చివరి వారం నుంచి కొన్ని మండలాల్లో భారీ వర్షాలు, మరి కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు రావడం వల్ల వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. అంతేకాకుండా నాలుగైదు రోజులకు ఒక్కసారి తేలికపాటి వర్షాలు కురుస్థుండడం వల్ల విత్తన కార్యక్రమాన్ని రైతులు ఎంతో ఉత్సాహంతో పూర్తి చేశారు. విత్తనాల తరువాత రైతులు కోరుకున్న విధంగానే తేలిక పాటి వర్షాలు ఈవారంలో కూడా పడ్డాయి. అందువల్ల విత్తనాలు వేసిన పంటలు బాగా మొలకెత్తడం జరిగింది. ఇదే విధంగా నాలుగైదు రోజులకు ఒక్కసారి వర్షాలు వస్తే ఈ సంవత్సరం పంటలు పండినట్లేనని తమ కష్టాలు, అప్పులు తీరిపోతాయని రైతులు అంటున్నారు. ఇప్పటి వరకు రైతులకు అనుకూలంగా పంటలకు మేలు చేసే వర్షాలు వస్తున్నాయి. శనివారం వర్షాలు రావడంతో పంటలు ఏపుగా పెరగడానికి ఈ వర్షం ఉపయోగంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వర్షాలు రావడంతో పంటలు అన్ని కూడా భాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఈ సంవత్సరం కూడా పత్తి,వేరుశెనగ పంటలనే ఎక్కువగా వేయడం జరిగింది.